అప్పా కులకర్ణి రెండవ బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

అప్పాసాహెబు కులకర్ణి గురించి నిన్నటి బాగంలో కొంత తెలుసుకున్నాము. ఈ  రోజు బాగంలో కధనం సాయి సచ్చరిత్రలో వచ్చినదే. అయినప్పటికీ అయన గురించి ఆయనకి సంబందించినది కావటం వలన ఒకసారి మనం మననం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో మళ్ళి నిన్నటి బాగానికి కొనసాగింపుగా ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను సహనంతో చదవండి.

1917వ సంవత్సరములో అప్పాసాహెబు కులకర్ణి థానేకు బదిలీ అయ్యాడు. బాలాసాహెబు భాటే అతనికి బాబా ఫోటోను ఇచ్చాడు. అతడు దానిని జాగ్రత్తగా పూజించసాగాడు. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యం అర్పిస్తూ, బాబాను దర్శించుకోవాలని ఆతృతగా నిరీక్షించసాగాడు. ఈ సందర్భములో, బాబా పటమును మనఃపూర్వకముగా చూస్తే బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమేనని చెప్పవచ్చు. (దీనికి నిదర్శనము ఇప్పుడు చెప్పబడిన లీల).

థానేలో పనిచేస్తున్నప్పుడు, అప్పాసాహెబ్ మొదటి ప్రపంచ యుద్ధం కోసం సైనికుల నియామకానికి పర్యటన చేస్తూ ఉండేవాడు. శిరిడీ సందర్శించి బాబా దర్శనం చేసుకోవాలనే బలమైన కోరిక ఉండేది, కానీ అందుకు సెలవు దొరికేది కాదు. ఈ నేపథ్యంలో అప్పాసాహేబ్ బాబా ఫోటోని మాత్రమే ఆరాధించేవాడు గాని బాబా దర్శనం కోసం శిరిడీ సందర్శించలేకపోయాడు.

బాబా స్వయంగా థానేకు వచ్చి అప్పాకు దర్శనం ఇచ్చారు. అతని కడుపు నిండిన తర్వాత బాబా అతనికి దర్శనం ఇచ్చి, ఆప్పాసాహెబ్ బాబాకు ఎంత దక్షిణ యివ్వాలనుకున్నాడో సరిగా అంతే ధనం కోరి మరీ తీసుకున్నారు. బాబా అతనికి ఊదీ ప్యాకెట్ కూడా ఇచ్చారు.

కులకర్ణి థానేలో ఉండగా ఒకసారి భివండి పర్యటనకు వెళ్లవలసి వచ్చింది. ఒక వారం రోజుల లోపల తిరిగి రావడానికి అవకాశము లేదు. అతడు లేనప్పుడు మూడవరోజున ఒక ఆశ్చర్యమైన సంగతి జరిగింది. మధ్యాహ్నం 12గంటలకు ఒక ఫకీరు అప్పాకులకర్ణి యింటికి వచ్చాడు. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోలాయి. కులకర్ణిగారి భార్యాబిడ్డలు, మీరు షిరిడీ సాయిబాబాగారా అని అడిగారు.

కాని వారు “లేదు. నేను భగవంతుని సేవకుడిని. వారి ఆజ్ఞానుసారము మీ యోగ క్షేమాలను తెలుసుకోవడానికి వచ్చాను.” అని చెప్పారు. తరువాత వారిని దక్షిణ అడిగారు. ఆమె ఒక రూపాయి ఇచ్చింది. వారొక చిన్న పొట్లముతో ఆమెకు ఊదీ నిచ్చి, దానిని పూజలో ఫోటో వద్ద వుంచి పూజించుకొమ్మని చెప్పి, అక్కడనించి వెళ్లిపోయారు. ఇక చిత్రమైన సాయిలీలను వినండి.

భివండిలో తన గుఱ్ఱము జబ్బుపడడంతో అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చింది. ఆరోజు సాయంకాలమే తిరిగి ఇల్లు చేరాడు. ఫకీరు రాక గురించి భార్య ద్వారా తెలుసుకున్నాడు. ఫకీరు దర్శనము తనకు లభించనందుకు చాలా మనోవేదన పొందాడు. ఫకీరుకు తన భార్య ఒక్కరూపాయి మాత్రమే దక్షిణగా ఇవ్వటం అతనికి నచ్చలేదు. తానే యింటివద్ద వుండివుంటే 10 రూపాయలకు తక్కువగాకుండ దక్షిణ ఇచ్చివుండేవాడినని అన్నాడు.

వెంటనే ఫకీరును వెతకటానికి బయలుదేరాడు. మసీదులలో గాని, మరెక్కడైనా గాని భోజనము చేయకుండానే వారికోసం వెదకసాగాడు. అతని అన్వేషణ ఫలించలేదు. ఇంటికి వచ్చి భోజనము చేసాడు.

భోజనమైన తరువాత చిత్రే అనే స్నేహితునితో వాహ్యాళికి బయలుదేరాడు. కొంతదూరము వెళ్ళిన తర్వాత, ఎవరో తమవైపు త్వరత్వరగా వస్తున్నట్లు కనిపించింది. వారి ముఖలక్షణములనుబట్టి వారు తన యింటికి 12గంటలకు వచ్చినవారే అని అప్పా అనుకొన్నాడు. వెంటనే ఫకీరు చేయి చాచి అతనిని దక్షిణ అడిగారు. అప్పాసాహెబు ఒక రూపాయి ఇచ్చాడు. వారు మళ్ళీ అడగడంతో రెండు రూపాయలిచ్చాడు. అప్పటికీ అతడు సంతుష్టి చెందలేదు.

అప్పాసాహెబు చిత్రేవద్దనుంచి మూడు రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చాడు. వారు ఇంకా దక్షిణ కావాలన్నారు. అప్పాసాహెబు వారిని తమ ఇంటికి రావలసినదిగా వేడుకొన్నాడు. అందరు ఇల్లు చేరారు. అప్పాసాహెబు వారికి 3 రూపాయలిచ్చెడు. మొత్తము తొమ్మిది రూపాయలు సమర్పించాడు. అప్పటికీ సంతుష్టి చెందక, ఫకీరు ఇంకా దక్షిణ యిమ్మన్నారు.

అప్పాసాహెబు తన వద్ద పదిరూపాయల నోటు వున్నదని చెప్పాడు. ఫకీరు దానిని తీసుకుని, అంతకుముందు తాను తీసుకున్న తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చి, అక్కడనుండి వెళ్ళిపోయారు.

శ్రీసాయిసచ్చరిత్ర 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది పాఠకులు గమనించగలరు. అప్పాసాహెబ్ ఇక్కడ ఆ నీతిని నేర్చుకున్నాడు. 

అప్పాసాహెబు పదిరూపాయలిస్తానని అన్నాడు గనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరచిన పిమ్మట తొమ్మిది రూపాయల నిచ్చి వేసారు. 9 సంఖ్య  చాల ముఖ్యమైనది. అది నవవిధభక్తులను తెలియజేస్తుంది. (బాబా తాము సమాధి చెందే సమయంలో లక్ష్మీబాయిశిండేకు 9 రూపాయలు ఇచ్చారు).

అప్పాసాహెబు ఊదీ పొట్లమువిప్పి చూశాడు. అందులో పువ్వుల రెక్కలు, అక్షతలు వున్నాయి. కొంతకాలం తర్వాత శిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి అతనికి లభించింది. అతడు ఊదీ పొట్లాన్ని, వెంట్రుకను ఒక తాయెతులో పెట్టి తన దండపై కట్టుకొన్నాడు. అప్పాసాహెబు ఊదీ ప్రభావము గ్రహించాడు.

అతడు చాలా తెలివైనవాడయినప్పటికీ నెలకు 40 రూపాయలు జీతము మాత్రమే లభించేది. బాబా ఫోటోను, ఊదీని పొందిన తరువాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయము వచ్చింది. మంచి పలుకుబడి, అధికారము లభించింది.

ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తికూడ వృద్ధిచెందింది. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన తరువాత ఊదీని నుదుట రాసుకుని, కొంచెము ఊదీ నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగ భావించి పుచ్చుకొనవలెను.

source: http://bonjanrao.blogspot.in/2013/01/appasaheb-kulkarni.html

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles