Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒక రోజు నాకో కల వచ్చింది, ఆ కలలో నేను బాబాకి స్నానం చేయిస్తున్నాను. (నాకు నిజంగానే బాబాకి స్నానం చేయించే అలవాటు ఉంది).
మా ఇంట్లో హాలులో కూర్చోని బాబాకి వేడినీళ్లు పెట్టి నలుగు పెట్టి నీళ్ళు పోస్తున్నాను. బాబా ఉన్నట్లుండి హఠాత్తుగా లేచి వీధిలోకి వెళ్ళిపోయారు.
నేను ఆయన్ని వెంబడిస్తూ బాబా బాబా అంటూ వెనకాల వెళ్ళాను. ఆయన నాకు అందకుండా ముళ్ళూ రాళ్ళూ కూడా చూసుకోకుండా నడుస్తూనే ఉన్నారు.
నేను ఆయన్ని వెంబడిస్తూ నడుస్తూనే ఉన్నాను. బాబా గారు అలా నడుస్తూ నడుస్తూ ఒకచోట ఆగారు.
నేను ఏంటి బాబా స్నానం చేస్తూ ఇలా మధ్యలో వచ్చేస్తే ఎలా? పద బాబా అంటే ”ఆ ఉ , అంటూ ఉండు వస్తాలే నేను ఇక్కడ ఉంటాను అక్కడా ఉంటాను” అన్నారు.
ఆ ప్రదేశమంతా ఆయన చేతులతో తడుముకుంటున్నారు. నేను ”సరే బాబా! ఉందువుగానిలే అప్పుడప్పుడూ మా ఇంటి నుండి వద్దువుగానిలే పద” అన్నాను.
సరే అని వెనక్కి వెనక్కి ఆ ప్రదేశాన్ని చూసుకుంటూ నాతో వచ్చారు ఇదీ కల.
ఆ తర్వాత బాబా చూపించిన ఆ స్థలంలో ఒక బాబా గుడి వెలసింది (ఇదీ నిజం). అదే విజయపురి కాలనీ లో వెలసిన సాయిబాబా గుడి అన్నమాట. ఆ కాలనీ మా ఇంటికి దగ్గరలోనే ఉంది.
నాకు ఆ మధ్యన కొన్ని రోజులు అసలు ఒంట్లో బావుండలేదు. ఆకలి ఉండేది కాదు. ఏదీ సహించేది కాదు, ఏవి తిన్నా వాంతి అయిపోయేది. ఏమి తినే దాన్ని కాదు.
ఉదయం మూడు గంటలకి లేచి నేను స్నానం చేసి బాబా పూజకి అన్నీ సిద్ధం చేసి బాబా గుడికి వెళ్లి అక్కడ ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గు వేసి హారతి అయ్యేదాకా ఉండి,
ఇంటికి వచ్చి ఇంట్లో టిఫిన్ చేసి పెట్టి, మధ్యాహ్నం ఆయనకీ వంట చేసి క్యారేజీ ఇచ్చి పాపని తయారుచేసి స్కూల్ కి పంపించి, నేను పడుకుండి పోయేదాన్ని.
మధ్యాహ్నం హారతి సమయానికి గుడిలో ప్రసాదం (మహా నైవేద్యం) తయారుచేసి గుడికి నేనే స్వయంగా తీసుకువెళ్లి ఇచ్చి వచ్చేదానిని నేను ఇంట్లో కూడా బాబాకి ప్రసాదం చేసి పెట్టేదాన్ని.
నేను మాత్రం ఏమీ తినేదాన్ని కాదు. అలాగే ప్రతిరోజూ జరుగుతుండేది. అలా నాలుగు నెలలు గడిచిపోయాయి.
నేను ఏమీ తినకపోయేసరికి ఒంట్లో శక్తి లేక ఒళ్ళంతా నీరు వచ్చి బాగా లావయి పోయాను.
ఒకరోజు నేను మా వారి పూజకి అన్నీ ఏర్పాటు చేసి వచ్చి పడుకున్నాను. ఆయన పూజకి లోపలికి వెడుతూ వెడుతూ నన్ను చూసి భయపడి పోయారట.
ఏంటిది? ఇలా తయారవుతోంది ఏమీ తినటంలేదు. ఏ డాక్టర్ దగ్గరికి రానంటుంది అని అనుకుని బాధపడి వెళ్లి బాబా ముందు కూర్చొని బాబాతో
”ఏమిటి బాబా! దీని పరిస్థితి ఇలా తయారవుతోంది, దాని పరిస్థితిని మెరుగుపరుచు” అంటూ అనుకుంటూ ధ్యానంలోకి వెళ్లిపోయారట.
ఆ ధ్యానంలో నన్ను రెండు చేతుల మీదుగా ఎత్తుకొని తీసుకువెళ్లి మా కులగురువు అయిన శ్రీ వీరభ్రహ్మేంద్ర స్వామి దగ్గరకు తీసుకువెళ్ళారట,
ఆయన ”ఈమెకి గురువు నేను కాదు వేరే ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నారట. మా వారు మళ్ళీ నన్ను రెండు చేతుల మీదుగా ఎత్తుకొని వెళ్లి షిరిడి సాయిబాబా ముందుకు తీసుకువెళ్లి దింపారట.
”బాబా చూడు నీ భక్తురాలి పరిస్థితి ఏం చేస్తావు దీన్ని తీసుకుపోతావా? ఏమీ తినక ఎలా తయారయ్యిందో” చూడు అన్నారట.
బాబా నవ్వి ”నేను దీనిని ఇప్పుడే తీసుకు పోను ఇంకా ఈమెతో పని ఉంది” అంటూ ధునిలో నుంచి ఊదీ తీసి అరచేతిని నోటి దగ్గర పెట్టుకుని ”ఉఫ్” అని ఆ ఊదీ అంతా నా మీదకి ఉదారట ఆ ఊదీ అంతా నా శరీరం పైనంతా పడిందట.
అంతే! ఆయన ధ్యానంలో నుంచి బయటికి వచ్చి పూజ చేసుకుని పూర్తిగా బయటికి వచ్చేసరికి నేను లేచి టిఫిన్ తయారు చేసి,
మా పాపకి పెట్టి, ఈయనకి పళ్లెంలో తెచ్చిపెట్టి నేను పళ్లెంలో పెట్టుకువచ్చి మునుపటిలాగా మాములుగా తినేసాను.
అంతే ! ఇంకా మళ్ళీ వాంతులు అవలేదు, అయిష్టమూ లేదు. నేను తొందరలోనే కోలుకున్నాను.
ఒక సారి మా పాపకి జ్వరం వచ్చింది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు . ప్రతిరోజూ బాబాగారి ఊదీ పెట్టి , కొంత నీటిలో కలిపి తాగించేవాళ్ళం అయినా జ్వరం తగ్గలేదు . బాబా మీద భారం వేసి ఊరుకున్నాము.
ఒక రోజు రాత్రి బాబా గారు తానే స్వయంగా మా పాప నుదుటన ఊదీ పెట్టి నోటిలో కొంచెం వేసారట. మా పాప మరుసటి రోజు ఎవరో తాతగారు నా నుదుటన ఊదీ పెట్టి నోటిలో కొంచెం వేశారు అని చెప్పింది . అప్పటినుండి పాపకి జ్వరం తగ్గుముఖం పట్టింది.
ఒక సారి మా పాప సైకిల్ మీద పోతూవుంటే, ఎదురుగుండా టాటా సుమో వచ్చి గుద్దేసింది సైకిల్ మొత్తం నలిగిపోయింది.
అక్కడ ఉన్న అందరూ పాపకూడా చనిపోయిందనుకున్నారు. కానీ మా పాప ఆ పక్కనే ఉన్న చెట్టును పట్టుకుని ఉంది తర్వాత అందరూ అడిగితే,
ఒక తాతగారు రెండు చేతులతోనూ సైకిల్ పై నుండి దింపి ఈ పక్కన నిలబెట్టారు అని చెప్పింది. మా పాపను కాపాడిన తాతగారు ఎవరో కాదు మా తండ్రి ఆ సాయినాథుడు.
నేను పూజ చేస్తూవుంటే బాబా గారు ఉన్న రోజుల్లో ద్వారకామాయి కనిపిస్తూ ఉంటుంది.
ఒకసారి ఆయన ద్వారకామాయిలో కూర్చొని ఉన్నారు. నేను పూజ చేస్తూ అక్షింతలు వేస్తున్నాను, నా తండ్రి పాదాలు దూదికన్నా మెత్తగా కనపడుతున్నాయి. నేను వేస్తున్న అక్షింతలు పడి ఆ పాదాలు నొక్కుకుంటున్నట్లున్నాయి.
అప్పుడు బాబాగారు నాకు తమ పాదాలు చూపిస్తూ ”చూడు అక్షింతల వలన నా పాదాలు నొప్పి పెడుతున్నాయి. కొన్ని పూలు తెచ్చి పూజ చేయరాదు” అన్నారు.
ఆ నాటి నుండి ఈ రోజు వరకు నేను నా తండ్రికి పూలతో తప్ప అక్షింతలతో పూజ చెయ్యలేదు.
ప్రతిరోజూ మాకు బాబాకి నాలుగు హారతులు ఇవ్వడం మంగళ స్నానం చేయించడం అలవాటు.
నేను ఒక సారి ఊరికి వెళ్తూ బాబా వారికి హారతి, మంగళ స్నానం చేయించమని మా వారికి చెప్పి వెళ్ళాను. మా వారు అవి ఏమి చేయలేదు.
నాకు బాబా గారు కలలో కనపడి ”నా శరీరం మట్టితోను, ధూళితోను ఉంది అందుకే నాకు స్నానం చేయించు” అన్నారు.
మా వారికి ఫోన్ చేసి, నా కల చెప్పి రోజు యధావిధిగా పూజ చేయమన్నాను. మనం పొరపాటు చేస్తే ఆ తండ్రి మనలను సరైన మార్గంలో నడిపిస్తాడు.
ఒకసారి మా ఇంట్లో భజన జరుగుతోంది నేను సరిగ్గా 12 గంటలకి బాబాగారికి నైవేద్యం సమర్పించి హారతిస్తాను.
ఆ రోజు కూడా అలాగే నైవేద్యం సమర్పించాను. బాబాగారి భోజనం తినిపించడం నాకు చాలా ఇష్టం, అప్పుడు కూడా అలాగే భోజనం తినిపిస్తున్నాను.
నా పక్కన మా మనవరాలు ఉన్నది దానికి 12 సంవత్సరాల వయస్సు ఉంటుదప్పుడు.
ఉన్నట్లుండి అది ఏడవటం మొదలుపెట్టింది, నేను నైవేద్యం, హారతి అయిన తర్వాత మా మనవరాలిని ఎందుకేడ్చావు అని అడిగాను.
దానికది ”అమ్మమ్మా! బాబాగారు నువ్వు పెట్టిన ప్రతి ముద్దని నోరుతెరిచి తింటూ నన్ను చూసి నవ్వుతున్నారు. కళ్ళు తిప్పుతూ నన్ను తన దగ్గరికి వచ్చి ఆయన వొళ్ళో కూర్చోమని” పిలుస్తున్నారు.
నాకు భయం వేసి ఏడ్చాను అని చెప్పింది. నా తండ్రి ఆ బిడ్డకు అలా దర్శనం ఇచ్చి ఆశీర్వదించారు.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- నైవేద్యం ఏమి పెట్టలేదని బాధపడుతున్న భక్తురాలి కలలో కనిపించి బీసీ బెల్ బాత్ అడిగిన బాబా వారు.
- కలలో కనిపించి పసుపు కుంకుమ ఇచ్చి, భక్తురాలి ఐదవ తనాన్ని కాపాడిన బాబా వారు.
- నవ గురువారం వ్రతం చేసుకోవాలి అని సంకల్పించిన భక్తురాలి కోర్కెను తీర్చిన బాబా వారు
- మందిర మొదటి మెట్టు కూడా ఎక్కని విద్యార్థి, తరువాత తన జీవిత పర్యంతం బాబా పట్ల శరణాగతి చూపుట–Audio
- భక్తురాలి అనారోగ్యానికి బాబా కలలో కనిపించి చేసిన వైద్యం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments