మందులతో నయం కాని భక్తురాలి బాధను, షిరిడీకి రప్పించుకుని నయం చేసినా బాబా వారు….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: Mrs. Jeevani


మేము ఎప్పుడు ‘శిరిడి’ వెళదామనుకున్నా మాకు డబ్బులు ఇబ్బంది అవుతోంది. అలాకాదని ఒక హుండీ ఏర్పాటు చేసి మాకు వచ్చిన 20 రూపాయల నోట్లన్నీ అందులో వేయటం మొదలు పెట్టాం.

ఎప్పుడైనా ‘శిరిడి’ వెళ్ళాలి అనుకోగానే ఆ హుండీ బద్దలు కొట్టి డబ్బులు లెక్క పెట్టుకొని టిక్కెట్లు అందులోంచే కొనుక్కొని, అక్కడయ్యే ఖర్చు కూడా అందులోంచే పెట్టే వారం.

పైగా ఆ డబ్బుతోనే ఎప్పుడూ ‘శిరిడీ’  వెళ్ళని వారిని ఒకళ్ళని మాతో కూడా తీసుకు వెళ్ళే వాళ్ళం.

అలా డబ్బులు “బాబా” కోసం, ‘శిరిడి’ కోసం దాచుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంటుంది.

ఆ డబ్బులు కూడబెట్టడం కోసం ఎక్కడ ఎప్పుడు 20 రూపాయలు వచ్చినా అవన్నీ దాచటం, ఖర్చు పెట్టకుండా ఎలాగైనా చూసుకోవడం ఒక అలవాటుగా మారింది.

మా అబ్బాయి N.C.C.లో చేరాడు. NCC క్యాంప్‌ చిక్కడపల్లి లో ఉంటుంది. డ్రస్‌, షూస్‌ వేసుకుని రోజూ బస్సులో అంత దూరం వెళ్ళేవాడు.

రోజూ నేను 100 రూపాయలు వాడి ఖర్చు కోసం ఇచ్చేవాడిని. ఒకసారి వాడికి, బస్సు ఎక్కాక టికెట్‌ కోసం 100 రూపాయలు కండక్టరు కి ఇస్తే, వీడికి చిల్లరగా ఇరవై రూపాయల నోట్లు నాలుగు ఇచ్చాడు, మిగతా ఎంతో చిల్లర కూడా ఇచ్చాడు.

మావాడు సాయంత్రం అయ్యాక తిరగి వచ్చేటప్పుడు బస్సు ఎక్కితే మళ్ళీ 20 రూపాయలు ఇవ్వాలి, అది ఇచ్చేస్తే ‘బాబా’ను చూడటానికి వెళ్ళడానికి మనం దాస్తున్న డబ్బులు 20 రూపాయలు తగ్గుతాయని,

మరి ఏంచేయాలి అని ఆలోచించి మా వాడు చిక్కడపల్లి నుంచి వనస్థలిపురం వరకూ నడుచుకుంటూ వచ్చేసాడు.

N.C.C. షూస్‌ చాలా బరువుగా వుంటాయి. అలాంటి బరువును కూడా లెక్కా చేయకుండా ‘బాబా’కి డబ్బులు మిగల్బటం కోసం వాడీ పని చేసాడు.

ఇంటికి వచ్చాక మేమీ విషయం తెలుసుకొని బాధ పడ్డాము. కాళ్ళకి కొబ్బరి నూనె రాసింది వాళ్ళ అమ్మ.

ఒక్క ఫోన్‌ చేస్తే ఎవరమో ఒకరం వచ్చి నిన్ను తీసుకు వచ్చేవాళ్ళం కదా, అంత దూరం నుండి అలా నడుచుకుంటూ వచ్చేయటమేనా అంటూ వాళ్ళమ్మ ప్రేమగా కసిరింది.

ఒకసారి మా ఆవిడకి కాళ్ళు మంటలు, పగుళ్ళుగా మొదలయ్యి అసలు అడుగు కింద పెట్టలేని స్థితి వచ్చింది, అంటే కాలు కింద పెడితే రక్తమయంగా వుండేది.

భయంకరమయిన బాధ. చెప్పులు వేసుకున్నాకుదరదు, నడవలేదు, స్కూలికి వెళ్ళటానికి మరీ ఇబ్బందిగా వుండేది.

మానేద్దామనుకుంటే స్కూల్లో ప్రిన్సిపాల్‌ “మీరు మానద్దు మేడం. మీ క్లాసులు మేడ పైన ఉన్నవి కాకుండా, కిందనున్న క్లాసులు తీసుకుందురుగాని, లేదంటే ఆ టైం కి మీ క్లాసులు కిందకి మార్చించుదాము”అని

“మీరు బస్సుల్లోనూ, అటోలోనూ వచ్చి ఇబ్బంది పడద్దు, నేను కార్లో వచ్చేటప్పుడు మీ ఇంటిమీదుగా వచ్చి మిమ్మల్ని పిక్‌ అప్‌ చేస్కొని వస్తాను” అని,

రోజూ వచ్చి మా ఆవిడని టీచరు గా వదులుకోకూడదని, తను బాగా క్లాసులు తీసుకుంటుందని, ఆయన తీసుకెళ్ళేవాడు.

అందుకని ఎన్ని సంవత్సరాలయినా కూడా స్కూలు మార్పు అంటూ అవలేదు.

ఎంతోమంది డాక్టర్స్‌ చూసారు, రకరకాల మందులు రాస్తూన్నారు, వాడుతూనే ఉంది. కానీ ఏ మాత్రం గుణం కనపడలేదు.

డబ్బు ఖర్చు అయిపోతోంది, మనశ్శాంతి పోతోంది. 30,000 రూపాయలు దాకా ఖర్చు అయిపొయింది.

డాక్టర్స్‌ మారుతూనే ఉన్నారు. ఆ పరంపరలోనే ఓ డాక్టర్‌ దగ్గరకి వెళ్ళాము.

ఆ డాక్టర్‌ మా ఆవిడని పరిశీలించి, పరీక్షించి మందులు రాసిచ్చాడు. ఆ మందులు కొనడానికి ఇంక మా దగ్గర డబ్బులు లేవు.

తెల్లారాక మందులు కొనటం కోసం అప్పుకి బయలు దేరాలి అని అనుకొని ఆ రాత్రి పడుకున్నాను.

నిద్రలో నాకో కల వచ్చింది. ఆ కలలో “ఒక అడవి లొ ఒక ముసలాయన ఒక చోట మందులు ఇస్తూన్నాడు. ఆ మందులు నేను తీసుకోవటానికి వెళ్లాను.

ఆమెని తీసుకురా మందులు ఇస్తాను అన్నాడాముసలాయన. బురదగా వుంది ఇదంతా కష్టం తను నడవలేదు అన్నాను లేదు తీసుకురా అన్నాడాయన,

నేను వెళ్లి మా ఆవిడతో తీసుకు వెడతాను వస్తావా అని అడిగాను. లేదు  నేను నడవలేను అంతా బురదగా వుంది అంది మా ఆవిడ.

నేను తనను చేతులతో పైకి ఎత్తుకుని కొంత దూరం నడిచాక నేను నిన్ను ఇలా ఎత్తుకొని నడవలేక పోతున్నాను. నువ్వు నాతొ వస్తేరా లేక పొతే లేదు అంటూ దింపేసాను.

మా పిల్లలు చేరోపక్క పట్టుకుని మా ఆవిడని నడిపించుకుంటూ ఆ బురదలోనే ఆయన దగ్గరకి తీసుకుని వెళ్ళారు,

ఆయన మందులు ఇచ్చారు. ఇదీ కల. తెల్లవారురూమున 4 గంటల సమయం, తెల్లారాక మాఆవిడికి ఈ కల చెప్పాను. ఏమిటో ఈ కల అనుకున్నాము.

ఆ తరువాత ఆవిడ స్కూల్‌ కి వెళ్లి పోయింది. నేను మందులు కొనడం కోసం, డబ్బులు ఎవరినైనా అడుగుదామని బయలుదేరాను.

చింతలకుంట ( 4 km) దాకా వెళ్లాను. కొత్తపేట (8 km) వెళ్ళాలి. నా కెందుకో కల జ్ఞాపకం వచ్చింది,  ‘శిరిడీ’ కి వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చింది.

అంతే వెంటనే బండి వెనక్కి తిప్పేసి ఇంటికి వచ్చేసాను. బాబా డబ్బులు వేసే హుండీ, బద్దలు కొట్టాను, లెక్కపెట్టాను, టికట్లు కొనుక్కుని వచ్చాను.

ఇంటికి వచ్చి మా పిల్లల బట్టలు, మా ఆవిడ బట్టలు, నా బట్టలు సర్ది స్కూల్‌ కి వెళ్లి మా ఆవిడకి “మనం ‘శిరిడీకి వెళ్తున్నాము” అని అన్నాను.

“శిరిడీ కా ఇప్పటికి ఇప్పుడు శిరిడీ ఏంటి? డబ్బులు? టికట్లు?” అంది, డబ్బులు చూసాను, టికట్లు కొనేసాను, నిన్నుఇంటికి తీసుకు వెళ్ళటానికి వచ్చాను.

ఇంట్లో బట్టలు కూడా సర్ది పెట్టేసాను అన్నాను. అయినా నా కాళ్ళు ఇలా ఉన్నాయి, ఎలా వెడతాము అని అంది.

ఏమో ఎందుకో నాకలా వెళ్లాలని అనిపిస్తోంది, అందుకే టికట్లు బుక్‌ చేసాను అన్నాను. ఆవిడ పర్మిషన్‌ తీసుకొని, సెలవుపెట్టి స్కూల్‌ నుండి వచ్చేసింది. పిల్లలు వచ్చేశారు.

అందరం బయలుదేరాము, దిల్ షుక్ నగర్ దాకా వచ్చాక బస్‌ లో. ఒకామెకి బాగా కడుపునెప్పి వచ్చింది, మెలికలు తిరిగి పోతోంది.

నేనే ఆమెని హాస్పటల్‌ కి తీసుకువెళ్ళి చూపిద్దాము అన్నాను. బస్‌ లో అందరూ చాలా ఆలస్యం అయిపోతుంది అన్నారు.

అందరికీ నచ్చచెప్పి చివరికి హాస్పటల్‌ కి బస్‌ పోనిచ్చాడు. ఆమెకు ట్రీట్మెంట్‌ అయ్యేదాకా బస్‌ హాస్పిటల్‌ ముందు ఆగింది. కాసేపటికి ఆమెకి కొంచెం తగ్గింది, తిరిగి బస్‌ ఎక్కింది.

అందువల్ల ఉదయం 6 గంటలకు వెళ్ళవలసిన బస్‌ శిరిడీ కి 11 గంటలకి చేరింది. లైన్‌ లో రూమ్‌ కోసం నిలబడితే, భక్త నివాస్‌ లో రూమ్‌ దొరికింది.

రూమ్‌ లో సామాన్లు పెట్టి ఫ్రెష్‌ అయి బయటకి వచ్చి ‘బాబా దర్శనానికి వెళ్ళడానికి ఆటో ఎక్కబోతున్నాము, అప్పటిదాకా చాలా ఎండగా ఉంది, అప్పటికి అప్పుడు ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో ఉన్నట్టుంది చాలా పెద్ద వాన కురిసింది.

గబుక్కున ఆటో ఎక్కేసాము. గుడి దగ్గర ఆటో ఆగింది, మేము దిగుదాం అనుకుంటే అంతా బురద దారులు మొత్తం బురద మయం, వాన తగ్గిపోయింది, బురదగా ఉంది.

ఆ బురదలోనే మా ఆవిడ నడవవలసి వచ్చింది. బురద కాలికి లసుక్‌, లసుక్‌ అని అంటుకుంటోంది, లోపలికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము.

బయటికి వచ్చాక బురదలో ఎలా నడిచిందో? ఇసుక రేణువులు కాలిలో బాగా దిగిపోయి చాలా నెప్పి వస్తూ ఉండాలి, ఆ బురదలో ఏ గాజు పెంకులు ఉంటాయో ఏమో, నాకిదే టెన్షన్‌ గా వుంది.

మామూలుగా నడవలేని మనిషి ఆ బురదలో మట్టిలో అలా నడవటం నడవవలసి రావటం నా కెందుకో చాలా భాధ అనిపించింది,

బయటికి రాగానే ఒక గట్టుమీద కూర్చోపెట్టి, “ఏం లక్ష్మి బాగా నొప్పిగా ఉందా? ఎలాగ ఉంది? బాగా మంటగా ఉందా?”అంటూ వాటర్‌ బాటిల్‌ లో నీళ్ళు తెచ్చి కాళ్ళకున్న బురదనంతా బాగా శుభ్రంగా కడిగాను.

ఏమైనా రక్తం వస్తుందా అని చూసాను. ఏం లేదు, బాగానే వుంది అంటోంది.

ఇంక మళ్ళీ ఆటో ఎక్కి రూమ్‌ కి వచ్చాము. ‘నెప్పిగా ఉందా అంటూ ఒక టాబ్లెట్‌ ఇచ్చి వేసుకోమని, నెప్పులు ఏమైనా ఉంటే తగ్గిపోతాయని, పడుకోమని చెప్పాను.

నేను పిల్లలు బయటకు వచ్చాము. ఆవిడ రూమ్‌ లోనే పడుకుంది,

రెండు గంటలయ్యాక మేము రూమ్‌ కి వెళ్ళాము. మా ఆవిడ లేచింది. ‘ఏం లక్ష్మి ఎలా ఉంది? అని అడిగాను, నాకేం నెప్పి లేదండీ తగ్గిపోయింది అంది.

కాళ్ళు కింద పెట్టి అతి సాధారణంగా నడవటం మొదలుపెట్టింది, నాకు కలలో కనపడి మందులిస్తాను అని ‘శిరిడీకి తనని తీసుకువచ్చి బురదలో నడిపించాడు.

అది తపో భూమి కాబట్టి ఆ బురద, ఆ మట్టి పరమపావనమైనవి కాబట్టి ఆ గడ్డ మీద కాలు పెట్టేసరికి మా ఆవిడ నెప్పులు మాయం అయిపోయాయి.

ఆ తర్వాత మేము హైదరాబాదు తిరిగి వచ్చాక ఏ డాక్టర్‌ దగ్గర మందులు వాడారు ఇలా తగ్గిపోయింది అంటూ అంతకుముందు చూపించుకున్న డాక్టర్‌ అడిగారు.

మేము జరిగింది జరిగినట్లు చెప్పాము. ఆయన మమ్మల్ని చూసి దండం పెట్టాడు. అప్పటి నుండి మళ్ళీ కాళ్లకి ఎటువంటి సమస్య రాలేదు.

The above miracle has been typed by: Sreenivas Murthy Muppalla

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “మందులతో నయం కాని భక్తురాలి బాధను, షిరిడీకి రప్పించుకుని నయం చేసినా బాబా వారు….Audio

maruthi

🙏🌹🙏🌹

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles