Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్
మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-150-0212-pallaki seva 11:17
ఒకరోజు పెద్ద వర్షమొచ్చి, మశీదంతా తడిసిపోయి, బాబాకు కూర్చునేందుకు చోటుగూడ లేకపోయింది.
భక్తులాయనను నాటి రాత్రికి చావడిలో వుండమన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు.
ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు. నాటినుండి ఆయన ఒక రాత్రి మశీదులోను, ఒకరాత్రి చావడిలోనూ నిద్రించేవారు.
వారిని భక్తులు మశీదునుండి చావడికి వేడుకలతో తీసుకెళ్ళడం క్రమంగా డిసెంబరు 10, 1909 నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొందింది. నేటికీ యిది గురువారం రాత్రి పల్లకి ఉత్సవంగా జరుగుతున్నది.
ఒకప్పుడు హార్డానుండి భక్తులు బాబాకొక పల్లకీ పార్సెల్ చేసి పంపారు. బాబా దానిని మశీదు ముంగిట పెట్టించి, మూడు మాసాలు దానిని తెరవనివ్వలేదు.
ఒకరోజు రఘువీర్ పురందరే చనువుగా, “బాబా, ఈరోజు పల్లకీ బయటకు తీసి పూలతో అలంకరించి అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతాం” అన్నాడు.
సాయి ఆ పార్శిలు విప్పడానికే ఒప్పుకోలేదు. అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో సటకా తీసుకుని, చంపేస్తానని అతనిమీదకు పరుగెత్తారు. భక్తులు భయంతో పారిపోయారు.
పురందరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్శిలు విప్పి, పల్లకీని పూలతో అలంకరించాడు.
ఇక బాబా మానంగా వుండి పోయారు. అది చూచిన పురందరే పంతంగా, ఇకనుంచి మిమ్మల్ని పల్లకీలో ఊరేగింపుతో చావడికి తీసుకెళ్తాము!’ అన్నాడు.
“అలామాత్రమెన్నటికీ జరుగనివ్వను” అన్నారు బాబా. అతడు, “అయితే పల్లకీ ఖాళీగా మోసుకుపోతామా ఏమి?” అన్నాడు. సాయి ఉగ్రులై, “నీవు ముందు బయటికి పోతావా, లేదా?” అని చెడ్డగా తిడుతూ సటకాతో బెదిరించారు.
అతడు త్వరగా ఆ పని పూర్తిచేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు.
అతడనుమతి కోరినపుడు బాబా ఏమీ మాట్లాడకుండా ‘ఊధీ యిచ్చారు.
తర్వాత చావడికి వెళ్ళవలసినరోజు సాయంత్రమయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకీ ఉత్సవానికి మశీదువద్ద చేరారు.
బాబా మాత్రం పల్లకీ ఎక్కనని భీష్మించారు. ఊరినుంచి అప్పుడే వచ్చిన పురందరే తాను సిద్ధంచేసిన పల్లకీ లేకుంటే తాను ఉత్సవానికి రానన్నాడు.
భక్తులెంత బ్రతిమాలినా బాబా తమ పట్టు విడువలేదు.
చివరకు పల్లకీలో వారి పాదుకలు వూరేగించాలని, సాయి పాదచారియై వూరేగింపుతో వెళ్ళాలనీ రాజీ కుదిరింది. “బాబా, పల్లకీ నేను కూడా మోసేదా?” అన్నాడు పురందరే. “వద్దు, నీవు 125 వత్తుల దివిటీ పట్టుకో!” అన్నారు బాబా. అలా దివిటీల ఊరేగింపుతో పల్లకీ చావడి చేరింది.
నాటి ఉత్సవమయ్యాక సాయి పల్లకీని మశీదులో పెట్టనివ్వలేదు.
గనుక 3,4 రోజులు అది చావడిలోనే వున్నది. చివరికెలాగో ఒకరాత్రి మాత్రం మశీదు ముంగిట వుండనిచ్చారు.
ఆ రాత్రి దానికున్న రెండు వెండి సింహాలూ దొంగలెత్తుకెళ్ళారు. కనుక దానికొక షెడును నిర్మించనారంభించాడు పురందరే. బాబా లెండీనుండి గబగబా వచ్చి “ఏమిటి చేస్తున్నావ్?” అని గద్దిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు.
ఆయన ఉగ్రులై, “నువ్విక్కడనుంచి పోతావా, లేక నీ తల పగలగొట్టనా?” అని మీదకెళ్ళారు.
అతడాయన కాళ్ళావేళ్ళాపడి బ్రతిమాలాడు. ఆయన మరింత గట్టిగా, ‘నాకు నువ్వూ వద్దు, పల్లకీ, షెడు అసలేవదు; నన్ను విసిగించకు, ఫో!” అని అరచారుగాని, అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు.
మధ్యాహ్నం ఆరతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మశీదు చేరినా పురందరే మాత్రం వెళ్ళకుండా పనిచేస్తూనే వున్నాడు.
సాయి కొన్నిసార్లు అతనికి నెమ్మదిగా చెప్పారు. మందలించారు, గద్దించారు; భోజనానికి వెళ్ళకుంటే కొడతానని బెదిరించారు. అయినా అతడు వినిపించుకోలేదు. పట్టరాని కోపంతో పలుకకుండా పదేపదే అతనికేసి చూస్తారు;
చేత్తో పొట్ట తడుముకుంటారు. ‘ఆ పనికిమూలినవాడు భోజనానికిగూడ పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు. నువ్వైనా పిలుచుకుపో!” అని కాకా సాహెబ్ తో చెప్పారు.
“అతడు సెలవుపెట్టాడు. అదయ్యేలోగా పని పూర్తిచేయాలని చూస్తున్నాడు.
అతనిని భోజనానికి పిలుచుకెళ్ళనా?” అన్నాడు కాకా, “వాడు రాడు, ఆ మూర్ఖుడు నేను చెప్పినా వినలేదు!” అన్నారాయన.
వెంటనే పురందరే వారి పాదాలపైబడి పసిపిల్లవానిలా ఏడుస్తుంటే, “ఎందుకేడుస్తావ్? వూరుకో!” అన్నారు బాబా.
అతడు కళ్ళు తుడుచుకొని, “ప్రొద్దుటినుండీ నన్నింతలా తిడుతున్నారు;
కొడతాను, చంపుతాను అని బెదిరిస్తున్నారు. కాని నేనొక్కపూట భోంచేయకపోతే అంత తల్లడిల్లిపోతున్నారే! నాపై మీకెందుకింత దయ? మమ్మింతలా పట్టించుకునేదెవరు?” అన్నాడు.
“నోర్ముయ్! వెళ్ళి భోజనం చేయ్యి కడుపు మండిపోతుంది!” అన్నారు బాబా.
అతడు రెండడుగులు వేసి చటుక్కున వెనక్కు తిరిగి, “నేను వెళితే మీరిదంతా పీకేస్తారు!” అన్నాడు.
బాబా ప్రసన్నులై, నెనేమన్నారాక్షసుడనా? నేనలా ఏమీ చేయనులే! అన్నారు.
అతడు భోంచేసి వచ్చి సాయంత్రానికల్లా ఆ షెడుకొక తలుపు బిగించాడు.
అపుడు పల్లకీ ఆ గదిలో పెట్టి, సాయికి నమస్కరించి, “బాబా, సెలవయిపోయింది, నేను వెళ్ళాలి. ఇంకా ఒక్క తలుపు బిగించాలి. ఆ పని తాత్యాకు అప్పగించి వెడతాను” అన్నాడు. “
ఆ పని రేపాలోచిస్తాములే. నీవుపోయి విశ్రాంతి తీసుకో!” అన్నారు బాబా, తెల్లవారగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు. “అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు?
మనం ప్రారంభించిన పని పూర్తిచేయాలి గాని యింకొకరికప్పగించకూడదు. వీలైనంత తరచుగా శిరిడీ వస్తుండాలి” అన్నారు బాబా, “మీరు సంకల్పిస్తేనే రాగలం” అన్నాడు పురందరే.
“శిరిడీకి నేనందరినీ పిలుస్తాను. కాని రావడానికందరూ సిద్ధంగా వుండరు. పని పూర్తిచేసి, కాకడ ఆరతయ్యాక వెళ్ళు” అన్నారు. పురందరే మర్నాడు వెళ్ళాడు.
అప్పటినుండి ‘చావడి ఉత్సవం ‘పల్లకి ఉత్సవంగా మారింది.
ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మశీదు ముంగిట చేరి తాళాలు చిడతలు మొన వాద్యాలతో భజన చేసేవారు. ఇంతలో అబ్దుల్లా, రాధాకృష్ణ ఆయి-యిద్దరూ బాబా తిరిగే వీథులన్నీ శుభ్రంచేసి, నీళ్ళు చల్లి, ముగ్గులేసి, మశీదునుంచి చావడిదాకా బాటమీద గుడ్డలు పరిచేవారు.
వెనుక చిన్న రథము, కుడివైపున తులసికోట, ఏదుట సాయి, మధ్యలో భక్తబృందమూ వుండేవారు.
కొందరు మసీదు గేటువద్ద దివిటీలు సిద్ధం చేస్తుంటే, కొందరు పల్లకీనలంకరించేవారు. కొందరు దండాలు ధరించి, “సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై” అని కేకలేస్తుండేవారు.
మశీదంతా దీపాలతోను, తోరణాలతోనూ కళకళలాడుతుండేది. దాని ఏదుట ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ (గుజ్జం) నిలబడేది.
అపుడు తాత్యా వచ్చి బాబాను సిద్ధంగా వుండమని చెప్పేవాడు. తర్వాత అతడు సమయానికొచ్చి చంకలో చెయ్యివేసి సాయిని లేవదీసాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంకలో సట్కా, చేతిలో చిలుముగొట్టం,
పొగాకూ తీసుకుని, భుజానికొక పాతగుడ్డ వేసుకునేవారు. ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాత్యా ఒక బంగారు జరీశాలువా ఆయన భుజాలపై కప్పేవాడు.
అప్పడాయన అడుగు ముందుకువేసి, కుడికాలుతో ధునిలో కట్టెలు సర్ది, కుడిచేతితో అక్కడున్న దీపమార్పి బయల్దేరేవారు.
మేళతాళాలతో అందరూ ముందుకు సాగేవారు. కొందరావేశంతో నృత్యం చేసేవారు.
కొందరు జండాలు, ధ్వజాలు మోసేవారు. సాయి మశీదు మెట్లమీదకు రాగానే వందిమాగధులు ఎలుగెత్తి జై కొట్టేవారు. భక్తులు చామరాలతో వీస్తూ బాబాను ముందుకు నడిపించేవారు.
తాత్యా ఒక చేత్తో లాంతరు, మరొక చేత్తో బాబా ఎడమచెయ్యి పట్టుకునేవాడు; కుడిచెయ్యి మహల్సాపతి పట్టుకుని, తర్వాత విడిచి సాయి దుస్తుల అంచులు పట్టుకుని నడిచేవాడు. జోగ్ ఆయనకు ఛత్రం పట్టేవాడు.
ఆయన ముందు శ్యామకర్ణ, వెనుక భక్తులు, సేవకులు, వాద్యగాళ్ళు నడిచేవారు. నామసంకీర్తనం, వాద్యాలు, జయకారాలు మిన్నుముడుతుంటే, ఊరేగింపు నెమ్మదిగా మశీదు మలుపు చేరేది.
అక్కడ సాయి చావడివైపు తిరిగి నిలిచినప్పుడు, ఆయన రూపం దివ్యంగా వుండేది.
ఆయన ఏకాగ్ర మనస్కులై ఎవరినో మనస్సుతో పిలుస్తున్నట్లు కన్పించేవారు. తమ కుడిచెయ్యి క్రిందికి, పైకీ వూపి వింతైన భంగిమలు చేసేవారు.
కాకాసాహెబు వెండి పళ్ళెంలో గులాల్ పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతుండేవాడు.
అపుడు వాద్యఘాష ఆకాశాన్నంటేది. ‘అప్పుడు బాబా ముఖంలో వుట్టిపడే దివ్యకళను మించినదేదీ వుండజాలదు అన్నాడు ప్రధాన్.
దానిని స్వయంగా చూచిన హేమాద్ పంత్, ‘ఆ దృశ్యము, దాని వైభవము వర్ణించ సాధ్యంగాదు’ అని వ్రాశాడు. ఒక్కొక్కప్పుడు మహల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు.
అయితే ఏకాగ్రమైన సాయిదృష్టిని యివేవీ కించిత్తు గూడా ఆకర్షించలేకపోయేవి.
దివ్యమైన ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎందరెందరో గుమిగూడేవారు. సాయి చాల నెమ్మదిగా నడిచేవారు.
అలా ఊరేగింపు చావడి చేరేది. “ఆ రోజులు గడిచిపోయాయి.
ఇపుడు గాని, యిక ముందుగాని అలాటి ఉత్సవమెవరూ చూడలేరు. అయినా దానిని స్మరించి మనం కొంతవరకూ తృప్తి పొందవచ్చు” అంటాడు హేమాద్పంత్.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- చావడి ఉత్సవం ….సాయి@366 డిసెంబర్ 10….Audio
- పల్లకీ సేవ
- శివనేశన్ స్వామిని చావడి బాబా అని సంబోధించుట.
- తేలుకాటు
- సుబ్బారావు గారు సాయి మందిరమును ఏర్పాటుచేయుట—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments