శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (8)ఇంద్రియ సుఖములు (1వ.భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (8)ఇంద్రియ సుఖములు (1వ.భాగం)

ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్

తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు

సాయిబాబా గురించి చెప్పుకోవాల్సివస్తే ఆయన విషయంలో  ఇంద్రియ సుఖాలు అన్న మాటకి తావులేదు.  అసలు దాని విషయం మీద ప్రశ్నకూడా తలెత్తదు. సాయిబాబా తన జిహ్వతో పదార్ధాలను రుచి చూస్తున్నట్లు కనిపించినాగాని, వాస్తవానికి ఆయనకు ఆ పదార్ధాలను రుచి చూసి ఆస్వాదిద్దామనే కోరికగాని, అందులోని ఆనందాన్ని అనుభవిద్దామనే  కోరిక గాని ఏమీ లేవు.  ఎవరికయితే ఇంద్రియ సుఖాలను అనుభవిద్దామనే కోరిక ఉండదో వారు ఏనాటికయినా వాటిలోని ఆనందాన్ని అనుభవిస్తారా?  ఇంద్రియ జ్ఞానం ఉన్నవానికి ఆఖరికి అవయవాలను కూడా స్పృశించాలనే ఆలోచనే రాదు (శ్రవణం, స్పర్శ, దృష్టి, రుచి, వాసన).  అందుచేత అలాటివాళ్ళు ఎప్పటికయినా అందులో అనగా విషయ వాసనలలో చిక్కుకుపోతారా?  ఇంద్రియ జ్ఞానం ఉన్నవాడు చెడు మాటలను (శ్రవణం) వినడానికి, స్పర్శ ద్వారా అందమయిన వాటిని అనుభవిద్దామని, అలాగే సుందరమయిన వాటి మీద దృష్టి సారించి మనసును వికలం చేసుకోవాలని, మధురమయిన వాటి రుచిని ఆస్వాదించి వాటి మీద కోరిక పెంచుకోవాలని, వాటి వాసనను ఆఘ్రాణించి వాటినే తలచుకొంటూ ఉండటం గానీ, ఇలాంటివేమీ అటువంటి వారిని అంటిపెట్టుకుని ఉండవు. సుందరమయిన ప్రకృతిని చూసినప్పుడు మనసు పరవశం చెందుతుంది. అదే సుందరమయిన వారిని చూచినప్పుడు మనసు లయ తప్పుతుంది.  మనకిష్టమయిన ఆహారపదార్ధాలను చూసినప్పుడు మన జిహ్వకి వాటిని ఆస్వాదించాలనే కోరిక కలిగుతుంది.  అందుచేత వాటి వలలో మనం చిక్కుకోకుండా ఉండాలంటే మన మనసుని అదుపులో పెట్టుకోవాలి.  దేనినయినా సరే చూచిన తరువాత దాని గురించి మనం ఇక ఆలోచించకూడదు.  వాటిని పొందలేకపోయామే అనే బాధ ఉండకూడదు. అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది.  సాంసారిక జీవితాన్ని అనుభవిస్తున్నా మనం ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించగలం.

సాయిబాబా వారి బ్రహ్మచర్యం లేక ఇంద్రియసుఖాలపై (పంచేంద్రియాలు) అనురక్తి చెప్పుకోదగ్గది. రామాయణంలోని హనుమంతునివలె ఆయన అస్ఖలిత బ్రహ్మచారి.  మేక కంఠంలోని చన్నులవలె వారి ఇంద్రియాలు కేవలం మూత్ర విసర్జన కోసమే ఉండేవి. ఇంద్రియానుభూతులలో వారికి ఏమాత్రమూ అభిరుచి ఉండేది కాదు.  చెప్పాలంటే ఇంద్రియానుభవముల స్పృహయే ఆయనకు లేదు.  శ్రీసాయి సత్చరిత్ర 10వ.అధ్యాయం

ఇంద్రియ సుఖాలవల్ల కలిగే విపత్తులు శ్రీసాయి సత్ చరిత్రలో అనేక చోట్ల ప్రస్తావింపబడింది.  47వ.అధ్యాయం లో హేమాడ్ పంత్ ఇలా అంటారు. “శ్రవణ లాలసతో లేడి తన ప్రాణం పోగొట్టుకుంటుంది.  అందమయిన మణిని ధరించి సర్పం మరణిస్తుంది.  దీపపు కాంతిని కోరుకుని శలభం (చిమ్మెట) కాలిపోతుంది.”  విషయాలతోటి సంగమం ఈవిధంగా ప్రమాదకరంగా ఉంటుంది.  విషయభోగాలను అనుభవించటానికి, ఇంద్రియ సుఖాలకి ధనం అవసరం.  దానివల్ల ధన సంపాదన కోసం ప్రయత్నాలు మొదలుపెడతాడు మానవుడు.  ఒకసారి సుఖాలకు అలవాటు పడిన తరువాత ఇంకా ఇంకా అనుభవించాలనే కోరిక పెరుగుతూనే ఉంటుంది.  ఇక ఆపుకోలేనంతగా వాటి వలలో చిక్కుకునిపోతాడు. దాని వల్ల ఇంకా ఇంకా ధనం సంపాదించాలనే కోరిక ఆపుకోలేనంతగా బలీయమవుతుంది.  ఇంద్రియ సుఖాలను అనుభవించి ఆనందాన్ని పొందుదామనే తృష్ణ చాలా ప్రమాదకారి.  వాటికోసం ప్రాకులాడే మానవుడు ఆఖరికి నాశనమయిపోతాడు.  (ఓ వీ  121 – 123)

శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 2వ.అధ్యాయంలో ఈ విషయం గురించే బోధించారు.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే   I

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే   II     శ్లో. 62

విషయ చింతన చేయు పురుషునకు ఆవిషయముల యందు ఆసక్తి ఏర్పడును.  ఆసక్తి వలన ఆవిషయములను పొందుటకై కోరికలు కలుగును.  ఆకోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః   I

స్మృతిభ్రంశాద్భుద్దినాశో బుద్దినాశాత్ ప్రణశ్యతి       II    శ్లో. 63

అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును.  దాని ప్రభావమున స్మృతి ఛిన్నాభిన్నమగును.  స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును.  బుధ్ధినాశము వలన మనుష్యుడు తన స్థితినుండి పతనమగును.

శ్రీకృష్ణపరమాత్మ రెండవ అధ్యాయం 58వ.శ్లోకంలో కోరికలను (ఇంద్రియాలను) ఏవిధంగా అదుపులో ఉంచుకోవాలో, తాబేలును ఉదహరిస్తూ ఈవిధంగా చెప్పారు.

యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః    I

ఇంద్రియాణీంద్రియార్ధేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా      II

తాబేలు తన అంగములను అన్ని వైపులనుండి లోనికి ముడుచుకొనునట్లుగా, ఇంద్రియములను ఇంద్రియార్ధముల (విషయాదుల) నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుధ్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను.

పైన ఉదహరించినవన్నీ కూడా ధృఢమయిన ప్రయత్నంతో మనస్సును స్థిరపరచుకుని విషయ వాసనలకు దూరంగా, ఉంటూ ఆత్మజ్ఞానాన్ని, మోక్షమార్గాన్ని లక్ష్యంగా ఎంచుకున్నవారి కోసం.  కాని, మనం ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి.  సాంసారిక జీవితంలో అన్ని సుఖభోగాలను అనుభవిస్తూ, మనసు స్థిరంగా లేని వారి మాటేమిటి?  పైన ఉదహరించిన హానికరమయిన విషయ వాసనల నుండి తప్పించుకుని మోక్షమార్గాన్ని ఏవిధంగా మానవుడు అవలంబించగలడు?  అతను తన సంసార భాద్యతల నుండి పూర్తిగా తప్పుకోవలసినదేనా?  తన కుటుంబం గురించి ఇక ఆలోచించనవసరం లేదా?

శ్రీసాయిబాబా అటువంటి వారికి ఎప్పుడూ సంసారాన్ని త్యజించమని భోధించలేదు.  మనం ఇపుడు శ్రీసాయి సత్ చరిత్రలోని ఒక సంఘటనను గమనిద్దాము.  అందులో బాబా పైన ఉదహరించిన వాటికి విరుధ్ధంగా ఏమని చెప్పారో చూద్దాము.  నానా సాహెబ్ చందోర్కర్ తన సంసార జీవితంపై విసిగిపోయి బాబా వద్దకు వచ్చి, సంసారాన్ని త్యజించడానికి అనుమతి ప్రసాదించమని అడిగాడు.  బాబా అతనితో “నీకు వచ్చిన సమస్య సరైనదే.  కాని ఈశరీరం ఉన్నంత వరకు ఈప్రాపంచిక సమస్యలు అనివార్యం.  ఎవ్వరూ కూడా వాటినుండి తప్పించుకోలేరు.  ఆఖరికి సన్యాసికి కూడా తన కౌపీనం గురించి, ప్రతిరోజు భుక్తి గురించి చింత తప్పదు.  ఆఖరికి నేను కూడా నాభక్తుల యోగక్షేమాల గురించి అనుక్షణం నిమగ్నమయి ఉండవలసిందే” (పేజీ 91 – 92 దాసగణు రచించిన భక్త లీలామృతం).

ఆతరువాత బాబా, సాంసారిక జీవితాన్ననుభవిస్తూ కూడా, మన ప్రవర్తన ఏవిధంగా ఉండాలో నానాచందోర్కర్ కి బోధించారు.  విషయ వాసననలో (ఇంద్రియ సుఖములకు లోను కాకుండా) అనైతిక మార్గాలను అనుసరించకుండా, సుఖంగా ఉండే ఎన్నో సులభమయిన పద్ధతులను సాయిబాబా శ్రీసాయి సత్ చరిత్రలో వివరించారు.

(ఇంకా ఉంది)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

 సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (8)ఇంద్రియ సుఖములు (1వ.భాగం)

Sai bhavana

SAIRAM.. Thank you for the Post..and thank you so much Respected Admin ji to make us learn so many things through the website.. It is so useful and easy to get knowledge through technology as now a days most of people are using technology and they r busy in it in their entire day,,So we can spread it perfectly..
This article leads us to gain victory over mind..Mind is only the cause for defeat with Maya.If we control it it will be our servant..Through meditation we can get will power to control the mind.(as per the sathsung of Pujya Guruji Sri Ammula Sambasiva Rao ji)

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles