Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు కళ్యాణి. మా వారు స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ లో మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యి ఈ మధ్యనే చనిపోయారు.
మాకు ముగ్గురు అబ్బాయిలు. ప్రస్తుతం నా నివాసం హైదరాబాద్ బి. యన్. రెడ్డి నగర్ (వనస్థలిపురం) మా ముగ్గురు అబ్బాయిలు కింద ఉంటారు. నేను ఒక్కదాన్ని ”బాబా” తో డాబా పైన ఉంటాను .
మా వారున్న రోజుల్లో ఆయన బ్యాంకు మేనేజర్ గా నిజామాబాద్ జిల్లా ”కోటగిరి” లో పని చేస్తున్న రోజులవి – మాకు హైదరాబాద్ లో బి. యన్. రెడ్డి నగర్ లోని ఇంటిని అద్దెకి ఇచ్చి అక్కడ ఉంటున్నాము.
అద్దెలు వసూలు చేసుకోవడానికి నెలకొకసారి నేనే హైదరాబాద్ వస్తుండేదాన్ని. ఒక సారి అలాగే నేను అద్దె తీసుకోవడానికి వచ్చాను.
నేను కోటగిరిలో బయలుదేరేటప్పుడు ఆయన బాగానే ఉన్నారు, మామూలుగానే బ్యాంకుకి వెళ్లారు,
నేను హైదరాబాద్ వచ్చి కోఠీలో ఉండే మా అక్కవాళ్ళింటికి వెళ్లి కొంచెం సేదతీరి వనస్థలీపురం వెళుతుంటాను.
ఈ సారి అలాగే చేశాను. ఇంట్లో రెంటుకు ఉండే వాళ్ళు ఈ రోజు ఉండి మరుసటి రోజు వెళ్ళండి అంటూ నన్ను బలవంతంగా ఉంచేశారు.
తరచూ వస్తుంటాను కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు నాకు అందరూ పరిచయమే. నేను వచ్చాను అంటే నాతో కాలక్షేపం చేయటానికి అందరూ చేరిపోతారు.
అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుని పడుకున్నాము. మరునాడు ఉదయాన్నే నేను లేచి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను.
అక్కడ నన్ను చూడగానే రావే కల్యాణీ రా రా ముందు భోజనం చెయ్యి అంది.
ఇప్పుడు ఉదయం 9. 30 అయ్యింది, ఇప్పుడే భోజనానికేం తొందర అన్నాను నేను, కాదు కాదు ముందు నువ్వు భోజనం చెయ్యి అంటూ నన్ను భోజనానికి కూర్చోబెట్టి కొసరి కొసరి భోజనం వడ్డించింది. నేను తిన్నాను.
ఈ లోపు మా అక్క కూతురు, అల్లుడు కూడా వచ్చారు. వాళ్ళెందుకు ఈ సమయంలో వచ్చారో నాకు తెలియలేదు.
ఏమో వచ్చారేమో లే అనుకున్నాను. నేను అన్నం తిని అక్క ఇంక నేను నిజామాబాద్ బయలుదేరుతాను అంటూ పెట్టె తీసుకున్నాను.
ఎక్కడికి వెళతావే కల్యాణీ? అంది అక్క, ఎక్కడికెంటే కొత్తగా అడుగుతావు వెళ్ళాలిగా కోటగిరి అన్నాను. ఇప్పుడనంగా బయలుదేరితే సాయంత్రం ఎప్పటికి వెడతానో ఏమో అంటున్నాను.
మీ ఆయన ఇక్కడికే వచ్చారే అంది అక్క, ఎక్కడికీ? ఎక్కడున్నారు? అన్నాను నేను నవ్వుతూ, కల్యాణీ నువ్వు ముందు ఇలా కూర్చో అంటూ కూర్చోబెట్టింది.
కంగారుపడకు, కంగారుపడకు, అంటోంది. నా మనసేదో కీడు శంకిస్తోంది. నా నోరు తడారిపోయింది, గుండె వేగంగా కొట్టుకుంటోంది, ఆయనకేమయింది అని అడిగాను.
జ్వరమొచ్చిందట, బ్యాంకులోనే పడిపోయాడట, కోఠీలో మా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చి, బ్యాంకు వాళ్ళే రాత్రి కారులో ఆయన్ని ఇక్కడికి తీసుకువచ్చారు.
అదే కారులో మేము తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్లో చేర్పించాము, మనలో లేడు, జాండిస్ అంటున్నారు, అదేదో తెల్ల కామెర్లు అంటారే అదట, డాక్టర్స్ చెప్పలేమంటున్నారే కల్యాణీ! అంటూ చల్లగా అసలు విషయం చెప్పింది అక్క.
పెట్టె అక్కడ పారేసి బయటికి పరిగెత్తాను, నా వెనుకే వాళ్ళందరూ వచ్చారు. అందరం అపోలో హాస్పిటల్ కి చేరుకున్నాము.
ICU లో ఉన్నారు, స్పృహలో లేరు. ఆ కామెర్లు ఎన్ని రోజుల నుండి ఉన్నాయో ఏమో ఇప్పుడు బయటపడి ఇలా ప్రాణాంతకం అయింది.
డాక్టర్స్ వస్తున్నారు చూస్తున్నారు, ఆయనలో ఆర్గాన్స్ అన్నీ చాలా తేడాలు వస్తున్నాయి. ఇంక చెప్పలేము అంటూనే ఉన్నారు.
తెల్లవారేవరకూ కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పూ లేదు. అలాగే రాత్రంతా కూర్చునే వున్నాము.
ఉదయం 9. 30 సమయం అవుతుండగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ICU లో ఉన్నవాళ్ళ స్థితిగతులు బయటి వాళ్ళ వాళ్లకి తెలియటం కోసం బయట ఒక డిస్ ప్లే లో ఉంచుతారో లేదో నాకు తెలియదు కానీ ఆ రోజు ఆ ఆసుపత్రి లో మాత్రం అలా పెట్టారు.
వీరభద్ర రావు ”expired” (చనిపోయారు) అని పెట్టారు. బ్యాంకు వాళ్ళు ఆయన్ని పంపించారు కాబట్టి ఆ బ్యాంకు కి వీళ్ళు ఫోన్ కూడా చేసి చెప్పేసారు.
నా కాళ్ళ కింద భూమి దిగిపోతుంది, నాకేం కనపడటంలేదు, ఎక్కడినుండో ”సాయిబాబా, సాయిబాబా” అని వినపడుతోంది.
ఆ బ్యాంకు వాళ్ళు మన మేనేజర్ గారు పోయారు అంటూ సెలవు కూడా డిక్లేర్ చేసేసారట.
అంతే ”బాబా” అంటూ గట్టిగా ఏడ్చాను. ”నువ్వు చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తావని నేను విన్నాను, ఇప్పుడు నా భర్త ఏ లోపం లేకుండా బ్రతికి ఆరోగ్యవంతుడయితే నేను నిన్ను నమ్ముతాను బాబా” అనుకున్నాను.
పావుగంట తర్వాత లోపల ఏం జరిగిందో, ఏమైందో కానీ ‘వీరభద్ర రావు saved ‘ ( క్షేమం) అని display లో వచ్చింది.
ఎవరో ఏమిటో తెలియని ”సాయిబాబా” నా భర్తను నాకు ఇచ్చాడని, మనసారా ”బాబా” అంటూ ఏడ్చాను.
కొద్ది రోజులకి వార్డ్ కి షిఫ్ట్ చేసారు. తర్వాత ఒక నెలా పదిహేను రోజులకి హాస్పిటల్ నుండి బయటికి వచ్చారు.
ఇది 1982 సంవత్సరంలో జరిగింది. అప్పటినుండి నేను బాబాను దృఢంగా, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా వారికి మాత్రం ”బాబా” అంటే ఎటువంటి ప్రేమా లేదు.
నేను బాబా ఫోటోను దేవుడి గుడిలో పెడితే ఆయన వచ్చి బాబా ఫోటోను తీసేసి శివుడికి అభిషేకం పూజలు చేసేవారు.
గురువారం నాడు మాత్రం ఎక్కడో దూరంగా ఉన్న సాయిబాబా గుడికి నన్ను తీసుకువెళ్ళేవారు, తాను మాత్రం లోపలికి వచ్చేవారు కారు.
కొబ్బరికాయ, పూలదండలు స్వీట్స్ అన్నీ కొనిచ్చేవారు కానీ తాను మాత్రం లోపలికి వచ్చేవారు కారు. సరేలే లోపలికి నేనేమీ రమ్మనను మీరు గుడికి తీసుకువెళ్ళండి చాలు అనేదాన్ని, అలాగే చేసేవారు.
అక్కడ నుండి రెండు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ కు బదిలీ అయ్యింది.
వనస్థలిపురంలో సొంత ఇంటికి చేరాము. అప్పట్లో వనస్థలిపురంలో బాబా గుడి లేదు. బాబా గుడికి వెళ్లాలంటే dilshukhnagar లో ఉన్న బాబా గుడికి వెళుతుండేవాళ్ళం.
తర్వాత మేమున్న బి. ఎన్. రెడ్డి నగర్ లోనే మా ఇంటికి చాలా దగ్గరలోనే బాబా గుడి కట్టారు.
చిన్న విగ్రహం పెట్టుకుని ఆడవాళ్ళం ఒక పదిమందిమి చేరి అందరం ఉదయం నుండి అభిషేకం, పూజలు చేసేవాళ్ళం. ”లలితా పారాయణం”, ”విష్ణు సహస్రనామ పారాయణం” చేసేవారం.
గురువారం వస్తే తలా ఒక రకం ప్రసాదంగా తయారుచేసి తీసుకువెళ్ళి నైవేద్యం పెట్టి అందరమూ అన్నీ పంచుకుని తినేవారం.
రోజూ బాబాకి బట్టలు కట్టి అది మరునాడు నేనే ఇంటికి తీసుకువచ్చి పనామెచేత బాబా బట్టలు విడిగా ఉతికించి నేను ఇస్త్రీ చేసి తీసుకువెళ్లి గుడిలో పెట్టేదాన్ని.
ఆ బట్టలు అందరమూ తలా 100 రూపాయలు వేసుకుని బాబాకి కొనేవాళ్ళము.
అలా ఉండగా నాకు ఒకరోజు ఒక కల వచ్చింది. ఆ కలలో గుడిలో నున్న విగ్రహం పడుకున్నట్లుగా వచ్చింది.
నేను ఉదయాన్నే లేచి బాబా గుడికి పరుగెత్తుకు వెళ్ళాను. అలా నాకు కల వచ్చింది. ఏమయివుంటుంది అనే భయంతో,
నేను వెళ్ళేసరికి బాబా విగ్రహంలో బాబా ముక్కు విరిగి మొహం, మూతి సొట్టపోయి వున్నాయి. ఏమై ఉటుందని అని అక్కడి వాళ్ళను అడిగితే రాత్రి గుడిలో ముస్లింలు దూరి బాబా విగ్రహాన్ని కొట్టారని అందుకే బాబా విగ్రహం ఇలా అయిపోయింది అని చెప్పారు.
ఆ తర్వాత నెమ్మదిగా గుడిలో ఒక పూజారిని పెట్టాము, ఆయన పూజలు చేసేవాడు. మేమంతా హారతులు కూడా నేర్చుకుని పాటలు పాడుతుండేవాళ్ళం.
తర్వాత తర్వాత గుడికి జనం రావటం, రాజకీయాలు చోటు చేసుకోవటంతో నెమ్మదిగా గుడికి వెళ్ళటం మనుకున్నాము.
ఎవరి ఇంట్లో నైనా గురువారం నాడు భజన చేసుకుని నైవేద్యాలు పెట్టుకుని తిని వస్తుండేవాళ్ళం.
మేము నిజామాబాద్ దగ్గర ఉన్నప్పుడే మా అబ్బాయికి పెళ్లి కుదిరింది. సొంత ఇల్లు ఉండబట్టి హైదరాబాద్ లోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాము.
సెలవు పెట్టడానికి కుదరక ఆయన తర్వాత వస్తానన్నారు. నేను మాత్రం ముందే వచ్చేసి ఇంట్లో ఉన్నాను,
తెల్లవారితే పెళ్లి కొడుకుని చేయాలి ఆ ముందు రోజు సాయంత్రానికే మా వారు నిజామాబాద్ నుండి రావాలి కానీ ఏదో పని వత్తిడి లో ఆలస్యంగా బయలుదేరారట.
ఆలస్యమైపోతోందని హడావిడిగా వస్తున్నారు. సరిగ్గా, కామారెడ్డి దగ్గరికి రాగానే అక్కడ పెద్దదైన ”బాబా” గుడి ఉంది, ఆ గుడి ముందే ఆయన వస్తున్న కారు రెండు టైర్స్ పంక్చర్ పడ్డాయట, పొద్దుపోయింది, తెల్లవారేసరికి హైదరాబాద్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాలి. ఏం చేయాలో తోచలేదట.
సరే చూద్దామని బాబా గుడిలోకి వెళ్లారట. అప్పటికి మా వారు ఇంకా రాలేదని నేను కంగారుగా ఇంట్లోకి బయటికి తిరుగుతున్నారు.
అప్పట్లో ల్యాండ్ ఫోన్స్ మాత్రమే ఉన్నాయి. ”బాబా” ముందు నిలబడి బాబాను వేడుకుంటున్నాను, ”ఏమిటి బాబా ఈ పరీక్ష? ఏమైంది, ఇంకా ఎందుకు రాలేదు” అని మనసు కీడు శంకించి ఏడుస్తున్నాను.
అంతలో ఫోన్ మ్రోగింది. టైర్స్ పంక్చర్ అయ్యాయి, పిల్లవాడ్ని కారిచ్చి పంపించు దగ్గర్లో బాబా గుడి ఉంది అందులోనుంచి మాట్లాడుతున్నాను అన్నారు.
”అమ్మయ్య బాబా కాపాడావా బాబా” అని దండం పెట్టుకుని రెండు కార్లు ఇచ్చి పంపించాము.
ఒక కార్లో ఆయన్ని ఎక్కించుకుని వచ్చేసారు, మరో కార్లో 2 టైర్స్ ను తీసుకువెళ్లారు.
బాబా గుడిలోకి ఈయన వెళ్లారట. గుడి మూసేస్తున్నారట. ఈయన తన పరిస్థితి చెప్పి ఫోన్ కావాలి ఒక ఫోన్ చేసుకుంటానన్నారట, వాళ్ళు సరే అన్నారట.
అక్కడినుండే నాకు ఫోన్ చేసారన్నమాట. వీళ్ళు వెళ్లి ఎక్కించుకుని వచ్చేదాకా ఆయన గుడి మెట్ల మీదే కూర్చున్నారట. ”ఇంటికి వచ్చాక మీ బాబా నాకివాళ ఫోన్ ఇచ్చాడే” అన్నారు.
”ఒక్క ఫోన్ ఏమిటి ఆయన తలచుకుంటే ఏమైనా ఇస్తాడు” అన్నాను నేను, సరే సరే అన్నారు.
బాబా విషయం ఎత్తితే ఏమైనా అంటాను నేను. మరి నాకు ఆయన చూపించిన నిరూపణలు సామాన్యమైనవా!
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం
- బాబా ఏదో రూపంలో తమ ఇంటికి వస్తారు అని భావించిన భక్తుల నమ్మకాన్ని నిలబెట్టిన బాబా వారు
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- భక్తులు మరిచిపోయిన బాబా మరవరు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments