Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి
రచనః శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు (మూల రచన : తెలుగు. తరువాత ఆంగ్లంలోకి అనుబదింపబడినది, మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా) అనువాదానికి నిమిత్త మాత్రుడుః ఆత్రేయపురపు త్యాగరాజు గారు.
సప్త సప్తాహం – బాబా లీలలు
విజయవాడ మేరీస్టెల్లా కాలేజీ దగ్గర షిరిడీ సాయిబాబా మందిరం ఉంది. 1985 వ. సంవత్సరంలో హైదరాబాదు నుండి వచ్చిన శ్రీ డి.శంకరయ్య గారి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరంలో‘శ్రీసాయిబాబా సప్త సప్తాహం’ కార్యక్రమం, దత్తజయింతి రోజున ప్రారంభమయింది. ఆ కార్యక్రమానికి పూజ్య మహల్సాపతి కుమారుడయిన శ్రీ మార్తాండ మహరాజ్ గారి వద్ద నుంచి బాబా పాదుకలు, కఫనీ, పెద్ద సైజు సాయిబాబావారి చిత్రపటం తీసుకుని వద్దామని నిర్ణయించుకున్నాము.
వాటిని తీసుకురావడానికి శ్రీ డి.శంకరయ్యగారితో కలిసి షిరిడీకి వెళ్ళే అవకాశం లభించింది. మేమంతా ఒక వ్యానులో బయలుదేరాము. మొదటగా మేము ఉమ్నాబాద్ లో ఉన్న శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాధిని దర్శించుకున్నాము. తుల్జాపూర్ లోని దేవి భవానీ మాతను కూడా దర్శించుకున్నాము. అన్నీ అయిన తరువాత షిరిడీ చేరుకున్నాము.
మేమంతా సమాధి మందిరానికి వెళ్ళి బాబాను ప్రార్ధించుకున్నాము. శ్రీమహల్సాపతి గారి పూజా మందిరం నుండి, బాబా గారు ధరించిన పాదుకలను, కఫనీని తీసుకున్నాము. ఆయన మనుమడు (శ్రీమార్తాండ మహరాజ్ గారి కుమారుడు) శ్రీ అశోక్ మహల్సాపతి మాతో కూడా వచ్చాడు.
తిరుగు ప్రయాణంలో మేము దత్తాత్రేయులవారి కల్లూర్ దత్తఘడ్ దేవాలయాన్ని, శ్రీసాయిబాబా మందిరాలను దర్శించుకున్నాము. అక్కడ భక్తులందరూ దత్తజయంతిని చాలా వైభవంగా జరుపుకొన్నారు. పరడాసింగ నుంచి అవధూత అనసూయమాత కూడా ప్రతిసంవత్సరం దత్త జయంతినాడు వస్తూ ఉంటారు.
త్రిమూర్తి స్వరూపానికి గుర్తుగా ఒక పెద్దరాయి మూడు భాగాలుగా విడిపోయి ఉంది. అక్కడొక చిన్న గుహ ఉంది. భక్తులు ఆగుహలో ధునిని నిర్మించడానికి ముందే అక్కడ ‘హోమగుండం’ ఉన్నదనడానికి గుర్తులు కనిపించాయు. అక్కడ ఒక యోగి తపస్సు చేసుకొని సిధ్ధి పొందారని చెబుతారు. అక్కడ ఎవరయితే ధ్యానం చేస్తారో వారికి సాయి దర్శనం లభిస్తుందనే నమ్మకం ఉంది.
సూర్యాస్తమయానికి మేము దత్తఘడ్ చేరుకొన్నాము. షిర్దీ నుండి తీసుకువచ్చిన బాబా పాదుకలను, ఆయన కఫనీని పల్లకీలో ఊరేగిస్తూ గుడికి తీసుకునివెళ్ళాము. భక్తులందరూ గుంపులు గుంపులుగా వచ్చి బాబా పాదుకలను, కఫనీని దర్శించుకున్నారు.
గుహలోని ధుని వద్ద నాభర్త ధ్యానం చేసుకునే సమయంలో కరెంటు కోత ఉంది. కొంతసేపటి తరువాత ఆయన గుహ నుండి బయటకు వచ్చారు. గుహలోని గోడ మీద బాబా కనిపించారని చెప్పారు. ఇంతకు పూర్వం వెళ్ళిన కొంతమంది భక్తులు, తమకు కూడా బాబాచిత్రం కనిపించిందని చెప్పారు. బాబా చూపిస్తున్న లీలలకు ఆశ్చర్యపోయాము. అదే రోజు రాత్రి హైదరాబాదుకు మరలా ప్రయాణమయ్యాము.
శ్రీ శంకరయ్య గారి ఆధ్యర్యంలో దత్తజయంతినాడు ‘సప్తసప్తాహ’ కార్యక్రమం మొదలయింది. కార్యక్రమమంతా చాలా బాగా జరిగింది. నామజపానికి వేలాదిమంది భక్తులు వచ్చారు. మేము కూడా ఆ నామసప్తాహంలో పాల్గొన్నాము. ఒక నెలరోజులపాటు అక్కడే ఉన్నాము. ఆ నెల రోజులలోను మాకు ఇంటికి తిరిగి వెళ్ళాలనిపించలేదు. సాయిభక్తులందరూ మా దగ్గరి బంధువులన్నంతగా భావన కలిగింది.
నామ సంకీర్తన జరుగుతూ ఉండగానే ఒకరోజు సూర్యోదయానికి పూర్వమే నా భర్త పెద్ద సైజు శ్రీసాయిబాబా ద్వారకామాయి ఫోటో ముందు కూర్చుని ధ్యానంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. సరిగా మధ్యాహ్నం 12 గంటలకు కళ్ళు తెరిచారు. అది బాబాకు ఆరతి ఇచ్చే సమయం. బాబా తనముందు కూర్చున్నారని. తమ హస్తాన్ని తన తలపై ఉంచడం వల్లనే తను కళ్ళు తెరవలేకపోయానని నాభర్త చెప్పారు.
నాభర్త తలంతా మంచి సువాసనతో నిండిపోయింది. సాధారణంగా నాభర్త ఇంటిలో ధ్యానం చేసుకునేటప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఆయనకు బాబా దర్శనమిచ్చి దీవిస్తూ ఉంటారు. కాని ఇపుడు బాబా సశరీరంగా దర్శనమిచ్చి నాభర్తను దీవించారు.
విజయవాడలో జరుగుతున్న సప్తాహ కార్యక్రమంలో మూడు వారాలు పాల్గొన్న తరువాత కొన్ని అనుకోని కారణాల వల్ల హైదరాబాద్ కి తిరిగిె వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాదు నుంచి మరలా విజయవాడ రావడానికి కాస్త బధ్ధకించాను. విజయవాడకి నాభర్త ఒక్కరినే వెళ్ళమని చెప్పాను.
నాభర్త పదేపదే రమ్మని అడిగినా ఏమీ నిర్ణయించుకోలేకపోయాను. ఏసమాధానం చెప్పకుండా మవునంగా ఉండిపోయాను. ఆ రోజు రాత్రి బాబా నాకు కలలో కనిపించి “సప్తాహం చివరి మూడు రోజులలో గొప్పగొప్ప సాధువులు వస్తారు. నువ్వుకూడా వెళ్ళు. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకు. తప్పకూడా వెళ్ళు” అని ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞ ప్రకారం నేను కూడా నాభర్తతో విజయవాడ వెళ్ళాను.
విజయవాడలో మాచెల్లిలి కొడుకు చి.చంద్రమోహన్ ఇంటిలో దిగాము. ఒకరోజు తెల్లవారుఝామున మూడు గంటలకి బాబా నాభర్తకి కలలో కనిపించి “తొందరగా లే వెంటనే మందిరానికి వెళ్ళి అక్కడ ధ్యానం చెయ్యి.” అని ఆజ్ఞాపించారు.
బాబా ఆదేశానుసారం నాభర్త స్నానం చేసి గుడికి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నారు. ఆరోజు మధ్యాహ్న ఆరతి కూడా అయిపోయింది. నాభర్త ఇంకా ధ్యానంలోనే ఉన్నారు. కళ్ళుకూడా తెరవలేదు. ఆయనని ధ్యానం నుండి లేపడానికి ప్రయత్నించాము. కాని ఫలితం లేకపోయింది. ఆయన తలనుంచి విభూతి సువాసన వస్తోంది.
ఆ తరువాత ఆయన ధ్యానం నుండి లేచారు. తనకు ధ్యానంలో శ్రీదత్తాత్రేయులవారు, జీసస్ క్రైస్ట్, శ్రీరామకృష్ణపరమహంస, వీరందరూ దర్శనమిచ్చారని చెప్పారు.
ఇంకా ఉంది…..
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- శ్రీసాయి లీలా తరంగిణి – 16వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 9వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 5 వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 19వ. భాగం
- శ్రీసాయి లీలా తరంగిణి – 13వ. భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments