మేఘశ్యాముడు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!    శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)

 ఇక అన్నిటికంటె పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరమ్ గాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సాఠెగారి వంటబ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన, చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడు శివపంచాక్షరి ‘నమశ్శివాయ’ జపించువాడు. అతనికి సంధ్యావందనముగాని, గాయత్రీ మంత్రముగాని, తెలియకుండెను. సాఠేగారికి వీనియందు శ్రద్ధ గలిగి గాయత్రీమంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని యవతారమని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషనువద్ద సాయిబాబా మహమ్మదీయుడని యెవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు టుత్తరము షిరిడీ వాసి తన మామగారగు దాదా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో వరిచయము కలుగజేయవలెనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానీయక “వెధవను తన్ని తరిమివేయుడు” అని గర్జించి, మేఘునితో నిట్లనెను. “నీవు గొప్పజాతి బ్రాహ్మణుడవు. నేనా తక్కువజాతి మహమ్మదీయుడను. నీ విచటకు వచ్చినచో, నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము.” ఈ మాటలు విని మేఘుడు వణక నారంభించెను. అతడు తన మసస్సులోనున్న విషయములు బాబాకెట్లు దెలిసెనని యాశ్చర్యపడెను. కొన్నిదినము లచటనే యుండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని యతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన యింటికి బోయెను. అక్కడనుండి త్ర్యంబక్ (నాసిక్ జిల్లా) పోయి యచట ఒకసంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే నాతడు మసీదులో ప్రవేశించుటకు, షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశముద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పుకలుగజేయుచు చాలా మేలుచేసెను. అప్పటినుండి అతడు సాయిబాబాను శివుని యవతారముగా భావించుచుండెను. శివుని యర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళకొలది నడిచి పత్రిని దెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములో నున్న దేవతలనందరిని పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదముల నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబాదేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేసెను. ఖండోబామందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి యుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను.

గంగా స్నానము

ఒక మకరసంక్రాంతినాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి, గంగానదీజలముతో నభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టములేకుండెను. కాని యత డనేకసారులు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రానుపోను 8 క్రోసుల దూరము నడచి గోమతీనదీతీర్థము తేవలసియుండెను. అతడు తీర్థము దెచ్చి, యత్నము లన్నియు జేసికొని, బాబావద్దకు 12గంటలకు వచ్చి, స్నానమునకు సిద్ధముగా నుండుమనెను. బాబా తనకా యభిషేకము వలదనియు, ఫకీరగుటచే గంగానదీజలముతో నెట్టిసంబంధము లేదనియు చెప్పెను. కాని మేఘుడు వినలేదు. శివుని కభిషేక మిష్టము గనుక, తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసితీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపయి కూర్చుండి తల ముందుకు సాచి, ఇట్లనెను. “ఓ మేఘా! ఈ చిన్న యుపకారము చేసిపెట్టుము. శరీరమునకు తల ముఖ్యము. కావున తలపైనే నీళ్ళు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును.” అట్లనే యని మేఘశ్యాము డొప్పుకొని, నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కాని, భక్తిపారవశ్యమున ‘హరగంగే, హరగంగే’ యనుచు శరీరమంతటిపై నీళ్ళు పోసెను. కుండ నొక ప్రక్కకు బెట్టి, బాబా వయిపు జూచెను. వాని యాశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి, శరీరమంతయు పొడిగా నుండెను.

త్రిశూలము, లింగము

మేఘశ్యాముడు బాబాను రెండుచోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానా సాహెబు చాందోర్క రిచ్చినపటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపయి పండుకొని కండ్లు మూసియున్నప్పటికి, లోపల ధ్యానము చేయుచు, బాబా రూపమును జూచెను. అతనిఫై బాబా యక్షతలు చల్లి “మేఘా, త్రిశూలమును గియుము!” అని అదృశ్యుడయ్యెను. బాబా మాటలు విని, యాతురతగా కండ్లు దెరచెను. బాబాను చూడలేదు గాని, యక్షత లక్కడక్కడ పడియుండెను. బాబా వద్దకు పోయి, చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశులమును వ్రాయుట కాజ్ఞ నిమ్మనెను. బాబా యిట్లనెను. “నా మాటలు వినలేదా? త్రిశూలమును వ్రాయుమంటిని. అది దృశ్యము కాదు. స్వయముగా వచ్చి, నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు. అర్థవంతములు.” మేఘు డిట్లుపలికెను. “మీరు నన్ను లేపినటుల భావించితిని. తలుపులన్ని వేసి యుండుటచే, నది దృశ్యమను కొంటిని.” బాబా తిరిగి యిట్లు జవాబిచ్చెను. “ప్రవేశించుటకు నాకు వాకిలి యవసరము లేదు. నాకు రూపము లేదు. నేనన్నిచోట్ల నివసించుచున్నాను. ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను.”

మేఘుడు వాడాకు తిరిగి వచ్చి, బాబా పటమువద్ద గోడపై త్రిశూలము ఎర్రరంగుతో వ్రాసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనానుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడ అచటకు వచ్చెను. బాబా యిట్లనెను. “చూడు శంకరుడు వచ్చినాడు; జాగ్రత్తగా పూజింపుము.” మేఘుడు త్రిశూలమును వ్రాసిన వెంటనే లింగము వచ్చుట జూచి యాశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబు దీక్షిత్ స్నానము చేసి సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టియందు లింగము వచ్చుట గాంచెను. అతడాశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి, బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షితుడు దానిని జూచి సరిగా నది తన ధ్యానములో కనపడినదానివలె నున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తికాగా, బాబా మేఘశ్యాముడు పూజచేయుచున్న పెద్దపటమువద్ద లింగములు ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలము వ్రాయించి, లింగమును ప్రతిష్ఠించుట ద్వారా, బాబా వానియందుండు నమ్మకమును స్థిరపరచెను.

అనేకసంవత్సరములు బాబా సేవచేసి యనగా పూజా, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము నొందెను. బాబా వాని కళేబరముపయి చేతులుచాచి “ఇతడు నా నిజమయిన భక్తు”డనెను. బాబా తన సొంతఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజీ ఏర్పాటు చేయుమనెను. కాకా సాహెబు దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles