Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై !!
చైత్రమాస శుక్ల నవమి నాడు శ్రీ రామ నవమి శ్రీ రాముని జన్మ దినంగా జరుపబడుతుంది. శిరిడీ లో శ్రీరామనవమి ఉత్సవమ్ 1911 లో మొదటి సారిగా నిర్వహించబడింది. 1897 లో గోపాల్ రావు గుండ్ ద్వారా ప్రారంభమైన ’ఉర్సు’ వుత్సవమ్ ప్రేరణ తో శ్రీ కృష్ణ జోగేశ్వర్ భీష్మ శ్రీ కాకా మహాజని తో ప్రస్తావించిన శ్రీరామ జన్మదిన నిర్వహణ్ ప్రతిపాదన సద్గురు సాయినాధ్ మహరాజ్ అనుమతితో 1911 నుండి శ్రీ రామ నవమి శిరిడీలో ఎంతో గొప్పగా వేడుకగా నిర్వహించుకోవడం జరుగుతోంది.
శ్రీ రామ నవమి ఉత్సవాలు మూడు రోజుల వేడుకలు.
తొలి రోజు శ్రీ సాయి సచ్చరిత అఖండ పారాయణ జరుగుతుంది. అఖండ పారాయణ లో పాల్గనాలనుకున్న భక్తులు ముందురోజు తమ పేర్లను నమోదు చేసికోవాలి. ఆ సాయంకాలం ఒక చిన్న పిల్ల/పిల్లవాని చేత లాటరీ ద్వారా చీట్లు తీయించి 53 మంది పేర్లు ఎంపిక చేస్తారు, మరో 5 పేర్లు కూడా అదనంగా అత్యవసరార్దం ఎంపిక చేస్తారు. సాయంకాల ఆరతి పూర్తయిన తర్వాత ఈ పేర్లను ప్రకటిస్తారు, ముఖ్యప్రదేశాలలో జాబితాను వుంచుతారు. శిరిడీ లో జరిగే మూడు ముఖ్య వుత్సవాల లోనూ ఇదే పద్దతి అవలంబించబడ్తున్నది.
తొలిరోజు కాకడ ఆరతి తర్వాత అఖండ పారాయణ ప్రారంభమవుతుంది. శ్రీ సాయి సచ్చరిత గ్రంధాన్ని వూరేగింపు గా సమాధి మందిరం నుండి తీసికుని రావడం జరుగుతుంది. వూరేగింపు లో ఒక భక్తుని శిరసుపై ’పోతీ’ ని వుంచుతారు (సాధారణంగా ఈ భక్తుడు ట్రస్ట్ సభ్యుడై వుంటారు). మరో భక్తుడు వీణ ను ధరించి వుంటారు (వీణ సరస్వతి కి ప్రతి రూపంగా భావించడం జరుగుతుంది). మరో భక్తుడు సాయి నాధుని చిత్ర పటాన్ని పట్టుకుని నడుస్తారు. పూజారి కీర్తనలు పాడుతూండగా వూరేగింపు సమాధి మందిరం నుండి ద్వారకామాయి వైపు కు కొనసాగుతుంది.
మంత్రోచ్చారణ , లఘు ఆరతి, లల్ కార్ (రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్) అయిన తర్వాత సమాధి మందిరం దక్షిణ ద్వారం గుండా బయలు దేరుతుంది. శిరిడీ లో వుంటున్న అయ్యర్ కుటుంబీకులు పాదపూజ చేసి కర్పూర హారతిని సమర్పిస్తారు. వూరేగింపు గురుస్థాన్ కి చేరుకున్న తర్వాత మళ్ళీ మంత్రోచ్చారణ, లఘు ఆరతి, లల్ కార్ లు నిర్వహించ బడతాయి. ఊరేగింపు కుడివైపుకు తిరిగి దీక్షిత్ వాడా ముందుకి వచ్చినప్పుడు సంస్థాన్ ద్వారా పాద పూజ నిర్వహించ బడుతుంది. మహాద్వారం గుండా మారుతి మందిరం ముందునుండి కొనసాగి వూరేగింపు ద్వారకా మాయి చేరుకుంటుంది. అసంఖ్యాకమైన భక్తులు ఈ వూరేగింపు లో పాలు పంచుకుంటారు..
ద్వారకా మాయి రైలింగ్ పక్కనున్న వరండను అరటి చెట్లతో అలంకరిస్తారు. బాబా చిత్ర పటాన్ని, ’పోతీ’ ని స్వాగతించడానికి వెండి సింహాసనం ఎదురుచూస్తూ వుంటుంది. చిత్రపటానికీ, ’పోతీ’కి లఘు ఆరతి నిర్వహించిన తర్వాత పారాయణ ప్రారంభమవుతుంది. ద్వారకా మాయి తెల్లవార్లూ తెరిచే వుంటుంది, సాయంకాలం పొద్దుపోయిన తర్వాత పల్లకీ వుత్సవం జరుగుతుంది.
రెండవరోజు ముఖ్యమైన వుత్సవం. కాకడ ఆరతి తర్వాత అఖండ పారాయణ ముగిసిన తర్వాత ద్వారకా మాయి నుండి ’పోతీ’ ని సమాధి మందిరానికి వూరేగింపుగా తీసికుని వస్తారు. మంత్రోచ్చారణ, లఘు ఆరతి, లల్ కార్ లు ముగిసిన తర్వాత సమాధిమందిరం వెనుక ద్వారం గుండా వూరేగింపు గురుస్థాన్ చేరుకుంటుంది. అక్కడ లఘు ఆరతి నిర్వహించ బడిన తర్వాత మహాద్వారం గుండా సమాధి మందిరం పైపు కొనసాగుతుంది. సంస్థాన్ ద్వారా మహాద్వారం వద్ద పాద పూజ నిర్వహించబడిన తర్వాత వూరేగింపు సమాధి మందిరం చేరుకోవడం ద్వారా ముందురోజు ప్రారంభించిన ప్రదక్షిణ పూర్తవుతుంది.
సమాధి మందిరం లో బాబా కి మంగళ స్నానమ్ నిర్వహించబడ్తుంది. శిరిడీ గ్రామస్తులూ, అసంఖ్యాకమైన బాబా భక్తులూ కోపర్ గాం వెళ్ళి మంగళ స్నానం కోసం గోదావరి జలాలను తీసికుని వస్తారు. గంగా మరియు యితర నదులనుండి కూడా వుత్సాహమూ, శ్రద్దా వున్న భక్తులు జలాలను మంగళ స్నానం గురించి తీసికుని వస్తారు. నీటి కావడిలను మోసుకుని వచ్చే కావడి భక్తులు బాబా పాదుకలకు వారు తెచ్చిన పవిత్ర నదీజలాలతో అభిషేకం చేయడానికి అనుమతిస్తారు.
సమాధిమందిరం నుండి కొత్త గోధుమల బస్తా వూరేగింపు గా వుదయం 8 గంటలకి ద్వారకామాయి కి తీసికుని వస్తారు. ద్వారకామాయి అలమార లో వున్న పాత బస్తాని ప్రసాదాలయ్ కి తరలించి, కొత్త గోధుమ బస్తాని అక్కడ పెడతారు.
మద్యాహ్నమ్ పన్నెండు గంటలకి శ్రీ రామ జననానికి ప్రతీక గా సమాధి మందిరం లో ఊయల ను కడతారు. తొలి సారిగా శిరిడి లో శ్రీ రామనవమి జరిగినపుడు రాధాకృష్ణమాయి తెచ్చిన ’ఊయల’ ను కట్టారు. అప్పటి నుండీ ఆ సంప్రదాయాన్ని సంస్థాన్ వారు యిప్పటికీ అమలు జురుపుతున్నారు. ఆ తర్వాత మద్యాహ్న ఆరతి నిర్వహించ బడ్తుంది.
మద్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకూ శ్రీ సాయి సచ్చరిత ఆరవ అధ్యాయంలో వర్ణించినట్లుగా జండాలు మార్చ బడ్తాయి.
ప్రతి సంవత్సరం రెందు కొత్త జండాలను వూరేగింపు గా తీసికుని వస్తారు. దామూ అన్నా రాస్నే వంశస్తులు ఎంబ్రాయిడరీ చేసిన జండానూ, నానా సాహబ్ నిమోన్కర్ వంశస్తులు ఆకుపచ్చ జండాను సమాధి మందిరం లో బాబా ముందర వుంచి మద్యాహ్న ఆరతి ఇచ్చిన తర్వాత తుకారాం సుతార్ గృహానికి తీసికుని వెడ్తారు. (తుకారాం ఇంటిపేరు భలేరావు, అతని వృత్తి సుతార్ అంటే వడ్రంగం). మద్యాహ్నం రెండు గంటలకి కాషాయ జండాని సమాధిమందిరం నుండి వూరేగింపుగా తీసికుని వచ్చి పిలాజి గురవ్ ఇంటిముందున్న ఖాళీ ప్రదేశం లో వుంచుతారు. తుకారాం ఇంటినుండి తీసికుని వచ్చిన రెండు జండాల ను కూడా ఒక పొడుగు కర్రకి తగిలిస్తారు. అప్పుడు అన్ని జండాలను శిరిడీ పుర వీధులలో భక్తులు నాట్యం చేస్తూ, కీర్తనలు పాడుతూ, హర్షోస్సాలతో వూరేగిస్తారు. ఆఖరున రెండు జండాలను ద్వారకా మాయి పైన, కాషాయ జండాను ద్వారకా మాయి లోపల స్థాపిస్తారు.
ఉర్సు మరియూ చందనోత్సవమ్
గోపాలరావు గుండ్ బాబాని గౌరవంచడం కోసం ఒక ప్రత్యేక వుత్సవం జరుపాలనుకున్నాడు, అలా 1897 లో ’ఉర్సు’ ప్రారంభమైంది. ’ఉర్సు’ అంటే భగవంతునితో వివాహం లేదా భగవంతునితో ఆత్మని మృత్యుసమయంలో అనుసంధానం చేయడం. ఇది సంవత్సరానికి ఒక సారి జరిగే వుత్సవం, సాధుపురుషుల ఆధ్యాత్మిక శక్తి ఈ సమయంలో అంబరాన్నంటుతుందని అంటారు.
అబ్దుల్ బాబా వంశస్తులు జరిపే ఈ చందనోత్సవం రాత్రి 9 – 10 గంటల జరుగుతుంది. ఇది చాలా అందమైన ఉత్సవం. ఓ పెద్ద ప్లేటులో చందనం ముద్దలూ, అగరు వత్తులూ మరియు బహుమానాలూ మేలుకట్టు కింద వుంచి నాట్యగానాలతో వూరేగిస్తారు. నాలుగు వైపులా కర్రలవుంచి వాటిమీద ’గైలిఫ్’ ను గానీ, దుప్పటినిగానీ వుంచి మేలుకట్టు ఏర్పాటు చేస్తారు. ’గైలిఫ్’ ఆకుపచ్చ రంగులో వుండి, దానిమీద బంగారంతో ’కల్మాస్’ (పవిత్ర ఖురాన్ లోని వాక్యాలు) చెక్కబడివుంటుంది. ఈ చందనోత్సవం ముస్లీం ఔలియాలను ఆరాధించడానికి ఉద్దేశించబడింది. దీని గురించి శ్రీసాయి సచ్చరిత 6వ అధ్యాయంలో వివరించబడింది. సమాధి మందిరంలో శాలువా, పళ్ళు వంటి బహుమానాలు అర్పించిన తర్వాత అబ్దుల్ బాబా దర్గా దగ్గరకు వెళ్ళి మళ్లీ కానుకలు సమర్పిస్తారు. ఊరేగింపు ద్వారకామాయి దగ్గర గులాబి నీటితోనూ, అత్తరుతోనూ కలిపిన చందనం ముద్దలను నింబారు కు వట్టి చేతులతో అలంకరించడం తో ముగుస్తుంది.
సాయంకాలం రధోత్సవం వుంటుంది. రాత్రంతా భజన సంధ్య కార్యక్రమం వుంటుంది. సమాధి మందిరం రాత్రంతా తెరిచే వుంటుంది.
మూడవ రోజు వుదయం కాకడ ఆరతి వుండదు. లఘు ఆరతి తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు కృష్ణ కీర్తనలు ఆలపిస్తూ గోపాల్ కాలా వుత్సవాన్ని నిర్వహిస్తారు. ఎంతో అద్భుతంగా కన్నుల పండుగ గా జరిగే గోపాల్ కాలా వుత్సవం లో ఒక కుండని పెరుగు, పసుపు గుండ, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, తేనె లతో నింపుతారు, సుముహుర్త సమయానికి ఆ కుండని బద్దలు కొట్టి అందులోనివి ప్రసాదంగా పంచుతారు. పైన పేర్కన్న మిశ్రమం వంటిని చల్లబరుస్తుంది, తద్వారా శాంతి క్షేమాలేర్పడతాయి.
డాక్టర్ కేశవ్. బి. గావన్కర్ గారు తమ ’శీలధి’ గ్రంధం లో బాబా గురించి, శ్రీరామ నవమి పండుగ గురించి అందరికీ తెలియని విషయాలను ప్రస్తావించారు.
బాబా శ్రీ రామ నవమి వుత్సవాన్ని తను ద్వారకామాయి వుండడం ప్రారంభించిన తొలి రోజుల నుండీ జరిపేవారు. ఆ రోజు బాబా స్వయంగా ద్వారకా మాయి కడిగేవారు. మధ్యాహ్నం 12 గంటలకి కొద్దిగా నూనె కొని తెచ్చి కొన్ని దీపాలను వెలిగించేవారు. అలాగే ’గులాల్’ కూడా కొని తెచ్చేవారు. ’గులాల్’ ని ’ధుని’ మీద చల్లిన పిదప తన శిరసు పై కూడా చల్లుకునే వారు. ఆ తర్వాత మసీదు మెట్లమీద, మసీదు అన్ని మూలలలోనూ చల్లేవారు, తలుపులకి పూసేవారు. భక్తులు శిరిడీ కి సమూహాలుగా రావడం ఆరంభించాక సభామండపం లో రామ కధా, కీర్తనలూ జరిగేవి, బాబా అందరికీ కోవా, బర్ఫీలు పంచిపెట్టేవారు.
(విన్ని చిట్లూరి వ్రాసిన బాబా’స్ గురుకుల్ నుండి స్వేచ్ఛానువాదం)
సాయి పాదధూళి చాగంటి సాయిబాబా, జట్నీ, ఒడిషా
9178265499, 9439954093
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333
Latest Miracles:
- శ్రీ రామ మారుతీ మహరాజ్
- ఒక డాక్టరు (శ్రీ రామ భక్తుడు)
- రాంబాబు గారికి దీపావళి రోజు శ్రీ కృష్ణా, వినాయక స్వామి గా బాబా దర్శనం–Audio
- శ్రీ సాయిబాబా అనుగ్రహమునకు శ్రీ భరద్వాజ గారు పాత్రులగుట–Audio
- పూణే లో శ్రీ సాయిబాబా వారి పన్ను స్థాపించబడిన విధము—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments