Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (4) భక్తిమార్గం( 5వ.భాగమ్)
ఆంగ్లమూలమ్ : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
- దాస్యం (సేవ)
దాస్యం – అనగా సేవ ఏవిధంగా చేయాలో శ్రీసాయి సత్ చరిత్రలో నాందేడ్ నివాసి అబ్దుల్, నెవాసా నివాసి, బాలాజి పాటిల్, పండరీపూర్ నివాసిని రాధాకృష్ణ ఆయీలను చూసి తెలుసుకోవచ్చు.
బాలాజీ పాటిల్ నెవాస్కర్, బాబా స్నానం చేస్తున్నపుడు బయటకు ప్రవహించే నీటిని, ఆయన తన చేతులు కాళ్ళు కడుగుకొన్నపుడూ వచ్చే నీటిని మాత్రమే త్రాగేవాడు. బాబా సూచనల ప్రకారం షిరిడీలో రోగులకు సంబంధించిన నీచమయిన, కష్టతరమయిన పనులను కూడా చేస్తూ ఉండేవాడు. బాబా లెండీబాగ్ కు, చావడికి వెళ్ళే దారిని తుడిచి, శుభ్రం చేస్తూ ఉండేవాడు. ఆవిధంగా చేయాలనే ఆలోచనతో అమలు పరిచిన మొట్టమొదటి భక్తుడు ఇతడే. ప్రతిసంవత్సరం తన పొలంలో పండిన గోధుమ పంటనంతటినీ బాబా ముందు పెట్టి ఆయన ఇచ్చినదే ఇంటికి పట్టుకెళ్ళేవాడు. అహమ్మద్ నగర్ నివాసి దామూఅన్నా బాబాని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించినపుడు బాబా అతనితో తన ప్రతినిధిగా బాలాజీ పాటిల్ ను తీసుకొనివెళ్ళి అతిధి మర్యాదలు చేయమని చెప్పడంలో ఆశ్చర్యంలేదు. అలాగే బాలాజీ సాంవత్సరికము నాడు, నెవాస్కర్ కుటుంబమువారు కొంతమంది బంధువులను భోజనానికి పిలిచారు. పిలచినవారికంటే మూడు రెట్లు అధికంగా బంధువులు వచ్చారు. బాబా వచ్చినవారికందరికీ భోజనపదార్ధములు సరిపోవునట్లు చేయటమే కాక ఇంకా చాలా మిగిలాయి. ఆ విధంగా బాబా ఆయన కుటుంబ గౌరవాన్ని కాపాడారు. (అధ్యాయం – 35).
రాధాకృష్ణమాయికి ముప్పది సంవత్సరాల వయసులోనే వైధవ్యం ప్రాప్తించింది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె ఎప్పుడూ బాబా ఎదుట పడకుండా, మొహం మీద తన చీరను ముసుగు వేసుకొని ఆయన ముందుకు వచ్చేది. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ నియమం తప్పకుండా మసీదును పేడతో అలికి శుభ్రంగా ఉంచేది. చావడిలో బాబా నిద్రించే గదిని అద్దాలతోను, చిత్రపటాలు, పైకప్పుకు వ్రేలాడే దీపాలతోను (షాండ్లియర్స్) అలంకరించేది. ధనవంతులయిన భక్తులనుండి, బాబా చావడి ఉత్సవంకోసం, దుస్తులు, ఆభరణాలు, గొడుగులు, దీపాలు మొదలైనవాటినన్నీ సేకరించేది. ఆమె బ్రాహ్మణ కులానికి చెందిన స్త్రీ అయినప్పటికీ, బాలాజీ పాటిల్ మరణించిన తరువాత అతను చేసేపనులు, అనగా బాబా లెండీబాగ్ నుండి చావడికి వెళ్ళే దారిలో మలములను, పేడను తుడిచి శుభ్రం చేయడానికి కూడా సంకోచించలేదు. అందుచేతనే బాబా ప్రతిరోజూ మధ్యాహ్నం ఆమెకు రొట్టి, వండిన కూరలు ప్రేమాభిమానాలతో పంపిస్తూ ఉండేవారు. ఇండోర్ నివాసి బాబా సాహెబ్ రేగే, నాగపూర్ నివాసి బాపూసాహెబ్ బుట్టీ, బొంబాయి నివాసులు కాకా సాహెబ్ దీక్షిత్, వామన్ రావు పటేల్ (స్వామి శరణానందజీ) లాంటి విద్యాధికులయిన భక్తులను భక్తి పాఠాలు నేర్చుకోవడానికి రాధాకృష్ణమాయి ఇంటికి పంపిస్తూ ఉండేవారు.
అబ్దుల్ 19 సంవత్సరాల వయసులోనే తన భార్యాబిడ్డలను వదలివేసి, 26 సంవత్సరములపాటు బాబా మహాసమాధి చెందేంతవరకు ఆయనకు సేవ చేశాడు. ద్వారకామాయి, చావడి, లెండీ బాగ్ లలో ప్రతిరోజూ దీపాలను శుభ్రం చేసి అందులో నూనె వేసి వెలిగించడం అతని నిత్యకృత్యం. అదే అతని ప్రధాన ఉద్యోగం. ప్రతిరోజు మశీదును ఊడ్చి శుభ్రం చేసేవాడు. మట్టికుండలలో త్రాగేందుకు నీటిని నింపి, లెండీలో బాబాగారి బట్టలను ఉతికేవాడు. రాధాకృష్ణ మాయీ మరణానంతరం బాబా లెండీబాగ్ నుండి చావడికి వెళ్ళే దారిలో మలములను, పేడను తుడిచి శుభ్రం చేసేవారు. బాబా మహాసమాధి చెందిన తరువాత కూడా షిరిడీ విడిచి తన భార్యాబిడ్డల వద్దకు తిరిగి వెళ్ళకుండా ఉండిపోయాడు. ప్రతిరోజూ సమాధిని తుడిచి శుభ్రం చేస్తూ షిరిడీ వచ్చే భక్తులకు మార్గదర్శకుడిగా ఉన్నాడ.
8. సఖ్యత (స్నేహము)
శ్రీసాయి సత్ చరిత్రలో సఖ్యత అనగా స్నేహం గురించి చెప్పుకోవాలంటే శ్యామా అనగా మాధవరావు దేశ్ పాండే గురించే చెప్పుకోవాలి. శ్యామా 42,43 సంవత్సరాలపాటు విడవకుండా బాబాతో సన్నిహితంగా ఉన్నాడు. బహుశా తాత్యాకోటే పాటిల్, మహల్సాపతిలకి తప్ప మరెవరికీ ఇటువంటి గొప్ప అదృష్టం లభించలేదు. కాని బాబాతో మాధవరావు స్నేహం ప్రత్యేకమయినది. బాబా అతనిని ప్రేమగా ‘శ్యామా’ అని పిలిచేవారు. మాధవరావు బాబాని ‘దేవా’ అని పిలిచేవాడు. మాధవరావుకు బాబాని చనువుగా ఏకవచనంతో కూడా సంబోధించేంతగా ప్రత్యేకమయిన చనువు, హక్కు ఉంది. మరింకెవరికీ బాబాని అలా పిలిచే ధైర్యంలేదు. ఎవరూ కూడా అతనితో వాదించే ధైర్యం కూడా ఉండేది కాదు.
36వ.అధ్యాయంలో బాబా ఒకసారి శ్యామాను పరిహాసంగా అతని బుగ్గను గిల్లిన సంఘటన మనకు కనపడుతుంది. అదే అధ్యాయంలో శ్రీమతి ఔరంగా బాద్ కర్ పుత్రసంతానం కోసం, బాబాకు కొబ్బరికాయను సమర్పించడానికి వచ్చింది. అపుడామెతో మాధవరావు, “అమ్మా! నీవే నామాటలకు ప్రత్యక్ష సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలగనిచో ఈ దేవుని తలపై టెంకాయను కొట్టి ఈ మసీదునుండి తరిమివేస్తాను” అన్నాడు. ఈ విధంగా మాట్లాడటానికి మాధవరావుకెంత ధైర్యం! కోపోద్రేకం వచ్చినపుడు బాబా తన భక్తులను కొడతారని తెలిసి కూడా ఎవరంతలా బాబా గురించి మాట్లాడగలరు? ఈ సంఘటనను బట్టి శ్యామాకు బాబా వద్ద ఎంత సన్నిహిత సంబంధం, చనువు ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. బాబాతో అంతటి సాన్నిహిత్యం ఉన్న శ్యామా ఎంతటి అదృష్టవంతుడో కదా.
మాధవరావు దేశ్ పాండే భక్తి కూడా చాలా గొప్పది. ఒకసారి మాధవరావు దీక్షిత్ వాడాలో నిద్రపోతున్నపుడు కాకాసాహెబ్ దీక్షిత్ అతనిని లేపడానికి వెళ్ళాడు. అప్పుడే కాకాసాహెబ్ కి మాదవరావు శరీరంనుండి, ‘శ్రీసాయినాధ మహరాజ్’ ‘శ్రీసాయినాధమహరాజ్’ అనే మాటలు ప్రవాహంలా వస్తూ ఉండడం ఆయనకు వినిపించింది. అందువల్లనే మాధవరావు జీవితం సుఖసంతోషాలతో గడిచేలా బాబా తన శక్తికి మించి అనుగ్రహించారంటే అందులో ఆశ్యర్యం ఏమీ లేదు. 46వ.అధ్యాయంలో బాబా శ్యామాకు ఎటువంటి ఖర్చు లేకుండా కాశీ, గయ, ప్రయాగ పుణ్యక్షేత్రాల యాత్ర సౌఖ్యవంతంగా ఉండేలా చేయించారు. బాబా మహాసమాధి చెందిన తరువాత మాధవరావు 22 ససంవత్సరాలు జీవించాడు. బాబా తన తదనంతరం కూడా తన అంకిత భక్తుడయిన మాధవరావు జీవితం చాలా గౌరవంగాను, సుఖంగాను గడచిపోయేలా అనుగ్రహించారు. చాలామంది ధనవంతులు, అధికారులు మాధవరావుకు పాదాభివందనాలు చేస్తూ ఉండేవారు. ఆయనను ప్రేమతో ఆలింగనం చేసుకొనేవారు. తమతో కూడా ఆయనను తీర్ధయాత్రలకు తీసుకొని వెడుతూ ఆయనకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకొనేవారు. నిజానికి స్నేహంతో కూడిన భక్తి చాలా గొప్పది.
మహాభారత యుధ్ధంలో శ్రీకృష్ణపరమాత్మ తానే స్వయంగా రధసారధిగా అర్జునుని రధాన్ని తోలలేదా?
(ఇంకా ఉంది)
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (5) జనన మరణ చక్రాలు (1వ.భాగమ్)
- శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము – (4) భక్తిమార్గం(1వ.భాగమ్)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – 2. ఆహారం (5వ.భాగం)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము (3) వాక్కు 2వ.భాగమ్
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (3) వాక్కు 1వ.భాగమ్–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments