Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice By: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
రెండవ రోజు పారాయణము
శుక్రవారము
ఎనిమిదవ అధ్యాయము
మానవజన్మ యొక్క ప్రాముఖ్యము; బాబా యొక్క భిక్షాటనము; బాయిజాబాయి
యొక్క ఎనలేని సేవ; ముగ్గురి పడక స్థలము; రహతా నివాసి కుశాల్‌చంద్
మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము :
ఈ యద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి యున్నాడు. దేవ యక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వానిని సృష్టించెను.
స్వర్గము, నరకము, భూమి, మహా సముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి యంతయు సృష్టించెను.
వీరిలో నెవరి పుణ్యమెక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము ననుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు.
ఎవరి పాపమెక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు.
పాప పుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై యవకాశము గాంచెదరు.
వారి పాప పుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేల మోక్షముగాని, పుట్టుక గాని వారు వారు చేసికొనిన కర్మపై ఆధారపడి యుండును.
మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ :
జీవకోటి యంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికివిగాక మరొక్క ప్రజ్ఞ గలదు. అదియే జ్ఞానము.
దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందును దీని కవకాశము లేదు.
ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడ భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు.
కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు; చీము, రక్తము, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు, మరణమునకు కారణమగుననియునందురు. కొంతవరకది కూడ నిజమే.
ఇన్ని లోపములున్నప్పటికి మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు.
శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి, ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది, నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్సాక్షాత్కారమును బొందుచున్నాడు.
శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరగినచో నరకమున బడెదము.
ఉచిత మార్గమేమన, దేహమును నశ్రద్ధ చేయకూడదు; దానిని లోలత్వముతో పోషింపనూ గూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసికొనవలెను.
గుఱ్ఱపు రౌతు తన గమ్యస్థానము చేరువరకు గుఱ్ఱమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో యంత జాగ్రత్త మాత్రమే తీసికొనవలెను.
ఈ శరీరమును మోక్షసాధన, లేక యాత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధియై యుండవలెను.
భగవంతుడనేక జీవులను సృష్టించినప్పటికి అతనికి సంతుష్టి కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవియు గ్రహించలేక పోయినవి.
అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తి నిచ్చెను.
మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, శేముషీ విజ్ఞానములను జూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి జెంది యానందించును.
అందుచే మానవజన్మ పొందుట లభించుట గొప్ప యదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటి కంటె గొప్పది సాయిబాబా చరణార విందములపై సర్వస్య శరణాగతి చేయునవకాశము కలుగుట.
మానవుని విద్యుక్త ధర్మము :
మానవజన్మ విలువైనదనియు, దానికెప్పటికైననూ మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడు జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలయును.
ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను.
భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొఱకెంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి యెంతగా వెదక యత్నించునో యటులనే, విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి యాత్మ సాక్షాత్కారమును సంపాదించవలెను.
బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమొనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదుము.
తక్షణ కర్తవ్యము :
మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన, వెంటనే భగవత్సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట.
ఆధ్యాత్మికోపన్యాసము లెన్ని వినినప్పటికి పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియునగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును.
నక్షత్రములన్నియు కలిసి యివ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో యట్లనే ఆధ్యాత్మికోప న్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు.
వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు.
శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీన మందుంచు కొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి, భక్తులు నేర్చుకొందురు.
వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా యట్టి మహాపురుషుడు; సద్గురువు.
బాబా సామాన్య ఫకీరువలె సంచరించుచున్నప్పటికి వారెప్పుడును ఆత్మానుసంధానము నందే నిమగ్నులగుచుండిరి.
దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన క్రుంగిపోవువారు కారు. రాజైననూ, నిరుపేదైననూ వారికి సమానమే.
తమ దృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగల శక్తి యున్నప్పటికి బాబా ఇంటింటికి తిరిగి భిక్ష నెత్తెడివారు ! వారి భిక్ష యెట్టిదో చూతము.
బాబా యొక్క భిక్షాటనము :
షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా, వారి యిండ్ల యెదుటనే గదా బాబా భిక్షుకుని వలె నిలచి, ”అమ్మా ! రొట్టెముక్క పెట్టు” డనుచు, దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు !
చేత ఒక రేకు డబ్బా పట్టుకొని, భుజానికి ఒక గుడ్డజోలె తగిలించుకొని భిక్షాటనకు పోయెడివారు. బాబా కొన్ని యిండ్లకు(1. వామనరావు గోండ్కర్, 2. సఖారం పాటిల్ షెల్కే, 3. బయ్యాజి అప్పా కోతే పాటిల్, 4. బాయిజ బాయి కోతే పాటిల్, 5. నందురాం మర్వాడి alias నందలాల్ సంకలేచ) మాత్రమే భిక్షకు పోయెడివారు.
పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసికొనెడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనెడివారు.
బాబాకు రుచి యనునది లేదు. వారు జిహ్వను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్ని పదార్థములను రేకుడబ్బాలోను, జోలెలోను వేసికొనెడివారు.
అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి యనునది లేనట్లే కాన్పించు చుండెను.
బాబా భిక్షకు యొక పద్ధతి, కాలనియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని యిండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసెడివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళెడివారు.
భిక్షలో దొరికిన పదార్థముల నన్నింటిని ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు.
మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టెముక్కలను నిరాటంకముగా తీసికొనుచుండెడిది. కుక్కలను, పిల్లులను గూడ కలలో సైతము అడ్డు పెట్టనివారు, ఆకలితో నున్న పేదల ఆహారమునకు అడ్డుచెప్పుదురా ?
”ఫకీరు పదవియే నిజమైన మహారాజ పదవియనీ, అదియే శాశ్వతమనీ, మామూలు సిరిసంపదలు క్షణ భంగురాలనీ”, బాబా యనుచుండెడివారు. ఆ పావన చరితుని జీవితము వంటి జీవితమే గదా మిగుల ధన్యమైనది !
మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి ఫకీరని భావించి, అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టెముక్కలకై గ్రామములో భిక్షనెత్తి పొట్టపొసికొనెడు పేద ఫకీరన్న ఎవరికి గౌరవమేమియుండును ?
కానీ, యీ ఫకీరు పరమ విశాలహృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశ మాత్రము లేని నిరాసక్తుడు.
బాహ్యదృష్టికి వారు చంచలునిగను, స్థిరత్వము లేనివారుగను గాన్పించినను, లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి.
ఆ కుగ్రామములో కూడ బాబాను ఒక గొప్ప మహాత్మునిగ గుర్తించి, సేవించిన ధన్యజీవులు కొద్దిమంది గలరు. అట్టివారిలో నొకరి వృత్తాంతమిక్కడ చెప్పబోవుచున్నాను.
బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ :
తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని,
సమీపముననున్న చిట్టడివిలో ముండ్లు పొదలు లెక్కచేయక క్రోసుల కొద్ది దూరము నడచి, ఆత్మధ్యానములో నిశ్చలముగ యెక్కడో కూర్చునియున్న బాబాను వెదకి పట్టుకొని, భోజనము పెట్టుచుండెను.
బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి, వారి యెదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి, కొసరి కొసరి వాటిని బాబాచే తినిపించు చుండెను.
ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీలును యెంతో ఆదరించి ఉద్ధరించెను.
ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా యడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి.
అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతకి పట్టుకొను శ్రమ బాయిజాబాయికి తప్పినది.
ముగ్గురి పడక స్థలము :
ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు; అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప యదృష్టవంతులు.
తాత్యాకోతే పాటీలు, మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించెడివారు.
బాబా వారిరువురితో కలసి, మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి, మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకొనెడివారు.
ప్రక్కలు పరచుకొని, వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చడించుకొనెడివారు. అందులో నెవరికైన నిద్ర వచ్చుచున్నటుల గాన్పించిన తక్కినవారు వారిని మేల్కొలుపు చుండిరి.
తాత్యా పండుకొని గుఱ్ఱుపెట్టినచో బాబా వానిని యటు నిటు ఊపి, వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున జేర్చుకొని, అతని కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు.
ఈ విధముగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువరానివి;
వారి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవికానిది. తండ్రి మరణించిన(ది.03.01.1912) పిమ్మట తాత్యా గృహబాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను.
రహతా నివాసి కుశాల్‌చంద్ :
షిరిడీలో (తాత్యా తండ్రిగారైన) గణపతిరావుకోతే పాటీలును బాబా ఎంత ప్రేమాభిమానములతో జూచెడివారో, అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసియగు చంద్రభాను శేట్ మార్వాడీని జూచుచుండిరి.
ఆ శేట్ మరణించిన పిమ్మట అతని యన్న కొడుకగు కుశాల్‌చందును గూడ మిక్కిలి ప్రేమతో జూచుచు అహర్నిశలు వాని యోగక్షేమ మరయుచుండిరి.
ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడెద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలసి రహతా పోవువారు.
రహతా ప్రజలు బాజా భజంత్రీలతో యెదురేగి, బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి, సాష్టాంగ నమస్కారములు చేసెడివారు.
తరువాత మహా వైభవముగ బాబాను గ్రామములోనికి సాదరముగ తీసుకొని వెళ్ళెడివారు.
కుశాల్‌చందు బాబాను తన యింటికి తీసికొనిపోయి తగిన యాసనము నందు కూర్చుండజేసి భోజనము పెట్టెడివాడు.
ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చడించుకొనెడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండెడివారు.
షిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు (దక్షిణమున) రహతా, మరోవైపు (ఉత్తర దిశయందు) నీమ్‌గాం ఉన్నవి.
ఈ రెండు గ్రామములు దాటి బాబా యెన్నడు ఎచ్చటికి పోయి యుండలేదు. వారెన్నడూ రైలుబండిలో ప్రయాణము చేసి యెరుగరు;
రైలుబండిని కనీసము చూచి కూడా యుండలేదు. కానీ, సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగ తెలియుచుండెడివి.
బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి యాజ్ఞానుసారము ప్రయాణము చేయువారలకేకష్టములుండెడివి కావు.
బాబా యాదేశమునకు వ్యతిరేకముగ పోవు వారనేక కష్టముల పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలను, మరికొన్ని ఇతర విషయములను రాబోవు యధ్యాయములో చెప్పెదను.
ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఏబది యొకటవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹మొదటి అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదనొకండవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹నలుబదియారవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments