సపత్నేకరు భార్యాభర్తలు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

సపత్నేకర్ న్యాయపరీక్షలో నుత్తీర్ణుడయ్యెను. అక్కల్ కోటలో వృత్తిని ప్రారంభించి, యచట న్యాయవాది యాయెను. పది సంవత్సరముల పిమ్మట అనగా, 1913లో వానికి గల యొకేకుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనస్సు వికల మయ్యెను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థముపోయి, శాంతి పొందవలె ననుకొనెను. కాని యతనికి శాంతి లభించలేదు, వేదాంతము చదివెను గాని, యదికూడ సహాయపడలేదు. అంతలో శేవడే మాటలు, అతనికి బాబాయందుగల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తానుకూడ షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలె ననుకొనెను. తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరమునుండియే బాబా దర్శనముచేసి సంతసించెను. గొప్పభక్తితో బాబావద్దకేగి యొకటెంకాయ నచట బెట్టి, బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసెను. “బయటకు పొమ్ము” అని బాబా యరచెను. సపత్నేకర్ తలవంచుకొని కొంచెము వెనుకకు జరిగి యచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకెవరి సలహాయైన తీసికొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబావద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి యదెవరిదని యడిగెను. దానిని ప్రేమించువారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వయిపు చూసెను. బాబా నవ్వగా నచటివారందరు నవ్విరి. బాలా ఆ నవ్వుయెక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సపత్నేకర్ ను దగ్గరగా జరిగి బాబా దర్శనము చేయుమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా, బాబా తిరిగి వెడలి పొమ్మని యరచెను. సపత్నేకరుకేమి చేయవలెనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరు చేతులు జోడించుకొని బాబాముందు కూర్చుండిరి. మసీదు ఖాళీచేయమని బాబా సపత్నేకర్ ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారముతో నిరాశ జెందిరి. బాబా యాజ్ఞను పాలించవలసి యుండుటచే సపత్నేకర్ షిరిడీ విడువవలసివచ్చెను. ఇంకొకసారి వచ్చినపుడైన దర్శనమివ్వవలెనని అతడు బాబాను వేడెను.

సపత్నేకర్ భార్య

ఒక సంవత్సరము గడచెను. కాని, యతని మనస్సు శాంతి పొందకుండెను. గాణగాపురము వెళ్ళెను కాని యశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాఢేగాం వెళ్ళెను; తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు రెండు దినములకు ముందు అతని భార్యకొక స్వప్న దృశ్యము గనపడెను. స్వప్నములో నామె నీళ్ళకొరకు కుండ పట్టుకొని లకడ్షాబావికి పోవుచుండెను. అచట నొక పకీరు తలకొక గుడ్డ కట్టుకొని, వేపచెట్టు మొదట కూర్చున్న వారు తనవద్దకు వచ్చి “ఓ అమ్మాయి! అనవసరముగా శ్రమపడెదవేల? నేను స్వచ్ఛజలముతో నీకుండ నింపెదను” అనెను. ఆమె పకీరుకు భయపడి, ఉత్తకుండతో వెనుకకు తిరిగి పోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరచెను. ఆమె తన కలను భర్తకు జెప్పెను. అదియే శుభశకున మనుకొని యిద్దరు షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికి బాబా యక్కడ లేకుండెను. వారు లెండీతోటకు వెళ్ళియుండిరి. బాబా తిరిగి వచ్చువరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను జూచిన ఫకీరుకు బాబాకు భేదమేమియు లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచు, అచటనే కూరచుండెను. ఆమె యణకువ జూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఏదో నొక కథ చెప్పుటకు మొదలిడెను. “నా చేతులు, పొత్తి కడుపు, నడుము, చాల రోజులనుండి నొప్పి పెట్టుచున్నవి. నేననేకౌషధములు పుచ్చుకుంటిని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు జెందితిని. కాని నొప్పులన్నియు నిచట వెంటనే నిష్క్రమించుట కాశ్చర్యపడుచుంటిని” అనెను. పేరు చెప్పనప్పటికి ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో పోవుటచే నామె సంతసించెను.

సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసికొనెను. మరల బాబా బయటకు బొమ్మనెను. ఈ సారి యతడు మిక్కిలి పశ్చాత్తాపపడి యెక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి యెగతాళి చేసినదాని ప్రతిఫలమని గ్రహించి, దాని విరుగుడుకొరకు ప్రయత్నించుచుండెను. బాబా నొంటరిగా కలిసికొని వారిని క్షమాపణ కోరవలెనని యత్నించుచుండెను. అట్లే యొనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదాములపై బెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపయి బెట్టెను. బాబా కాళ్ళనొత్తుచు సపత్నేకర్ అక్కడనే కుర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును బట్టుచుండెను. బాబా యొక కోమటిగూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితములో కష్టములన్నియు వర్ణించెను. అందులో వాని యొకేయొక కొడుకు మరణించిన సంగతి కూడ చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే యని సపత్నేకర్ మిక్కిలి యాశ్చర్యపడెను. బాబాకు తన విషయము లన్నియు దెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయముల గ్రహించుననెను. ఈ యాలోచనలు మనస్సున మెదలుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు జూపించి యిట్లనెను. “వీడు తనకొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను జంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి యేడ్చుచున్నాడేల? అదే బిడ్డను వీనిభార్య గర్భములోనికి మరల దెచ్చెదను.” ఈ మాటలతో బాబా యతని తలపై హస్తముంచి యోదార్చియిట్లనియె. “ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నా యందే నమ్మకముంచుము. నీ మనోభీష్టము నెరవేరును.” సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను.

సపత్నేకర్ పూజాసామగ్రినమర్చుకొనినైవేద్యముతో మసీదుకు భార్యతో బోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారివద్ద ప్రసాదము పుచ్చుకొనుచుండెడివారు. ప్రజలు మసీదులో గుమిగూడి యుండెడివారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమవినయములతో నొక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి యుత్సవమును జూచెను. అందు బాబా పాండురంగనివలె ప్రకాశించెను.

ఆ మరుసటిదిన మింటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ యిచ్చి తిరిగి యడిగినచో రెండవ రూపాయి లేదనక యివ్వచ్చునని సపత్నేకర్ యనుకొనెను. మసీదుకు బోయి ఒక రూపాయి దక్షిణ నివ్వగా బాబా యింకొక రూపాయ కూడ నడిగెను. బాబా వానిని ఆశీర్వదించి యిట్లనెను. “టెంకాయను దీసికొనుము. నీ భార్య చీరకొంగులో పెట్టుము. హాయిగా పొమ్ము, మనస్సునందెట్టి యాందోళనము నుంచకుము” అతడట్లే చేసెను. ఒక సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి, ఆ శిశువును బాబా పాదములపై బెట్టి యిట్లు ప్రార్థించిరి. “ఓ సాయీ! నీ బాకీ నెటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది. కనుక మీకు సాష్టాంగనమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయుల మగుటచే మమ్ముద్ధరించ వలసినది. ఇక మీదట మేము మీ పాదములనే మాశ్రయించెదముగాక. అనేకాలోచనలు, సంగతులు, స్వప్నావస్థలోను, జాగ్రదవస్థలోను మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజనవైపు మరల్చి మమ్ము రక్షింపుము.”

కుమారునకు మురళీధర్ యను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ యను నిద్దరు జన్మించిరి. బాబా మాటలు వృధాపోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి యక్షరాల జరుగునని కూడ నమ్మిరి.

 

సంపాదకీయం:  శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Contact No :09704379333

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles