Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice by: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
ఏడవ రోజు పారాయణము
బుధవారము
నలుబదియైదవ అధ్యాయము
కాకా సాహెబు సంశయము – ఆనందరావు అనుభవము;
కొయ్య బల్ల మంచము బాబాదే – మహల్సాపతిది కాదు
గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులగుట గూర్చి చెప్పితిమి.
వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెను గాని, వారి యనంత స్వరూపము లేదా సాయి శక్తి యెల్లప్పుడు నిలిచియే యుండును.
ఇప్పటివరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట క్రొత్త లీలలు జరుగుచున్నవి.
దీనిని బట్టి బాబా శాశ్వతముగా నున్నారనియు తమ భక్తులకు పూర్వమువలె తోడ్పడుచున్నారనియు తెలియుచున్నది.
ఎవరయితే బాబా సమాధి చెందకముందు వారిని జూచిరో వారు నిజముగ నదృష్టవంతులు.
అట్టివారిలో నెవరైన ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొననిచో, వారి మనస్సులు భగవత్పరము కానిచో యది వారి దురదృష్టమని చెప్పవచ్చును.
అప్పుడేకాదు ఇప్పుడు కూడ కావలసినది బాబా యందు హృదయపూర్వకమయిన భక్తి. మన బుద్ధి, యింద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యము కావలెను.
కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించునట్లు చేసినచో, ప్రయోజనము లేదు.
పూజగాని, ధ్యానము గాని చేయ పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలెను.
పతివ్రతకు తన భర్తయందు గల ప్రేమను, భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికి మొదటిది రెండవదానితో పోల్చుటకే వీలులేదు.
జీవితపరమావధిని పొందుటకు తండ్రిగాని, తల్లిగాని, సోదరుడు గాని యింక తదితర బంధువులెవ్వరుగాని తోడ్పడరు.
ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదకుకొని ప్రయాణమును సాగించవలెను.
నిత్యానిత్యములకు భేదమును తెలిసికొని, ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను.
ఇతరులపై నాధారపడుటకంటె మన స్వశక్తియందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను.
ఎప్పుడయితే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించెదమో, ప్రపంచము అబద్ధమని తెలిసికొనెదము.
దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి, మనకు నిర్వ్యామోహము కలుగును.
క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమున కతీతులును.
అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు జూడగలిగి పూజించెదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ.
ఎప్పుడయితే మనము బ్రహ్మమును, లేదా గురుని హృదయపూర్వకముగ ధ్యానించెదమో, మనము కూడ వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందెదము.
వేయేల గురువు నామమును జపించుట వలనను, వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతుకోటి యందు చూచుట కవకాశము కలుగును. మనకది శాశ్వతానందమును కలుగజేయును.
ఈ దిగువ కథ దీనిని విశదీకరించును.
కాకాసాహెబు సంశయము – ఆనందరావు అనుభవము :
కాకాసాహెబు దీక్షిత్‌ను ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థరామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను.
బాబా సమాధికి పూర్వము కాకాసాహెబు దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తరువాత కూడ అట్లే చేయుచుండెడివాడు.
ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీలో నున్న కాకామహాజని యింటిలో కాకాసాహెబు దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను.
శ్యామా, కాకామహాజని కూడ నచట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి. దీక్షిత్ ఏకాదశస్కంధములోని ద్వితీయా ధ్యాయమును చదువుచుండెను.
అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, దృమిళ, చమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి.
జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని యడిగెను. వారొకొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి.
అందులో మొదటివాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయను దాటుటను, ప్రబుద్ధ మాయ అంటే ఏమిటి? , పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని యవతారములను వారి లీలలను, చమస్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి.
వాని సారంశమేమన కలియుగములో మోక్షము పొందుట కొక్కటే మార్గము గలదు. అదేమన గురుని లేదా హరి పాదారవిందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబు నిరుత్సాహముతో శ్యామాతో నిట్లనియె:
”నవనాథులు భక్తి విషయమై చెప్పినది యెంత అద్భుతముగా నున్నది? దాని నాచరించుట యెంత కష్టము ?
నవనాథులు పూర్ణజ్ఞానులే గాని మనవంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా?
అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయిన మనకు మోక్షము వచ్చుటెట్లు ? కాబట్టి యట్టిదానిని మన మాశించరాదని తెలియుచున్నది”.
కాకాసాహెబు నిరుత్సాహము, నిరాశలు శ్యామా యిష్టపడలేదు. వెంటనే యతడిట్లనెను : ‘‘ఎవరయితే వారి యదృష్టవశముచే బాబా వంటి యాభరణమును పొందిరో, అట్టివారు నిరాశచెంది యేడ్చుట విచారకరమైన సంగతే.
వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే యున్నచో, వారు నిరాశ చెందనేల? నవనాథుల భక్తి బలమైనదై యుండవచ్చును గాని, మనది మాత్రము ప్రేమానురాగములతో నిండియుండలేదా ?
హరినామ స్మరణము గురునామ స్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా ? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని యవకాశమేది” ?
శ్యామా చెప్పిన సమాధానముతో కాకాసాహెబు సంతుష్టి చెందలేదు.
నవనాథుల భక్తిని పొందుటెట్లు ? అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి యుదయమే యీ క్రింది యద్భుతము జరిగెను.
ఆనందరావు పాఖాడే యనువాడు శ్యామాను వెదకుచు పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను.
కాకాసాహెబ్ భాగవతము చదువుచుండెను. పాఖాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలోనేమో చెప్పుచుండెను.
అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామాకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచె మాటంకము గలుగ జేసెను.
కాకాసాహెబు పురాణము చదువుటమాని విషయమేమని యడిగెను. శ్యామా యిట్లు నుడివెను.
”నిన్న నీ సంశయమును దెలిపితివి. దానికి సమాధానమిదిగో ! బాబా పాఖాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము.
”రక్షకమైన భక్తి” గాక వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పియున్నారు.
అందరు ముఖ్యముగా కాకాసాహెబు ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారము పాఖాడే యా దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను.
లోతైన సముద్రములో నడుమువరకు దిగి యచ్చట నిలిచితిని. హఠాత్తుగా నచట సాయిబాబాను చూచితిని.
రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొనియుండెను. వారి పాదములు నీటిలో నుండెను.
బాబా స్వరూపమును జూచి మిగుల ఆనందించితిని. అది నిజమువలె నుండెనే కాని స్వప్నమువలె గానరాకుండెను.
దానిని నేను స్వప్నమని యనుకొనలేదు. మాధవరావు కూడ అచ్చట నిలచియుండెను. శ్యామా ”ఆనందరావు ! బాబా పాదములపై బడుము” అని సలహానిచ్చెను.
”నాకు కూడ నమస్కరించవలెననియే యున్నది. కాని వారి పాదములు నీటిలో నున్నవి. కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను? నేను నిస్సహాయుడను” అని నేనంటిని.
అది విని యతడు బాబాతో నిట్లనెను. ”ఓ దేవా ! నీటిలోనున్న నీ పాదములను బయటకు దీయుము”. వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని.
దీనినిజూచి బాబా నన్ను దీవించి యిట్లనెను. ”ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదవు. భయముగాని ఆందోళన గాని అవసరము లేదు. శ్యామాకు పట్టుపంచె యొకటి దానము చేయుము. దానివల్ల మేలు పొందెదవు”.
బాబా యాజ్ఞానుసారము పాఖాడే పట్టుధోవతిని తెచ్చెను. మాధవరావు కివ్వవలసినదని కాకాసాహెబును వేడెను.
శ్యామా యందుల కొప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా నివ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లువేసి తెలిసికొనుటకు సమ్మతించెను.
సంశయ విషయములందు చీటి వేసి సంశయమును దీర్చుకొనుట కాకాసాహెబు స్వభావము.
‘పుచ్చుకొనుము’ ‘నిరాకరించుము’ అను రెండు చీటీలు వ్రాసి బాబా పాదుకల వద్ద బెట్టిరి. ఒక బాలునితో అందులో నొకదానిని తీయించిరి. ‘పుచ్చుకొనుము’ అను చీటీ ఎంచుటచే మాధవరావుకు ధోవతి ఇచ్చిరి.
దానిని శ్యామా యంగీకరించెను. ఇద్దరును సంతుష్టి చెందిరి. కాకాసాహెబు సంశయము తీరెను.
ఇతర యోగుల మాటలను కూడ గౌరవించవలసినదని యీ కథ ప్రబోధించుచున్నది. కాని మన తల్లియగు గురువు నందు పూర్ణమైన భక్తి విశ్వాసము లుండవలెను.
వారి బోధల ప్రకారము నడువవలెను. ఎందుకనగా మన కష్టసుఖము లితరులకంటె వారికే బాగుగ తెలిసియుండును. నీ హృదయ ఫలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము.
”ఈ లోకములో ననేకమంది యోగులు గలరు. గాని మన గురువసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును. కాని, మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు.
వేయేల ! హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్య శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు, నీవు దాటలేని భవసాగరము లేదు”.
కొయ్యబల్ల మంచము బాబాదే – మహల్సాపతిది కాదు :
బాబా షిరిడీ చేరిన కొద్దికాలమునకే 4 మూరల పొడవు, ఒక జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకొనువారు.
కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబుకు వర్ణించి చెప్పుచుండెను.
ఇది విని యతడు బాబాతో కిట్లనియె. ‘‘మీకింకను కొయ్యబల్ల యందు మక్కువ యున్నచో నింకొక బల్ల మీ కొరకు మసీదులో వ్రేలాడవేసెదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును”.
అందుకు బాబా యిట్లనెను. ”మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడనే పైన పండుకొనుట కిష్టము లేదు”.
కాకాసాహెబు ఇట్లనెను. ”మహల్సాపతికొర కింకొక బల్లను తయారుచేయించెదను”.
బాబా ‘‘అతడెట్లు బల్లపై పరుండగలడు ? బల్లమీద అంత ఎత్తున పడుకొనుట సులభమయిన పనికాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు.
ఎవరయితే కండ్లు దెరచి నిద్రించగలరో వారికే యది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై నుంచుమనెదను.
అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణమును వినుమనెదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టు మనెదను. దీనినే యతడు నెరవేర్చలేకున్నాడు.
నిద్రతో కునుకుపాట్లు పడుచుండును. నా హృదయముపై వాని చేతి బరువును గమనించి, ఓ భగత్ ! అని పిలచెదను. వెంటనే కండ్లు తెరచి కదలును.
ఎవడయితే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండ యుండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో, వాడు ఎత్తైన బల్ల మీద నెట్లు పండుకొనగలడు” ? అనెను.
అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమచే నిట్లనెను. ”మంచి గాని చెడ్డ గాని, ఏది మనదో యది మన దగ్గర నున్నది. ఏది యితరులదో, యది యితరుల వద్ద నున్నది”.
నలుబదియైదవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above text has been typed by: Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబదియారవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువదవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఏబదియవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పదియేడవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఇరువది రెండవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments