శిరిడీ చేరేంత వరకు అన్నీ తానై చూసుకున్న బాబావారు!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నాకు ఐదు ఏళ్ల క్రితం చికెన్ గున్యా వచ్చింది. జ్వరం వచ్చి మూడు రోజులలో తగ్గింది కానీ మోకాళ్ళ నొప్పులు మాత్రం చాలా బాధపెడుతూ ఉండేవి. చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని.

గుడికి రావడం, గుడిమెట్లు ఎక్కటం, కూర్చోవడం, పనిచేయటం చాలా కష్టంగా ఉంటూ ఉండేది.

ఏది ఏమైనా బాబా గుడికి రావటం మానేదాన్ని కాను. అలా బాధపడుతూనే నెమ్మదిగా బాబా గుడికి వచ్చేదాన్ని క్రింద కూర్చుని విష్ణు సహస్ర నామాలు చదవటం చాలా కష్టంగా ఉండేది.

అందుకని ఇంట్లోనుంచి చిన్న చెక్క స్టూల్ తెచ్చుకుని దాని మీద కూర్చుని పారాయణ చేసేదాన్ని.

ఇలా సాగుతుండగా ”భాను” (ఒక సాయి భక్తుడు) కొంత మంది సాయి భక్తులతో షిరిడి వెళ్తున్నాను మీరు కూడా వస్తారా ఆంటీ అని అడిగాను.

బాబాను ఇక్కడ కొలవడమే తప్ప ఇంత వరకు షిరిడి వెళ్లి దర్శనం చేసుకోలేదు.1978 సంవత్సరంలో పరిచయమైన బాబా షిరిడి రావాలని ఇప్పుడు నాకు పర్మిషన్ ఇస్తున్నాడు,

కానీ ఇక్కడ గుడికే దేక్కుంటూ, పాక్కుంటూ వస్తున్నాను (చికెన్ గున్యా మూలాన).

షిరిడి బస్సు ఎక్కి దిగి వెళ్లగలనా? అయినా సరే బాబా దగ్గర నుంచి పిలుపు వచ్చింది, అని తోచి ఏదైతే అది అవుతుందని షిరిడికి వాళ్ళతో బయలు దేరాను.

30 సీట్లు ఉన్న ఆ బస్సులో ఎక్కువ మంది ఆడవాళ్లే ఉన్నారు. అందరూ భోజనాలు చేసి, వారి వారి ఇళ్ల వద్ద నుంచి గుడి నుంచి వద్దకు వచ్చాము.

బ్యాగులు అన్ని వ్యానులో సర్దుకుని, బయలుదేరే ముందు కొబ్బరి కాయ కొట్టి ”జై బోలో సాయినాథ్ మహారాజ్ కి జై” అని అందరమూ కోలాహలంగా వ్యాన్ ఎక్కాము.

వ్యాన్ బయలుదేరింది. చాలా సేపు నామం చేసాము. అలా చేస్తూనే నిద్రలోకి జారిపోయాము.

నాలుగు గంటలకి నిద్ర లేచే అలవాటు ఉండడం వలన నాకు తెల్లవారుఝామునే మెలకువ వచ్చింది.

ఏం! భాను ఇంకా ఎంత దూరంలో ఉన్నామయ్య? ఇంకా ఎంత సేపు పడుతుంది! షిరిడి రావటానికి? అని అడిగాను.

అప్పుడు భాను ”ఆంటీ! మీకింకా పూర్తిగా మెలకువ రాలేదా? వ్యాన్ వెళ్తునట్టుగా ఉందా? రాత్రి ఒంటి గంటకి వ్యాన్ ఆగిపోయింది. ఏదో రిపేర్ వచ్చింది అట.

అప్పటి నుంచి మా మగాళ్ళంతా  బస్సుకి కాపలాగా ఉన్నాము. మీ ఆడవాళ్ళంతా హ్యాపీగా పడుకున్నారు  అని అన్నాడు.

ఆడవాళ్ళంతా లేచి బస్సు దిగాము. అంతా చిమ్మ చీకటి దట్టమైన అడవి లాగా కనిపిస్తుంది. మళ్ళీ బస్సు ఎక్కి ”కాకడ హారతి” పాడుకున్నాము. తెల్లవారింది.

వెలుతురు వచ్చాక చుట్టూ పరికించి చూసాము. ఎక్కడా నర మానవుడు లేడు. మగపిల్లలు కొంచెం దూరం వెళ్లి వెతకగా అక్కడ ఒక డాభా కనిపించిందట.

అందులోకి వెళ్లి ఇలా మా బస్సు చెడిపోయింది. మాకు అందరికి కాఫీలు కానీ, టీ లు కానీ, పాలు కానీ ఏమైనా ఇచ్చి, 30 మందికి తినడానికి ఏమైనా టిఫిన్స్ ఏర్పాటు చేయగలరా అని అడిగితే,

వాళ్ళు మా దగ్గర పాలు అంతగా లేవు, కాఫీలు చేయటం మాకు రాదు, టీ లు కావాలి అంటే ఇస్తాం.

తినడానికి అంటే మా దగ్గర బ్రెడ్డు తప్ప ఏం లేదు అని బ్రెడ్డు టీ లు ఇచ్చి మీకు మధ్యాహ్నానికి కావాలంటే మాకు రొట్టెలు చేయటం తెలుసు అది కూడా మేము పక్క ఊరికి వెళ్లి సామాన్లు కొని అక్కడే చేయించి సబ్జీ కూడా చేయించి తేవాలి టైం పడుతుంది అని చెప్పారట.

అతని సాయంతోనే మేము అందరం స్నానాలు అవి కానిచ్చుకున్నాము.

ఈ లోపల మా వ్యాన్ డ్రైవర్ బండి రిపేరుకి ప్రయత్నించాడు. వాడి వల్ల కాలేదు. ట్రావెల్స్ వాడికి ఫోన్ చేసి అర్ధ్రరాత్రి మా బండి ఆగిపోయింది.

డ్రైవర్ రిపేరుకి ట్రై చేసినా అవ్వలేదు, అందువలన వేరే బండి పంపు అని అడిగితే ఆ ట్రావెల్స్ వాడు సరే పంపిస్తాను కానీ సమయం పడుతుంది అని అన్నాడు.

ఈ లోపు మా అందరికి ఆకళ్ళు వేస్తున్నాయి. వాడు పెట్టిన బ్రెడ్డు మాకు ఏ మాత్రం సరిపోలేదు. మాలో కొంతమంది ఆ బ్రెడ్డు కూడా తినలేదు.

ఈ లోపల ఆ డాభా వాడు చపాతీ కూర చేయించి తీసుకుని వచ్చాడు. అందరమూ రుచి సంగతి పక్కన పెట్టి ఆవురు ఆవురుమంటూ తిన్నాము.

ఈ లోపల వేరే బస్సు వచ్చింది. అందరమూ పాడైపోయిన వ్యాన్లోంచి సామాన్లు తీసి ఇప్పుడు వచ్చిన వ్యాన్లోకి మార్చుకొని అందరమూ బస్సు ఎక్కి కూర్చున్నాము. మధ్యాహ్నం ఒంటి గంటకి బస్సు బయలుదేరింది.

ఆ తర్వాత మాకు తెలిసింది ఏమిటంటే మా బస్సు ఆగిపోయిన ప్రదేశం చాలా ప్రమాదకరమైన ప్రదేశం అని, అక్కడే దోపిడీ దొంగలు దారి కాచి అందరినీ దోచుకుంటారని, ఆ ప్రదేశంలోనే మా వ్యాన్ ఆగిపోయింది.

అక్కడ ఎవ్వరూ మాములు మనుషులు ఉండరట. మరి మాకు భోజనాలు, నీళ్లు, టీ లు ఏర్పాటు చేసింది ఎవరు? సాక్షాత్తూ ఆ ”షిరిడి సాయినాథుడు” కాకుంటే మరి ఎవ్వరు.

బస్సు షిరిడికి చేరేటప్పటికి సాయంత్రం ఐదు గంటలు అయింది. నేను ఎప్పుడు షిరిడీలో దిగుదామా, ఎప్పుడెప్పుడు ఆ సాయిని దర్శనం చేసుకుందామా అని ఎదురుచూస్తున్నాను.

అందరం వ్యాన్ దిగి రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి వద్దాం అని అనుకుంటున్నారు.

నేను మాత్రం ద్వారకామాయికి వెళ్ళిపోతాను, నేను అక్కడే ఉంటాను, మీరు వచ్చి నన్ను అక్కడే కలవండి, పైగా ఇప్పుడు హారతి సమయం కూడా అవుతుంది కాబట్టి నేను వెళ్తాను అని అన్నాను.

మిగిలిన వాళ్ళు అందరూ ఆంటీ! ఇది కొత్త స్థలం మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు అన్నారు.

ఏం పర్వాలేదు మేము ఢిల్లీ లో ఉండి వచ్చాము కాబట్టి హిందీ భాష తెలుసు, ఏం భయం లేదు అని చెప్పి , వెతుక్కుంటూ నేను ద్వారకామాయికి వెళ్ళిపోయాను.

హారతి సమయం  అవుతోంది. జనం అంతా నిలబడి ఉన్నారు. నాకు కాళ్ళు నొప్పి గానే ఉన్నాయి. అయినా హారతి కోసం నిలబడ్డాను.

హారతి మొదలైంది, నేను జనం మధ్యలో ఉన్నాను. హారతి అవుతుంటే తన్మయత్వంతో కళ్ళు మూసుకుని ఉన్నాను.

నాకు తెలియకుండానే నేను హారతి మధ్యలో, చటుక్కున చతికిల పడి పద్మాసనంలో కూర్చున్నాను. అది నాకు ఏ మాత్రం తెలియదు. హారతి అయిపోతోంది.

అప్పుడే స్పృహలోకి వచ్చినట్లు చుట్టూతా చూసాను. జనం మధ్యలో నేను ఉన్నాను. నెమ్మదిగా లేచి బయటికి వచ్చాను.

ద్వారకామాయి ముందు ప్రసాదం తీసుకున్నాను. ఈ లోపల నా తోటి ప్రయాణికులంతా అక్కడికి చేరుకున్నారు.

అందరం సమాధి మందిరంలోకి వెళ్ళి బాబాను దర్శనం చేసుకున్నాము. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసి పరవశించి పోయాను.

లెండి తోట, నందా దీపం, దత్తాత్రేయుని దర్శనం అయ్యాయి. పారాయణ హాల్ కూడా చూసాము.

ఆ రోజు, మర్నాడు కూడా అక్కడ గడిపి, బాబాని మరల మరల దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ ప్రయాణం అయ్యాము.

నా కాళ్ళ నొప్పులు నాకు తెలియడం లేదు. తిరుగు ప్రయాణం లో అందరం బాసర వెళ్దాము అని అన్నారు.

అక్కడ ఆగి గోదావరిలో అన్ని మెట్లు దిగి స్నానాలు చేయడానికి సమయం లేనందున, కాళ్ళు మాత్రం కడుక్కుని, మెట్లు అన్ని ఎక్కి పైకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని, ఎటువంటి ప్రయాస పడకుండా బస్సు ఎక్కాను.

నన్ను గమనించి మా వాళ్ళు గోదావరి లోపలికి దిగేరా లేక కాళ్ళ నొప్పులు అని ఒడ్డునే ఉండిపోయారా? అని అడిగారు.

లేదు లేదు గోదావరిలోకి దిగి, కాళ్ళు కడుక్కుని మరీ అమ్మవారి దర్శనం చేసుకున్నాను, అని చెప్పాను.

హైదరాబాద్ వచ్చాక మామూలు గానే విష్ణు సహస్రనామం పారాయణ చేయటానికి, నేను బాబా గుడికి ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్లిన చెక్క బల్ల మీద కూర్చున్నాను.

నా మోకాలిపై తడుతూ ఉన్నట్లుగా ”ఇది అవసరమా, ఇది అవసరమా” అన్న మాటలు నాకు వినిపించాయి.

”ఏంటి బాబా ఇది అవసరమా అని అడుగుతున్నావు” అంటే, నా మోకాలి మీద తడుతూ నా క్రింద స్టూల్ చూపించినట్లు అయింది.

అప్పుడు నేను నా మోకాళ్ళ నొప్పులు విషయం గమనించాను. నా మోకాళ్ళ నొప్పులు లేవు అని, అవి పోయాయి అని అప్పుడు తెలుసుకున్నాను. నేను లేచి ఆ చెక్క స్టూల్ దూరంగా నెట్టేసి క్రింద చతికల పడ్డాను.

నాలుగు రోజుల తర్వాత కృష్ణ మూర్తి గారు (బాబా భక్తుడు) విష్ణుసహస్ర నామ పారాయణం ప్రారంభించే ముందు ”ఆవిడ బల్ల పట్టుకు రండి, ఎవరో ఎక్కడో పడేసారు” అని అన్నారు.

నేను ఇంకా దాని అవసరం లేదు అని, నా నొప్పులు పోయాయి అని, సైగ చేశాను.

ఆ బల్ల ఇప్పుడు వైదేహి నగర్ సాయి బాబా మందిరంలో , సెల్లార్ గద్దె మీద ఉన్న చిన్న నల్లని సాయి బాబా విగ్రహానికి ఆసనంగా మారింది.

ఆ చెక్క బాబా తీసుకున్నాడు. చికెన్ గున్యాతో వచ్చిన నొప్పులను బాబా తరిమికొట్టాడు.

బాబా ఎప్పుడు ఏది ఎందుకు చేస్తారో ఆయనకే తెలుసు. 18 సంవత్సరాలుగా ఉన్న ulcer కి వైదేహి నగర్ గుడిలో తాను ప్రత్యక్షంగా కనపడి, ట్రీట్మెంట్ ఇచ్చి మాయం చేసాడు.

హైదరాబాద్ లో వచ్చిన చికెన్ గున్యా నొప్పులకు ”షిరిడి” కి తీసుకుని వెళ్ళి, ద్వారకామాయి లో సంధ్య హారతికి నిలబడ్డ నన్ను కూర్చోపెట్టి నొప్పులను మటుమాయం చేసాడు.

స్టూల్ మీద కూర్చోవటానికి కష్టపడే నన్ను క్రింద మఠం వేసుకుని కుర్చునేలాగా చేసి నొప్పులను అంతం చేసారు.

ఇది బాబా నా పై చూపించిన ప్రేమామృత వర్షం. ఎప్పుడు ఎక్కడ ఎలా చికిత్స చేయాలో, ఆ పరమ వైద్యునికే ఎరుక.

సర్వం శ్రీ సాయినాథ చరణావిందార్పణ మస్తు

శుభం భవతు

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles