🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పదియారవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ముప్పదియారవ అధ్యాయము

ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు; ఔరంగాబాద్‌కర్‌ భార్య

ఇద్దరు గోవా పెద్దమనుష్యులు :

ఒకనాడు గోవానుండి యిద్దరు పెద్దమనుష్యులు బాబా దర్శనమునకై వచ్చి, బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరు కలిసి వచ్చినప్పటికి బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ యిమ్మనెను.

ఇంకొకరు అడుగకుండగనే 35 రూపాయలివ్వగా నందరికి ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను.

అక్కడున్న శ్యామా బాబాను నిట్లడిగెను. ”ఇది యేమి ? ఇద్దరు కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ యామోదించితివి. రెండవ వానిది తిరస్కరించితివి. ఎందులకీ భేదభావము ?”

బాబా యిట్లు జవాబిచ్చెను. ”శ్యామా ! ఎందులకో నీకేమియును తెలియదు. నేనెవరివద్ద ఏమియు తీసికొనను. మసీదుమాయి బాకీని కోరును. బాకీయున్నవాడు చెల్లించి ఋణవిమోచనము పొందును.

నాకిల్లుగాని, ఆస్తిగాని, కుటుంబము గాని కలవా ? నాకేమీ యక్కరలేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. ఋణము, శతృత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకొను మార్గము లేదు”

పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో నిట్లనెను. ”ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతము నిచ్చెదనని తన ఇష్టదైవమునకు మ్రొక్కుకొనెను.

అతనికి నెలకు 15 రూపాయల యుద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200లకు హెచ్చెను. తుదకు 700లకు హెచ్చెను.

అతడు ఐశ్వర్యము ననుభవించు కాలమందు తన మ్రొక్కును మరచెను. అతని కర్మఫలమే అతని నిటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే (15 రూపాయలు) నేను దక్షిణ రూపముగా నడిగితిని”.

ఇంకొక కథ :

సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి, దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా నాదరించి చక్కని భోజనము పెట్టెను.

బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి యక్కడ పరుండుమనెను. నేనక్కడ నిద్రపోయితిని. నేను గాఢనిద్రలో నుండగా ఆ మనిషి యొక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి, లోపల ప్రవేశించి నా జేబులో నున్న ద్రవ్యమునంతయు దొంగిలించెను.

నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని, ఏడ్చుచు కూర్చుంటిని.

పైకమంతయు నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించెననుకొంటిని. భోజనము నీరు రుచించవయ్యెను.

వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమున కేడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారివెంట పోవుచు నే నేడ్చుచుండుట జూచి యెందుల కేడ్చుచుంటివని యడిగెను.

నేను జరిగిన వృత్తాంతము చెప్పితిని. వారిట్లనిరి. ”నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారి చిరునామా నే నిచ్చెదను.

వారి శరణు వేడుము. వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన యాహారమేదో దానిని నీ ద్రవ్యము దొరకునంతవరకు విసర్జింపుము”.

నేను ఫకీరు చెప్పినట్లు నడచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపుటొడ్డునకు పోయితిని.

అక్కడొక స్టీమరుండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేక పోయితిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు బోయితిని.

అది యింకొక యొడ్డునకు దీసికొని పోయినది. అక్కడ రైలుబండి నెక్కి యీ మసీదుకు వచ్చితిని.

కథ పూర్తికాగానే బాబా ఆ యతిథులను భోజనము కొరకు తీసికొని పొమ్మనగా శ్యామా అట్లే చేసెను.

శ్యామా వారి నింటికి దీసుకొని పోయి భోజనము పెట్టెను. భోజన సమయములో శ్యామా బాబా చెప్పిన కథ చిత్రముగా నున్నదనెను.

బాబా వారెన్నడు సముద్రతీరమునకు పోయి యుండలేదు. వారివద్ద 30,000 రూపాయలెప్పుడు లేకుండెను. ఎన్నడు ప్రయాణము చేయలేదు.

ద్రవ్యమెప్పుడును పోవుట గాని వచ్చుటగాని జరుగలేదు. కాన దాని భావము తమకేదైన దెలిసినదా ? యని వారినడిగెను.

అతిథుల మనస్సులు కరగెను. వారు కండ్ల తడిపెట్టుకొనిరి. ఏడ్చుచు ”బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే” యని నుడివిరి.

”బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసెనో యనునది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పెద”మనిరి.

భోజనమయిన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి.

అందులో నొకరు యిట్లు చెప్పిరి. ”లోయలోనున్న యూరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేనుద్యోగము సంపాదించి గోవా వెళ్ళితిని.

నాకు ఉద్యోగము లభించినచో నా మొదటి నెల జీతము నిచ్చెదనని దత్తదేవునికి మ్రొక్కుకొంటిని. వారి దయవల్ల నాకు 15 రూపాయల యుద్యోగము దొరికెను.

నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరచితిని.

దానిని బాబా యివ్విధముగా జ్ఞప్తికి దెచ్చి నావద్ద 15 రూపాయలు తీసికొనిరి. అది దక్షిణ కాదు. అది పాత బాకీ; తీర్చుకొనక మరచిన మ్రొక్కును చెల్లించుట”.

నీతి :

బాబా యెన్నడు డబ్బు భిక్షమెత్తలేదు, సరికదా తమ భక్తులు కూడ భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు.

వారు ధనమును ప్రమాదకారిగాను, పరమును సాధించుట కడ్డుగాను భావించువారు భక్తులు దాని చేతులలో జిక్కకుండ కాపాడెడివారు.

ఈ విషయమున భక్త మహల్సాపతి యొక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడ జరుగుబాటు లేకుండెను.

అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా యనుమతించలేదు; దక్షిణలోనుండి కూడ ఏమియు ఈయలేదు.

ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాల ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతి కిచ్చెను. కాని బాబా దానిని పుచ్చుకొనుట కనుమతించలేదు.

పిమ్మట రెండవ యతిథి తన కథ నిట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంటమనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరి చేయుచుండినను, దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను.

వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి, ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా యాస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయెను.

బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగెనో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచు కూర్చుంటిని. నా ప్రయత్నములన్నియు విఫలమైనవి.

ఒక పక్షము వరకు చాల యారాట పడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరగుపై కూర్చొనియుండగా ఒక ఫకీరు నా స్థితిని గనిపెట్టి కారణమును దెలిసికొనెను. నేను వివరములన్నియు దెలిపితిని.

అతడు ‘‘షిరిడీసాయి యను ఔలియా యున్నారు, వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన యాహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయువరకు నీకు ప్రియమైన యాహారమును తిననని మ్రొక్కుకొనుము” అనెను.

నేనట్టులే ”బాబా ! నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనము చేసిన పిమ్మట, నేనన్నము తినెదను” అని మ్రొక్కుకొంటిని.

దీని తరువాత 15 దినములు గడచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను.

వాడిట్లనియెను. ”నేను పిచ్చియెత్తి యిట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై బెట్టితిని. దయచేసి క్షమించుము”. ఈవిధముగా కథ శుభాంతమైనది.

నాకు కనిపించి సహాయమొనర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుట కెంతో గాఢమైన కోరిక కలిగినది.

మాయింటికంత దూరము వచ్చినవారు షిరిడీ సాయిబాబాయే యని నా నమ్మకము. ఎవరయితే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా ?

దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి యేమియు ఆశించక, ఎల్లప్పుడు తమ చేతనయినంతవరకు బాబా మమ్ములను ఆధ్యాత్మికమార్గమున నడిపింతురు.

దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మ్రొక్కును మరచితిని.

ఒకనాటి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు బాబాను స్వప్నములో జూచితిని. షిరిడీకి పోవలెనను సంగతి యప్పుడు జ్ఞప్తికి వచ్చెను.

నేను గోవా వెళ్ళితిని. అక్కడ నుండి స్టీమర్‌ మీద బొంబాయి వెళ్ళి అటునుండి షిరిడీకి పోవ నిశ్చయించితిని.

నేను హార్బరు వద్దకు పోగా స్టీమరులో జాగా లేకుండెను. కెప్టెను ఒప్పుకొనలేదు కాని, నాకు పరిచయము లేని నవుకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయికి తీసుకొని వచ్చెను.

అక్కడనుండి యిక్కడకు రైలులో వచ్చితిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి.

మేమెక్కడ ? మా యిల్లెక్కడ ? మా యదృష్టమేమని చెప్పవలెను ? బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను. ఇక్కడకు లాగుకొనివచ్చెను.

షిరిడీ జనులారా ! మీరు మా కంటె పుణ్యాత్ములు, మా కంటె యదృష్టవంతులు. ఏలన, బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి యెన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యమనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను.

సాయియే మన దత్తుడు. వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి.

స్టీమరులో జాగా యిప్పించిరి. నన్ను ఇచ్చటకు దెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి.

ఔరంగాబాద్‌కర్‌ భార్య(గంగుబాయి) :

షోలాపూరు నివాసియగు సఖారామ్‌ ఔరంగాబాద్‌కర్‌ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు.

ఆమె అనేక దేవతలకు మ్రొక్కులు మ్రొక్కెను, కాని నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను.

ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను.

అచట బాబా సేవ చేయుచు రెండు నెలలు గడపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండియుండెడిది. బాబా చుట్టు భక్తమండలి మూగి యుండువారు.

బాబా నొంటరిగా జూచి, వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి, తనకొక సంతానము కావలెనని కోరుకొనుటకై తగిన యవకాశమునకై ఆమె కనిపెట్టుకొని యుండెను.

తుట్టతుదకు శ్యామాకీ సంగతి చెప్పి, బాబా యొంటరిగా నున్నప్పుడు తన విషయములో జోక్యము గలుగజేసికొనుమనెను.

శ్యామా, బాబా దర్బారెల్లప్పుడు తెరచియుండుననియు, ఐనను ఆమె గూర్చి ప్రయత్నించెదననియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను.

బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ, అగరువత్తులతో సిద్ధముగా నుండుమనియు తాను సైగ చేయగనే మసీదు పైకి రావలెననియు చెప్పెను.

ఒకనాడు శ్యామా మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామా బుగ్గను గిల్లెను.

శ్యామా కోపగించి ”దేవా ! నా బుగ్గను గిల్లుట నీకు తగునా ? మా బుగ్గలు గిల్లునట్టి పెంకి దేవుడు మాకక్కరలేదు. మేము నీపై నాధారపడియున్నామా ? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము ?” అనెను.

బాబా యిట్లనెను. ”శ్యామా ! 72 జన్మల నుంచి నీవు నాతో నున్నప్పటికి నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్ళకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది”.

శ్యామా యిట్లనియెను. ”ఎల్లప్పుడు ముద్దులు, మిఠాయిలు ఇచ్చు దైవము మాకు కావలెను. మీ నుండి మాకు గౌరవము గాని, స్వర్గము గాని, విమానము గాని యవసరము లేదు. మీ పాదములయందు నమ్మకము మాకెప్పుడును నుండుగాక”.

బాబా యిట్లనెను. ”అవును, నేను వచ్చినది యందుకే. ఇన్నాళ్ళనుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీయందు నాకు ప్రేమానురాగములున్నవి”.

అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపయి కూర్చొనెను. శ్యామా యామెను సైగచేసి రమ్మనెను.

ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి, కొబ్బరికాయ, అగరువత్తులిచ్చెను. బాబా ఆ టెంకాయ నాడించెను. అది యెండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను.

బాబా : శ్యామా ! యిది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది యేమనుచున్నదో విను !

శ్యామా : ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది కాన, టెంకాయను నీ యాశీర్వాదముతో నిమ్ము !

బాబా : టెంకాయ బిడ్డను ప్రసాదించునా ? అట్లనుకొనుటకు ప్రజలెంత అమాయకులు ?

శ్యామా : నీ మాటల మహిమయు, ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియును. నీ యాశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు.

ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామా టెంకాయను కొట్టకుండ నా స్త్రీకే ఇవ్వుమని వేడుచుండెను.

తుదకు బాబా లొంగి ”ఆమెకు సంతానము కలుగు”ననెను. ఎప్పుడని శ్యామా యడిగెను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చెను.

టెంకాయను పగులగొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. రెండవ చిప్ప నామె కిచ్చిరి.

అప్పుడు శ్యామా యా స్త్రీ వైపు తిరిగి ”అమ్మా ! నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనిచో, ఈ దేవుని తలపై నొక టెంకాయను గొట్టి ఈ మసీదు నుంచి తరమివేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడగాను, మీరు దీనిని జూచెదరు గాక !” యనెను.

ఆమె ఒక సంవత్సరములో కొడుకును గనెను. 5వ మాసములో  కొడుకును మసీదుకు తీసికొనివచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై బడిరి.

కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలిచ్చెను. బాబా గుఱ్ఱము  ‘శ్యామకర్ణ’కు ఈ ధనముతో శాల కట్టించెను.

ముప్పది ఆరవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles