విజయానంద్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!

విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానససరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారమునుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలిసికొనెను. మానససరోవరపు యాత్రగూర్చి వివరములను కనుగొనెను. ఆ స్వామి సరోవరము, గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదనియు ప్రయాణమున కలుగు కష్టము లన్నిటిని వర్ణించెను. మంచు యెక్కువనియు భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయనైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగువానిని జెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశచెంది యాత్రను మానుకొనెను. అతడు బాబావద్దకేగి సాష్టాంగనమస్కారము చేయగా బాబా కోపగించి యిట్లనెను. “ఈ పనికిరాని సన్యాసిని తరిమి వేయుడు. వాని సాంగత్యము మన కుపయుక్తము గాదు.” సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నిటిని గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరసి యుండెను. వారు బాబాను అనేకవిధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదముల కభిషేకము చేయుచుండిరి. వారి బొటనవ్రేలునుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లకద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమున కత్తరు చందనములను పూయుచుండిరి. జాతిమత భేదములు లేక యందరును, సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికి, అతనికి బాబాయందు ప్రేమ కలిగెను. కావున నాతనికి ఆస్థలము విడిచి పెట్టుట కిష్టము లేకుండెను.

అతడు షిరిడీలో రెండు రోజు లుండినపిమ్మట తల్లికి జబ్బుగా నున్నదని మద్రాసునుండి ఉత్తరము వచ్చెను. విసుగుచెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా యాజ్ఞలేనిదే షిరిడీ విడువలేకుండెను. ఉత్తరము తీసికొని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా యాజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా, ముందు జరుగబోవునది గ్రహించి “నీ తల్లిని అంతప్రేమించువాడవయితే, సన్యాసమెందుకు పుచ్చుకొంటివి? కాషాయవస్త్రములు ధరించువానికి దేనియందభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగ కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియవేసికొని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకొని పోయెదరు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలిసికొని నీ కర్తవ్యమును జేయుము, ఇహలోక పరలోక వస్తువు లన్నిటియందు గల యభిమానమును విడిచి పెట్టుము. ఎవరయితే ఈ ప్రకారముగ జేసి హరియొక్క పాదములను శరణు వేడెదరో, వారు సకలకష్టములనుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరయితే ప్రేమభక్తులతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో, వారికి దేవుడు పరుగెత్తిపోయి, సహాయము చేయును. నీ పూర్వపుణ్య మెక్కువగుటచే నీ విక్కడకు రాగలిగితివి. నేను చెప్పినదానిని జాగ్రత్తగ విని, జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడవై, రేపటినుండి భాగవతమును పారాయణ చేయము. శ్రద్ధతో మూడు సప్తాహములను చేయుము. భగవంతుడు సంతుష్టిజెంది నీ విచారములను దొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును” అనిరి. అతని మరణము సమీపించినందున, బాబా అతని కీ విరుగుడు నుపదేశించెను. మృత్యుదేవతకు ‘రామవిజయము’ ప్రీతి యగుటచే దానిని చదివించెను. ఆ మరుసటి యుదయము స్నానము మొదలగునవి యాచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండీ తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. రెండు పారాయణములు చెయగనే యలసిపోయెను. వాడాకు వచ్చి రెండు దినము లుండెను. మూడవరోజు ఫకీరు (బడే) బాబా తొడపై ప్రాణములు వదలెను. బాబా ఒకరోజంతయు శవము నటులే యుంచుడనెను. పిమ్మట పోలీసువాండ్రు వచ్చి, విచారణ జరిపిన పిమ్మట శవసంస్కారమున కాజ్ఞ నిచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా సన్యాసి సద్గతికి సహాయపడెను.

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles