Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Sreenivas Murthy Muppalla
హరిభక్తపరాయణ
శ్రీదాసగణూకృత
శ్రీ సాయినాథ స్తవనమంజరి
1. శ్రీగణేశాయనమః ఓ సర్వాధారా! మయూరేశ్వరా! సర్వసాక్షీ గౌరీకుమారా! ఓ ఆచింత్యా! లంబోదరా! శ్రీ గణపతీ పాహిమాం.
2. నీవు సకల గణాలకు అది ఈశ్వరుడవు. అందుకే నిన్ను గణేశుడని అంటారు. సకల శాస్త్రాలు నిన్ను అంగీకరిస్తున్నాయి. మంగళరూపా! ఫాలచంద్రా!
3. శారదా! వాగ్విలాసినీ! నీవు పదాలను సృష్టించిన వాగీశ్వరివి. నీ అస్తిత్వం వలననే జగత్తులోని వ్యవహారాలు నడుస్తున్నాయి.
4. నీవు గ్రంథకర్తల దేవతవు. నీవు దేశానికి ఎల్లప్పుడూ భూషణానివి. అన్నిటియందూ నీ శక్తి అగాధం జగదంబా! నీకు నమస్కారం.
5. ఓ పూర్ణబ్రహ్మ! సాధుసజ్జనప్రియా! ఓ సగుణరూపా! పండరీనాథా! కృపాసాగరా, పరమదయామయా! పాండురంగా! నరహరి!
6. నీవు అందరినీ నడిపించే సూత్రధారివి. నీవు జగమంతటా వ్యాపించిఉన్నావు. సకలశాస్త్రాలు నీ స్వరూపాన్ని పరిశోధిస్తున్నాయి.
7. ఓ చక్రపాణీ! నీవు పుస్తకజ్ఞానులకు అంతుపట్టవు. ఆ మూర్ఖులందరూ వాద వివాదాలు చేసేవారు.
8. సాధువులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. మిగతావారు మౌనంగా ఉంటారు. నీకు సాదరంగా నా సాష్టాంగనమస్కారం.
9. ఓ పంచవక్త్రా శంకరా! క పాలమాలాధారీ! ఓ నీలకంఠా! దిగంబరా! ఓంకారరూపా! పశుపతీ!
10. నీ నామాన్ని స్మరించిన వారి దైన్యం వెంటనే తొలగిపోతుంది. ధూర్జటీ! నీ నామం యొక్క మహిమ ఇటువంటింది.
11. నీ చరణాలకు వందనం చేసి నేను ఈ స్తోత్రాన్ని రచిస్తాను. నీలకంఠా! దీనిని సంపూర్ణం చేసేలా సహకరించు!
12. ఇప్పుడు అత్రిసుతునకు, ఆదినారాయణునికి తుకారామాది సత్పురుషులకు మరియు భక్తులందరికి నమస్కారం
13. జయ జయ సాయినాథా, పతిత పావనా! పరమాదయాళూ! మీ చరణాలయందు శిరస్సు నుంచుతున్నాను. అభయాన్ని అనుగ్రహించండి.
14. మీరు సుఖానికి నిలయమైన పూర్ణ బ్రహ్మ పురుషోత్తముడైన విష్టుమూర్తి మీరే. ఆర్థనారీశ్వరుడు మదనాంతకుడు కూడ మీరే.
15. మానవశరీరాన్ని ధరించిన పరమేశ్వరులు. మీరు జ్ఞానాకాశంలోని భాస్కరులు, దయాసాగరులు, మీరు భవరోగానికి ఔషధం.
16. మీరు హీనులకు, దీనులకు చింతామణి, భక్తులకు పవిత్రగంగాజలం. మీరు ప్రపంచములో మునిగిపోయే వారిని తరింపచేసే నౌక. భయభీతులకు ఆశ్రయం.
17. మీరు జగత్తుకు అది కారణం. దయాఘనా! నిర్మలచైతన్యమైన ఈ సృస్టి విలాసమంతా మీదే.
18. మీరు జన్మరహితులు, మీకు మృత్యువు లేదు. బాగా పరిశోధిస్తే చివరకు ఇదే అవగతమౌతుంది.
19. జననమరణాలు రెండూ అజ్ఞానం వలన కలుగుతాయి. మహారాజా! మీరు రెంటికీ అలీప్తంగా ఉంటారు.
20. నీరు ఒక చోట ఊటలా ప్రకటమైంది. అయితే అది అక్కడే పుట్టి పైకి వచ్చిందా? అది ఆదినుండి అక్కడ పూర్ణంగా నిండిఉండి లోపలి నుండి వచ్చింది. అంతే.
21. ఒక లోతు గుంతలో నీరు ఊరితే దానికి బావి అని పేరు కలుగుతుంది. నీరు లేకపోతె అది ఒక గుంత మాత్రమే.
22 . నీరు గుంతలో ఊరటం, లేదా ఎండిపోవడం ఇది నీటికి అసలు పట్టదు. నీరు గుంతకు అసలు ఏ విలువా ఇవ్వదు.
23. అయినా నీరు నిండుగా ఉన్నప్పుడు గుంతకు మాత్రం గర్వం. అందువలన నీరు బాగా ఇంకిపోగానే దైన్యావస్థను పొందుతుంది.
24. ఈ మానవశరీరం నిజంగా గుంతవంటిది. ఇందులోని శుద్ధచైతన్యం నిర్మలమైన నీరు. గుంతలు అసంఖ్యాంగా ఉన్నా నీరు అన్నింటిలో ఒక్కటే.
25. దయామయా! జననమరణాలకు అతీతమైన మీరు, అజ్ఞానమనే పర్వతాన్ని చేధించడానికి వజ్రాయుధం కావాలి.
26. భూమిపై నేటి వరకు అనేక గుండాలు వెలిశాయి. ఇప్పుడు ఉన్నాయి. ఇక ముందు ఉంటాయి.
27. ఆయా ప్రత్యేక గుండానికి విశేషమైన నామరూపాలుంటాయి. వాని ద్వారానే గుర్తించగలం.
28. అయితే చైతన్యాన్ని నీవు నేను అని అనటం ఉచితం కాదు. ఎందుకంటే చైతన్యంలో ద్వైతం లేదు కనుక.
29. పైగా చైతన్యం జగమంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటప్పుడు నీవు నేను అను భావన అక్కడ ఎలా సంభవం?
30. మేఘాలలోని నీరు అంతటా ఒకేలా ఉంటుంది. భూమి పై పడగానే ఆ నీటికి అనేక భేదాలు కలుగుతాయి.
31. గోదావరిలో పడిన నీటిని గోదావరి అని అంటారు. బావిలో పడిన నీటికి నదీ జలానికి ఉన్న పవిత్రత లేదు.
32. గోదావరి సత్పురుషులవలె పవిత్రం. మీరు అందులోని నీరు. మేము అక్కడక్కడా ఉన్న వాపీ, కూప, తటాకాలము అదే మీకు మాకు భేదం.
33. మీరు ప్రవిత్రులు మేము కృతార్థులవటానికి చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ మీ వద్దకు శరణాగతులై రావాలి.
34. గోదావరి జలానికి పాత్రతను బట్టి పవిత్రత వచ్చింది. నీరు వేరే ఎక్కడైన ఒక్కటే.
35. గోదావరి జలాలు ప్రవహించే ఆ భూస్థలం పవిత్రమని అక్కడి భూమి యొక్క గుణాలను బట్టి ఇది నిర్ణయించబడింది.
36. మేఘగర్భంలోని నీటిని ఏ ప్రదేశం ఏ మార్పు చేయదో అదే భూభాగాన్ని గోదావరి అని శాస్త్రవేత్తలన్నారు.
37. ఇతర ప్రదేశాలలో పడిన నీరు ఆయా స్థలాల గుణాలను గ్రహిస్తాయి. మొదట్లో మధురంగా ఉన్న నీరు, ఆయా ప్రదేశాలలోని ప్రభావం వలన అనారోగ్యంగా, ఉప్పుగా, వగరుగా మారుతుంది.
38. గురువరా మీ పట్ల కూడా అట్లే! కామక్రోధాది అరిషద్ వికారాల మాలిన్యాలు లేని పవిత్ర శరీరానికి సత్పురుషులనే నామం శోభిస్తుంది.
39. అందువలన సత్పురుషులు గోదావరి అని నేను అంటాను. సకల జీవులలోను మీ యోగ్యతే శ్రేష్టమైనది.
40. జగత్తు ఆరంభమైనప్పటి నుండి గోదావరి ఉంది. నీరు కూడా ఏ లోపం లేకుండా ఈనాటి వరకూ పరిపూర్ణంగా ఉన్నది.
41. శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు నదిలో ఉన్న నీరు ఇప్పటివరకూ ఉంటుందా!
42. నీరు ఉన్నస్థలం మాత్రం ఇక్కడ మిగిలివుంది. నీరు సాగరంలో కలిసిపోతుంది. అయినా నీరు ఉన్న స్థలం యొక్క పవిత్రత నేటి వరకూ స్థిరంగా ఉంది.
43. ప్రతి సంవత్సరమూ పాతనీరు పోయి క్రొత్తనీరు వస్తూనే ఉంటుంది. మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది.
44. ఒక శతాబ్దంలోనిదే సంవత్సరము. ఆ శతాబ్దంలోని సత్పురుషులు నీటి ప్రవాహం వంటివారు. సాధువులు ఆ నీటిపైని అలల వంటివారు.
45. ఈ పవిత్ర గోదావరి వద్దకు ప్రథమ శతాబ్దంలో సనత్ సనకనందనాదులు వచ్చారు.
46. తరువాత నారద తుంబుర ధృవ, ప్రహ్లాద బలి మొదలగు రాజులు; శబరీ, అంగదుడు, హనుమంతుడు, విదురుడు, గోపగోపికలు వచ్చారు.
47. ఇలా ఈనాటి వరకూ ప్రతి శతాబ్దంలోనూ పుష్కలంగా వచ్చారు. వారిని వర్ణించడానికి నేను అశక్తుణ్ణి.
48. ప్రస్తుతం ఈ శతాబ్దంలో పవిత్ర గోదావరి సమీపాన సాయినాథులైన మీరు వచ్చారు.
49. అందువలన మీ దివ్యచరణాలకు నేను వందనం చేస్తాను. ప్రభూ! నా దుర్గుణాలను పరిగణించకండని వేడుకుంటున్నాను.
50. నేను హీనుణ్ణీ, దీనుణ్ణీ, అజ్ఞానుణ్ణీ, పాతకశిఖామణిని, ఇలా సకల చెడు లక్షణాలు కలవాణ్ణి, అయినా దేవా! నన్ను ఉపేక్షించకండి.
51. పరుశువేది ఇనుములోని దోషాలను పట్టించుకోదు. గోదావరి ఊరిలోని కాలువలను బహిష్కరించదు.
52. బాబా మీ కృపాకటాక్షాలతో నాలోని సకల కల్మషాలను త్వరగా తొలగించండి. ఇదే ఈ దాసుని విన్నపం.
53. పరశువేది సాంగత్యంలో ఇనుము బంగారం కాకపోతే ఆ లోపం పరశువేదిదీ.
54. మీరు పరశువేది, నేను ఇనుమును. నాలో పరివర్తన రాకపోతే ఆ లోపం మీ పైన ఆపాదించ బడకూడదు. మీకు అప్రతిష్ట రాకూడదు. కనుక నన్ను పాపిగా ఉంచకండి.
55. పిల్లలు ఎల్లప్పుడూ తప్పులు చేస్తూంటారు. కానీ తల్లి కోపగించుకోదు. దీనిని దృష్టిలో ఉంచుకొని బాబా నన్ను అనుగ్రహించండి.
56. ఓ సద్గురు సాయినాథా! మీరే మా కల్పతరువు. భవసాగరాన్ని తరింపచేసే నౌక నిశ్చయంగా మీరే.
57. మీరు కామధేనువు. చింతామణి. మీరు జ్ఞానకాశంలోని భాస్కరులు. సద్గుణాలగాని. స్వర్గానికి సోపానం.
58. ఓ పరమపావన పుణ్యమూర్తీ! శాంతస్వరూపా! ఆనందఘనా! ఓ చిత్స్వరూపా! పరిపూర్ణా! ఓ భేదరహితా! జ్ఞానసింధూ!
59. ఓ విజ్ఞానమూర్తీ! పురుషోత్తమా! క్షమాశాంతులకు నిలయమా! ఓ భక్తజనుల విశ్రామధామమా! నన్ను అనుగ్రహించండి.
60. మీరు సద్గురు మచ్చిందరు. మీరే మహాత్ములైన జలంధర్, మీరే నివృత్తినాథ్ జ్ఞానేశ్వరులు, కబీరు, షేక్ మహమ్మద్, ఏకనాథులు మీరే
61. మీరే బోధ్ లా, సావతమాలి, సమర్థ రామదాసూ మీరే! సాయినాథా! మీరే తుకారం. మీరే సఖారం, మీరే మాణిక్యప్రభు.
62. ఈ మీ అవతారాల లక్ష్యం అనూహ్యం. మీరు మీ జాతిని గూర్చి ఎవరికీ తెలియపరచలేదు.
63. మీరు బ్రాహ్మణులని కొందరు యవనులని కొందరు అంటారు. మీరు శ్రికృష్టునివలె లీలలను ప్రదర్శించారు.
64. శ్రీకృష్ణుని ప్రజలు పలురకాలుగా అన్నారు. కొందరు యదుకుల భూషణుడని అన్నారు. కొందరు పశువులకాపరి అని అన్నారు.
65. సుకుమార బాలుడని యశోద అన్నది. మహాకాలుడని కంసుడన్నాడు. ప్రేమమయుడని ఉద్దవుడంటే, ఙ్ఞానశ్రేష్ఠుడని అర్జునుడన్నాడు.
66. ఆ విధంగా గురుదేవా! ప్రజలు మిమ్మల్ని వారి వారి మనసులకు తోచినట్లు భావిస్తారు.
67. మీ నివాసస్థానం మశీదు. మీ చెవులు కుట్టి ఉండేవి. మీరు పాటించిన మహ్మదీయుల నైవేద్య పద్దతులను చూచి ప్రజలు మిమ్మల్ని ముసల్మాను అని తలచారు.
68. కానీ దయాఘనా! మీ అగ్ని ఆరాధనను గని మీరు హిందువని మా మనసులకు నిశ్చయమైంది.
69. ఈ వ్యావహారిక భేదాలలో తార్కికులు తర్జన భర్జనలు చేస్తారు. కాని జిజ్ఞాసులు భక్తులు వీటిని పట్టించుకోరు.
70. మీది పరబ్రహ్మస్థితి, జాతిమతాలు మీకు వర్తించవు. మీరు అందరికీ గురుమూర్తి. మీరు ఆది కారణులు.
71. హిందూ ముసల్మానులలో వైరభావం ఉన్నది. వారిలో ఐక్యతను కలిగించటానికి, భక్తులకు మీ లీలలను చూపించటానికి మీరు మశీదులో అగ్ని ఆరాధనను చేపట్టారు.
72. మీరు జాతిమతాలకు అతీతమైన సాక్షాత్తు సద్ వస్తువు. పరబ్రహ్మ. అందువలన మీరు తర్కానికి అంతుచిక్కరు.
73. తర్కవితర్కాల గుర్రపుస్వారీ మీ వద్ద నిలువజాలదు. అటువంటప్పుడు నా మాటలు నిలువగలవా?
74. అయినా మిమ్మల్ని చూచి నేను మౌనంగా ఉండలేను. కారణం వ్యవహారంలో స్తుతించటానికి సాహిత్యంలోని మాటలే సాధనాలు.
75. అందువలన మీ అనుగ్రహంతో సాధ్యమైనంతవరకూ ఎల్లప్పుడూ వర్ణిస్తుంటాను.
76. సత్పురుషుల ఘనత గొప్పది. దేవతల కంటే కూడా అధికం. ఎందుకంటే సత్పురుషుల వద్ద ‘నా’, ‘నీ’ అన్న భేద భావాలుండవు.
77. హిరణ్యకశివుడు, రావణుడు దేవుని ద్వేషించుటవలన వధింపబడ్డారు. అలా సత్పురుషుల చేతిలో వధించబడిన వారు ఒక్కరైనా లేరు.
78. గోపీచందు జలంధరుని పెంటకుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాత్మునికి దుఃఖం కలగలేదు.
79. సరికదా, పై పెచ్చు, ఆ రాజును ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు. ఇటువంటి సత్పురుషుల మహిమలను ఎంతని వర్ణించగలను?
80. సత్పురుషులు సూర్యనారాయణుని వంటివారు. వారి కృప జ్ఞానప్రకాశం. వారు చల్లటి సుఖాన్నిచ్చే చంద్రుని వంటివారు. వారి కరుణ వెన్నెల వెలుగు.
81. సత్పురుషులు కస్తూరి వంటివారు. వారి కృప పరిమళం వంటిది. సత్పురుషులు చెఱకు రసం వంటివారు. వారి కృప మధురం.
82. సత్పురుషులు దుష్టులపట్ల, శిష్టులపట్ల సమాన దృష్టిని కలిగి ఉంటారు. అంతే కాదు, పాపులపట్ల వారికీ ప్రీతి ఎక్కవ.
83. గోదావరి జలంలో శుభ్రపరచటానికి మలిన వస్త్రాలే వస్తాయి, శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి.
84. పెట్టెలోని బట్టలు కూడా ఒకప్పుడు శుభ్రపరచటానికి గోదావరికి వచ్చినవే.
85. ఇక్కడ ఆ పెట్టె వైకుంఠం. మీరు గోదావరి. శ్రద్ధ స్నానఘట్టం, జీవాత్మలే వస్త్రాలు. వాని మాలిన్యం షడ్ వికారాలు.
86. మీ పాద దర్శనమే గోదావరి స్నానం. మీరు మా సకల మాలిన్యాలను తొలగించి నిర్మలంగా చేయగల సమర్థులు.
87. మేము ఈ ప్రపంచంలో మాటిమాటికి మలినులమై పోతున్నాం. అందువలన సత్పురుషుల సందర్శనం అవసరం.
88. గోదావరిలో నీరు పుష్కలంగా ఉండి, ఆ నీటిలో శుభ్రపరచటానికి తెచ్చిన మాలిన వస్త్రాలు, శుభ్రం కాకుండా అక్కడి స్నానఘట్టాలపై ఉండిపోతే అది గోదావరికి అప్రతిష్ఠ కదా!
89. మీరు చల్లటి నీడనిచ్చే వృక్షం. మేము తాపత్రయాలనే తీవ్ర ఎండబాధకు మాడిపోతున్న బాటసారులం.
90. ఓ గురువర్యా! కరుణామయా! మమ్ము ఈ తాపత్రయాల నుండి రక్షించండి. చల్లటి నీడ వంటి మీ కృప లోకోత్తరమైనది.
91. నీడకోసం ఒక వృక్షం క్రింద కూర్చున్నప్పుడు పై నుండి ఎండ వేడి తగులుతుంటే ఆ వృక్షాన్ని నీడను ఇచ్చే చెట్టు అని ఎవరు అంటారు!
92. మీ కృప లేకుండా ఈ ప్రపంచంలో బాగుపడటం జరగదు. ధర్మస్థాపన కొరకు అర్జునునికి శ్రీకృష్ణుడు సఖునిగా లభించాడు.
93. సుగ్రీవుని కృపతో విభీషణునికి శ్రీరామప్రభువు లభించాడు. సత్పురుషుల వలననే భగవంతునికి ఘనత.
94. వేదశాస్త్రాలు వర్ణించలేని నిరాకారనిర్గుణ పరబ్రహ్మను సగుణసాకార రూపంలో భూమిపైకి అవతరింపచేసినది సత్పురుషులే
95. రుక్మిణీ వల్లభుడైన వైకుంఠపతియగు శ్రికృష్టుని దామాజి మాలవానిగా చేశాడు. చోఖాబా జగన్నాధునితో పశువుల శవాలను మోయించాడు.
96. సత్పురుషుల మహిమలను ఎరిగి శ్రీహరి సక్కుబాయి ఇంట నీళ్ళు మోసాడు. నిజంగా సత్పురుషులు సచ్చిదానంద పరమాత్మను శాసించగలరు.
97. ఇంకా అధికంగా చెప్పవలసిన అవసరం లేదు. ఓ సద్గురు సాయినాథా! శిరిడీ గ్రామ నివాసీ ! మీరే మా తల్లి తండ్రి.
98. బాబా! మీ లీలలు నిజంగా ఎవరికీ అంతుపట్టవు. అటువంటప్పుడు పామరుణైన నా వాక్కుకు మీ లీలలను వర్ణించ సాధ్యమా?
99. జడుల వంటి జీవులను ఉద్దరించటానికి మీరు శిరిడీ వచ్చారు. ప్రమిదలలో నీరు పోసి దీపాలను వెలిగించారు.
100. మూరెడు వెడల్పుగల చెక్కపలకను మంచంలా, పైన చూరుకు వ్రేలాడగట్టి, దానిపై శయనించి భక్తులకు మీ యోగ శక్తి సామర్ధ్యాన్ని తెలియజేశారు.
101. మీరు అనేకులకు సంతానాన్ని అనుగ్రహించారు. విభూతిని ప్రసాదించి అనేకుల రోగాలను పోగొట్టారు.
102. ఐహిక కష్టాలను తొలగించటం మీకు అశక్యం కాదు. గజరాజుకు చీమ బరువా?
103. గురుదేవా! దీనులను కరుణించండి. మీ చరణాలకు శరణు జొచ్చిన నన్ను వెనుకకు నెట్టివేయకండి.
104. మీరు మహారాజులకు మహారాజు. కుబేరులకు కుబేరులు, వైద్యులకు వైద్యులు. నిశ్చయంగా మీ కంటే శ్రేష్టులెవరూ లేరు.
105. ఇతర దేవతల పూజలకు విశేషమైన పూజాసామాగ్రి, ప్రత్యేక పూజా విధానం అవసరం. కాని మీ పూజకు జగత్తులో విశిష్టమైన వస్తువేదీ లేదు.
106. సూర్యుని ఇంటిలో దీపావళి పండుగ వచ్చినట్లైతే, ఏ ద్రవ్యాలతో ఈ పండుగను జరుపుకుంటారు?
107. సాగరం యొక్క దప్పికను తీర్చటానికి ఈ భూమిపై నీరు లేదు. అగ్నిని రగల్చటానికి నిప్పు ఎక్కడి నుండి తేవాలి?
108. గురుదేవా శ్రీ సాయి సమర్థా! పూజ చేసే వస్తువులన్నీ ఆది నుండి మీ ఆత్మ యొక్కఅంశాలు,
109. ఈ మాటలన్నీ తత్వదృష్టితో ఊరికే చెప్పటమేగాని పరమాత్మ తత్త్వం ఇంకా పట్టుపడలేదు. అందువల్ల అనుభవ జ్ఞానం లేకుండా చెప్పేమాటలు నిరర్థకం
110. మీ పూజను వ్యావహారికంగా చేయటానికైనా నాకు సామర్థ్యం లేదు.
111. అందువలన గురుదేవా! అనేక కల్పనలతో మీ పూజ చేస్తాను. దయామయా! ఈ దాసుని యొక్క పూజను స్వీకరించండి.
112. ఇక ప్రేమాశ్రువులతో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. సద్బక్తియనే చందనాన్ని రాస్తాను.
113. శబ్దాలంకారాల కఫనీని సమర్పిస్తాను. ప్రేమ భావాల సుమమాలను మీ కంఠానికి అలంకరిస్తాను.
114. నా దుర్గుణాలను ధూపంగా దహింపచేస్తాను. అవి చెడు ద్రవ్యాలే అయినా వాని నుండి చెడు వాసనలు రావటం లేదు.
115. ధూప ద్రవ్యాలను, సద్గురువు వద్ద కాక ఇతరత్రా ఎక్కడ కాల్చినా ఆ ధూపద్రవ్యల నుండి వెలువడే వాసనలు అలాగే ఉంటాయి.
116. ధూప ద్రవ్యాలు అగ్నిని తాకగానే తక్షణం వాని సువాసనలు వెలువడతాయి.
117. మీ వద్ద వ్యతిరేకంగా జరుగుతుంది. మాలిన్యాలు అగ్నిలో కాలిపోయి సద్గుణాల పరిమళం, ప్రపంచానికి తెలిసేలా మిగిలి ఉంటుంది.
118. గంగా జలంలోని మురికి పోగానే నీరు నిర్మలమవటం సహజం. మనసులోని మాలిన్యంపోయి మనసు నిర్మలమౌతుంది.
119. గురుదేవా! నేను మాయామోహాలనే దీపాలను వెలిగిస్తాను. దాని వలన వైరాగ్య ప్రభలను లాభంగా పొందేలా అనుగ్రహించండి.
120. మీరు ఆసీనులవటానికి శుద్ధమైన శ్రద్ధ అనే సింహాసనాన్ని అర్పిస్తాను. దానిపై విరాజమానులై భక్తి నైవేద్యాన్ని స్వీకరించండి.
121. ఆ భక్తి నైవేద్యాన్ని మీరు సేవించి భక్తి రసాన్ని నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను మీ బిడ్డను కనుక మీ బోధామృతరసాన్ని పానం చేసే అధికారం నాకు ఉన్నది.
122. నా మనసును మీకు దక్షిణగా సమర్పించుకుంటున్నాను. దానివల్ల నాకు ఎటువంటి కర్తృత్వభావం ఉండదు.
123. ఇక ప్రార్థనా పూర్వకంగా సాష్టాంగదండ ప్రణామాలను చేస్తాను స్వీకరించండి. పుణ్యశ్లోకా సాయినాధా.
.
ప్రార్ధనాష్ఠకం
124. (1) శాంతచిత్తా! మహాప్రజ్ఞా! సాయినాథా! దయాఘనా! దయసింధో! సత్ స్వరూపా మాయాంధకారాన్ని నాశనం చేసేవాడా
125 (2) జాతి మత గో త్రాతీతా! సిద్దా! అచింత్యా! కరుణాలయా! పాహిమాం పాహిమాం సాయినాథా! శిరిడీగ్రామ నివాసీ!
126 (3) శ్రీ జ్ఞానా భాస్కరా! జ్ఞానదాతా! సర్వమంగళకారకా! భక్త చిత్త మరాళా! శరణాగత రక్షకా!
127 (4) మీరు సృష్ఠికర్త బ్రహ్మ, మీరు పాలనకర్త విష్ణుమూర్తి, త్రిలోకాలను లయంచేసే మహేశ్వరులు మీరే.
128 (5) ఈ పృధ్వీతల మందు మీరులేని చోటంటూ ఉందా? సాయినాథా! మీరు సర్వజ్ఞులు, సర్వహృదయాలలోనూ ఉన్నారు.
129 (6 ) మా సర్వాపరాధాలను క్షమించండి.
130. (7 ) మీరు ఆవు, నేను లేగదూడను, మీరు చంద్రుడు. నేను చంద్రకాంతమణిని గంగానదీరూపమైన మీ పాదాలకు ఈ దాసుడు సాదరంగా నమస్కరిస్తున్నాడు.
131. (8 ). నా శిరస్సుపై మీ కృపాహస్తాన్ని ఉంచండి. మీ దాసుడైన ఈ గణుని చింతను దుఃఖాలను నివారించండి.
132. ఈ ప్రార్ధనాష్టకంతో మీకు సాష్టాంగనమస్కారం చేస్తున్నాను. మా పాపతాప దైన్యాలను త్వరగా నివారించండి.
133. మీరు ఆవు నేను దూడను మీరు మా తల్లి. నేను మీ బిడ్డను నా విషయంలో మీ మనసున కాఠిన్యతను వహించకండి.
134. మీరు మలయగిరి చందనం. నేను ముళ్లపొదను. మీరు పవిత్ర గోదావరి నీరు, నేను మహాపాతకుణ్ణి.
135. మీ దర్శనమయ్యాక కూడా నా మనో మాలిన్యాలు తొలగిపోక ఇంకా ఉంటె మిమ్మల్ని చందనమని ఎవరంటారు?
136. కస్తూరి సాంగత్యంలో మట్టికి విలువ వస్తుంది. పూవుల సహవాసంతో ఉన్న ధారం శిరస్సుపై ఉంటుంది.
137. అదే విధంగా మహాత్ములు చేపట్టిన వస్తువులు విశిష్టతను సంతరించుకుంటాయి.
138. పరమేశ్వరుడు తన కోసం విభూతిని, మృగచర్మాన్ని, నందిని స్వీకరించాడు. ఆకారణంగానే వాటికి అంతటా గౌరవం లభిస్తుంది.
139. శ్రీ కృష్టుడు గోపాలురను రంజింపచేయటానికి, బృందావనంలో యమునా తీరాన ఉట్లుకొట్టే ఆటలాడాడు. దానిని కూడా బుధులు గౌరవించారు.
140. నేను దురాచారిని, అయినా మీ శరణు జొచ్చాను. అందువలన ఓ గురుదేవా! నా గురించి ఆలోచించండి.
141. ఐహిక లేక పారమార్థిక వస్తువులు ఏవేవి నా మనసుకు సుఖమనిపిస్తాయో వానిని ప్రసాదించండి గురుదేవా!
142. నా మనసును నిగ్రహించుకునేలా మీరు అనుగ్రహించండి. సముద్రపు నీరు తీయగా మారితే ఆ ఉప్పునీటికి భీతి చెంద నవసరం లేదు కదా!
143. సాగరాన్ని మధురంగా మార్చగల సామర్థ్యం మీ కున్నది. అందువలన దాసగణుని ఈ కోరికను మన్నించండి.
144. నాలో ఉన్న లోపాలన్నీ మీవే. మీరు సిద్దులకు రాజు మీకు లోపాలు తగవు.
145. ఇంకా అధికంగా ఏం మాట్లాడను. మీరే మాకు ఆధారం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డకు నిర్భయం సహజం కదా!
146. ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తిగా పఠిస్తారో వారి కోరికలను మీరే తీర్చాలి. మహాప్రభూ!
147. ఈ స్తోత్రానికి మీ ఆశీర్వచనం ఎల్లప్పుడూ ఉండాలి. ఒక సంవత్సరంలో పాఠకుల త్రితాపాలు తొలగిపోవాలి.
148. శుచిర్చూతులై తమ మనసులలో శుద్ధమైన భక్తిభావంతో నిత్యం ఈ స్తోత్రాన్ని పఠించాలి.
149. ఇది వీలుపడకపోతే ప్రతి గురువారమైన సద్గురు మూర్తిని మనసున ధ్యానించి పఠించాలి.
150. ఇది కూడా వీలుకాకపోతే ప్రతి ఏకాదశి రోజున ఈ స్తోత్రాన్ని పఠించి, దీని ప్రభావాన్ని గ్రహించండి.
151. భక్తులారా! ఈ స్తోత్రాన్ని పఠించే వారి ఐహికమైన కోరికలను గురుదేవులు వెంటనే తీర్చి, వారికి ఉత్తమ గతిని ప్రసాదిస్తారు.
152. ఈ స్తోత్రపారాయణతో మందబుద్ధులు బుద్ధిమంతులౌతారు, ఆల్ఫాయుష్యులు శతాయుష్యులౌతారు.
153. ఈ స్తోత్రాన్ని పఠిస్తే ధనహీనుల ఇంటికి కుబేరుడు వస్తాడు. ఇది ముమ్మాటికి సత్యం.
154. ఈ స్తోత్రాన్ని పఠిస్తే సంతానహీనులకు సంతానం కల్గుతుంది. మరియు సకల రోగాలు నలుదిశలా పారిపోతాయి.
155. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణ చేయుట వలన చింతలు, భయాలు తొలగి, గౌరవ మర్యాదలు అభివృద్ధి చెందుతాయి! అవినాశియగు పరబ్రహ్మమును తెలుసుకుంటారు.
156. కనుక బుద్ధిమంతులారా! మీ మనసులలో ఈ స్తోత్రమందు విశ్వాసముంచండి.తర్కవితర్కాలనే చెడు ఆలోచనలకు అసలు చోటివ్వకండి.
157. శిరిడీ క్షేత్ర యాత్రను చేయండి. మనసును బాబా పాదాలయందు లగ్నం చేయండి. భక్త కామకల్పద్రుమమైన సాయి అనాథులకు ఆశ్రయం.
158. వారి ప్రేరణ వలననే నేనీ స్తోత్రాన్ని రచించాను. లేకపోతె పామరు పామరుణ్ణెన నాకు ఇటువంటి రచన ఎలా సాధ్యం?
159. శక. సం. 1840 భాద్రపద శుక్లపక్షంలో వినాయక చవితి సోమవారం రోజు (9 -9-1918 ) సూర్యోదయమయాక.
160. మహేశ్వర్ వద్ద, పవిత్ర నర్మదానదీతీరాన శ్రీ అహల్యదేవి సమాధి సన్నిధి వద్ద శ్రీ సాయినాథ స్తవనమంజరి సమాప్తి అయింది.
161. మహేశ్వర క్షేత్రమందు సంపూర్ణమైన ఈ స్తోత్రంలోని ప్రతి పదాన్ని శ్రీ సాయినాథులు నా మనసులో ప్రవేశించి పలికించారు.
162. శిష్యుడు దామోదరుడు వ్రాసిపెట్టాడు, దాసగణుడైన నేను సాధుసత్పురుషులందరికి దాసుడను.
163. స్వస్తి, శ్రీ సాయినాథ స్తవనమంజరి భవసాగర తారకం కావాలి పాండురంగా! దీనినే దాసగణు అత్యాదరంగా విన్నవించుకుంటున్నాడు.
శ్రీ హరి హరార్పణమస్తు. శుభం భవతు. పుండరీక వరదా! హరి విఠల్.
సీతాకాంత స్మరణ జయ జయ రామ. పార్వతీపతే హరహరమహదేవ.
శ్రీ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.
శ్రీ సద్గురు సాయీనాథార్పణమస్తు శుభం భవతు.
Latest Miracles:
- శ్రీ సాయినాథ చాలీసా…Audio
- శ్రీ సాయి దత్తావతారం రెండవ బాగం – శ్రీ గాడ్గే మహరాజ్ ని శ్రీ సాయి అనుగ్రహించుట
- సాయి బాబా వారు ఒక భక్తుని కోరిక ఇంకొక భక్తుని ద్వారా తీర్చుట.–Audio
- వినాయక చవితి నాడు బాబా ఫోటో రూపంలో భక్తురాలి ఇంటికి వచ్చుట…Audio
- శ్రీ సాయిదాసుగారు నంధ్యాలనుండి శ్రీ శైలము ట్రాన్సఫర్ లోని బాబా లీల.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “శ్రీ సాయినాథ స్తవనమంజరి….Audio”
Madhavi
September 9, 2020 at 8:36 pmచాలా బాగా రాసారు.మూర్తి గారు.
సాయి నాధుని కరుణా, కటాక్ష సిద్ధి రాస్తూ..అని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను.