అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

 

జనన మరణాలను దేవుడు నిర్దేశిస్తాడు. ఎప్పుడు జన్మించాలి, ఎప్పుడు మరణించాలన్నది ఆ దేవుని ఆదేశానుసారమే జరుగుతుంది. దానికి బాబా కూడా అతీతుడు కాడు.

భగవదంశ ఒక రూపాన్ని సంతరించుకుంటే ఆ రూపానికి నిర్దేశించిన కాలాన్ని అనుభవించి, అంతరించిపోవాలి. అవతారాన్ని చాలించాలి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్‌ కాలానుగుణంగానే తమ తమ అవతారాలు చాలించారు. వారిలాగానే సాయిబాబా కూడా తన అవతారాన్ని చాలించేందుకు సిద్ధమయ్యారు.

ఆ ఘడియలు దగ్గరపడ్డాయి.విజయదశమి.షిరిడీలో ఆ పండగ వాతావరణమే లేదు. అంతటా విషాదం అలుముకుని ఉంది.  ఉత్సాహాలు లేవు. కొత్త బట్టలు లేవు. పిండివంటలు లేవు. ఏ ఇల్లు చూసినా దిగులు దిగులుగా ఉంది. దుఃఖంగా ఉంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయం భయంగా ఉంది. ద్వారకామాయి కూడా ఇందుకు భిన్నంగా లేదు.

బాబా కళ్ళు తెరచి చూడలేకపోతున్నారు. తెరచినా మరుక్షణమే మూసుకుంటున్నారు. విపరీతంగా ఆయాసపడుతున్నారు. ఎగశ్వాస తీస్తున్నారు.

ఆయన ఉచ్చ్వాస నిశ్వాసలు బుసలు కొడుతున్నట్టుగా ఉంది. బాబాని ఆ స్థితిలో చూడలేకపోతున్నాడు శ్యామా. కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తున్నాడతను. ఇవి ఆఖరి క్షణాలు కాదు కదా? అనుకున్నాడు.

అంతే! సమాధానంగా కళ్ళిప్పి అవునన్నట్టుగా శ్యామాని చూశారు బాబా. ఒప్పుకోను, నేనొప్పుకోను అన్నట్టుగా బోరుమన్నాడు శ్యామా.

ఎడంగా నిల్చున్న నిమోన్కర్‌ని చూశారు బాబా. దగ్గరగా పిలిచారు. వచ్చాడతను.‘‘నేనిక్కడ ఉండలేకపోతున్నాను. నన్ను…నన్ను బూటీవాడాకు తీసుకుపోండి. అక్కడయితే హాయిగా ఉంటుందేమో.’’ అన్నారు బాబా. ఆ నాలుగు మాటలూ మట్లాడడానికి చాలా కష్టపడ్డారు.‘‘చెప్పింది అర్థమయిందా?’’ అడిగారు బాబా.

‘‘అర్థమయింది బాబా! నువ్వు కోరుకున్నట్టుగానే నిన్ను బూటీవాడాకి తరలిస్తాం.’’ అన్నాడు నిమోన్కర్‌.‘‘ఇక మీదట నేను కాదు, నా సమాధి మాట్లాడుతుంది. నా సమాధి నుంచే నేను సర్వకార్యాలూ నిర్వహిస్తాను. మీకు…నా భక్తులందరికీ నా సమాధి నుంచే రక్షణ లభిస్తుంది.’’ అన్నారు బాబా.

ఆగి ఆగి మాట్లాడారు.అందరూ గొల్లుమన్నారు.‘‘నన్ను త్వరగా బూటీవాడాకు చేర్చండి.’’ చెప్పలేక చెప్పలేక చెప్పారు బాబా. తల దిక్కుగా కూర్చున పాటిల్‌ ఒడిలో ఒరిగిపోయారు.

నానా చూశాడది. పరుగున వెళ్ళి నీళ్ళు తీసుకుని వచ్చాడు. నోరు తెరవమని చెప్పాడు. బాబా నోరు తెరవలేదు. బలవంతంగా తెరిచారు. నీళ్ళు పోశారు. గుటక పడలేదు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com