ఎన్నో అడ్డంకులు దాటించి నన్ను షిరిడీ రప్పించిన బాబావారు ….!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా పెద్ద అమ్మాయి పెళ్లిలోనే మా చిన్నమ్మాయిని చూసి మా వియ్యంకుడి చుట్టం ఈ అమ్మాయి ఎవరు? అని అడిగి, మా రెండవ అమ్మాయి అని తెలుసుకొని ఈ అమ్మాయిని మా కోడలిగా చేసుకుంటాం అడగమన్నారట.

అప్పటికే మా మర్యాదలని, వంటలని చూసిన మా వియ్యంకుడు గారు, ఇంత వెంటనే మరో అమ్మాయి పెళ్లంటే వాళ్ళు చేయరు, చేయలేరు, నాకు అర్ధం అయ్యింది వాళ్ళ స్థితి,

మా వియ్యపురాలు ఇప్పటికే చాలా కష్టపడి ఒంటిచేత్తో సంసారం ఈది పాపం ఈ పెళ్లి చేస్తోంది. అందుకని ఇంత వెంటనే ఆవిడ ఒప్పుకోదని ఆయనే నా తరపున చెప్పారట.

పర్వాలేదు ఆ అమ్మాయి చదువు అయ్యి, ఉద్యోగం చేసే దాకా ఎన్నాళ్లయినా మేము ఆగుతాము అన్నారుట.

ఇప్పుడు మా చిన్నమ్మాయి విదేశాలలో ఉంది, ఉద్యోగం చేస్తోంది. తన చదువుకయ్యే ఖర్చు అంతా స్కాలర్ షిప్ ద్వారా వచ్చినదే.

పెళ్లి వారు కూడా బాబా భక్తులు. వాళ్ళు ఉండేది వరంగల్.  మళ్లీ వచ్చే ఏడాది పెళ్లి ముహుర్తాలు ఉన్న సమయానికి పెళ్లి చేయాలి.

నేను, ”షిరిడి” కి బాబా పరిచయం అయిన చాలా రోజుల దాకా నన్ను ఆయన పిలిపించు కోలేదు. మా ఇంటి దగ్గర కొంతమంది కలిసి ”షిరిడి” కి వెళ్లి అక్కడ నామసప్తాహం చేస్తుంటారు,

ఒకసారి వాళ్ళతో పాటు షిరిడి వెళ్లి దర్శనం చేసుకుందాం అనుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఉత్సాహం కొద్దీ వస్తానని వాళ్ళతోటి అనేశాను. మా మేనమామ కొడుకుని డబ్బులు అడిగాను.

అతను స్టేషన్ కి డబ్బులు తెచ్చిస్తాను అన్నాడు. సరే అన్నాను. స్టేషన్ కి వెళ్ళిపోయాము.

వాడు మళ్లీ ఫోన్ చేసి ట్రైన్ ఎన్నింటికి అని అడిగాడు . నేను కనుక్కొని మధ్యాహ్నం 2:30 నిమిషాలకి వెళ్ళిపోతుంది అని చెప్పాను.

సరే నువ్వేమి కంగారు పడకు నేను వస్తున్నాను అన్నాడు. నేను స్టేషన్ బయటికి వచ్చి చూస్తున్నాను, ఈ లోపల 2 గంటలు అయింది. మా బావ వచ్చాడు, డబ్బులు తీసుకువచ్చి నా చేతికి ఇచ్చాడు.

నువ్వు ఒక్కదానివే ఇక్కడ నుంచున్నావా, పద రైలు బయలుదేరే వరకు ఉండి వెళ్తాను అన్నాడు.

ఇద్దరమూ స్టేషన్ లోపలి ప్లాట్ ఫారం మీదకి వచ్చాము. చూస్తే ఏముంది నేను ఎక్కవలసిన రైలు వెళ్ళిపోయి అరగంట అయింది.

రైల్ 1:30 కి. నాకు రైలు సమయం తప్పు చెప్పారు. నేను రైలు ఎక్కలేదు అని కొంచెం ముందుకు వెళ్ళాక రైలు ఆపించారట.

ఆ విషయం నాకేం తెలుస్తుంది, నాకు చాలా బాధ వేసింది. ఏడుపు మొహం పెట్టాను.

మా బావ పరవలేదులే కళా నువ్వేమి బాధపడకు, నా వల్లే కదా నీ రైలు దాటిపోయింది.

నేను నిన్ను బస్సులో అయినా సరే షిరిడి పంపిస్తాను అని నన్ను బస్సు ఎక్కించడానికి ఆ రోజు టిక్కెట్లు చూసాడు.

ఏ బస్సులోనూ టిక్కెట్టు దొరకలేదు. మరునాటికి బస్సులో ఒకే ఒక సీటు ఉందన్నారట, ఆ టికెట్ కొనేసాడు.

నన్ను రాత్రి 11 గంటలకి బస్సు ఎక్కించి వెళ్ళిపోయాడు. బస్సు ఎక్కి నేను హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలోపే బస్సులో ఒక కలకలం మొదలైంది.

అదేమిటి అంటే ఆ బస్సు కి రిపేర్ వచ్చింది, అది బయలుదేరదు అని అందరూ అంటున్నారు. నాకు ఏడుపు వచ్చేస్తోంది.

”షిరిడి వచ్చి నిన్ను దర్శనం చేసుకోవచ్చు అని అనుకుంటే నన్ను ఇలా తిప్పలు పెడుతున్నావేమయ్యా.

రైలు ఎక్కుదాం అనుకుంటే రైలు వెళ్ళిపోయింది, తీరా బస్సు ఎక్కుదాం అనుకుంటే బస్సు బయలుదేరదు రిపేరు అంటే ఇప్పుడు నేనేం చేయాలి.

ఈ బస్సు నిజంగానే బయలుదేరాకపోతే నేను తిరిగి వనస్థలిపురం వెళ్లే దారి కూడా లేదు.

సాయి ఏంటయ్యా నీ లీల? నన్నేమి చేయాలనుకుంటున్నావు,?” అని లోలోపల ఏడుస్తున్నాను.

బస్సులో తోటి ప్రయాణికులు కొందరు వేరే బస్సు మార్చి పంపించ మంటున్నారు, మరికొందరు ఈ బస్సు బయలుదేరాకుండా కుదరదు అని కొందరు అంటున్నారు.

TV9 కి ఫిర్యాదు చేస్తాం అన్నారు కొందరు. మొత్తానికి 12 గంటలు అవుతుండగా మరో బస్సు ఎక్కించి బయలుదేరదీసాడు డ్రైవర్.

తెల్లవారేసరికి ”షిరిడి” కి చేరుకున్నాం. అప్పటికే నేను బస్సులో షిరిడికి వస్తున్నట్లు ఫోన్ చేసి బస్సు స్టాండుకి ఎవరినైనా పంపమని ముందు వెళ్లిన వాళ్ళకి చెప్పాను.

మా ఇంటి దగ్గర నుండి వెళ్లిన వాళ్ళు ఎవర్నో బస్సు స్టాండుకి పంపించారు.

నేను వాళ్ళతో కలుసుకున్నాను. అందరూ నన్ను ఇలా జరగడానికి కారణం అడిగారు.

నా దగ్గర డబ్బు లేదని, అందుకు మేనమామ కొడుకు స్టేషన్ కి డబ్బులు తెచ్చిస్తాను అన్నాడు అని తెలుసుకొని, అందరూ, మమ్మల్ని అడిగితే మేమె ఏదో ఒకటి చేసేవారము.

అనవసరంగా పాపం చాలా ఇబ్బంది పడ్డావు అన్నారు, డబ్బులు లేవని అందరి తోటి ఏం చెప్పుకుంటాం.

మా వారు చనిపోయిన తర్వాత నేను తిండికి లేక ఇబ్బంది పడుతున్న సమయంలోనే నాకు మా ఇంటి దేవుడు వేంకేటేశ్వరస్వామికి ఏవో దోషాలు చేశాను అనిపించి మహబూబ్ నగర్లో ఒక గుడికి ప్రతి పౌర్ణమికి వెళ్లి పూజ చేయించి వస్తుండేదాన్ని.

ఉదయాన్నే, హైదరాబాద్ లో బయలుదేరి మళ్ళీ సాయంత్రం కల్లా తిరిగి వచ్చేసేదాన్ని.

ఒకసారి అలాగే గుడికి వెళ్ళటానికి ప్రయాణమై గుట్ట ఎక్కి పూజ చేయించి, గుట్ట దిగుతుంటే మిట్ట మధ్యాహ్నం, ఒక్క మనిషి కూడా లేడు.

నాకు చాలా భయం వేసింది. వెంటనే బాబాను తలచుకున్నాను. ”బాబా నేను ఒక్కదాన్నే ఉన్నాను, చుట్టూ ఎవరూ లేరు నాకు భయం వేస్తోంది, ఏదో ఒకటి చెయ్యి బాబా” అని అనుకున్నాను.

ఎక్కడనుండి వచ్చిందో ఒక సింహం లాంటి కుక్క నాతో పాటు మెట్లు దిగుతోంది. నేను దాన్ని ఏం చేస్తుందా చూద్దాం అని నేను ఆగిపోతే అది ఆగుతోంది. నేను నడుస్తుంటే అది నడుస్తోంది, మెట్లు అన్ని నాతో పాటు అదీ దిగింది.

దిగంగానే ఇంక నాకు ఆ కుక్క కనపడలేదు. ఎటు వెళ్లిపోయిందో చూడలేదు. బాబాయే ఆ రూపంలో నాకు సాయంగా వచ్చి మెట్లు దిగాడు అని అనిపించింది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles