Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు రాజ్య లక్ష్మి. నేను dilshukhnagar లో వుంటాను. మా వారు జి .హరినాథ్ బాబు గారు ప్రభుత్వ సహకార బ్యాంకు లో పని చేసి రిటైర్ అయ్యి తర్వాత చనిపోయారు.
1982 వ సంవత్సరంలో శ్రీ షిరిడి సాయి బాబా మహత్యం సినిమా కి మా చుట్టాల ఆవిడ నన్ను తీసుకు వెళ్ళింది .సినిమా అంతా ఆద్యంతం చాల ఆసక్తిగా చూసాను.
అసలు షిరిడి సాయి బాబా ఎవరు? ఏసు ప్రభువు లాగా ఈయన కూడా మూడవ రోజు తిరిగి వచ్చాడే ? ఈయన అవతారం ఏంటి? అని చాలా రోజులు ప్రశ్నలు వెంటాడాయి?
మా వారు ఎక్కువగా క్యాంపులకి వెళ్తుంటారు కాబట్టి నాకు పెద్దగా పని అంటూ ఏమి లేక కాలక్షేపానికి రామకోటి రాసుకుంటూ ఉండేదాన్ని.
బయట వరండాలో కుర్చీ వేసుకుని రాసుకుంటూ ఉండేదాన్ని. మేము విజయనగరంలో ఉండేటప్పుడు అక్కడ 7, 8 కుటుంబాల వాళ్ళము వరుసగా ఉండేవాళ్ళము.
మా పక్కన శ్రీ దేవి అని ఇంచు మించు నా వయసే ఉంటుంది, వాళ్ళ కుటుంబము ఉంటూ ఉండేది.
వాళ్ళ నాన్న గారు శ్రీ వెంకట సుబ్బారావు గారు వాళ్ళ అమ్మాయిని చూసి నాలుగు రోజులు ఉండటానికి గుంటూరు నుంచి వచ్చారు.
ఆయన వచ్చిన దగ్గర నుండి నన్ను గమనిస్తున్నారు. నేను ఉదయం నుండి ఆలా కూర్చొని శ్రద్దగా రామకోటి రాస్తూ ఉండటం ఆయన గమనించి, వాళ్ళ అమ్మాయి తోటి, ఏంటమ్మా ఆ అమ్మాయి ఎదో రాస్తోంది? అన్నారట .
శ్రీ దేవి – ఏం లేదు నాన్న! రామకోటి కాలక్షేపానికి రాస్తోంది అని చెప్పిందిట. మరి వాళ్ళ ఆయన? అన్నారుట.
ఎప్పుడు క్యాంపుల్లో ఉంటారు నాన్న అందిట. అలాగా అని ఆయన నా దగ్గరికి వచ్చారు. పెద్దాయన బాబా భక్తుడు దేవి ఉపాసకుడు కూడా.
ఆయన ఏమ్మా ఏంటి రాస్తున్నావ్ అని అడిగారు. రామకోటి రాసుకుంటూ ఉంటాను బాబాయి గారు అన్నాను.
అమ్మాయి మీ ఇంట్లోకి రావచ్చా అని అడిగారు. అయ్యో అదేమిటండి శ్రీ దేవి కి నాన్న అయితే నాకు తండ్రి వంటి వారే కదండీ, రండి అన్నాను.
ఆయన లోపాలకి వచ్చి నీ పూజ గది ఏది చూపించు అన్నారు. నేను పూజ గది అంటూ ఏది లేదు, మందిరం కూడా లేదు, ఎదో గూట్లో దేవుణ్ణి పెట్టుకున్నాను రండి చూడండి అని తీసుకెళ్లి చూపించాను.
ఆయన దేవుడు గూడు చూస్తూనే నీ గురువెవ్వరు అన్నారు. నాకు ప్రత్యేకించి గురువు గురించి తెలియదు కాబట్టి వినాయకుడు అన్నాను అనాలోచితంగా,
దానికి ఆయన నవ్వి వినాయకుణ్ణి? అందరూ పూజిస్తారు అయితే నీకంటూ గురువు ఎవరూ లేరన్నమాట? నువ్వు శిరిడీ వెళ్ళావా? అని అడిగారు.
శిరిడీయా అదెక్కడుంది అన్నాను నేను. పోనీ సాయి బాబా పేరైనా విన్నావా అన్నారు.
ఆయన గురించి నాకేమి తెలియదు కానీ సినిమా అయితే చూసాను మా చుట్టలావిడ తీసుకెళ్లింది అన్నాను. అయితే ఆ చుట్టలావిడే తొలి గురువు అన్నమాట అన్నారాయన నవ్వుతూ.
ఈ లోపు వాళ్ళమ్మాయిని పిలిచి తనకేదో చెప్పారు. శ్రీ దేవి లోపలకి వెళ్లి ఒక పుస్తకం, క్యాలెండరు తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చి ఆయన పక్కన నిలబడింది .
చూడమ్మా! ఇది బాబా క్యాలెండరు, ఇది బాబా గారి పుస్తకం. ఈ పుస్తకం తీసుకొని చదువు, ఇందులో రోజుకో 72 పేజీలు అలా ఉంటాయి.
ఇది గురువారం నాడు మొదలుపెట్టి బుధవారం వరకు చదవాలి. ఇలా ఇన్ని వారాలు అని అనుకొని సంకల్పం చేసికొని చదివిన తర్వాత ఎవరినైనా పిలిచి భోజనం పెట్టు.
నీకు ఇవ్వాలి అనిపిస్తే బట్టలు కూడా పెట్టుకో, పండు తాంబూలం ఇవ్వు , ఇంకా గురువారానికి నాలుగు రోజుల సమయం వుంది .
ఈ నాలుగు రోజులల్లో నువ్వీ పుస్తకాన్ని అక్కడక్కడా చదివితే ఇందులో ఏముందో అవగాహన వస్తుంది అన్నారు.
నేను ఈ పుస్తకాన్ని రెండు రోజులల్లో చదివేస్తాను , ఇంతకన్నా పెద్ద పుస్తకమే మూడు రోజుల్లో చదివేసాను అంటూ భగవత్ గీత పుస్తకం పట్టుకు వెళ్లి ఆయనకి చూపించి ఇదిగో చూడండి అన్నాను.
ఆయన ఇది మామూలు పుస్తకం కాదు అన్ని పుస్తకాల్లాగా దీన్ని చదవడం కష్టం అన్నారు. ఏం కాదండీ చాలా సులభంగా నేను చదివేస్తాను అన్నాను.
ఆయనకి కోపం వచ్చేసింది . అసలు ఆయనకి కోపం రాదు. వాళ్ళ నాన్న కోపం శ్రీ దేవి కూడా మొదటిసారి చూసింది .
ఏంటమ్మాయ్! ఇది మామూలు పుస్తకం కాదు, ఇది చదవడం కష్టం, తొందరగా పట్టు పడదు అని ఎన్ని సార్లు చెబుతున్నా ఎంత చెబుతున్నా వినిపించుకోవేంటి? అన్నారు గట్టిగా.
ఆయన ధోరణి చూసి నేనింక మాట్లాడలేదు. ఈ ముసలాయనకి నా చేత ఈ పుస్తకం చదివించాలనే పట్టుదల ఏంటో అని అనుకున్నాను.
ఆ పుస్తకం పూజ దగ్గర పెట్టాను. రెండు రోజులయ్యింది. నేనా పుస్తకం తెరవను కూడా తెరవలేదు. రేపే గురువారం ఆ పుస్తకం మొదలు పెడుతున్నారుగా అన్నారు.
చేసేదేమీ లేక ఆ మొదలు పెడతాను అన్నాను .తెల్లవారింది. పనులన్నీ చేసుకొని పుస్తకం తీసుకొని కూర్చున్నాను.
2 పేజీలు కూడా అవకుండానే మా వీధులొంచి పిల్లలు వచ్చారు . మంచినీళ్లు కావాలని కాసేపు కూర్చొని వెళ్లిపోయారు.
అది చూసి శ్రీ దేవి నాన్న గారు మీ ఇంటికి వచ్చే వాళ్ళకి నేను సమాధానం చెబుతాను కానీ నువ్వు లేవకుండా చదువుకోమ్మా అన్నారు.
ఆయన వరండాలో కూర్చున్నారు. నేను మళ్ళీ పుస్తకం తీసాను. ఈ సారి మళ్ళి రెండు పేజీలు చదవకుండానే ఎప్పుడూ ఇటు వైపు రాని మా ఇంటి ఓనర్ వచ్చింది.
రాజ్యలక్ష్మీ అంటూ ఆడవాళ్లు వచ్చేటప్పటికి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఆవిడ తోటి కాసేపు కబుర్లు చెప్పి కాఫీలు, టీలు అయ్యి ఆవిడ వెళ్ళిపోగానే నేను మళ్ళీ లోపలికి వెళ్లి పుస్తకం తీసాను.
నాకీసారి బాగా నిద్ర వస్తుంది. ఎప్పుడూ నాకు పుస్తకం తీస్తే నిద్ర రాదు అలాంటిది కునికి పాట్లు మొదలయ్యాయి.
బాబాయి గారు లోపలికి వచ్చి చూసి మరీ నన్ను అదిలించి వెళ్లారు. క్యాంపుకి వెళ్లి రెండు రోజులు దాకా రానని చెప్పిన మా వారు భోజనానికి ఇంటికి వచ్చారు.
ఆయన రారనుకొని నేను ఏ వంట ప్రయత్నమూ చేయలేదు. అది తెలిసి శ్రీదేవి కూర అది తెచ్చి ఇచ్చింది.
ఆయన భోజనం అయ్యాక పడుకున్నాక నేను లోపల గదిలోకి వెళ్లి తలుపు దగ్గరికి వేసుకొని మరీ పుస్తకం తెరిచాను.
మళ్ళీ అరగంట కూడా గడవక ముందే ఎవరో పసుపు కుంకుమ పంచడానికి వచ్చారు (అవి సంక్రాంతి పండగ రోజులు).
ఆంధ్రాలో సంక్రాంతి పండగ రోజులల్లో ముతైదువులు ఇంటిఇంటికి వెళ్లి పసుపు కుంకుమ పళ్ళు పంచుకుంటూ ఉంటారు. అది అక్కడి ఆచారం.
వాళ్ళు పసుపు కుంకుమ ఇచ్చి వెళ్లిపోయారు. సాయంత్ర సమయం అవ్వటాన తిరిగి స్నానం అది చేసుకొని తిరిగి పుస్తకం తీసుకొని కూర్చున్నాను.
అటుపక్క ఇంట్లో ఉండే వాళ్ళింట్లో పెద్దావిడకి ఒంట్లో బాగాలేదు. ఆంటీ అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్లాలి సాయం రమ్మన్నారు అని తీసుకువెళ్లారు.
అక్కడి నుండి వచ్చేటప్పటికీ రాత్రి 9 గంటలు అయింది. ఈ పుస్తకం చదవడం ఇంక నా తరం కాదు. నేను చదవలేను అని తీసుకెళ్లి ఆయన పుస్తకం ఆయనకి ఇచ్చేద్దాం అనిపించింది.
అంతే వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళింటికి వెళ్లి ఇదిగోనండీ మీ పుస్తకం. నేను చదవగలనేమో అనుకున్నాను కానీ చదవలేక పోయాను. నా వల్ల కావడం లేదు. నేనీ పుస్తకం చదవలేనండి మీ పుస్తకం మీరు తీసుకోండి అన్నాను.
ఆయన నవ్వి నా తల మీద చెయ్యి వేసి సాయి అందరకి లొంగడు. ఎన్నో ఆటంకాలు , చికాకులు , పరీక్షలు పెడతాడు .దానికి నువ్వు తట్టుకోగలిగితే సాయి నీ వశమవుతాడు. లేదంటే నీ దరికి రాడు. నువ్వు మారిన పిదప ఆయన నీ వెన్నంటే ఉంటాడు అన్నారు.
ఆ మాటలకు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి . నేను వెంటనే ఇంట్లోకి వచ్చి బాబా ఫోటో ముందు నిలబడి బాబా నువ్వు నా యందు ఉండాలి. బాబా నేనిన్ను తక్కువగా అంచనా వేసాను . దయచేసి నన్ను క్షమించు
ఈ పుస్తకం చదివేలాగా నువ్వు నన్ను దీవించు ,నన్ను అనుగ్రహించు బాబా అంటూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని పడుకున్నాను .
మరునాడు ఉదయం 4 గంటలకి లేచి పనులన్నీ చేసుకొని మా వారిని ఆఫీసుకి పంపేసి పుస్తకం తీసుకొని కూర్చున్నాను .ప్రవాహం లాగా సాగిపోయింది .
45 నిముషాలలో ఆ రోజు పారాయణ పూర్తి చేశాను . నా మనసంతా చాలా తెలికిగా ఆనందంగా అనిపించింది.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari. Sainathuni
Latest Miracles:
- పరీక్షలు – పొరపాట్లు …..సాయి@366 జూన్ 23….Audio
- ఆ వచ్చింది సాక్షాత్తు బాబానే….G.A రాజ్య లక్ష్మి.
- సాయి దాసు గారు బాబా ను ఆశ్రయించకముందున్న స్థితి.
- బాబా పై భక్తి , ఊదీ మహత్యం …..!
- అనారోగ్యముతో భాదపడుతున్న భక్తురాలిని ఆరోగ్య వంతురాలిగా చేసి, బిడ్డను ప్రసాదించిన బాబా వారు…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments