Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఈ రోజు “ది గ్లోరీ ఆఫ్ షిరిడీసాయి” 14.04.2016 సంచికలో ప్రచురించిన మరొక సాయి వైభవం గమనిద్దాము.
హరిశ్చంద్ర పితలే కుమారుడికి మూర్చవ్యాధి ఏవిధంగా నివారణయిందో దాని గురించి శ్రీ సాయి సత్ చరిత్ర 26వ. అధ్యాయంలో వివరింపబడింది. బాబా హరిశ్చంద్రతో “బాపూ! ఇంతకు ముందు నీకు రెండు రూపాయలిచ్చాను. ఈ మూడు రూపాయలు కూడా ఉంచుకుని వాటితోపాటుగా ప్రతిరోజు భక్తితో పూజించుకో. అది నీకు ఎంతో మేలు చేస్తుంది” అని ఆశీర్వదించారు. హరిశ్చంద్ర ఇంటికి తిరిగి వచ్చాడు. అతనికి షిరిడీకి వెళ్ళడం అదే మొదటిసారి. మరి బాబా తనకు ఇంతకు ముందు రెండు రూపాయలనిచ్చానని చెప్పారు? ఆయన మాటలు అర్ధం కాలేదు. జరిగినదంతా తన తల్లికి చెప్పాడు . అప్పుడామె “నాయనా, నీ తండ్రికి స్వామి సమర్ధ రెడు రూపాయలనిచ్చారు” అని బాబా అన్న మాటలలోని అర్ధాన్ని వివరించింది.
కుటుంబ సభ్యులందరూ అతను తన షిరిడీ యాత్ర విశేషాలను చెబుతుంటే చాలా ఆసక్తిగా విన్నారు. అతని సోదరుడయిన విష్ణు పంత్ బల్వంత్ కూడా ఆ విశేషాలన్ని విన్నాడు.
అతనికి కూడా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవాలని బాగా కోరిక కలిగింది. బల్వంత్ విలే పార్లేలో అనువాదకునిగా పని చేస్తున్నాడు. అందుచేత అతనెప్పుడూ పని వత్తిడిలోనే ఉంటాడు. 1917 వ.సంవత్సరంలో మొదటి సారి షిరిడీ వెళ్ళాడు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. బాబా గారికి సమర్పించడానికి ఇంకా పక్వానికి రాని మామిడి పండ్ల కోసం పండ్లు అమ్మే బజారంతా కలియ తిరిగాడు. ఒక పండ్ల వర్తకుడి దగ్గిర మంచి మామిడి పండ్లు కనిపించాయి. అవి ఇంకా పక్వానికి రాలేదు. చూడటానికి చాలా బాగున్నాయి
ఒక బుట్టనిండా మామిడి పండ్లను కొని షిరిడీకి ప్రయాణమయ్యాడు. ముగ్గిన మామిడి పండ్లయితే షిరిడీ చేరేటప్పటికి కుళ్ళిపోతాయని పక్వానికి రాని పండ్లయితే షిరిడీ చేరుకునేటప్పటికి ముగ్గుతాయని ఆలోచించాడు.
కోపర్ గావ్ చేరుకున్న తరువాత, అక్కడినుండి షిరిడీకి బయలుదేరాడు. ఇక్కడ షిరిడీలో బాబా గారు ద్వారకామాయిలో తన చుట్టూ ఉన్న భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆసమయంలో ద్వారకామాయి అంతా మామిడి పండ్ల వాసన వ్యాపించింది. భక్తులంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని మామిడి పండ్లు ఎక్కడ ఉన్నాయా అని చూశారు. బాబా దానిగురించి ఏమీ మాట్లాడకపోవడంతో భక్తులు కూడా ఏమీ మాట్లాడలేదు. ఈ లోపల విష్ణుపంత్ షిరిడీ చేరుకున్నాడు. తన సామాను, మామిడి పండ్ల బుట్ట ఒక గదిలో ఉంచి ధూళి దర్శనానికిబయలుదేరాడు. బాబా అతనిని నవ్వుతూ రమ్మని పిలిచి, “నాకోసం ఏం తెచ్చావు? మామిడి పళ్ళేవి?” అన్నారు. విష్ణుపంత్ కాస్తంత సిగ్గుపడి “బాబా, మామిడిపళ్ళు ఇంకా పక్వానికి రాలేదు. వాటిని గదిలోనే ఉంచాను” అన్నాడు. “వెళ్ళి వాటిని తీసుకురా,నీకు వాటి వాసన రావడంలేదా?” అన్నారు బాబా. వెంటనేవిష్ణుపంత్ గదికి వెళ్ళి మామిడి పండ్ల బుట్టను తీసుకునివచ్చి బాబాముందర పెట్టాడు. బుట్ట తెరచి చూడగానే మామిడి పండ్లన్నీ మంచిరంగుతో మిల మిలలాడుతూ చక్కగా ముగ్గి తినడానికి తయారుగాఉన్నాయి.
విష్ణుపంత్ ఆనందంగా షిరిడీలో మూడు రోజులున్నాడు. తిరుగుప్రయాణానికి తన దగ్గర రూ.15/- మాత్రమే ఉన్నాయి ఫరవాలేదనుకున్నాడు. తిరిగి వెళ్ళేరోజున బాబా ఫొటో ఒకటికొన్నాడు. ఆ ఫోటోని బాబాకిచ్చి ఆయన స్పృశించిన తరువాత తీసుకుందామని అతని ఉద్దేశ్యం. ద్వారకామాయికి వెళ్ళి బాబాపిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బాబా అతనిని దగ్గరకురమ్మని సైగ చేసి “భావు, నాకు రూ.15/- దక్షిణ ఇవ్వు” అనిఅడిగారు. విష్ణుపంత్ వెంటనే తన జేబులోనుంచి రూ.15/-దక్షిణగా సమర్పించేశాడు. తరువాత బాబా ఫొటో గురించి అడగగానే ఆనందంగా ఫోటో ఇచ్చాడు. బాబా ఫొటో తీసుకుని ఒక్క క్షణం తనహృదయానికి హత్తుకున్నారు. విష్ణుపంత్ కి ఎంతో సంతోషంకలిగింది. బాబా మరలా ఆ ఫొటోని అతనికిచ్చి తిరుగు ప్రయాణానికి అనుమతిని ప్రసాదించారు. విష్ణుపంత్ చాలా ఆనందంగా ఉన్నాకూడా పెద్ద సంశయంలో పడ్డాడు. తన వద్ద ఉన్న రూ.15/- బాబాదక్షిణగా స్వీకరించేశారు. ఇక తనద్ద ఒక్క పైసా లేదు. ప్రయాణం ఎలా చెయ్యాలి అని సందిగ్ధంలో పడ్డాడు. టాంగాకు డబ్బివ్వడానికి కూడా లేకపోవడంతో ఇక కోపర్ గావ్ కి నడిచే వెడదామని నిశ్చయించుకున్నాడు. ఒక అరమైలు దూరం దాకా నడిచిన తరువాత అతని దగ్గరకు ఒక టాంగా వచ్చి ఆగింది. టాంగా తోలేవాడు.“ఇంత ఎండలో ఎందుకు నడుచుకుంటూ వెడుతున్నారు? మిమ్మల్ని చూస్తే పల్లెటూరివానిలా కనబడటంలేదే?” అన్నాడు. “ నేను అనువాదకుడిని. నేను ప్రక్క గ్రామానికి వెడుతున్నాను” అని సమాధానమిచ్చాడు విష్ణుపంత్. అప్పుడు ఆ టాంగా అతను నవ్వుతూ “ రండి నాబండిలో చోటు ఉంది. నేను మిమ్మల్ని కోపర్ గావ్ చేరుస్తాను” అన్నాడు. విష్ణుపంత్ హాయిగా ఊపిరి పీల్చుకుని టాంగాలో కోపర్ గావ్ చేరుకున్నాడు. టాంగా నుంచి దిగి సామానంతా దింపుకున్నాడు. తరువాత చూసేటప్పటికి టాంగా లేదు, టాంగా తోలేవాడు లేడు. టాంగాతో సహా మాయమయ్యాడు. రైల్వే స్టేషన్ లోకి వెళ్ళి తనకు తెలుసున్నవారు ఎవరయినా కనపడతారేమోనని చూశాడు. కాని ఎవ్వరూ కనపడలేదు. తెలిసున్నవారు కనపడితే టిక్కెట్ కి డబ్బులడుగుదామనుకున్న అతని ఆశ అడియాశ అయింది. రైలు వచ్చేసింది. ఆఖరికి టిక్కెట్ లేకుండానే రైలెక్కి, దానివల్ల వచ్చె కష్ట నష్టాలు భరించడానికి సిధ్ధపడ్డాడు. తరువాతి స్టేషన్ లో బోగీలోకి టిక్కేట్ కలెక్టర్ వచ్చాడు. టిక్కెట్ కలెక్టర్ అతనివైపు చూసి “నమస్కారం పితలే సాబ్” అని పలకరించాడు. కాని విష్ణుపంత్ కి అతనెవరో గుర్తుకు రాలేదు. టిక్కెట్ కలెక్టర్ తనని గుర్తుపట్టి పలకరించాడంటే ఖచ్చితంగా టిక్కెట్ చూపించమని అడుగుతాడు. దానితో తను చాలా ఇబాంది పడాల్సివస్తుందనుకున్నాడు. కాని అటువంటిదేమీ జరగలేదు. ఎటువంటి సమస్య లేకుండా బొంబాయి చేరుకున్నాడు.
మరుసటి రోజు ఒక పెద్ద కారొకటి వచ్చి అతని ఇంటిముందు ఆగి ఉంది. సూటు బూటు వేసుకుని మంచి దర్జాగా ఉన్న ఒక పెద్ద మనిషి “మీరేనా? అనువాదకులు విష్ణుపంత్ పితలే” అని అడిగాడు. విష్ణుపంత్ చాలా గాభరాపడి”ఇప్పుడు నేను చాలా కష్టంలో పడ్డాను. ఈయనేమో మీరేనా అనువాదకులు అని నేరుగా వచ్చి నన్నే అడుగుతున్నారు ఎందుకని” అనుకున్నాడు. అప్పుడా పెద్దమనిషి “ నేను జే.ఆర్.డి. టాటా ని. సహార్ దగ్గర (ఇప్పుడున్న విమానాశ్రయం) స్థలం కొందామనుకుంటున్నాను. నా దగ్గిర ఎంతోమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కాని వారెవ్వరికి మరాఠీ నుంచి ఆంగ్లంలోకి, ఆంగ్లంనుండి మరాఠీలోకి తర్జుమా చేయడం రాదు. మీకు రెండు భాషలు వచ్చనీ, అనువాదం కూడా చేయగలరని విని వచ్చాను” అన్నాడు. అంతా విని విష్ణుపంత్ అవునన్నట్లుగా తల ఊపాడు. అపుడాయన “అనువాదకునిగా మీరు నెలకు రూ.35/- మాత్రమే సంపాదించగలరు. మీరు నాదగ్గిర పనిచేయడానికి అంగీకరిస్తే మీకు నెలకు రూ.150/- జీతమిస్తాను” అన్నాడు. విష్ణుపంత్ వెంటనే “మీకు నేను అనువాదం చేసి పెడతాను. కాని నాకు రెండు రోజులు సమయం ఇవ్వండి. నా నిర్ణయం చెబుతాను” అన్నాడు. సరే అని చెప్పి టాటా గారు వెళ్ళిపోయారు.
విష్ణుపంత్ ఇప్పుడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు. “నాకు పెన్షన్, ఇంకా ఇతక సౌకర్యాలు లభించే ఈ ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాక, ఆ పెద్ద మనిషి తన మాట నిలబెట్టుకోలేకపోతే నా పరిస్థితి ఏమిటి? తన పని పూర్తయిన తరువాత ఉద్యోగం నుండి నన్ను తొలగించేస్తే నేనేమవ్వాలి?” ఈ విధమయిన ఆలోచనలతో అతనికి రాత్రి నిద్ర పట్టలేదు. అప్పుడతనికి హటాత్తుగా తోచింది. తను షిరిడీ నుండి తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు బాబా తనవద్ద మిగిలిన రూ.15/- దక్షిణగా తీసేసుకుని దాని బదులు పది రెట్లు ఆదాయం చూపించారనిపించింది. రెండు రోజుల తరువాత టాటా గారి సెక్రటరీ అతని ఇంటికి వచ్చి ఉద్యోగం ఇస్తున్నట్లుగా నియామక పత్రం ఇచ్చాడు. ఇంకా ఉద్యోగం గురించి అన్ని వివరాలు, జీతం, ఇవ్వబడె ఇతర సౌకర్యాలు అన్నీ పత్రంలో ఉన్నాయని చెప్పాడు. పత్రం మీద సూచించిన చోట సంతకం చేయమని చెప్పాడు. బాబా తనను ఆశీర్వదించి ఇచ్చిన ఆయన ఫోటోకి నమస్కరించుకుని సంతకం పెట్టాడు.
సాయి భక్తులందరూ ఇది చదివిన తరువాత ఒక విషయం గమనించి ఉంటారు. విష్ణు పంత్ గారు షిరిడి వెళ్ళడం అదే మొదటిసారి. బాబా గారు దక్షిణ అడగగానే మరొక ఆలోచన ఏదీ లేకుండా తన వద్ద ఉన్నది అడగగానే సమర్పించేశాడు. తిరుగు ప్రయాణానికి ఒక్క పైసా లేదే ఎట్లా వెళ్ళాలి అన్న విషయం కూడా ఆయన మనసులోకి రాలేదు. షిరిడీనుండి కోపర్ గావ్ కి నడుచుకుంటూ వెళ్ళాడే గాని దారిలో ఎక్కడా బాధపడలేదు. ఆయన ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాబా గారే చూసుకున్నారు. అతను ఇచ్చిన దక్షిణకి పంత్ గారు భావించినట్లుగానె పది రెట్ల జీతంతో కొత్త ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించారు. బాబా మీద అచంచలమైన భక్తి ఉన్న వారికి బాబా ఎప్పుడూ తోడూ నీడలా ఉంటారు.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీషిరిడీసాయి వైభవమ్ – తన భక్తునిపై బాబా అనుగ్రహమ్ ప్రొఫెసర్ ఆర్. విశ్ కాంత మొదటి అనుభవం
- గణేష్ విష్ణు బేరే
- అంతర్యామి, హేమాడ్ పంత్—Audio
- హేమద్పంత్ – 1
- హేమద్పంత్ – 2 తొలి దర్శన అనుభూతి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments