కాకాజీ వైద్య



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!

నాసిక్ జిల్లా వాణిలో కాకాజీవైద్య యనువాడుండెను. అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి. అత డనేకకష్టముల పాలైమనశ్శాంతిని పోగొట్టుకొని, చంచలమనస్కు డయ్యెను. అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు బోయి తనను ఆందోళననుండి కాపాడుమని హృదయపుర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి యానాటి రాత్రి యాతనికి స్వప్నమున గాన్పించి “బాబావద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించు” ననెను. ఈ బాబా యెవరో దేవి నడిగి తెలిసికొనుటకు కాకాజీ యుత్సహించెను. కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా యెవరైయుండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించినపిమ్మట యీ బాబా త్ర్యంబకేశ్వరుడు (శివుడు) కావచ్చునని అతడు పుణ్మస్థలమగు త్ర్యంబకము (నాసిక్ జిల్లా) వెళ్ళెను. అచ్చట పదిరోజులుండెను. అక్కడున్నంతకాలము వేకువజామున స్నానము చేసి, రుద్రమును జపించుచు, అభిషేకమును తదితరపూజలను గావించెను. అయినప్పటికి మునుపటివలెనే అశాంతమనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగివచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో గనిపించి యిట్లనెను. “అనవసరముగా త్ర్యంబకేశ్వర మెందుకు వెళ్ళినావు? బాబా యనగా షిరిడీ సాయిబాబా యని నా యభిప్రాయము.”

షిరిడీకి పోవుటెట్లు? ఎప్పుడు పోవలెను? బాబాను జూచుటెట్లు? అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరయిన యోగీశ్వరుని చూడవలె ననుకున్నచో, ఆ యోగియేగాక దైవముకూడ అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యధార్థముగా యోగియు, భగవంతుడును నొకరే వారిలో నేమియు భేదము లేదు. ఎవరైన తానై పోయి యోగిని దర్శించుటన్నది యుత్తబూటకము. యోగి సంకల్పించనిదే వారిని జూడగలుగు వారెవరు? అతని యాజ్ఞ లేక చెట్టు ఆకు గూడ కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తివిశ్వాసములు జూపునో, యంత త్వరగాను, బలముగాను, అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగతసన్నాహము లొనర్చును. కాకాజీ విషయములో అట్లే స్వాగతసన్నాహము లొనర్చెను. కాకాజీ విషయములో అట్లే జరిగెను.

శ్యామా మ్రొక్కు

కాకాజీ షిరిడీకి పోవుట కాలోచించుచుండగా, ఒక యతిథి అతనిని షిరిడీకి తీసికొనిపోవుట కాతని యింటికే వచ్చెను. అతడింకెవరో కాదు, బాబాకు ముఖ్యభక్తుడగు శ్యామాయే. శ్యామా ఆసమయమున వాణికి ఎట్లు వచ్చెనో చూతుము. శ్యామా బాల్యములో జబ్బు పడినప్పుడు ఆయన తల్లి తమ గృహదేవతయగు వాణిలోని సప్తశృంగి దేవతకి, జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై బెట్టెదనని మ్రొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట, ఆ తల్లికి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో రెండు వెండికుచములు సమర్పించెదనని అప్పుడింకొక మ్రొక్కు మ్రొక్కెను. కాని ఈ రెండు మ్రొక్కులు కూడ ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునపుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి, రెండు మ్రొక్కులు చెల్లించు భారము నాతనిపై వైచి ఆమె మృతిచెందెను. శ్యామా కొన్నాళ్ళకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరచెను, ఇట్లు 30 సంవత్సరములు గడచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బుట్టీ మొదలగువారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను. శ్యామా తమ్ముడు బాపాజీ జ్యోతిషపండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కుకున్న మ్రొక్కులు చెల్లించక పోవుటచే వారికి కష్టములు సప్తశృంగిదేవత కలుగజేయుచున్న దనెను. బాపాజీ యీ సంగతి శ్యామాకు తెలియపరచెను. అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికివచ్చెను. ఇంకను ఆలస్యము చెసినచో హానికరమని యెంచి శ్యామా ఒక కంసాలిని బిలచి, రెండు వెండి కుచములను చెయించెను. మసీదుకు బోయి, బాబా పాదములపై బడి, రెండు కుచముల నచట బెట్టి, తన మ్రొక్కులను చెల్ల జేయుమని, బాబాయే తన సప్తశృంగి దేవత యగుటచే వాని నామోదించమని వేడెను. నీవు స్వయముగా బోయి సప్తశృంగి దేవతకు మ్రొక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను. బాబా ఊదీని ఆశీర్వదమును పొంది, శ్యామా వాణీ పట్టణమునకు బయలుదేరెను. పూజారి యిల్లు వెదకుచు తుదకు కాకాజీ యిల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలెనని గొప్ప కుతూహలముతో నుండెను. అట్టి సమయములో శ్యామా వారింటికి వెళ్ళెను. ఇది ఎంత యాశ్చర్యకరమైన కలయికయో చూడుడు!

“మీరెవ్వరు? ఎచటనుండి వచ్చినా” రని కాకాజీ యడిగెను. “నాది షిరిడీ. నేను సప్తశృంగి మ్రొక్కు చెల్లించుట కిక్కడకు వచ్చినా”నని శ్యామా యనెను. షిరిడీనుండి వచ్చెనని తెలియగానే శ్యామాను కాకజీ కౌగిలించుకొనెను. ప్రేమచే మైమరచెను. వారు సాయిలీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామా మ్రొక్కులన్నియు చెల్లించిన పిమ్మట వారిద్దరు షిరిడీకి బయలుదేరిరి. షిరిడీకి చేరగనే, కాకాజీ మసీదుకు బోయి బాబాను జూచి, వారి పాదములపై బడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగిదేవత స్వప్నములో తెలియపరచిన రీతిగా బాబాను చూడగనే అతని మనస్సులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనస్సులో నిట్లనుకొనెను. ‘ఏమి ఈ యద్భుతశక్తి, బాబా యేమియు పలుకలేదు. ఉత్తరప్రత్యుత్తరములు కూడ జరుగలేదు. ఆశీర్వచనముల నైన పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శనమాత్రముననే నామనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనంద ముద్భవించినది. ఇదియే దర్శనభాగ్యము.’ అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని, యతని సంతోషమున కంతులేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన యానందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా సెలవు తీసుకొని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది యిల్లు చేరెను.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles