🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబదియారవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

నలుబదియారవ అధ్యాయము

ప్రస్తావన; గయ యాత్ర; రెండు మేకల కథ

ఈ అధ్యాయములో శ్యామా కాశి, గయ, ప్రయాగ యాత్రలకు వెళ్లుట, బాబా ఫోటో రూపమున నతనికంటె ముందే వెళ్ళుట చెప్పెదము.

బాబా రెండు మేకల పూర్వ జన్మ వృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుట గూడ చెప్పుకొందము.

ప్రస్తావన :

ఓ సాయీ ! నీ పాదములు పవిత్రములయినవి. నిన్ను జ్ఞప్తియందుంచు కొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడ మిక్కిలి పావనమయినది.

ప్రస్తుతము నీ రూప మగోచర మయినప్పటికి, భక్తులు నీయందే నమ్మకముంచినచో, వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు.

నీవు కంటి కగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని యెంతో దూరము నుండి గాని యీడ్చెదవు. వారిని దయగల తల్లివలె కౌగలించుకొనెదవు.

నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కాని నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టతుదకు గహించెదరు.

బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు నీ శక్తివలన నిరాడంబర భక్తుల రక్షించెదవు.

ఆంతరికముగను, అదృశ్యముగను ఆటంతయు నాడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు గనిపించెదవు. నీవె పనులన్నియును నెరవేర్చుచున్నప్పటికి ఏమియు చేయనివానివలె నటించెదవు.

నీ జీవితము నెవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట యెట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను.

నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికయితే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందము నిచ్చెదవు.

నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభసాధనము. ఈ సాధనవల్ల మన పాపములు, రజ స్తమో గుణములు నిష్క్రమించును.

సాత్త్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును.

మనమట్టి సమయమందు గురువునే యనగా నాత్మనే యనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్యశరణాగతి. దీనికి తప్పనిసరి యొకేగుర్తు. మన మనస్సు నిశ్చలము శాంతమునగుట.

ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక నింకొకటి వెన్నంటి వచ్చును.

ఒకవేళ బాబా ఎవరైన భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే యుండి, యింటి వద్దనుగాని దూరదేశమున గాని వానిని వెంబడించు చుండును.

భక్తుడు తన యిష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటె ముందుగా బోయి యేదో ఒక ఊహించరాని రూపమున నుండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము.

గయ యాత్ర :

బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ళ తరువాత కాకాసాహెబు తన పెద్దకుమారుడు బాబు ఉపనయనము నాగపూరులో చేయ నిశ్చయించెను.

సుమారదే సమయమందు నానాసాహెబు చాందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్‌లో చేయ నిశ్చయించుకొనెను.

కాకాసాహెబు, నానాసాహెబు చాందోర్కరులిద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా దీసికొని వెళ్ళుడని బాబా నుడివెను.

తామే స్వయముగా రావలసినదని బలవంతపెట్టగా బాబా వారికి శ్యామాను దీసుకొని పోవలసినదనియు ”కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామా కంటె ముందుగనే గయలో కలిసికొనెద”నని చెప్పెను.

ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపియని నిరూపించును.

బాబా వద్ద సెలవు పుచ్చుకొని, శ్యామా నాగపూరు, గ్వాలియరు పోవ నిశ్చయించెను. అచటినుండి కాశీ, ప్రయాగ, గయ పోవలెననుకొనెను.

అప్పాకోతే యతని వెంట బోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయమునకు బోయిరి.

కాకాసాహెబు దీక్షిత్‌ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా నిచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్‌ పెండ్లికి బోయిరి.

అచ్చట నానాసాహెబు చాందోర్కరు శ్యామాకు 100 రూపాయలును, అతని బంధువు జఠార్‌ 100 రూపాయలును ఇచ్చిరి. అక్కడినుండి శ్యామా కాశీకి వెళ్ళెను.

అచ్చట జఠారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరములో అతనికి గొప్ప సత్కారము జరిగెను.

అచ్చటినుండి శ్యామా అయోధ్యకు పోయెను. అచ్చట జఠారు మేనేజరు శ్రీరామమందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి.

కాశీలో రెండు మాసములుండిరి. అక్కడి నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెము చికాకుపడిరి.

రాత్రి గయ స్టేషనులో దిగి ధర్మశాలలో బసచేసిరి. ఉదయమే గయ పండా వచ్చి యిట్లనెను. ”యాత్రికులందరు బయలుదేరుచున్నారు. మీరు కూడ త్వరపడుడు”.

అచ్చట ప్లేగు గలదా ? యని శ్యామా ప్రశ్నించెను. లేదని పండా జవాబు నిచ్చెను. మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను.

అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ యిల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామా చాలా సంతుష్టి చెందెను.

అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటె ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది యింటికి ముందు భాగములో మధ్య నమర్చబడి యుండెను.

దీనిని చూచి శ్యామా మైమరచెను. ”కాశీ, ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామాకంటె ముందుగనే గయకు బోయెదను” అను బాబా పలుకులను జ్ఞప్తికి దెచ్చుకొనెను.

కండ్ల నీరు గ్రమ్మెను, శరీరము గగుర్పొడిచెను, గొంతుక యార్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి యేడ్వసాగెను. ఆ పట్టణములో ప్లేగు జాడ్యము గలదని భయపడియేడ్చుచున్నాడేమోయని పండా యనుకొనెను.

పండాను బాబా పటమెక్కడ నుండి తెచ్చితివని శ్యామా యడిగెను.

పండా తన ప్రతినిధులు రెండు మూడువందల మంది మన్మాడులోను, పుణతాంబేలోను గలరనియు, వారు గయకు పోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు,

వారివల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 యేండ్ల క్రిందట చేసితిననియు చెప్పెను.

షిరిడీలో శ్యామా యింటిలో వ్రేలాడుచున్న బాబా పటమును జూచి దాని నిమ్మని కోరితిననియు బాబా యనుజ్ఞ పొంది శ్యామా దానిని తనకిచ్చెననియు చెప్పెను.

శ్యామా పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి దెచ్చుకొనెను. పూర్వము తనకు పటము నిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన యింట నతిథిగా నుండుట గ్రహించి పండా మిక్కిలి యానందించెను.

వారిరువురు ప్రేమానురాగములనుభవించి యమితానందమును పొందిరి. శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చెను.

పండా ధనవంతుడు. అతడొక పల్లకిలో కూర్చుండి, శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నియు నేర్పరచెను.

ఈ కథవల్ల నేర్చుకొనవలసిన నీతి :

బాబా మాటలు అక్షరాలా సత్యములనియు బాబాకు తన భక్తులందుగల ప్రేమ యమితమనియు తెలియుచున్నది. ఇదియేగాక వారికి జంతువులయందు కూడ సమాన ప్రేమ యుండెను. వారు వానిలో నొకరుగా భావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును.

రెండు మేకల కథ :

ఒకనాడుదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకలమందను జూచెను.

అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను.

బాబా వైఖరిని జూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయెనని వారనుకొనిరి.

ఎందుచేతననగా నొక్కొక్క మేకను 2 గాని, 3 గాని, 4 గాని రూపాయలకు కొనవచ్చును. రెండు మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి.

బాబా నెమ్మదిగా నూరకొనెను. శ్యామా, తాత్యాకోతే బాబాను సమాధానము వేడగా బాబా ”నాకు ఇల్లుగాని, కుటుంబము గాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు” అనిరి.

మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి యిచ్చివేసి వాని పూర్వవృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి.

”ఓ శ్యామా ! తాత్యా ! మీరీ బేరములో నేను మోసపోయితినని యనుకొనుచున్నారు. అట్లు కాదు.

వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి యదృష్టము కొలది నా జతగాండ్రగా నుండెడివారు. వారొకే తల్లి బిడ్డలు.

మొదట వారికి నొకరిపై నొకరికి ప్రేమ యుండెను. రానురాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి గాని, చిన్నవాడు చురుకైన వాడు.

అతడు చాల ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యము నపహరింప నెంచెను. తమ సోదరత్వమును మరచి వారిద్దరు కలహించిరి.

అన్న తమ్ముని జంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను, కాని నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరు బద్ధవైరులయిరి.

అన్న ఒకనాడు తన సోదరుని బడితెతో కొట్టెను, చిన్నవాడు అన్నను గొడ్డలితో నరకెను. ఇద్దరదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి.

నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి దెచ్చుకొంటిని వారియందు కనికరించి వారికి తిండి పెట్టి, కొంత విశ్రాంతి కలుగజేసి యోదార్చవలెనని యనుకొంటిని.

అందుచే నింత ద్రవ్యమును వ్యయపరచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరిష్టపడుకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసితిని”. మేకలపైని కూడ బాబా ప్రేమ యెట్టిదో చూడుడు.

నలుబది యారవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above text has been typed by: Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles