శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (5) జనన మరణ చక్రాలు (2వ.భాగమ్)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (5) జనన మరణ చక్రాలు (2వ.భాగమ్)

ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

శ్రీనానా సాహెబ్ చందోర్కర్ సాయిబాబాకు మరొక భక్తుడు.  ఆయన అహమ్మద్ నగర్ కలక్టర్ గారి వద్ద సెక్రటరీగా ఉండేవారు.  అప్పసాహెబ్ కుల్ కర్ణి గ్రామ కరణం ద్వారా బాబా అతనిని తన వద్దకు  రమ్మనమని ఒక్కసారి కాదు మూడు సార్లు కబురు పట్టారు.  ఆఖరికి చందోర్కర్ బాబా వద్దకు వచ్చి తననెందుకు పిలిపించారని అడిగాడు.  అప్పుడు బాబా “ఈ ప్రపంచం మొత్తం మీద ఒక్కడే నానా ఉన్నాడా?  నేను నిన్నే పిలిపించానంటే దానికేదో కొంత కారణం ఉంటుంది కదా?  నేను, నువ్వు గత నాలుగు జన్మల నుండి కలిసి ఉన్నాము.  నీకీసంగతి తెలీదు.   కాని నాకు తెలుసు.” అన్నారు.

గీత 4వ.అధ్యాయం 5వ.శ్లోకంలో  శ్రీకృష్ణపరమాత్మ ఇదే విషయాన్ని అర్జునునితో చెప్పాడు.

“బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున I

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్ధ పరంతప II

ఓ పరంతపా ! అర్జునా ! నాకును నీకును అనేక జన్మలు గడిచినవి.  కాని వాటిని అన్నింటిని నేను ఎరుంగుదును.  నీవెరుగవు.

ఒకసారి కొంతమంది దర్వీషులు ఒక పులిని తీసుకొని వాబా వద్దకు వచ్చారు.  వారు దానిని ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకుంటూ ఉండేవారు.  అది ఇప్పుడు జబ్బుతో బాధపడుతుండటం చేత బాబా వద్దకు తీసుకొని వచ్చారు.  అది బాబా దగ్గరకు రాగానే ఆఖరి శ్వాస వదిలింది.  దర్వీషులు తమ జీవనోపాధి పోయిందని చాలా విచారించారు.  బాబా వారిని ఓదారుస్తూ పునర్జన్మ సిధ్ధాంతం గురించి ఈవిధంగా చెప్పారు.  “క్రిందటి జన్మలో ఆపులి మీకు ఋణపడి ఉంది.  ఈ జన్మలో అది మీకు సేవ చేసుకొని ఋణవిముక్తి పొందగానే నాపాదాల చెంత మరణించింది.”    అధ్యాయం – 31

ఒకరోజు మధ్యాహ్నం ఖాపర్దే గారి భార్య ఒక పళ్ళెంలో సాంజా, పూరీ, పులుసు, అన్నం, పరమాన్నం, మొదలైనవన్నీ భోజన సమయానికి మసీదుకు తీసుకొని వచ్చింది.  గంటల కొద్దీ వేచి ఉండే బాబా ఆనాడు వెంటనే లేచి, భోజన స్థలములో కూర్చుండి, ఆమె తెచ్చిన పళ్ళెం మీద ఆకు తీసి త్వరగా తినడం ప్రారంభించారు.  అప్పుడు శ్యామా బాబాని ఇట్లా అడిగాడు. – “ఎందుకింత పక్షపాతం?  ఇతరుల పళ్ళెములను నెట్టివేస్తావు.  వాటివైపు అసలు చూడనైనా చూడవు.  కాని దీనిని నీవద్దకు ఈడ్చుకొని తృప్తిగా తింటున్నావు.  ఈమె తెచ్చిన భోజనం అంత రుచికరంగా ఉందా?”  బాబా ఈ విధంగా సమాధానం ఇచ్చారు. – “ఈమె భోజనము యదార్ధముగా మిక్కిలి అమూల్యమయినది.  గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు.  అది బాగా పాలిస్తూ ఉండేది.  తరువాతి జన్మలో, ఒక తోటమాలి ఇంటిలో జన్మించి యొక వర్తకుని వివాహమాడింది.  తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించింది.  చాలా కాలము పిమ్మట ఆమెను నేను జూచితిని.  కావున ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్ర్రేమయుతమగు ముద్దలను తీసుకొననిండు.”    అధ్యాయం – 27 .  ఆ విధంగా బాబా ఆమె యొక్క ఎన్నో గత జన్మల వృత్తాంతాన్ని వివరించారు.  ఒక ఆత్మకు జంతు జన్మనుంచి మంచిపనులవల్ల బ్రాహ్మణ జన్మ లభించడం ఏవిధంగా జరుగుతుందో తన భక్తులకు వివరంగా చెప్పడం బహుశా బాబా ఉద్దేశ్యం అయి ఉండవచ్చు.

శ్రీసాయి సత్ చరిత్ర 14వ.అధ్యాయంలో ధబోల్కర్ గారు బృహదారణ్యకోపనిషత్తు గురించి చెప్పారు.  ఆ ఉపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ‘ద’ యను అక్షరమును బోధించెను.  ఈ అక్షరము వల్ల దేవతలు ‘దమము’ నవలంబించవలెనని గ్రహించారు (అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట).  మానవులు ఈ అక్షరమును ‘దానము’ గా గ్రహించారు.  రాక్షసులు దీనిని ‘దయ’గా గ్రహించారు.  దీనిని బట్టి మానవులు దానము చేయవలెనను నియమం ఏర్పడింది.  తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలెనని తెలియచేస్తుంది.  దానము గట్టి విశ్వాసముతోను, ధారాళముగాను, అణకువతోను, భయముతోను, కనికరముతోను చేయాలి.  భక్తులకు దానము గూర్చి భోధించుటకు ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనసులను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుతూ ఉండేవారు.

గత జన్మలో చేసుకొన్న పుణ్యం వల్లనే మనకి ఈ మానవ జన్మ లభించింది.  ఈ జీవితంలో భక్తి, ముక్తి సాధించాలంటే ఈ మానవ జన్మతోనే సాధ్యపడుతుంది.  అందుచేత మనం సోమరిగా ఉండకుండా జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా ప్రధానంగా చెబుతూ ఉండేవారు.

8వ.అధ్యాయంలో కూడా బాబా ఇదే విషయాన్ని చెప్పారు.  ప్రపంచంలో సమస్త జీవకోటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము.  కాని మానవునికి మరొక ప్రజ్ఞ ఉంది.  అదే జ్ఞానము.  జ్ఞానంతోనే మానవుడు భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలడు.  ఇక మరే జన్మలోను దీనికి అవకాశం లేదు.

మానవుడు తన మరణ సమయంలో ఏకోరికతోనయితే మరణిస్తాడో మరుజన్మలో వాడు దానిని పొందుతాడు.

భగవద్గీత 8వ.అధ్యాయం 5,6 శ్లోకాలలో శ్రీకృష్ణపరమాత్మ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంత్యకాలమందు ఎవరయితే నన్నే స్మరిస్తారో వారు నన్నే పొందుతారు.  మనుష్యుడు అవసాన దశయందు ఏఏభావములను స్మరించుచు దేహత్యాగమును చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందుచున్నాడు.

వివిధ కారణాలవల్ల మరణసమయంలో మనకి మంచి ఆలోచనలే వస్తాయని ఖచ్చితంగా చెప్పలేము.  వ్యాధుల వల్ల వచ్చిన బాధలు, భవిష్యత్తు గురించి, కుటుంబం గురించి ఆందోళన ఇటువంటి కారణాలన్నీ మన మనసులో నిండిపోయి మంచి ఆలోచనలు రావడానికి ఆస్కారం తక్కువ.  అందుచేతనే యోగులందరూ కూడా మరణసమయంలో కలవరపాటు, చికాకులు ఉండకూడదనే నిరంతరం భగవంతుని నామాన్నే ఉచ్చరిస్తూ ఆయన రూపాన్నే ధ్యానిస్తూ ఉండమని చెప్పారు.  ఈలక్ష్యాన్ని సాధించడానికి తెలివైన భక్తులు ఇంకా సులభమయిన ఉపాయాన్ని సాధన చేస్తున్నారు. ఆఖరి దశలో వారు యోగులను ఆశ్రయించి శరణాగతి వేడుకొంటారు.  సర్వజ్ఞులయిన యోగులే తరింపచేయగలరని నమ్మి వారి నాశ్రయిస్తారు.  శ్రీసాయి సత్ చరిత్ర 31వ.అధ్యాయంలో వీటికి సంబంధించిన ఉదాహరణలున్నాయి.  విజయానంద్ సన్యాసి, బాలారామ్ మాన్ కర్, తాత్యా సాహెబ్ నూల్కర్, మేఘుడు, దర్వీషులచేత తీసుకొని రాబడ్డ పులి. వీరందరు షిరిడీలో బాబావద్ద తమ ఆఖరి శ్వాస వదిలారు.

ఆవిధంగా సాయిబాబా తన భక్తుల పునర్జన్మల గురించి చెప్పడమే కాక, మంచి జన్మను ఏవిధంగా పొందాలో జననమరణ చక్రాలనుండి ఏవిధంగా తప్పించుకోవాలో సోదాహరణంగా వివరించారు.

(రేపు కర్మ సిధ్ధాంతం)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles