Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు ఉమామహేశ్వరరావు. నేను జిల్లా కోర్టులో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. మా శ్రీమతి పేరు హేమసుందరి. ఆమె ఆయుర్వేదం డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తోంది.
మాకు పెద్దమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి నాలుగు సంవత్సరాల వయస్సు వున్నప్పుడు నేను శిరిడి వెళ్తూ పాపని కూడా తీసుకుని వెళ్ళాను.
మా శ్రీమతి డాక్టర్ కదా ఆమెకి తీరిక లేక నాతో రాలేదు. నాతో పాటు శ్రీ వెంకటేశ్వరరావు గారు( బాబా భక్తులు), మా మామగారు అందరం కలిసి అజంతా ఎక్సప్రెస్ లో బయలు దేరాము.
ముందుగా మన్మాడ్ వెళ్లి అక్కడి నుండి నాసిక్ వెళ్లి, ఆ తర్వాత త్రయంబకేశ్వర్ వెళ్లి, ఆ తర్వాత శిరిడి చేరుకునేవాళ్ళము. మేము వెళ్లే ప్రతిసారి ఇంచుమించు ఇలానే వెళ్ళేవాళ్ళము. అన్నీ చూసుకొని, దర్శనం చేసుకొని మన్మాడ్ వస్తున్నాము.
ఇంకా మన్మాడ్ నుంచి శిరిడి చేరాల్సి వుంది. ఈ లోపు మా అమ్మాయికి జ్వరం వచ్చింది, వళ్ళు కాలిపోతుంది. 103 – 104 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది.
వరుస ప్రయాణాలు, పూటకో నీళ్లు, గంటకో వాతావరణంలాగా ఉండటాన, పసి పిల్ల కావటం వలన జ్వరం వచ్చింది. బస్సులో వున్నాము, ఆ జ్వరం లో దానికి ఫీట్స్ లాగా వచ్చాయి.
ఉన్నట్టుండి కొయ్యలాగా బిగుసుకుపోయి కళ్ళు తేల వేసింది. నోట్లో నుంచి నురగలు వచ్చేస్తున్నాయి, నేను పెద్దగా ‘ బాబా ‘ అంటూ కేక పెట్టి, గట్టిగా ఏడ్చేసాను. పాప వెంటనే మాములుగా అయిపొయింది.
నా అరుపుకి ఏడుపుకి బస్సు డ్రైవర్ బస్సు ఆపేసాడు. నేను కళ్ళు మూసుకొని బాబాను ధ్యానం చేస్తున్నాను ” బాబా ఏమిటీ పరిస్థితి ” అని. జనం అంతా ‘ చూడవయ్యా! చూడు పాప నార్మల్ అయిపొయింది ‘ అన్నారు హిందీలో.
ఇదంతా రెండు నిమిషాలలో జరిగిపోయింది. బస్సు డ్రైవర్ ముస్లిం అతను. నాసిక్ నుంచి మన్మాడ్ వచ్చే దారి సింగల్ రోడ్డు, చుట్టూ పొలాలు, అన్నీ ఎండిపోయి వున్నాయి.
ఆ సింగల్ రోడ్డు పైన బస్సు వెళుతూ ఉంటే మరో బస్సు రావటం చాల కష్టం. అటువంటిది ఎలా తిప్పాడో ఏమో బస్సు వెనక్కి తిప్పి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. గబా గబా పాపని ఆసుపత్రిలోకి తీసుకెళ్ళాము,
డాక్టర్ మాలతి ఆసుపత్రి (నాసిక్ లో ) జాయిన్ చేసాము. ఆ డ్రైవర్ ది ఆ ఊరే కాబోలు, ఆ సంగతి మనకి తెలియదు.
ఆ డ్రైవర్ ప్రయాణికులందరిని ఏమి చేసాడో తెలియదు కానీ అతను వాళ్ళ ఇంటికి వెళ్లి భార్యని పిల్లల్ని ఆసుపత్రికి తీసుకువచ్చాడు. వస్తూ వస్తూ భోజనం కూడా తెచ్చాడు.
రెండు గంటలు నాతోనే వుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం దాకా ఆసుపత్రిలో వుండి మరో బస్సు ఎక్కి శిరిడీకి చేరుకున్నాము. పాపకి సరి అయితే దాన్ని తెచ్చి బాబా పాదాల మీద వేస్తాను అని అనుకున్నాను .
శిరిడి కి చేరగానే పాపని సమాధి మందిరం పైకి తీసుకువెళ్లి బాబా పాదాల మీద పాపని వుంచాను. బాబా పాదాలు చేరగానే జ్వరం మాయం అయిపొయింది.
తిరుగు ప్రయాణం లో మరో సంఘటన జరిగింది. నేను మళ్ళీ పాపని తీసుకొని హైదరాబాద్ బయలుదేరాను.
మన్మాడ్ వచ్చి రైలు ఎక్కాలి. మన్మాడ్ రావాలంటే ఏదో ఒక వాహనాన్ని ఆశ్రయించాలి. వేరే దారి లేదు. ఇప్పుడు అయితే డైరెక్ట్ ట్రైన్ వచ్చేసింది, అప్పట్లో ఆలా ఉండేవి కాదు.
మన్మాడ్ లో దిగాలి లేదా నాగర్ సోల్ లోనో, రోటే గావ్ లోనో దిగివెళ్ళేవాళ్ళు. నేను మన్మాడ్ చేరుకోవడానికి నాకు ఎటువంటి బస్సు కానీ, జీపులు కానీ కనపడలేదు.
సమయం అయిపోతుంది. నేనేం చేయాలి అని ఆలోచించేలోపలే నా ముందుకి ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ఆ సమయంలో చాల పెద్ద వాన కూడా పడుతోంది. షాపులు అన్నీ మూసేసి వున్నాయి. అప్పట్లో ఆటోలు కూడా శిరిడీలో లేవు.
వ్యానులో నుంచి డ్రైవర్ తొంగి చూసి మన్మాడ్ వస్తారా అని అడిగాడు, నేను వెంటనే వ్యాన్ ఎక్కాను. అందులో డ్రైవర్ తప్ప మరెవరూ లేరు. నన్ను మన్మాడ్ స్టేషన్లో దించాడు.
ట్రైన్ వెళ్లిపోవడానికి సిద్ధంగా వుంది. పరుగున వెళ్లి రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కాకుండా వేరే కంపార్ట్మెంట్లో ఎక్కేసాను. శిరిడి నుండి మన్మాడ్ 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ట్రైన్ టైం అయిపోతున్న సమయంలో వానలో హడావిడిగా ఎక్కడి నుంచో వచ్చి, ఎదురుగా ఆగటం కేవలం నన్ను ఒక్కడినే ఎక్కించుకుని, తీసుకువచ్చి మన్మాడ్ స్టేషన్ లో దింపడం,వెళ్ళిపోతున్న రైలు లో రిజర్వేషన్లో కాకుండా వేరే కంపార్ట్మెంట్లో ఎక్కడం,
ఇంత హడావిడిగా ఎందుకు నా ప్రయాణం కొనసాగింది అంటే అదంతా బాబా లీలే అని, నేను ఇంటికి వెళ్ళాక గాని అదంతా అర్థం కాలేదు.
The above Telugu text has been typed by : Mr. Sai Krishna
Latest Miracles:
- బాబా దయ వల్ల బ్యాగు లో కాష్ తీయలేదు.—Audio
- శ్రీ సాయిబాబా దయతో నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు
- అడవిలో ఏకాకిగా ఉన్న మాకు సహాయం చేసిన బాబా వారు …..!
- యిస్తానన్నది మరి అడిగి తీసుకుంటారు బాబా–Audio
- బాబా నే స్వయంగా వచ్చి అభయం ఇచ్చారు…2
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments