🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹18-19 అధ్యాయములు🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice by: R C M Raju and team


🌹సాయిబాబా..సాయిబాబా…సాయిబాబా..సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

18-19 అధ్యాయములు

ప్రస్తావన; సాఠే; శ్రీమతి రాధాబాయి దేశముఖ్‌; మన ప్రవర్తన గూర్చి బాబా

యుపదేశము; సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి

జూపుట; ఉపదేశములో వైవిధ్యము-నింద గూర్చి బోధ; పనికి తగిన ప్రతిఫలము

గత రెండు అధ్యాయములో బ్రహ్మజ్ఞానము నభిలషించు ఒక ధనికుని బాబా యెట్లు ఆదరించెనో హేమాడ్‌పంత్‌ వర్ణించెను.

రాబోవు రెండు అధ్యాయములలో హేమాడ్‌పంత్‌ను బాబా యెట్లు ఆమోదించి యాశీర్వదించెనో, బాబా యెట్లు తమ భక్తులలో మంచి యాలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో,

ఆత్మోన్నతి గూర్చి, పరనింద గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతి ఫలమును గూర్చి, బాబా వారి ప్రబోధము లెట్టివో వర్ణింతుము.

పస్తావన :

సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి, వారి మనస్సు కలత చెందకుండ తగిన బోధచేసి, తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయమందరికి తెలిసినదే.

ఈ విషయములో సద్గురవు బోధించిన దానిని నితరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు.

అట్లు గురువు బోధించినదానిని వెల్లడిచేసినచో ఆ బోధలు నిష్పయోజనములగునని వారి యాలోచన. ఇది సరియైనది కాదు.

సద్గురువు వర్షాకాలపు మేఘమువంటివారు. వారు తమ యమృత తుల్యములైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు.

వానిని మనమనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని, పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలుకొరకు వెల్లడి చేయవలెను.

ఇది వారు మన జాగ్రదవస్థలోనే గాక స్వప్నావస్థలో కూడ తెలియజేయు విషయములకు వర్తించును.

తన స్వప్నమందు గనిన ‘రామరక్షా స్తోత్రము‘ను బుధ కౌశిక ఋషి ప్రచురించిన యుదాహరణము నిచ్చట స్మరించవలెను.

ప్రేమగల తల్లి, గుణమిచ్చు చేదైన యౌషధములను బిడ్డ మేలుకొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయునట్లు, ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు.

వారి మార్గము రహస్యమైనది కాదు. అది బహిరంగమైనది. వారి బోధల ననుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరెడిది.

సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి యాత్మ యొక్క దైవీ సౌందర్యములను జూపి మన కోరికలను నెరవేర్చెదరు.

ఇది జరిగిన పిమ్మట, మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి, వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును.

నిద్రలో కూడ ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి, వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును.

భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి, మన కష్టములను, బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును.

ఈ యభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతునివలె కొలువవలెను.

కాబట్టి మనము సద్గురువును వెదకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ యధ్యాయములోని ముఖ్యకథను ప్రారంభించెదము.

సాఠే :

సాఠే యనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను.

అంతేగాక మరికొన్ని సమస్య లతనిని చీకాకు పరచెను. అందుచే నతడు విచారగ్రస్తుడయ్యెను. విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే నిల్లు విడిచి చాలా దూరము పోవలెననుకొనెను.

మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు గాని, కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును.

వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపజేయును.

వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును జూచెదరు. సాఠేగారికి కూడ అట్టి యనుభవము కలిగెను.

అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి యనేకమంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు గూడ నెరవేరుచుండెను.

సాఠేగారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో షిరిడీకి వచ్చెను.

అచ్చట శాశ్వత బ్రహ్మవలె స్వయం ప్రకాశుడై, నిర్మలుడు, శుద్ధ స్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే యతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను.

వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమయిన పాదసేవ లభించెను.

అతడు గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలు పెట్టెను.

7 రోజులలో చరిత్ర చదువుట పూర్తికాగానే బాబా యానాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది యిట్లుండెను :

బాబా గురుచరిత్రము చేతిలో బట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు, అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు జూపెను.

సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను.

అజ్ఞానమనే నిద్రలో గుఱ్ఱుపెట్టి నిద్రపోవుచున్న తనవంటివారిని లేపి, గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ద్రహృదయమె గదా యనుకొనెను.

ఆ మరుసటి దినమాదృశ్యమును కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయి యుండునో సాయిబాబా నడిగి తెలుసుకొనుమనెను.

ఒక సప్తాహము చాలునో లేక యింకొక సప్తాహము పారాయణము చేయవలెనో కనుగొనమనెను.

కాకాసాహెబు సమయము చూచి బాబాను ఇట్లడిగెను, ”ఓ దేవా ! యీ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి ? అతడూరకొన వలెనా లేక యింకొక సప్తాహము పారాయణము చేయవలెనా ?

అతడు అమాయిక భక్తుడు; అతని కోరిక నెరవేరవలెను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను. వాని నాశీర్వదింపు”డన

బాబా, ”అతడు గురుచరిత్ర మింకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో నాతడు పావనుడగును;

మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచబంధముల నుండి తప్పించును !” అనెను.

ఆ సమయమున హేమాడ్‌పంతు అచ్చట నుండి, బాబా కాళ్ళ నొత్తుచుండెను. బాబా పలుకులు విని యతడు తన మనస్సులో నిట్లనుకొనెను:

”సాఠే యొక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా! నేను నలుబది సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను గాని నాకు ఫలితము లేదు గదా !

అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేనో 7 సంవత్సరముల నుంచి యున్నాను. నా ప్రయత్నములు నిష్పలమా యేమి ?

చాతకపక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని యున్నట్లు నేను కూడ బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని యున్నాను”.

ఈ ఆలోచన వాని మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులలో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు.

అంతియేగాక, చెడ్డ యాలోచనలను అణచుచు, మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు.

హేమాడ్‌పంతు మనస్సును గనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి, శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని, అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను.

బాబా మనస్సున కారుణ్యోదయమయ్యెను. కాన వారిట్లాజ్ఞాపించిరి. బాబా యాజ్ఞను జవదాటగల వారెవరు ?

హేమాడ్‌పంత్‌ వెంటనే మసీదు విడచి శ్యామా గృహమునకు పోయెను. అప్పుడే యతడు స్నానము చేసి ధోవతి కట్టుకొనుచుండెను.

అతడు బయటకు వచ్చి హేమాడ్‌పంత్‌ నిట్లడిగెను : “మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏల యున్నారు ? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే !

మీరేల చీకాకుతో చంచలముగా నున్నారు ? మీ రొంటరిగా వచ్చినారేల? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈలోగా తాంబూలము వేసికొనుడు.

పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడు కొనెదము!” ఇట్లనుచు నతడు లోపలికి పోయెను.

హేమాడ్‌పంతు ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో ఏకనాథ భాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని యేకాదశస్కంధమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము.

సాయిబాబా సిఫారసు చేయుటచే బాపూసాహెబు దీక్షితు (శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణా రూపమైన) భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థదీపిక (జ్ఞానేశ్వరి), శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణా రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండెడివాడు.

భక్తులు వచ్చి బాబాను ఏదైన ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి, అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు.

భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి, ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను.

హేమాడ్‌పంతు కూడ నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు.

హేమాడ్‌పంత్‌ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథభాగము పూర్తిచేయకయే కొందరు భక్తులతో కలసి మసీదుకు పోయెను.

శ్యామా ఇంటి కిటికీలో నున్న ఏకనాథ భాగవతము తీయగా తానానాడు పూర్తిచేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను.

తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తననచ్చటకు పంపెనని హేమాడ్‌పంత్‌ యనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తిచేసెను.

పిమ్మట శ్యామా తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను.

హేమాడ్‌పంతు : నేను బాబా వద్ద నుండి యొక కబురు తీసికొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసికొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి యున్నారు.

అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి.

శ్యామా : (ఆశ్చర్యముతో) నా వద్ద డబ్బులేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము.

హేమాడ్‌పంతు : సరే నీ నమస్కారము లామోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనెదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలను, కథలను చెప్పుము.

శ్యామా : అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని (బాబా) లీలలు మిక్కిలి యాశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియును.

నేను పల్లెటూరి వాడను; నీవు చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే యుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను?

సరే యీ తమలపాకులు వక్క సున్నము తీసికొని తాంబూలము వేసికొనుము. నేను లోపలకు బోయి దుస్తులు ధరించి వచ్చెదను.

కొద్ది నిముషములలో శ్యామా బయటికి వచ్చి హేమాడ్‌పంతుతో మాట్లాడుచు కూర్చొనెను. అతడిట్లనియెను :

”ఈ దేవుని (బాబా) లీల కనుగొనశక్యము కానిది. వారి లీలల కంతులేదు. వానినెవరు గమనించగలరు? వారీ లీలలతో వినోదించు నట్లగుపడినను వారు వాని  నంటినట్లు కాన్పించరు.

మావంటి జానపదులకేమి తెలియును ? బాబాయే యీ కథల నెందుకు చెప్పరాదు ? నీవంటి పండితులను నావంటి పామరునివద్ద కేల పంపుచున్నారు ? వారి మార్గములు ఊహింపరానివి.

అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ”ఈ యుపోద్ఘాతముతో శ్యామా యిట్లనెను : ”నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియును.

భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో, బాబా యంత త్వరగా వానికి సహాయపడును.

ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము నిచ్చును”. (ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశము).

ఉపదేశమనుమాట విన్నతోడనే హేమాడ్‌పంత్‌ మనస్సులో నొక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను.

తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపి యుండుననుకొనెను. అయినప్పటికి ఈ భావము నణచుకొని, శ్యామా చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను.

ఆ కథలన్నియు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమాడ్‌పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామా ఈ దిగువ కథను చెప్పదొడంగెను.

శ్రీమతి రాధాబాయి దేశ్‌ముఖ్‌ :

రాధాబాయి యను యొక ముసలమ్మ యుండెను. ఆమె ఖాశాబా దేశ్‌ముఖ్‌గారి తల్లి.

బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తిచెందెను.

ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసికొని యేదైన యుపదేశమును పొందవలెనని మనోనిశ్చయము చేసికొనెను.

ఆమెకింకేమియు తెలియకుండెను. బాబా యామె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను.

ఆమె తన బసలోనే యుండి భోజనము, నీరు మానివేసెను. అట్లు మూడు రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను (శ్యామా) భయపడి యామె పక్షమున బాబాతో నిట్లంటిని.

”దేవా ! మీరేమి ప్రారంభించితిరి ? నీ వనేకమంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని నీవెరిగియే యుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడియున్నది.

ఆమె చచ్చువరకు ఉపవసింప నిశ్చయించుకొనియున్నది. నీవు ఆమె ననుగ్రహించి ఉపదేశమిచ్చునంతవరకామె తన నిరాహారదీక్షను మానదు.

ఆమెకేమైన హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశమివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు.

కాబట్టి యామెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము !” ఆమె మనో నిశ్చయము జూచి, బాబా యామెను బిలిపించి, ఈ క్రింది విధముగా బోధించెను :

”ఓ తల్లీ ! అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నావు! నీవు నిజముగా నా తల్లివి; నేను నీ బిడ్డను.

నాయందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము ! నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును.

నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు; మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలాకాలము శుశ్రూష చేసితిని, కాని నా చెవిలో వారే మంత్రము నూదలేదు.

నాకు వారిని వదలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే యుండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది.

వారు నా తల గొరిగించిరి; నా నుండి రెండు పైసలు దక్షిణ యడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని.

‘మీ గురువుగారు పూర్ణకాములయినచో వారు మిమ్ములను దక్షిణ యడుగనేల ? వారు నిష్కాములని యెట్లనిపించుకొందురు ?’ అని నీవడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను.

వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయున దేమున్నది ? వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో గూడిన ఓరిమి! నేనీ రెంటినీ వారి కర్పించితిని. వారు ప్రసన్నులైరి.

”నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించితిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు.

వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను ? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే యుండరు.

నిరంతర ధ్యానములో నున్న వారిని తదేకముగ జూచుచుండెడివాడను. మేమిద్దరమానందములో మునిగెడివారము.

రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారివైపు దృష్టి నిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొటి లేకుండెను. వారే నాయాశ్రయము.

నా మనస్సు ఎల్లప్పుడు వారియందే నాటుకొని యుండెడిది. ఇదియే వారడిగిన దక్షిణలో ఒక పైస.

‘సబూరి’ (సంతోష స్థైర్యములతో గూడిన ఓరిమి) యనునది రెండవ పైసా. నేను మిక్కిలి సంతోషముతో చాలాకాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని.

ఈ ప్రపంచమనే సాగరమును ‘సబూరి’ యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును.

సబూరి యనునది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నిటిని తొలగించును; కష్టములను పారద్రోలును.

అనేక విధముల అవాంతరములను తొలగించి, భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగజేయును.

సబూరి యనునది సుగుణములకు గని, మంచి యాలోచనకు తోడువంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెండ్ర వంటివి.

”నా గురువు నానుండి యితరమేమియు ఆశించి యుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు.

నేను వారితో కలసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను, వారి ప్రేమకు ఎన్నడును లోటు కలుగలేదు.

వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు, నన్ను గూడ నా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివారు.

తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండును. బిడ్డ తాబేలు రెండవ యొడ్డున ఉండును.  తల్లి తాబేలు  పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట గాని, పాలిచ్చుట గాని చేయదు.

తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దవి యగును. అటులనే మా గురువు కూడ తమ దృష్టిని నా యందు నిల్పి, నన్ను ప్రేమతో గాపాడిరి.

ఓ తల్లీ ! నా గురువు నాకు మంత్రమేమియు నుపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను?

గురువు యొక్క ప్రేమమయమయిన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపకముంచుకొనుము.

మంత్రముగాని యుపదేశము గాని యెవ్వరి వద్దనుండి గాని పొందుటకు ప్రయత్నించకుము. నీయాలోచనలు, నీవు చేయు పనులు నాకొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు.

నాపైన సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను.

ఏ సాధనలు గాని యారు శాస్త్రములలో ప్రావీణ్యముగాని యవసరము లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసముల నుంచుము.

గురువే సర్వమును చేయువాడనియు, కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడని యెంచెదరో వారే ధన్యులు” !

ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యా ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదలుకొనెను.

ఈ కథను జాగ్రత్తగాను, శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును, సందర్భమును గుర్తించి, హేమాడ్‌పంతు మిక్కిలి యాశ్చర్యపడెను.

ఈ యాశ్చర్యకరమైన బాబా లీలను జూచి అతని యాపాదమస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యారిపోయెను.

ఒక్క మాటైన మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామా అతని నీ స్థితిలో జూచి ”ఏమి జరిగినది ? ఏల యూరకున్నావు ? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను” ? అని అడిగెను.

అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి.

కనుక శ్యామా, హేమాడ్‌పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపూసాహెబు జోగు అప్పుడే హారతి ప్రారంభించెను.

స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరు బాజా భజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామా; ముందర హేమాడ్‌పంతు కూర్చొనిరి.

వారిని జూచి బాబా హేమాడ్‌పంతును శ్యామా యిచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామా రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చెననియు, శ్యామా ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చుననెను.

బాబా యిట్లనెను : ”సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకొంటిరా ? అట్లయినచో మీరేమి మాట్లాడుకొనినారో చెప్పుము”.

గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్‌పంతు బాబాకు జరిగిన దంతయు చెప్పటకు ఆతురపడెను.

తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి యాశ్చర్యము కలుగజేసినదనియు,

దానిని విని బాబా లీలలు అగోచరములని తెలిసికొంటిననియు ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్‌పంతు చెప్పెను.

అప్పుడు బాబా ”కథ చాలా అద్భుతమైనది. నీవెట్టుల ఆనందించితివి ? నాకా విషయమై వివరములన్నియు చెప్పుము” అనిరి.

అప్పుడు హేమాడ్‌పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, యది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను.

ఇది విని బాబా మిగుల సంతసించెను. ”ఆ కథ నీకు నచ్చినదా ? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా” ? యని బాబా హేమాడ్‌పంతునడిగెను.

”అవును బాబా నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్యమార్గమును కనుగొనగలిగితిని” అని హేమాడ్‌పంతు బదులిచ్చెను.

బాబా యిట్లు చెప్పెను. ”నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది ! ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము. అది మిక్కిలి యుపయోగించును.

ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానమవసరము. దాని నలవరచుకొన్నచో వృత్తులన్నియు శాంతించును. కోరికలన్నియు విడచి నిష్కామివై, నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుని ధ్యానింపుము.

మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము ! అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము.

మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నాయీ యాకారమును ధ్యానించుడు.

అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల బేధము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై, బ్రహ్మముతో నభిన్నమగును.

తల్లి తాబేలు నదికి నొక యొడ్డున నుండును. దాని పిల్ల లింకొక యొడ్డున నుండును. తల్లి వానికి పాలిచ్చుటగాని, పొదుపుకొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది.

చిన్న తాబేళ్ళు ఏమి చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి యమృత ధారవలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము.గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే”. బాబా యీ మాటలు పూర్తిచేయుసరికి, హారతి పూర్తియాయెను.

అందరు ‘శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్‌ మహారాజ్‌కి జై’ యని జయ జయ ధ్వానములు చేసిరి.

ఓ ప్రియ పాఠకులారా ! యీ సమయమందు మనము కూడ మసీదులోని జనసమూహముతో కలిసి యున్నట్లు భావించి, మనము కూడ ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందము.

హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచి పెట్టిరి. బాబాకు నమస్కరించి బాపూసాహెబు జోగ్‌ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను.

బాబా దాని నంతను హేమాడ్‌పంత్‌ చేతిలో పెట్టి యిట్లనెను : ”ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో, నీ స్థితి కలకండవలె తియ్యగా నుండును. నీ కోరికలన్నియు నెరవేరును. నీవు సుఖముగా నుందువు”.

హేమాడ్‌పంతు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి, ”ఇట్లు ఎల్లప్పుడు నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము !” అని ప్రార్థించెను.

అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. ”ఈ కథను వినుము. దీనిని మననము చేయుము. నిధి ధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడు జ్ఞప్తి యందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందుర ప్రత్యక్షమగును”.

ఓ ప్రియమైన చదువరులారా ! అప్పుడు హేమాడ్‌పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము.

దానిని హృదయపూరితముగా సేవించి, ధ్యానించి, మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను, సంతోషముగాను నుండెదము. తథాస్తు !

19వ అధ్యాయము చివర హేమాడ్‌పంతు కొన్ని యితర విషయములను జెప్పియున్నారు. అవి యీ దిగువ పొందుపరచితిమి.

మన ప్రవర్తన గూర్చి బాబా యుపదేశము :

ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవయినప్పటికి అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని యట్లే చేసినచో నవి మనకు మేలు చేయును.

”ఏదైన సంబంధముండనిదే యొకరు ఇంకొకరి వద్దకుపోరు. ఎవరుగాని యేట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చినచో నిర్ధాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని సాదరముగ చూడుము.

దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో నున్న వారికి అన్నము పెట్టినచో, బట్టలు లేనివారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా యితరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసికొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి జెందును.

ఎవరైన ధనసహాయము గోరి నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుట కిష్టము లేకున్న నీవు ఇవ్వనక్కరలేదు. కాని వానిపై కుక్కవలె మొఱగవద్దు.

ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబు నివ్వకుము. అట్టి వానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును.

ప్రపంచము తలక్రిందులైనప్పటికి నీవు చలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి, నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము.

నీకు, నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గమేర్పడును.

నాకు నీకు బేధము గలదనునదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపజేయనిది మనకు ఐక్యత కలుగదు.

‘అల్లామాలిక్‌ !’ భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరు మనలను కాపాడువారు కారు.

భగవంతుని మార్గమసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి యిచ్ఛానుసారమే మనము నడచెదము.

మన కోరికలను వారు నెరవేర్చెదరు. మనకు దారి చూపెదరు. ఋణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి, ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందము గాక.

ఎవరయితే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కినవారందరు పేరునకే ఊపిరి సలుపువరకు మాత్రమే బ్రతికెదరు”.

సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట:

సాయిబాబా సద్విచారముల నెట్లు ప్రోత్సహించుచుండెనో తెలిసికొనుట మిగుల ఆసక్తికరముగా నుండును.

భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియును.

ప్రక్కనుంచి లేవగనే నీకేమయిన మంచి యాలోచన కలిగిన, దానిని తరువాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును. నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్‌పంతు దీనికై ప్రయత్నించదలచెను.

ఒక బుధవారము రాత్రి పండుకొనేటప్పుడిట్లనుకొనెను. రేపు గురువారము. శుభదినము. షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామస్మరణతోనే కాలము గడపెదను అని నిశ్చయించుకొని పరుండెను.

ఆ మరుసటి దినము లేవగనే, రామనామము ప్రయత్నము లేకుండ జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను.

కాలకృత్యములు దీర్చుకొనిన పిమ్మట బాబాను జూచుటకు పువ్వులను దీసుకొని పోయెను. దీక్షిత్‌వాడా విడిచి బూటీవాడా దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను.

ఔరంగాబాదు నుంచి వచ్చినవాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాధ్‌ మహరాజ్‌ రచించిన ‘గురుకృపాంజన పాయో మేరే భాయి’ యనునది.

గురువు కృపయను అంజనము లభించెను. దాని మూలమున తన కండ్లు తెరువబడెననియు, దానిచే తాను శ్రీరాముని లోన, బయట, నిద్రావస్థలోను, జాగ్రదవస్థలోను, స్వప్నావస్థలోను నన్నిచోట్లను చూచితినని చెప్పెడు పాట యది.

అనేక పాటలుండగ బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి యీ పాట నేల పాడెను ? ఇది సందర్భానుసారముగ బాబా చేసిన ఏర్పాటు కాదా?

హేమాడ్‌పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుప నెంచినవాడు గావున నాతని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా యీ పాటను పాడించి యుండును.

రామనామ స్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును.

ఉపదేశములో వైవిధ్యము – నిందగూర్చి బోధ :

శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలముగాని, ప్రత్యేక సమయముగాని యక్కరలేదు. సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను.

ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త  సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను.

మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును.

యోగులు నిందల నింకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట కనేక మార్గములు గలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును.

ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లన, వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు.

కావున తిట్టబడినవాడు, తిట్టినవానికి కృతజ్ఞతలు తెలుపవలెను ! అట్లు పరనిందకు పాల్పడువానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది.

నిందించువాడు చేసిన యపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండీతోటకు పోవునపుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికొక పందిని జూపి యిట్లనెను,

”చూడుము ! ఈ పంది అమేథ్యమును యెంత రుచిగా తినుచున్నదో ! నీ స్వభావము కూడా అట్టిదే ! ఎంత ఆనందముగ నీ సాటి సోదరుని తిట్టుచున్నావు.

ఎంతయో పుణ్యము జేయగ నీకీ మానవజన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడునా ?” భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను.

ఈవిధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్ల ఉపదేశించు చుండెడివారు. ఈ యుపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు.

ఒక లోకోక్తి కలదు. ”నా దేవుడున్నచో నాకు మంచముపైని కూడ బువ్వ పుట్టును”. అది భోజనము, వస్త్రములను గూర్చి చెప్పినది.

ఎవరయిన దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసిన నంత మేలు.

బాబా తాను సర్వాంతర్యామినని చెప్పెడివారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు.

ఆ కనిపించెడి మూడున్నర మూరల దేహమే బాబాయని అనుకున్నవారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమెత్తిరి.

బాబాకు సర్వస్య శరణాగతిచేసి, అహర్నిశలు వారినే ధ్యానించినచో, చక్కెర – తీపి, కెరటములు – సముద్రము, కన్ను – కాంతి కలిసియున్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యతను పొందెదరు.

ఎవరయితే చావుపుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడుపవలెను. ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు.

మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మల నాచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు.

ఎవరయితే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని, యితరులకు చెప్పెదరో, ఇతర విషయములేమియు నాలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారము పొందుదురు.

అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకొని, శరణువేడు మనెను.

‘తానెవరు’ అనుదానిని తెలిసికొనగోరు వారికి శ్రవణమును మననమును చేయుమని సలహా యిచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి యందుంచు కొనుమనువారు.

కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి అధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట,

కొందరికి తమ పాదములవద్ద కూర్చొనుమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు బంపుట, కొందరికి విష్ణు సహస్ర నామములు, కొందరికి ఛాందోగోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయుమని విధించుచుండెను.

వారి ఉపదేశములకు పరిమితి లేదు; అడ్డులేదు. కొందరికి స్వయముగా ఉపదేశము నిచ్చువారు; కొందరికి స్వప్నములో నిచ్చేవారు.

ఒక త్రాగుబోతు(డి.వి. సంభారే) కు స్వప్నములో గనిపించి ఛాతీపైన కూర్చొని అదుముచూ, ఇక యెన్నడూ త్రాగనని అతడు వాగ్ధానము చేసిన పిమ్మట వదలిరి.

కొందరికి స్వప్నములో ‘గురుబ్రహ్మాది’ మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి.

వారి మార్గములను జెప్పుట కలవి గాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలో నొకటి.

పనికి తగిన ప్రతిఫలము :

బాబా ఒకనాడు మిట్టమధ్యాహ్నము రాధాకృష్ణమాయి యింటి సమీపమునకు వచ్చి ”నిచ్చెన తీసికొని రమ్ము” అనెను.

ఒకడు పోయి దానిని తెచ్చి యింటికి చేరవేసెను. బాబా వామనగోండ్‌కర్‌ యింటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి యింటి పై కప్పును దాటి ఇంకొక ప్రక్క దిగెను.

బాబా యభిప్రాయమేమో యెవరికిని తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను.

ఆమె జ్వరమును తొలగించటకై బాబా యిట్లు చేసియుండునని యనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి(వెంకూ షింపే కాంబ్లేకర్‌) బాబా రెండు రూపాయలు ఇచ్చెను.

ఎవడో ధైర్యముచేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి రెండు రూపాయలేల యివ్వవలెనని బాబాను ప్రశ్నించెను.

ఒకరి కష్టము నింకొకరుంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వముతోను ధారాళముగ నివ్వవలెనని బాబా చెప్పెను.

బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పనిచేయించేవాడు, పని చేసే వారలు కూడ సుఖపడెదరు.

సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి, కష్టపడి కూలి చేయువాండ్రకు మనః స్పర్ధలుండవు.

18-19 అధ్యాయములు సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles