పరీక్షలు …. మహనీయులు – 2020… ఏప్రిల్ 23



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా అందరినీ పరీక్షించేవాడు. గురు నానక్ కూడా అంతే.

ఒకసారి కుర్తార్ పూర్ కు ఉహించనంతమంది నానక్ ఉపన్యాసాలు వినటానికి వచ్చారు. ఆ గురువే అందరుకూ భోజనవసతులు ఏర్పాటు చేసాడు.

ఆహార పదార్దాలు అయిపోసాగాయి. అక్కడ ఇద్దరు, ముగ్గురున్నారు వారిలో నానక్ కుమారులు శ్రీచంద్, లక్ష్మీదాసు, మరో శిష్యుడు కూడా ఉన్నాడు. అతని పేరు లెహనా.

నానక్ కుమారులతో “బిడ్డలారా! ఆహార పదార్దాలు అయిపోయాయి. ఈ తుమ్మచెట్టు ఎక్కి ఊపండి. ఆహార పదార్దాలు పడతాయి. వాటిని అందరకూ ఇద్దాం” అన్నాడు.

కుమారులు నవ్వి, అక్కడ నుండి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న లెహనా గురువుకి నమస్కరించి, ఆ ముళ్ళ తుమ్మచెట్టు ఎక్కి ఊపాడు. ఆహార పదార్దాలు పడ్డాయి.

నానక్ ఒకసారి లెహనాను “నీఇంటికి పో” అని ఆజ్ఞాపించారు. “తమ పాదసన్నిధే తప్ప నాకు వేరే ఇల్లు లేదు” అన్నాడు లెహనా.

“ఐతే నాతొ రా!” అంటూ ఆయనవెంట తీసుకుపోయారు. నదీ తీరం చేరారు వారు. అక్కడ ఒక గుడ్డ కప్పి ఉన్న శవం వద్దకు తీసుకువెళ్ళాడు నానక్ లెహనాను.

ఆ శవం నుండి భరింపరాని వాసనవేస్తోంది. ఆ శవాన్ని చూపి నానక్ “తిను” అన్నారు లెహనాను. లెహనా తెల్లపోలేదు.

అతడు సిద్దపడి “ఎటు నుండి తినటం మొదలుపెట్టమంటారు?” అని అడిగాడు. ” పాదాల వైపు నుండి” అన్నాడు నానక్.

“అలాగే” అంటూ లెహనా ఆ గుడ్డను తీసాడు. ఆశ్చర్యపోయాడు లెహనా. శవం బదులు పొడవైన పళ్ళెంలో పంచభక్ష్య పరమాన్నాలున్నాయి.

ఈ అద్భుత మహిమను చూచిన లెహనా గురుదేవుని కాళ్ళపై పడ్డాడు. అది శవమైనా సరే, పంచభక్ష్య పరమాన్నాలైనా సరే గురువు చెప్పింది తు.చ. తప్పకుండా ఆచరించాలి. జుగుప్స కూడదు. సర్వం బ్రహ్మ స్వరూపంగానే భావించాలి అని లెహనాకు తెలుసు.

ఒకసారి తన ఇద్దరు కుమారులతోను, లెహనాతోను చక్కని బట్టలు ధరింపచేసి బయలుదేరాడు నానక్, అలా తిరిగొద్దామని.

అక్కడున్న పొలాలలో చక్కని గడ్డి కనిపించింది వారికి. నానక్ వారిని ” ఆ గడ్డిని కోసి, తీసుకురండి. పశువులకు మేతగా వాడదాం” అన్నారు.

ఆ గడ్డి బురద నీటిలో ఉంది. ఆ పొలాల్లో దిగి గడ్డి కొస్తే తమ తెల్లని బట్టలన్నీ మరకలవుతాయని అలోచించి నానక్ కుమారులు ఆ గడ్డిని తాకనైనా తాకలేదు.

లెహనా మాత్రం ఆ బురదలో దిగి గడ్డిని కోసి మోపుగా కట్టుకుని నెత్తినపెట్టుకుని ఇంటికి తెచ్చాడు. గురు నానక్ భార్య “బట్టలు బురదయ్యాయి. అంత బరువు మోస్తున్నాడేమిటి లెహనా?” అంది భర్తవైపు చూస్తూ.

అది “బాధలుపడుతున్న భక్తుల బరువుకు సంకేతం, ఇక అవి మరకలు కావు అవి స్వర్గం పెట్టిన సింధూరపు చుక్కలు” అన్నారు నానక్.

అంతటి భక్తి విశ్వాసాలున్న లెహనాకు గురుత్వాన్నిచ్చాడు నానక్. లెహనా గురు అంగద్ అయ్యాడు.

అంగద్ అంటే శరీరంలోని భాగం. నానక్ శరీరంలో భాగమయ్యాడు లెహనా.

ఏప్రియల్ 23  (1504) గురు అంగద్ జన్మదినం. ఆయనను స్మరించి ఆయనవలె గురు సేవతో గురు కృప పొందుదుము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles