🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదనొకండవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

పదనొకండవ అధ్యాయము

సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా; డాక్టర్ పండితుని పూజ;

హాజీ సిద్దీఖ్‌ ఫాల్కే; పంచభూతములు బాబా స్వాధీనము

సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా :

భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింప వచ్చును.

(1) నిర్గుణ స్వరూపము, (2) సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు. సగుణ స్వరూపమునకు ఆకారము గలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే.

మొదటి దానిని కొందరు ధ్యానింతురు; రెండవదానిని కొందరు పూజింతురు.

భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు. కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి.

మనుష్యుడు ఆకారము గలిగి యున్నాడు; కావున సహజముగ భగవంతుని గూడ ఆకారముతో సగుణ స్వరూపునిగ భావించి పూజించుట సులభము.

కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధిచెందవు. క్రమముగ ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును.

విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము – ఈ ఏడును పూజనీయములు.

కాని సద్గురువు వీని యన్నిటికంటె నుత్కుృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించెదము గాక ! వారు రూపుదాల్చిన వైరాగ్యము; నిజ భక్తులకు విశ్రాంతి ధామము.

వారి వాక్కులయందు మనకు గల భక్తియే యాసనముగ, మన కోరికలన్నియు విసర్జించుటయే పూజా సంకల్పముగ జేసి వారిని ఉపాసింతుము గాక !

కొందరు సాయిబాబా యొక భగవద్భక్తుడనెదరు; కొందరు మహాభాగవతుడందురు; కాని మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని యవతారమే.

వారు క్షమాశీలురు, క్రోధరహితులు, ఋజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు.

శ్రీ సాయిబాబా యాకారముతో కనిపించినప్పటికి వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు.

గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుచూ సాగిపోతున్నటులే,

సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖ శాంతులను ప్రసాదించుచూ జగత్తును పావనం చేస్తున్నారు.

భగవద్గీత యందు శ్రీకృష్ణుడు, మహాత్ములు తన యాత్మయనియు, తన సజీవ ప్రతిమ యనియు, తానే వారనియు, వారే తాననియు నుడివి యున్నాడు.

వర్ణింపనలవికాని యా సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున నవతరించెను.

శ్రుతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి (తైత్తిరీయ ఉపనిషత్తు). ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము.

కాని భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు.

వారు తమ యాసనము కొరకు ఒక గోనెసంచి నుపయోగించెడివారు. భక్తులు దానిపై చిన్న పరుపువేసి, ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి.

బాబా తన భక్తుల కోరికను మన్నించి, వారి వారి భావాన్ననుసరించి తనను పూజించుట కెట్టి యభ్యంతరము జూపకుండెను. కొందరు చామరములతోను, కొందరు విసనకఱ్ఱలతోను విసురుచుండిరి .

కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి.

కొందరు వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కాన్పించినప్పటికి వారు సర్వాంతర్యామి;

ఎక్కడ జూచినను వారే యుండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండెడివారు.

సర్వాంతర్యామియగు యా సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు.

డాక్టరు పండితుని పూజ :

తాత్యాసాహెబు నూల్కరు మిత్రుడైన డాక్టరు పండిత్ యొకసారి బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను.

బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతనిని దాదాభట్ కేల్కరు వద్దకు పొమ్మని బాబా చెప్పెను.

డాక్టరు పండిత్‌ అటులనే దాదాభట్ వద్దకు పోయెను. దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను.

బాబాను పూజించుటకై పూజాసామాగ్రి పళ్ళెముతో దాదాభట్ మసీదుకు వచ్చెను. డాక్టరు పండిత్‌ కూడ అతని ననుసరించెను.

దాదాభట్ బాబాను పూజించెను. అంతకు మునుపెవ్వరును బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు.

ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కాని యీ అమాయిక భక్తుడగు డాక్టరు పండిత్‌ దాదాభట్ యొక్క పూజాపళ్ళెరము నుండి చందనమును దీసికొని బాబా నుదుటిపై త్రిపుండ్రకారముగ వ్రాసెను.

అందరికి ఆశ్చర్యము కల్గునట్లు బాబా ఒక్క మాటయిననూ అనక యూరకుండెను.

ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగెను. ”బాబా ! మేమెవరయిన మీ నుదుటిపై చందనము పూయుదుమన్న నిరాకరింతురే ! డాక్టరు పండిత్‌ వ్రాయగా ఈనాడేల యూరకుంటిరి ?”

అందులకు బాబా ప్రసన్నముగ యిట్లు సమాధానమిచ్చెను: ‘నేనొక ముసల్మానుననీ, తానొక సద్బ్రాహ్మణుడననీ, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైలపడిపోవుదుననే దురభిమానము లేకుండా, ఆతడు నాలో తన గురువు(కాకా పురాణిక్‌)ను భావించుకొని అట్లు చేసెను.

అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను ?” దాదాభట్ ఆ తరువాత డాక్టరు పండిత్‌ని ప్రశ్నించగా అతడు, బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితిననెను.

భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను, ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు.

ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్ళెమును విసరివేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా యెవ్వరికీ ధైర్యము చాలెడిదికాదు.

ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనము కంటె మెత్తగా గనిపించెడివారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలే గాన్పించుచుండిరి.

బయటికి కోపముతో నూగిపోవుచూ, కళ్ళెఱ్ఱ జేసినప్పటికీ, వారి హృదయము మాత్రము మాతృ హృదయమువలే అనురాగమయము.

వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరతీసి, ”నేనెప్పుడూ యెవరిపైనా కోపించి యెరుగను. తల్లి తన బిడ్డల నెక్కడైనా తరిమివేయునా ? సముద్రము తనను చేరు నదులనెప్పుడైన తిరుగగొట్టునా ? నేను మిమ్ములనెందుకు నిరాదరించెదను ? నేనెప్పుడూ మీ యోగక్షేమములనే అపేక్షించెదను.

నేను మీ సేవకుడను. నేనెప్పుడూ మీ వెంటనే యుండి, పిలచిన పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే !” అనెడివారు.

హాజీ సిద్ధీఖ్‌ ఫాల్కే(దర్వేష్ సాహెబ్) :

బాబా యెప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో యెవరికీ తెలియదు. అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడియుండెను.

హాజీ సిద్ధీఖ్‌ ఫాల్కే కథ ఇందు కుదాహరణము. సిద్ధీఖ్‌ ఫాల్కేయను మహమ్మదీయుడు కల్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను.

అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను. తొమ్మిది నెలలు షిరిడీలో నున్ననూ, బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు.

అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనుచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశా నిస్పృహలకు లోనయ్యెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను.

నిరాశ చెందవద్దనీ, నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు, మాధవరావు దేశపాండే (శ్యామా) ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియూ కొందరు భక్తులతనికి సలహానిచ్చిరి.

అటులేయని, తన తరపున బాబాతో మాట్లాడుమని శ్యామాను ఫాల్కే వేడుకొనెను. శ్యామా యందులకు సమ్మతించి, ఒకనాడు సమయము కనిపెట్టి, బాబాతో నిట్లనియెను :

”బాబా ! ఆ ముదుసలి హాజీని మసీదులో కాలుపెట్టనీయవేల? ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. ఆ హాజీని మాత్రమెందుకు ఆశీర్వదించవు ?”

దానికి బాబా యిట్లని జవాబిచ్చెను : ”శ్యామా ! ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థంకావు. అల్లా యొప్పుకొననిచో నేనేమి చేయగలను ? అల్లామియా కటాక్షము లేనిచో యీ మసీదులో పాదము పెట్టగలుగువారెవ్వరు ?

సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో యడుగుము” ! శ్యామా పోయి హాజీని ఆ విషయము అడిగి, తిరిగి బాబా వద్దకొచ్చి, హాజీ అందులకు సమ్మతించెనని చెప్పెను.

నలుబదివేల రూపాయలు నాలుగు వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనుమని తిరిగి బాబా యడిగెను. శ్యామా వెంటనే పోయి, హాజీ తాను నాలుగు లక్షలు కూడ ఇచ్చుటకు సిద్ధముగా నున్నాడని జవాబు తెచ్చెను.

సరే మరల పోయి వాని నిట్లడుగుము, ”మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలెనో, వృషణములు కావలెనో కనుగొనుము”

బాబావారి కొళంబా (మసీదులో బాబా భిక్షచేసి తెచ్చిన పదార్థములుంచెడి మట్టిపాత్ర)లో నున్న చిన్న ముక్కతోనైన సంతుష్టి చెందెదనని శ్యామా ద్వారా హాజీ బదులు చెప్పెను.

ఇది వినగనే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని కొళంబా, నీటికుండలను బయటికి విసరివైచి, తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు బోయి, తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని, తీవ్ర స్వరంతో:

”నన్ను గురించి యేమనుకొనుచున్నావు ? నీవేదో గొప్పవాడివనీ, పెద్ద హాజీవని గొప్పలు పోవుచూ, యేమిటేమిటో వదరుచున్నావే? నా దగ్గరా నీ ఆటలు ? ఖురాను చదివి నీవు తెలుసుకొన్నదిదేనా ?

మక్కా మదీనా యాత్రలు చేసితిననే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు !’‘ అనుచూ, యేమేమో యింకనూ అతనిని తిట్టి, మసీదుకు మరలి వెళ్ళెను.

బాబా ఆగ్రహావేశములను చూచి హాజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను.

తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టెను.

అప్పటినుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచూ, భోజనమునకు బిలుచుచుండెను.

హాజీ ఆనాటి నుండి తన కిష్టము వచ్చినప్పుడెల్ల మసీదులోనికి వచ్చిపోవుచుండెను. బాబా యొక్కొక్కప్పుడు వానికి డబ్బు నిచ్చుచుండెను. బాబా దర్బారులో అతను గూడ యొకడయ్యెను.

పంచ భూతములు బాబా స్వాధీనము :

బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు రెండు సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ యధ్యాయమును ముగించెదను.

1) ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను.

గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలో నేలయంతయు జలమయమయ్యెను.

పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులందరు మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువైయున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు.

కావున వారందరు మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి.

ఆపదలో నున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ”ఆగు, నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు ” మని గర్జించిరి.

కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున గనిపించెను. ప్రజలందరు సంతుష్టి చెంది వారి వారి గృహములకు బోయిరి.

2) ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంటలు అపరిమితముగా లేచెను.

మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగయుచుండెను. మసీదులో కూర్చొన్నవారి కేమి చేయుటకు తోచలేదు.

ధునిలోని కట్టెలు తగ్గింపుడని గానీ, నీళ్ళు పోసి మంటలు చల్లార్పుడనిగానీ బాబాకు సలహా నిచ్చుటకు వారు భయపడుచుండిరి.

వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి, తమ సటకాతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు, ”దిగు దిగు, శాంతించుము” అనిరి.

ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచము కొంచము చొప్పున మంటలు తగ్గిపోయి, ధుని యధాపూర్వము మితముగ మండసాగెను.

భగవదవతారమైన శ్రీ సాయినాథుడట్టివారు. వారి పాదములపైబడి సాష్టాంగనమస్కారముచేసి, సర్వస్య శరణాగతి వేడినవారినెల్ల వారు కాపాడెదరు.

ఎవరయితే భక్తి ప్రేమలతో నీ యధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటినుండి విముక్తులగుదురు.

అంతేకాక సాయియందే యభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నియు నెరవేరి, తుదకే కోరికలు లేనివారై ముక్తిని బొందెదరు !

పదనొకండవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles