🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹తొమ్మిదవ అధ్యాయము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice By: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా..సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

తొమ్మిదవ అధ్యాయము

షిరిడీ యాత్ర యొక్క లక్షణములు; తాత్యాకోతే పాటిల్;

ఐరోపా దేశస్తుని ఉదంతము; భిక్ష యొక్క యావశ్యకత;

భక్తుల యనుభవములు – తర్కడ్ కుటుంబము; ఆత్మారాముని భార్య;

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు?; నీతి

షిరిడీ యాత్ర యొక్క లక్షణములు :

షిరిడీ సందర్శనములోని యొక ప్రత్యేక విశేషమేమన, బాబా యనుమతి లేనిదే యెవరును షిరిడీ విడువ లేకుండిరి.

బాబా యనుమతి లేక యెవరైనను షిరిడీ విడచి వెళ్ళినచో, వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్నవారగుచుండిరి.

బాబా యెవరినైన బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత, ఇక షిరిడీలో నుండరాదు.

సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగనో లేక సూచన ప్రాయముగనో కొన్ని సలహాల నిచ్చుచుండెడివారు.

బాబా ఆదేశానుసారము నడచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి యుదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను.

తాత్యాకోతే పాటిల్ :

తాత్యాకోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్‌గాంవ్‌లో జరుగు సంతకు బయలుదేరెను.

హడవుడిగా మసీదుకు వచ్చి, బాబాకు నమస్కరించి కోపర్‌గాంవ్‌ సంతకు పోవుచుంటునని చెప్పెను.

బాబా అతనితో, ”తొందర పడవద్దు ! కొంచెమాగుము. సంత సంగతి యటుండనివ్వు ! ఊరు విడిచి అసలు బయటకెక్కడికిని పోవలదు” అని అనెను.

సంతకు వెళ్ళవలెననెడి తాత్యా యాతురతను జూచి, కనీసము శ్యామా (మాధవరావు దేశపాండే) నయిన వెంట దీసికొని పొమ్మని బాబా చెప్పెను.

బాబా మాటలను లెక్కచేయక తాత్యా హుటాహుటిన టాంగానెక్కి కోపర్‌గాంవ్‌ బయలుదేరెను.

టాంగాకు కట్టిన రెండు గుఱ్ఱములలో నొకటి మూడువందల రూపాయలు ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది.

షిరిడీ వదలి సావుల్‌ విహిర్‌ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరుగెత్తసాగెను. కొంతదూరము పోయిన పిమ్మట కాలు మడతబడి యది కూలబడెను.

తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు గానీ, తల్లివలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను.

మరొకప్పుడు గూడా, ఇటులనే బాబా యాజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామమునకు ప్రయాణమై, దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను.

ఐరోపా దేశస్తుని( Mr.జాన్ కర్టిస్) ఉదంతము :

బొంబాయి నుండి ఐరోపా దేశస్తుడొకడు యేదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరిడీ వచ్చెను.

తనతో నానాసాహెబు చాందోర్కరు వద్ద నుంచి తనను గూర్చిన యొక పరిచయ పత్రమును కూడా తెచ్చెను.

అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి, అందులో సౌకర్యముగ బస యేర్పాటు చేసిరి.

బాబా ముందు మ్రోకరిల్లి, వారి చేతిని ముద్దిడవలెనను కోరికతో అతడు మూడుసారులు మసీదులో ప్రవేశింప యత్నించెను. కాని బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను.

క్రిందుగా మసీదు ముందు గల బహిరంగావరణములో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చుననిరి.

అతడు తనకు జరిగిన మరియాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడువ వలెనని నిశ్చయించుకొనెను.

బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందర పడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కినవారు కూడ బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి.

ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడీ నుండి బయలుదేరెను.

మొదట గుఱ్ఱములు బాగుగనే పరుగెత్తినవి. సావుల్‌విహిర్‌ దాటిన కొద్దిసేపటిలో యొక సైకిలు అతని టాంగా కెదురు వచ్చెను. దానిని జూచి గుఱ్ఱములు బెదరినవి.

టాంగా తలక్రిందులయ్యెను. ఆ పెద్దమనిషి క్రిందబడి, రోడ్డుపై కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసికొనుటకై కోపర్‌గాంవ్‌లో ఆసుపత్రి పాలయ్యెను.

ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు, బాబా యాజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా నుందురనియు జనులు గ్రహించిరి.

భిక్ష యొక్క యావశ్యకత :

బాబాయే భగవంతుడయినచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేల ? యను సందియము చాలామందికి కలుగవచ్చును.

దీనికి (1) భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు ? (2) పంచసూనములు, వానిని పోగొట్టుకొను మార్గమేది ? యను రెండు ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడును.

సంతానము, ధనము, కీర్తి సంపాదించుట యందాపేక్ష వదలుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించు చున్నవి.

వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసికొని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు.

సాయిబాబా గృహస్థు కారు; వానప్రస్థుడు కూడ కారు; వారస్థలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంభించుచుండిరి.

ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు  కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి యున్నది.

వారు పరబ్రహ్మ స్వరూపులు. కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు.

పంచసూనములు, వానిని తప్పించుకొను మార్గమును ఆలోచింతము భోజన పదార్థములు తయారుచేయుటకు గృహస్థులు అయిదు పనులు తప్పక చేయవలెను.

అవి యేవన : 1) దంచుట లేక రుబ్బుట, 2) విసరుట, 3) పాత్రలు తోముట, 4) ఇల్లు ఊడ్చుట, తుడుచుట, 5) పొయ్యి యంటించుట.

ఈ అయిదు పనులు చేయునప్పుడనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపము ననుభవించవలెను.

ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించు చున్నవి. 1) బ్రహ్మయజ్ఞము, 2) వేదాధ్యయనము, 3) పితృయజ్ఞము, 4) దేవయజ్ఞము, 5) భూతయజ్ఞము, 6) అతిథి యజ్ఞము.

శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములగును. మోక్షసాధనమునకు ఆత్మ సాక్షాత్కారమునకు యివి తోడ్పడును.

బాబా యింటింటికి వెళ్ళి భిక్ష యడుగుటలో, ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి దెచ్చినట్లయినది.

తమ ఇంటి గుమ్మము వద్దనే యింత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు!

భక్తుల యనుభవములు :

శ్రీకృష్ణుడు భగవద్గీత (9 అ. 26 శ్లో.) యందు ”శ్రద్ధా భక్తులతో ఎవ్వరేని పత్రము గాని పుష్పముగాని ఫలము గాని లేదా నీరు గాని యర్పించినచో దానిని నేను గ్రహించెదను” అని నుడివెను.

సాయిబాబాకు సంబంధించి యింకా సంతోషదాయకమగు విషయమేమన, తమ భక్తుడేదైన తమకు సమర్పించవలెననుకొని, యే కారణము చేతైనను ఆ సంగతి మరచినచో, అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి, ఆ నివేదనను గ్రహించి యాశీర్వదించువారు.

అట్టి యుదాహరణలు  కొన్ని యీ క్రింద చెప్పబోవుచున్నాను.

తర్కడ్ కుటుంబము :

రామచంద్ర ఆత్మారామ్‌ వురఫ్‌ బాబాసాహెబు తర్కడ్ యొకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను, తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు.

వాని భార్యాపుత్రులు కూడ బాబాను మిగుల ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లీ కొడుకులు షిరిడీకి పోయి యచ్చట వేసవి సెలవులు గడుపవలెనని నిర్ణయించిరి.

షిరిడీ పోవుట సంతోషదాయకమైనను, కొడుకు మాత్రము దానికి మనఃస్పూర్తిగ ఇష్టపడలేదు.

కారణమేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను.

కాని, బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసెదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరెను. శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి.

ఆ మరుసటి దినము శనివారమునాడు తండ్రియగు తర్కడ్ పెందలకడనే నిద్రలేచి, స్నానముచేసి, పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి, యేదో లాంఛనము వలె కాక, తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింప వలసినదని ప్రార్థించెను.

ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగ కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను.

ఆనాటి సాయంత్రము, ఆ మరుసటి దినము, అనగా ఆదివారమునాడు, పూజ యంతయు సవ్యముగా జరిగెను.

సోమవారము కూడ చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి యుండలేదు.

పూజయంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను.

మంగళవారము నాడు పూజనెప్పటివలె సలిపి కచేరికి పోయెను. మధ్యాహ్నమింటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించెను.

నౌఖరును అడుగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పెను.

ఈ సంగతి వినగనే భోజనమునకు కూర్చున్న ఆత్మారామ్‌ వెంటనే లేచి, బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి, బాబాను క్షమాపణ కోరెను.

బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నిటిని షిరిడీలో నున్న తన కొడుకునకు వ్రాసి, బాబాను క్షమాపణ వేడుమనెను. ఇది బాంద్రాలో మంగళవారము మధ్యాహ్నము సుమారు 12 గంటలకు జరిగెను.

అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు, ఆత్మారాముని భార్యతో బాబా యిట్లనెను :

”తల్లీ ! ఏమయిన తినవలెనను ఉద్దేశముతో బాంద్రాలో మీ యింటికి పోయినాను. తలుపు తాళము వేసియుండెను. ఎలాగుననో లోపల ప్రవేశించితిని. కాని అక్కడ తినుటకేమి లేకపోవుటచే తిరిగి వచ్చితిని” అనెను.

బాబా మాటలు ఆమెకేమియు బోధపడలేదు. కాని ప్రక్కనేయున్న కుమారుడు (జ్యోతీంద్ర ఆత్మారాం తర్కడ్‌)  మాత్రము ఇంటివద్ద పూజలో నేమియో లోటుపాటులు జరిగినవని గ్రహించి, యింటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను.

అందులకు బాబా పూజను అక్కడనే చేయుమనీ, యింటికి పోనవసరము లేదని చెప్పెను.

వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగ తండ్రికి ఉత్తరము వ్రాసి, బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను.

ఈ రెండు ఉత్తరములు ఒకటినొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా !

ఆత్మారాముని భార్య :

ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను.

అవి : 1) వంకాయ పెరుగుపచ్చడి, 2) వంకాయ వేపుడు కూర, 3) పేడ. బాబా వీనినెట్లు గ్రహించెనో చూచెదము.

బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేరుచుండెను.

ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి యొక వంకాయతో పెరుగు పచ్చడిని రెండవదానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను.

షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళెను.

బాబాకా పచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దాని నందరకు పంచి పెట్టెను. వెంటనే, తనకు వంకాయ వేపుడు కూడ అప్పుడే కావలెనని బాబా అడిగెను.

ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరచిరి. అది వంకాయల కాలము కాదు గనుక యామె కేమియు తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట యనునది ఆమెకు సమస్య యాయెను.

వంకాయపచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురందరుని భార్యయని తెలియుటచే వంకాయ వేపుడు గూడ ఆమెయే చేసి పెట్టవలెనని ఆమెకు కబురంపిరి.

అప్పుడందరికి వంకాయ వేపుడును బాబా యెందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు యందరాశ్చర్యపడిరి.

1915 డిసెంబరులో గోవింద బలరాం మాన్‌కర్‌ యనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలెననుకొనెను.

ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైన పంపవలెననుకొని ఇల్లంతయు వెదకెను.

కాని యొక్క పేడ తప్ప యేమియు గాన్పించలేదు. ఆ పేడ కూడా యప్పటికే బాబాకు నైవేద్యముగ సమర్పింపబడి యుండెను.

తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై యుండెను. కాని బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె యా పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను.

గోవిందుడు షిరిడీ చేరెను; బాబాను దర్శించెను. కానీ, పేడ తీసికొని వెళ్ళుట మరచెను.

బాబా అప్పటికి ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడ అతడు పేడ తీసికొనిపోవుట మరచెను.

అప్పుడు బాబా యోపిక పట్టక తనకొరకేమి తెచ్చినావని యడిగెను. ఏమియు తీసికొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను.

వెంటనే బాబా, ”నీవు యింటివద్ద బయలు దేరునప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా”? యని యడిగెను.

కుఱ్ఱవాడదియంతయు జ్ఞప్తికి దెచ్చుకొని సిగ్గు పడెను. బాబాను క్షమాపణ కోరెను.

బసకు పరుగెత్తి పేడాను దెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మ్రింగెను.

ఇవ్విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగ స్వీకరించెను.

”నా భక్తులు నన్నెట్లు భావింతురో, నేను వారి నావిధముగనే అనుగ్రహింతును” అను గీతావాక్యము (4-11) నిరూపించెను.

బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట యెట్లు ?

ఒకప్పుడు ఆత్మారామ్‌ తర్కడ్ భార్య (సీతాదేవి తర్కడ్) షిరిడీలో నొక ఇంటియందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యెను. అందరికి వడ్డించిరి.

ఆకలితో నున్న కుక్క యొకటి వచ్చి మొఱుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి యొక రొట్టెముక్కను విసరెను.

ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టెముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో నిట్లనెను,

”తల్లీ ! నాకు కడుపునిండ గొంతువరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడు ఇట్లనే చేయుము. ఇది నీకు సద్గతి కలుగజేయును.

ఈ మసీదులో గూర్చుండి నేనెన్నడసత్య మాడను. నాయందిట్లే దయ యుంచుము. మొదట యాకలితో నున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందుంచుకొనుము”. ఇదంతయు ఆమెకేమియు బోధపడలేదు.

కావున ఆమె యిట్లు జవాబిచ్చెను. ”బాబా ! నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి యున్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను”.

అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను. ”నీవు ప్రేమపూర్వకముగ పెట్టిన యా రొట్టెముక్కను తిని యిప్పటికి త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు యే కుక్కను నీవు జూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే.

అట్లనే, పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నియు నా యంశములే. నేనే వాని యాకారములో తిరుగుచున్నాను.

ఎవరయితే సకల జీవకోటిలో నన్ను జూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. కావున నేను వేరు తక్కిన జీవరాశి యంతయు వేరు యను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము”.

ఈ యమృత తుల్యమగు మాటలు యామె హృదయము నెంతయో కదలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యెను. ఆమె యానందమునకు అంతు లేకుండెను.

నీతి :

‘జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము’ అనునది యీ యధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి.

ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి యన్నియు భగవంతుని ప్రతి జీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి.

ఈ యధ్యాయము చివర చెప్పిన యుదాహరణము వలనను, ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను, సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను, తమ ఆచరణ రూపమున చూపి, యనుభవ పూర్వకముగా నిర్ధారణ చేసియున్నారని స్పష్టమగును.

ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్త్వమును అనుభవ పూర్వకముగ ప్రబోధించిన సమర్ధ సద్గురుడే శ్రీ సాయిబాబా.

తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles