Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు అనురాధ. మేము హైదరాబాద్ వనస్థలిపురం వైదేహీనగర్ లో నివాసం ఉంటున్నాము.
మా అమ్మగారికి మేము ఆరుగురం సంతానం. అందరమూ ఆడవారమే.
అక్క చెల్లెళ్ళమందరం ఎంతో అన్యోన్యంగా ఉండేవారం. ఎవరి ఇంట్లో ఏ కార్యం జరిగినా అందరము తప్పనిసరిగా ఉండేవారం.
మా నాన్నగారు పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేసేవారు. ఆయన ఉద్యోగ రీత్యా ఒకసారి బొంబాయి వెడితే అక్కడ ఎవరో మా నాన్నకి ఒక బాబా ఫోటో ఇచ్చారు.
అది మేము ఆనాడే చూసాము. ఆయన ఫైల్స్ మధ్యనే ఆ ఫోటో ఉండిపోయింది. ఆ ఫోటోను ఏనాడు మేమెవరం పట్టించుకోలేదు .
అప్పట్లో వనస్థలిపురంలో బాబా గుడిలేదు. ఎక్కువగా ఇళ్లు కూడా ఉండేవి కావు, అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు ఉండేది.
ఒక ఐదుగురు ఇళ్ళ వాళ్ళం కలిసి వేరే ఎక్కడో బాబా పూజ జరుగుతుందని తెలిసి వెళ్ళాము.
అక్కడ భజన చూసిన తరువాత, నాకు బాబా అంటే ప్రేమ, గౌరవం కలిగాయి.
ఇంటికి వచ్చినా బాబాని తలుచుకుంటే నాకు కళ్ళ వెంట నీళ్ళు వస్తుండేవి, అది చూసి మా వారు ఎవరు చచ్చారని ఏడుస్తున్నావ్ అనేవారు.
ఆ తర్వాత వెళ్లిన ఐదుగురము వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో బాబా పూజ భజన చేసుకోవాలని అనుకున్నాము.
ఆ పరంపర లోనే మా పెద్ద అక్క వాళ్ళింట్లో బాబా భజన ముందుగా జరిగింది. ఆ రోజు నేను మాత్రమే వెళ్ళాను.
ఏదైనా కార్యక్రమం ఎక్కడైనా జరిగితే మా వారు నేను ఇద్దరమూ వెళుతూ ఉంటాము .అలాంటిది బాబా భజనలంటే మాత్రం ఆయనకు అసలు గిట్టేది కాదు, వచ్చేవారు కాదు.
నాకేమో బాబా భజనలు చాలా ఇష్టంగా ఉండేది. అందుకని నేను ఒక్కదాన్ని అక్కలతోను, చెల్లెళ్ళతోనూ వెడుతుండేదాన్ని.
ఒకసారి BDL నాగేశ్వరరావు గారింట్లో ఏకాహం జరుగుతోంది.
బాబా పూజ అంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ”ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి” అన్న నామం అఖండంగా పాడుతుంటారు.
24 గంటల పాటు నామం చేస్తారన్న మాట. ఉదయం నేను పని చేసుకుని వెళ్ళేటప్పుడు మా వారిని ఇలా వాళ్ళింట్లో సాయి నామం జరుగుతోంది వెడదాం రమ్మన్నాను.
ఆయన నేను టిఫిన్ ఇప్పుడే తిన్నానుగా టిఫిన్ తిన్నాక దేవుడి పూజకి రానని నీకు తెలుసుగా అన్నారు, టిఫిన్ తిన్నా ఏం కాదు నేనూ తిన్నాను కదా బాబా పూజకి అటువంటి నియమం లేదు రమ్మనమన్నాను.
నేను రాను మా ఫ్రెండ్ వాళ్ళింట్లో ఘటాలు ఎత్తుతారు అక్కడికి వెడతాను అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది.
నాతోటి బాబా పూజకి రమ్మంటే నేను టిఫిన్ తిన్నాను రాను అంటున్నావు, ఘటాలంటే అమ్మవారికి సంబంధించినవి అక్కడ ఈ నియమం అక్కరలేదా వెళతానంటున్నావు అన్నాను.
అలా ఇద్దరం వాదులాడుకుంటున్నాము. నేను పూజకి వెళ్లాను కానీ నా మనసు మనసులో లేదు. అశాంతిమయం అయిపోయింది.
బాబాని చూస్తూంటే నాకు కళ్ల నీళ్ళు ఆగటం లేదు. ‘
‘బాబా నాకేమో నీ పూజ, భజనలు అంటే ఇష్టం ఆయనకేమో నీ పొడ గిట్టటం లేదు. నీ పూజకి నేను వచ్చిన ప్రతిసారీ మా ఇద్దరి మధ్యన గొడవలు అవుతున్నాయి.
అలాగైతే తనకి ఇష్టం లేనప్పుడు నేను ఎంతని తగాదా పడి రాను. ఆయన మనసు మార్చవా బాబా” అని అనుకున్నాను.
మధ్యాహ్నం ఇంటికివెళ్లాను. మా ఆయనకీ వండి పెట్టి , ఆయనతో ”నేను పూజకి మళ్ళీ వెడుతున్నాను, తలుపు వేసుకుంటావా బయట తాళం వేసి వెళ్ళనా అని అడిగాను.
నా మీద అలిగి ముసుగుదన్ని పడుకున్నాడు, తాళం వేసుకుని పో అన్నాడు, ముసుగు కూడా తీయకుండా, నేను వెళ్ళిపోయాను.
భజన చాలా బాగా జరిగింది, నా ఒళ్ళు పులకించిపోయింది.
సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నేను మా వారితో అక్కడ భజన బాగా జరిగింది, మనింట్లో కూడా పెట్టుకుంటే బావుంటుంది అని ఒకింత భయంగానే అన్నాను.
ఆయన నా మొహం లోకి చూస్తూ సరే అన్నాడు. నాకు ఆశ్చర్యం ఆనందం ఒకేసారి కలిగాయి.
ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా నా దగ్గరికి వచ్చి దక్షిణ అడిగాడు. నేను 2 రూపాయలు ఆయన జోలిలో వేసాను.
నా చెయ్యి మణికట్టు వరకూ ఆయన జోలిలో పడిపోయింది. ఈ కలకు అర్ధమేమో నాకు తెలియలేదు.
అప్పట్లో అలా 24 గంటలు నామం చేయాలంటే కొంతమంది గ్రూప్ లాగా ఉండేవాళ్ళు . లవకుమార్ అనే ఆయన చేసేవారు .
ఆయన దగ్గర చాలా మంది పాడేవాళ్ళున్నారు. ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని నేను ఆయనకీ ఫోన్ చేశాను.
ఇలా మా ఇంట్లో కూడా మీరు నామం చేయాలి అని చెప్పాను. ఆయన మంచిదమ్మా! మీరు ఒక తేదీ ఫిక్స్ చేసి నాకు చెబితే సరిపోతుంది అన్నాడు.
మేము మా పాప పుట్టినరోజు మే 1 వ తారీఖు , ఆ తారీకైతే బాగుంటుందనిపించి మేము ఆయనకి ఆ తేదీ చెప్పాము.
మా ఇంట్లో నామం మొదటిసారి జరుగుతుందనే సంబరంతో అందర్నీ పిలిపించుకుని, అందరికి జాకెట్టు బట్టలు పెడదామనిపించి అవి తేవటానికి కోఠీ వెళ్ళాలని మావార్ని ఆఫీస్ నుండి అటు వచ్చేయమని, నేను మా అబ్బాయిని తీసుకుని ఇక్కడినుండి బస్సులో వెళ్ళాము.
పూజకి సంబంధించిన సామానంతా కోఠిలో కొనుక్కున్నాము. అల్లం వెల్లుల్లి కావాలని మలక్ పేట గంజ్ లో ఆగాము.
మా వారి భుజాన ఉండవలసిన ఆఫీస్ బ్యాగ్ ఆయన భుజాన లేదు. అందులో ఆయన జీవితమే ఉంది. ఆఫీసుకి సంభందించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నీ అందులో ఉన్నాయి.
అంతే ఆయనకి కళ్ళు తిరిగినంత పని అయింది. అప్పుడు అప్పుడనుకున్నాడాయన ”బాబా నా బ్యాగ్ దొరికింది అంటే నువ్వు ఉన్నావని నేను నమ్ముతాను” అని.
మేము తిరిగి నేరుగా కోఠిలో ఒక షాప్ లో మా వారు తరచూ తమలపాకులు కొంటుంటారు, ఎందుకంటే మా వారూ, మా అత్తగారు ఇద్దరూ రోజు తమలపాకులు వేసుకుంటారు.
అందుకని రోజూ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తప్పని సరిగా ఆకులు కొనుక్కువస్తారు.
ఆ షాప్ అతను బాగా పరిచయస్తుడే అయినా కోఠీ అంటే చాలా బిజీ సెంటర్ అక్కడ ఏ వస్తువు పోయినా దొరుకుతుందనే ఆశ లేదు.
పైగా అక్కడ నుండి వచ్చేసి దాదాపు గంట పైన అయిపోయింది. మేము తిరిగి ఆ షాప్ దగ్గరికి వెళ్ళాము.
మేము వెళ్లేసరికి ఆ బ్యాగ్ అక్కడే ఉంది. చాలా ఏళ్ల నుండి ఆకులు కొంటుంటారు కాబట్టి ఆ షాప్ అతను ఈయన్ని బాగానే గుర్తుపడతారు.
”ఏం సారూ ! మల్ల వచ్చినవ్” అన్నాడు. బ్యాగ్ ఇక్కడ పెట్టి మర్చిపోయాను అని అన్నారు ఈయన.
”గట్లన సారూ! ఇంతసేపటి సంది నేనా బ్యాగ్ ని చూడనే లేదు కస్టమర్లు వస్తున్రు, పోతున్రు నేనైతే చూడనే లేదు, ఇక్కడ కాగితం పడితేనే దొరకదు, గాంట్లాంటిది గంటసేపటి సంది నీ బ్యాగ్ మంచిగానే దొరికింది” అన్నాడు.
మా వారు అప్పటి నుంచి బాబాను నమ్ముతున్నారు. మా ఇంట్లో నామం జరిగితే ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన నామంలో కూర్చొనే కూర్చోడు.
ఆయనకి బాబా మీద నమ్మకం కలిగించి నామం లో మంచిగా కూర్చోబెట్టాడు బాబా.
మా వారే కూర్చొని నామం చెప్పారు. అప్పటినుండి బాబా నామం ఎక్కడ జరిగినా ఇద్దరమూ కలిసే వెడుతుంటాం.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా వారు మాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు …..!
- కడుపులో బాధ అనే మిషతో నన్ను తన దగ్గరికి చేర్చుకున్న బాబా వారు!
- బాబా వారి సత్సంగ మహిమ ద్వారా “చైనా ప్రభుత్వము వారు మా మరిదిని విడుదల చేయట.”—-Audio
- పిలిచి అవకాశం ఇవ్వటం బాబా కృప కాకా మరేమిటి–Audio
- బాబా నామస్మరణ ఎన్నో ఆపదల నుండి కాపాడే రక్షక కవచం …!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments