మద్రాసు భజనసమాజము



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!    శ్రీ సాయిసచ్చరిత్రము(click Here)

1916వ సంవత్సరమున రామదాసి-పంథాకు చెందిన మదరాసు భజన సమాజ మొకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులో నొక పురుషుడు అతని భార్య, అతని కొమార్తె, అతని వదినెయు నుండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహమదు నగరు జిల్లా, కోపర్ గాం తాలూకాలో షిరిడీ యను గ్రామమున సాయియను నొక గొప్ప యోగీశ్వరు డున్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచి పెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణరూపముగా చాల డబ్బు వసూలుచేసి, దానిని భక్తకొండాజి కూతురు 3యేండ్ల అమానికి ఒక రూపాయి, రెండు రూపాయలనుంచి 5 రూపాయలవరకు కొందరికి, జమాలికి 6 రూపాయలును, అమాని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి, యచట ఆగిరి. సమాజము మంచి భజన చేసెను. మంచి పాటలు పాడిరి. కాని లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో ముగ్గురు పేరాస గలవారు. యజమానురాలు మాత్రమట్టి స్వభావము గలది కాదు. ఆమె బాబా యందు ప్రేమగౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్నహారతి జరుగుచుండగా, బాబా యామె భక్తివిశ్వాసములకు ప్రీతి జెంది యామె యిష్టదైవముయొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరామునివలె గాన్పించెను. తన యిష్టదైవమును జూచి యామె మనస్సు కరిగెను. ఆమె కండ్లనుండి యానందబాష్పములు కారుచుండగా ఆనందముతో చేతులు తట్టెను. ఆమె యానందవైఖరికి తక్కినవా రాశ్చర్యపడిరి. కాని కారణమేమో తెలిసికొనలేకుండిరి. జరిగిన దంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని జూచితి ననెను. ఆమె అమాయిక భక్తురాలగుటచే, శ్రీరాముని జూచుట, ఆమె పడిన భ్రమ యని భర్త యనుకొనెను. అది యంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరు సాయిబాబాను జూడగా ఆమె శ్రీరాముని జూచుట యసంభవమనెను. ఆమె యా యాక్షేపణకు కోపగించ లేదు. ఆమెకు శ్రీరామదర్శనము అపుడపుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునపుడు, దురాశలు లేనపుడును, లభించుచునే యుండెను.

ఆశ్చర్యకరమైన దర్శనము

ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒక రాత్రి భర్తకొక యద్భుతమైన దృశ్యము ఈ ప్రకారముగా కనబడెను. అతడొక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి, యొక పంజరమున బంధించిరి. పోలీసువారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట జూచి, విచారముగా నత డిట్లనెను. “నీ కీర్తి విని, నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయముగా నిచట నిలచి యుండగా, ఈయాపద నాపయి బడనేల?”. బాబా యిట్లనెను. “నీవు చేసిన కర్మఫలితమును నీవే యనుభవింపవలెను.” అతడిట్లనెను. “ఈ జన్మలో నాకిట్టి యాపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు.” బాబా యిటులనెను, “ఈ జన్మములో కాకున్న గతజన్మములో నేమయిన పాపము చేసియుండ వచ్చును.” అతడిట్లనెను. “గతజన్మములో యేమయిన పాపము చేసి యున్నచో, నీ సముఖమున దాని నేల నిప్పుముందర యెండుగడ్డివలె దహనము చేయరాదు?” బాబా “నీ కట్టి విశ్వాసము గలదా?” యని యడుగ అతడు ‘కలదు’ అనెను. బాబా యప్పుడు కండ్లు మూయుమనెను. అతడు కండ్లు మూసి తెరచునంతలో ఏదో పడిపోయి క్రిందబడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసువారు రక్తము కారుచు పడిపోయి యుండిరి. తాను బంధవిముక్తుడై యుండెను. అతడు మిక్కిలి భయపడి బాబావైపు జూచెను. బాబా యిట్లనెను. “ఇప్పుడు నీవు బాగుగ పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు.” అప్పుడతడు ఇటుల విన్నవించెను. “నీవు తప్ప రక్షించేవా రెవరునులేరు. నన్ను ఎటులయిన కాపాడుము.” అప్పుడు బాబా వానిని కండ్లు మూయుమనెను. వాడట్లుచేసి, తిరిగి తెరచునంతలో, వాడు పంజరమునుండి విడుదలయినట్లు బాబా ప్రక్కనున్నట్లు గాన్పించెను. అతడు బాబా పాదములపై బడెను. బాబా యిట్లనెను, “ఈ నమస్కారములకు ఇంతకుముందటి నమస్కారముల కైమైన భేదము కలదా? బాగా యాలోచించి చెప్పుము.” అతడు ఇట్లనెను. “కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీవద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును, నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై హిందువులను పాడుచేయుచుంటివని యనుకొనెడి వాడను.” బాబా “నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా?” యని ప్రశ్నింప అతడు నమ్మననెను. అప్పుడు బాబా “నీ యింటిలో పంజా లేదా? నీవు మోహర మప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ యింటిలో మహమ్మదీయ దేవత యగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పు డామెను మీరు శాంతింప జేయుట లేదా?” యనెను. అతడు దీనికంతటికి యొప్పుకొనెను. అపుడు బాబా యిటులనెను. “నీకింక ఏమి కావలెను?” అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడుమని బాబా యనెను. వెనుకకు తిరుగగనే యతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాసు తన ముందర నుండెను. వారి పాదములపై బడగనే, రామదాసు అదృశ్యమయ్యెను. జిజ్ఞాస గలవాడై యతడు బాబాతో యిటులనెను. “మీరు వృద్ధులుగా గనబడుచున్నారు. మీ వయస్సు మీకు తెలియునా?” బాబా, “నేను ముసలివాడ ననచున్నావా? నాతో పరుగెత్తి చూడు” ఇట్లనుచు బాబా పరుగిడ మొదలిడెను. అతడు కూడ వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్రనుండి మేల్కొనెను.

మేలుకొనిన వెంటనే స్వప్నదర్శనము గూర్చి తీవ్రముగా నాలోచించ మొదలిడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటుపిమ్మట వాని సంశయవైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలయిన భక్తి మనమున నుద్భవించెను. ఆ దృశ్యమొక స్వప్నమే కాని, యందుగల ప్రశ్నోత్తరములు చాల ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి యుదయమందరు మసీదులో హారతికొరకు గుమి గూడి యుండగా అతనికి బాబా రెండురూపాయల విలువగల మిఠాయిని, రెండురూపాయల నగదు నిచ్చి ఆశీర్వదించెను. అతని మరికొన్నిరోజు లుండుమనెను. అతనిని బాబా ఆశీర్వదించి యిట్లనియె. “అల్లా నీకు కావలసినంత డబ్బు నిచ్చును. నీకు మేలు చేయును.” అతని కచ్చట యెక్కువ ధనము దొరుకలేదు, కాని అన్నిటికంటె మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా యాశీర్వాదము. తరువాత ఆ భజనసమాజమున కెంతో ధనము లభించెను. వారి యాత్రకూడ జయప్రదముగా సాగెను. వారి కెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరు క్షేమముగా ఇల్లుచేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షముచే కలిగిన ఆనందమును గూర్చి మనమున చింతించుచుండిరి.

తన భక్తులను వృద్ధిచేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా యవలంబించిన మార్గములలో నొకటి చూపుట కీ కథ యదాహరణము. ఇప్పటికి నిట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles