Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అప్పటి జామ్నెరు లీల అంటే నానాసాహెబ్ మమలతా దారు గా వుండటం , ఆయన కుమార్తె మైనతాయి కి ప్రసవం కష్టమవటం,
బాబా రాం గిరి బువా ద్వారా ఊదీ మరియు, మాధవ్ ఆర్కడ్ రాసిన ” ఆరతి సాయి బాబా” పాట పంపించడం,
రాంగిరి బువా జలగాం వరకే తన దగ్గర ఉన్న ధనం సరిపోతాయి అంతకు మించి ముందుకు వెళ్ళడానికి ధనం సరిపోదు అనడం,
అన్నీ సమకూరుతాయి అని బాబా చెప్పడం జలగాం రైల్వే స్టేషన్ దగ్గరికి టాంగా రావడం మధ్యలో ఫలహారాలు పెట్టడం,
ఊరు దగ్గరికి వచ్చేటప్పటికి టాంగా మాయం అవటం, రాంగిరి బువా కచేరి కి వెళ్లి నానా సాహెబ్ చాందోర్కర్ గారి ఇల్లు ఎక్కడా అని అడగటం అక్కడి వారు చెప్పటం,
వారింటికి వెళ్లి ఊదీని, హారతి పాటను చాందోర్కర్ కి ఇవ్వడం ఊదీ ని నీళ్లలో కలిపి మైనతాయి కి తాగించడం, హారతి పాటను పడుకోవడం వెంటనే ఆ తల్లికి సుఖ ప్రసవం జరిగిపోవడం,
సమయానికి ఊదీ తెచ్చినందుకు నానా సాహెబ్ చాందోర్కర్ కృతజ్ఞతలు చెబితే నాదేమీ లేదు మీరు సమయానికి టాంగా పంపించినందుకే నేను సమయానికి రాగలిగాను అని ఆయన అనటం
మీరు శిరిడీ నుండి వస్తున్న విషయమే నాకు తెలియదు. నేను టాంగా పంపించలేదు అని చెప్పడం,
జనగాం స్టేషన్ లో బాపూ గిర్ బువా అని రాంగిరి బువాను సంబోధించడం ద్వారా ఆ వచ్చింది బాబాయే అని ఇద్దరికీ తెలియటం బాబా లీలలు విని, మురిసి పోవడం బాబా తన వాళ్ళను ఎలా కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడో ఈ లీల ద్వారా తెలుసుకున్నాము.
ఇది అప్పటి జామ్నెరు లీల ఇది ఇప్పటికీ శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా పారాయణ చేసే లీల ఈ ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని చూడాలనే ఉత్సాహం తో మా బృందం వెళ్ళటం జరిగింది.
(S. L. నరసింహ రావు, S. లక్ష్మి, ఉమామహేశ్వర రావు గారు, హేమ గారు, జ్యోత్స్నా, సందీప్, సాయి మల్లిఖార్జున, లీలా కృష్ణ మరియు ఇద్దరు పిల్లలు మొత్తం 11 మంది).
జామ్నెరు ఊరిలో ప్రవేశించగానే నానా సాహెబ్ చాందోర్కర్ గురించి అడిగితే ఎవరికీ తెలియటం లేదు. ఆయన ఎవరు అని అడుగుతున్నారు.
ఒక పెద్దాయన్ని అడిగితే ఆయన ఎవరికి తెలుస్తుంది? ఎవరు చెబుతారు మీకు ఎప్పుడో 110 సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఎవరికి తెలుసు మీరు అనవసరం గా వచ్చారు అంటూ కసిరేసారు.
అయినా మేమేమి పట్టించుకోలేదు అలా కాదని ఊర్లో సాయిబాబా గుడి కనుక ఉంటే తప్పకుండా సచ్చరిత్ర చదివిన వాళ్ళు ఉంటారు.
ఈ లీలా ఇక్కడే జరిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళ ద్వారా తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆశపడి బాబా గుడి గురించి అడిగాము.
నలుగుర్ని అడిగాక ఆ ఊర్లో అసలు బాబా గుడే లేదు అని గజానన్ మహారాజ్ నే అక్కడి వారు బాబా అంటారని ఆ గుడి చూపించారు.
సరే పూజారి కనుక ఉంటే ఆయనకన్నా ఎమన్నా విషయం తెలుస్తుందని గుడి ముందుకు కారు ఆపి చూసాము. గుడి తాళం వేసి ఉంది.
దూరం గానే తాళం కనపడుతోంది. ఆటోల వాళ్ళని ఊళ్ళో వాళ్ళని అడుగుతూ మా బృందం లో ఇద్దరు అలా ఊళ్లోకి వెతకడానికి వెళ్లారు.
మిగిలిన వారందరం ఆ గజానన్ మహారాజ్ గుడి దగ్గరే ఆగాము.
ఆ గుడి పూజారి ఇల్లు ఈ పక్కనే ఎక్కడో ఉండి ఉంటుందని అనుకొని గుడి దగ్గరగా వెళ్ళాము అక్కడ కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నారు.
వాళ్ళని అడిగాము పూజారి గారు ఎక్కడ ఉంటారు? గుడి ఎప్పుడు తీస్తారు? అని పిల్లల్ని అడిగాము.
పూజారి గారు ఊర్లో లేరు. ఎప్పుడు వస్తారో మాకు తెలియదు. మీరు గుడి లోకి వెళ్తారా అని అడిగారు.
ఈ పక్కనే ఎవరి వద్దనైనా తాళం ఉందా అని చూస్తుంటే తగిలించిన తాళం తీసి గేటు తీశారు పిల్లలు, లోపలికి వెళ్ళాము.
మాలో ముందుగా లోపలి కి వెళ్ళింది నరసింహ రావు గారు. ఆయన లోపలి కి వెళ్లి పాదాలకి తన తలని ఆనించారట. విపరీతంగా వైబ్రేషన్స్ వచ్చాయట.
ఆ పక్కనే పాదుకలు ఉన్నాయి. అక్కడ కూడా ఆయన సాయిబాబా సాయిబాబా అంటూ తలను తాకించారు. అక్కడ కూడా బాగా వైబ్రేషన్స్ వచ్చాయట.
ఆయన వెంటనే అందర్నీ పిలిచి విషయం చెప్పారు. అక్కడ మాకు బాబా విగ్రహం కూడా కనపడింది.
అందరూ పాదాలకి తల ఆనించి అటువంటి అనుభవం కోసం ప్రయత్నించారు. ఎవరికీ ఎటువంటి అనుభవం కలగలేదు. ఒక్క లక్ష్మి గారికి తప్ప.
ఈ లోపు బయట వెతుకుతున్న మా వాళ్ళకి ఒక వ్యక్తి కనిపించి అవును ఇక్కడ ఆ లీల జరిగింది దాని గురించి తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు.
అని ఆయన దగ్గరికి మమ్మల్ని తీసుకు వెడతానని చెప్పారు, వెంటనే ఒక ఆటో లో అతన్ని ఎక్కించి మా వాళ్ళు ఇద్దరూ అదే ఆటో లో ఎక్కి మా దగ్గరికి వచ్చి (గజానన్ మహారాజ్ గారి గుడి) వచ్చారు.
మేము వెతుకుతున్న నానా సాహెబ్ చాందోర్కర్ గారి ఇల్లు ఆయనకి ఎవరికో తెలుసునట. అక్కడికి వెడదామని మమ్మల్ని బయలుదేరమని చెప్పారు.
మేమంతా మళ్ళీ జీప్ ఎక్కాము. ఆటో లో మా వాళ్ళు ఇద్దరూ మరొకతను వెడుతుంటే మేము జీపులో వాళ్ళను అనుసరించాము.
ఇరుకు ఇరుకు సందులన్నీ తిరిగి తిరిగి ఆటోని అతను ఒక ఇంటి ముందు ఆపించారు.
ఆ వ్యక్తి లోపలకి వెళ్లి అడిగి వెంటనే బయటికి వచ్చి ఈ వివరాలన్నీ తెలిసిన మనిషి ఇంట్లో లేడు షాపులో ఉన్నాడని ఇంట్లో వాళ్ళు చెప్పారట.
అందుకని అతన్ని కలుసుకోవాలని షాప్ కి వెళ్ళాము. మార్గ మధ్య లో ఒక డైరీ ఫామ్ కనిపిస్తే అక్కడ పెరుగు కొన్నాము.
పెరుగు కూడా దగ్గరుంచుకుంటే ఇక అన్నం ఎక్కడో అక్కడ చూసుకోవచ్చు అనుకున్నాము. ఆ షాప్ లో వ్యక్తి ని కలిసాము.
ఆ వ్యక్తి ఆ కథంతా తనకి తెలుసునని దగ్గరలోనే తహసీల్దారు ఆఫీస్ నుండి దాని ఎదురుగానే నానా సాహెబ్ చాందోర్కర్ ఉన్న ఇల్లు ఉందని తెలిపారు.
అందరి మొహాల్లోనూ ఆనందం స్పష్టం గా కనిపించింది . ఆ ఇల్లు దొరకదు అని అనవసరం గా ఇంత దూరం వచ్చామని అందరి మొహాల్లోనూ అప్పటిదాకా చిన్న నిస్పృహ వుంది.
మా అన్వేషణ ఫలించిందని మా ఆనందం. వ్యాన్ అక్కడే పెట్టి ఆటోలో అందరం రెండు దఫాలుగా అక్కడికి చేరుకున్నాము.
అక్కడ దిగి చుట్టూరా తిరిగాము. ఆటో వాడు మాకు ఇల్లు చూపించి ఇదే ఇల్లు అన్నాడు కానీ ఆ ఇల్లు పక్కనే ఒక పాత బంగాళా పెంకుటిల్లు చుట్టూతా ప్రహరగోడతో చూడముచ్చటగా మాకు కనిపించింది.
అదే అయి ఉంటుందని మా మనసులకి తెలుస్తోంది. కానీ ఆటోవాడు వేరే ఇల్లు చూపించాడు.
అతను చూపించిన ఇంట్లో అడిగితే వాళ్ళు ముందున్న పెంకుటిల్లు చూపించారు.
మేమంతా అటునుండి ఇటువైపుకు తిరిగి వచ్చి ఎంతో ఉత్సాహంగా లోపలి కి గేటు తీసుకొని వెళ్లబోయాము.
కానీ గేటుకి పెద్ద తాళం ఉంది. లోపల కూడా తలుపులు వేసి ఉన్నాయి.
మాతో కూడా వచ్చిన మనిషి ఈ బంగాళా పోలీసుల ఆధీనం లో ఉంది. బహుశా పోలీస్ స్టేషన్ లో దీని తాళం దొరకవచ్చు అన్నాడు.
మాలో కొందరు మగవారు గబా గబా పోలీస్ స్టేషన్ కి పరుగెత్తారు. మిగతా మేమంతా ఆ గేటు బయటనే నిల్లబడ్డాము.
మాకంత ఉత్సుకతగా ఉంది. లోపల చూడాలని పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన మా వాళ్ళకి అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ కూర్చొని ఉన్నాడు.
మేము హైదరాబాద్ నుండి షిరిడి కి బాబా దర్శనార్ధం వచ్చాము. అక్కడ నుండి నానాసాహెబ్ గారిల్లు చూడాలని ఇలా జామ్నెరు వచ్చాము.
అది ఆ బంగాళా అని తెలిసింది. అది చూసి వెళ్ళిపోతాము. చూడడానికి పర్మిషన్ ఇవ్వమని తాళాలు ఇవ్వమని అడిగారట. చూపించమని కోరారట.
ఇది అక్కడ అలా మాట్లాడుతుండగానే చిన్న బాబా విగ్రహం అక్కడ పోలీస్ స్టేషన్ లో మా వాళ్ళు చూసి ఆశ్చర్య పోయారట.
నేను మీ కంటే ముందు గానే గయ లో నిన్ను కలుస్తానని బాబా శ్యామా తో చెబుతారు.
అలాగ అక్కడ మా వాళ్ళకి అది పోలీస్ స్టేషన్ లో కనపడేసరికి మా వాళ్ళకి ఎవరికీ నోట మాట రాలేదు.
ఆ బంగళాలో ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ ఉంటాడని ఆయనకీ కానిస్టేబుల్ ఫోన్ చేసి ” సార్ మీ బంగాళా చూడడానికి షిరిడి నుంచి ఎవరో వచ్చారండి పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్ కి వాళ్ళు వచ్చారు ” అని చెప్పాడు.
అవతల పోలీస్ ఇన్స్ పెక్టర్ నేను పది నిముషాలలో తయారయ్యి బయటికి వస్తానని చెప్పు అని అన్నాడట.
ఆయన ఎక్కడో ఉంటాడేమో ఎక్కడ నుండో రవాలేమో అనుకోని మా వాళ్ళు అనుకున్నారు. ఆ ఇన్స్ పెక్టర్ బంగాళాలోనే ఉన్నాడు.
ఆయన తలుపులు తీసుకొని బయటికి చూస్తూ నిలబడ్డాడు. ఇదేంటి నానా సాహెబ్ గారి బంగళాను చూడడానికి వస్తే ఆయనే లోపల నుండి బయటికి వస్తున్నాడేంటి అని మేము అనుకున్నాము.
ఆడవాళ్ళము పిల్లలము గేటు బయట గుమ్మం కేసి చూస్తూ నిలబడ్డాము.
నానా సాహెబ్ చాందోర్కర్ ని మేము నిజంగా చూడలేదు. కానీ సినిమా లోను, సమాధి మందిరం లో ఫోటో చూసినందుకు మాకు అలా ఆయనే నానా సాహెబ్ చాందోర్కరా అని అనిపించింది.
ఆయన అలా గుమ్మం లోంచే మమ్మల్ని పరిశీలించి ఆయనే గేటు దాక వచ్చి గేటు తీసి మమ్మల్ని సొంత మనుషుల్ని ఆహ్వానించినట్లుగా లోపలికి ఆహ్వానించాడు.
మేము నాలుగు అడుగులు లోపలి కి వేసి కొంత మంది పోలీస్ స్టేషన్ కి పర్మిషన్ కోసం వెళ్లారు వాళ్ళు రావాలి అన్నాము.
ఆయన వచ్చేస్తారు మీరు రండి అని మమ్మల్ని లోపలి తీసుకు వెడుతూ లోపల గుమ్మం లోకి రెండు అడుగులు వేసాడు.
ఇక్కడే బాబా మూడు రోజులున్నాడు అంటూ వసారా చూపించాడు. ఒక పొడవాటి వసారా ఉంది.
ఒక పక్కగా చిన్నదైన బాబా మందిరం ఎత్తుగా పెట్టి ఉంది. అందులో బాబా ద్వారకామాయి లో ఉన్నటువంటి ఫోజులో ఒక చిన్న విగ్రహం ఉంది. దాని ముందు దీపం కూడా పెట్టి ఉంది.
అబ్బ ఇక్కడ మాకు బాబా దర్శనం అయ్యిందని దగ్గరగా వెళ్ళాము.
మాలో ఉన్న లక్ష్మి గారికి దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారి వైబ్రేషన్స్ వచ్చాయట. మాకందరికి ఏమీ అనిపించలేదు.
దండం పెట్టుకున్నాము. లోపల పెద్దదైన హాలు ఉంది. మేము ఆయన కూడా లోపలికి అడుగు పెట్టాము.
ఈ లోపు పోలీస్ స్టేషన్ కి వెళ్లిన మా వాళ్ళు లోపలి కి వచ్చారు.
ఆ ఇన్స్ పెక్టర్ పేరు నజీరుద్దిన్ షేక్ (ముస్లిం) అనీ తాను అవటానికి ముస్లిం అయినా బాబా అంటే తనకీ తెలుసునని మాకు చెప్పాడాయన.
జామ్నెరు లీల గురించి ఉమా మహేశ్వరరావు గారు ఆయనకి వివరిస్తూంటే ఆయనకసలు అంతకు ముందు ఆ లీల గురించి అసలేమీ తెలియనట్లు విన్నాడాయన.
ఈ లోపు ఆయన భార్య కూడా లోపల నుండి బయటికి వచ్చారు. ఆవిడ మమ్మల్ని చూసి ఎంతో మురిసిపోయింది.
ఎక్కడ నుండి వచ్చారని ఎప్పుడు వచ్చారు అని అడిగారు. మేము అప్పటికి రెండు గంటలుగా ఆ ఇల్లు వెతుకుతున్నాము. ఆ మాటే మేము వాళ్ళకి చెప్పాము.
ఆవిడ మాకు మంచినీళ్లు ఇచ్చి, టీలు ఇచ్చి కూర్చో పెట్టి చాలా మర్యాదగా మాట్లాడి ఫ్రెష్ అవ్వమని వాష్ రూమ్ చూపించి చాలా మర్యాద చేసారు. ఆప్యాయత కురిపించారు.
పోలీస్ స్టేషన్ లో బాబా విగ్రహం గురించి అడిగితే ఆ ఇన్స్ పెక్టర్ నేను ఇంతకు ముందు నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ కొన్ని రోజులు పని చేశాను.
ఆ సమయం లో నాకు ఎందుకో ఇక్కడ బాబా విగ్రహం పెట్టాలనే ఆలోచన వచ్చింది. నేను ఒక ముస్లింను. బాబా విగ్రహం పైగా పోలీస్ స్టేషన్ లో ఉంచడానికి అందరూ వ్యతిరేకించారు.
పేపర్ కి ఎక్కించి మీడియా ని పిలిచి హడావిడి చేసారు. నేను ఎలాగైనా విగ్రహం అక్కడ పెట్టి తీరాలని పట్టుపట్టాను.
నాకు ఒక DIG గారు మాత్రమే మద్దతు పలికారు. మిగతా అందరూ చాలా వ్యతిరేకించారు.
మొత్తానికి స్టేషన్ లో మందిరం లాగా కట్టించి అందులో బాబా ని ప్రతిష్ట చేయడం జరిగింది అని ఆయన చెప్పారు.
మిగిలిన చూడని ఆడవారు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ కొలువై ఉన్న సాయినాథుణ్ణి కళ్లారా దర్శించి వచ్చాము.
ఆయనలా పోలీస్ స్టేషన్ లో కొలువై ఉండటాన ఇక్కడ గొడవలు అనేవే ఉండవు. అంతా ప్రశాంతం గా ఉంటుంది.
అందుకని మాకు ప్రత్యేకంగా పని అంటూ ఉండదు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటాం అని చెప్పాడాయన.
ఇల్లంతా చూసాము. ఆనాటి ఇల్లే అట, ఏం పెద్దగా మార్పులు చేయలేదట. ఫ్లోరింగు వేశారు. రంగులు వేసారట తప్ప ఇల్లు మాత్రం కప్పులు తలుపులు ఏం మార్పులేవట.
లోపల డైనింగు రూమ్ ఉంది. అందులో ఒక గూట్లో బాబా ఫోటో ఉంది.
ఫోటో ముందు అఖండ దీపం ఉంది. దీపాలున్నాయి అని అడిగితే మా వారికి దీపాలు పెట్టటమంటే ఇష్టం అని చెప్పింది.
వాళ్ళు కూడా అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తూ ఉంటారట. ఈ సారి వచ్చినప్పుడు మా ఇళ్ళకి తప్పక రమ్మని చెప్పాము.
మైనతాయి డెలివరీ అయిన రూమ్ చూసాము. ఇక్కడే జరిగింది అనుకుంటూ బెడ్ వేసి ఉన్న రూమ్ అనుకున్నాము. కానీ మాలో లక్ష్మి గారికి ఆ రూమ్ కాదు ఆ పక్కనే ఉన్న మరో రూమ్ exercise రూమ్ గా బాబా వారు తనకి చెప్పటం జరిగింది.
అందరము ఫ్రెష్ అయ్యాము. కాసేపటికి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో తెలియనంతగా కలిసిపోయాము.
మాకు మాటలు మాట్లాడుకోవడానికి భాష అడ్డం అయిపోయింది. ఆవిడకి తెలుగు రాదు. మాకు హిందీ రాదు. అక్కడకి హేమ గారు ఆవిడ తో బాగానే మాట్లాడారు.
ఆవిడ మమ్మల్ని గుమ్మం బయటికి తీసుకెళ్లి దూరం గా ప్రహరీకి పక్కనే ఒక చిన్న చెట్టు చూపించి అక్కడ బాబా బండి పెట్టి ఇక్కడ లోపల గూడు లాగా ఉన్న చోట బాబా మూడు రోజులు ఇక్కడ స్నానం చేసుకొని ఇక్కడే ఉన్నారట అంది.
మేము అన్నాము మైన తాయి గురించి బాబా వచ్చినట్లు లేదు కదా అని అడిగాము.
ఆహా అప్పుడు కాదు ఆ తర్వాత బాబా వచ్చారట. అది పుస్తకాలలో ఎక్కడా రాసి లేదు అంది. దాని గుర్తుగానే అక్కడ బాబా గూడు లాగా పెట్టారని చెప్పిందావిడ.
బయట తులసి కోట ఉంది. అదేంటి మీరు ముస్లిమ్స్ కదా. తులసి చెట్టు ఎందుకు పెట్టారని అడిగితే మా వారికి చాలా ఇష్టం ఆ తులసి చెట్టు ఉంటే ఇంట్లో ప్రశాంతం గా అనిపిస్తుంది. అని అంది.
మా వారికి హిందూ సంప్రదాయాలు అంటే గౌరవం అంది. ఇంక బయలుదేరుదామనుకుంటూ ఇక్కడ పక్కనే ఏమైనా హోటల్ ఏదైనా ఉందా మేము కర్రీస్ ప్రిపేర్ చేసి తెచుకున్నాము. రైస్ ఒక్కటీ పక్కనే ఎక్కడైనా దొరికితే తీసుకొని వెళ్ళిపోతాము అని చెప్పాము.
అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు అవుతోంది. ఆయన ఆశ్చర్యపోయి ఇప్పటి వరకు మీరు భోజనం చెయ్యలేదా మీకు రైస్ కావాలంటే మా ఇంట్లోనే వండుకోండి అని అన్నాడాయన.
ఆయన ముస్లిం కాబట్టి అభ్యంతరం చెబుతాము అనుకోని అందుకే మీరే వండుకోండి అంటూ ఆడవాళ్ళని వంటింట్లో వెళ్ళమని చెప్పి వాళ్లావిడకి విషయం చెప్పాడు.
మేము పది మందిమి ఉన్నాం కదా ఎంత రైస్ కావాలి ఏ గిన్నె పెట్టాలా అని చూస్తున్నాము. దాదాపు కిలోన్నర ఉడికే గిన్నె కావాలి.
వాళ్ళింట్లో భార్య భర్తలిద్దరే ఉంటారు. ఆయనకీ ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళు పెళ్లిళ్లు అయ్యి ఎక్కడో ఉన్నారు.
రైస్ వాళ్ళింట్లో ఉన్నాయా అన్న అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో తప్ప అన్నం ఎక్కువగా ఎవరూ తినరు.
ఈ లోపు ఆవిడ వచ్చింది. బియ్యం చూపించింది. పెద్ద గిన్నె కావాలి అని అన్నాము.
ఆవిడ ఆ పక్కనే ఆ షెల్ఫ్ లోనుంచి రెండు పెద్ద గిన్నెలు ఒకటి 5 kg లు ఉడికే గిన్నె మరొకటి ఇంకొంచెం పెద్ద గిన్నె బయటికి తీసి
చూసారా ఈ రోజు మీరు వస్తారనేనేమో బాబా మా చేత ఈ గిన్నెలు కొనిపించారు.
ఈ రోజు ఉదయమే బజారు వెళ్ళాము. మా ఇద్దరికీ చిన్న గిన్నెలు సరిపోతాయి. కానీ ఈ రోజు ఉదయమే ఎందుకు వెళ్ళామో బజారుకు వెళ్ళాము.
ఈ రెండు గిన్నెలు కొన్నుక్కు వచ్చాము. ఎందుకు తెచ్చామో ఏమో అనుకున్నాము. ఇప్పుడు అర్ధం అయ్యింది మీ కోసమే బాబా ఇలా ఏర్పాటు చేసాడని ఆవిడ అందరికి చెప్పి మురిసి పోయింది.
ఆ ఇన్స్ పెక్టర్ గారు కూడా ఈ గిన్నెలు ఈ రోజే కొన్నాము అంటూ అందరికి తాను చూపించాడు.
నేను లక్ష్మి గారు హేమ గారు లీలా కృష్ణ ఇంకా ఇన్స్ పెక్టర్ గారి వదిన గారి కొడుకు ఒకతను ఉన్నాడు. మాకు బాగా హెల్ప్ చేసాడు. అందరమూ కలిసి అన్నం వండేశాము.
అది ఉడకగానే కొంచెం చల్లార్చి ఒక కవర్లో వేసుకొని పట్టుకు వెళ్ళిపోదామని మేము అనుకున్నాము. కానీ ఇన్స్ పెక్టర్ గారు అన్నం పెట్టుకోవడానికి కంటైనర్స్ తెప్పించాడు. వాటిలో పెట్టుకుంటే కానీ ఆయన ఒప్పుకోలేదు.
ఆ ఇన్స్ పెక్టర్ గారి అక్కగారు షిరిడీ లో పింపుల్ వాడీ లో ఉందని చెప్పారు. వాళ్ళింటి ఎదురుగ ఒక మసీద్ ఉంది. ఆ మసీద్ కి బాబా అప్పుడప్పుడు వస్తుండేవాడని ఆయన చెప్పాడు.
ఇంకా వీళ్ళు చిన్నప్పుడు నాందేడ్ లో ఉండేవారని అక్కని తీసుకు రావడానికి తీసుకు వెళ్ళడానికి తననే ఆఫ్ టికెట్ కొని అమ్మా నాన్నా పంపించేవారని చెప్పారు.
ఇంకా వాళ్ళ అత్త గారికి బాబాతో అనుభందం ఉందని కూడా చెప్పారు. బాబా షిరిడీ కి వచ్చిన కొత్తల్లో రాళ్లతో పిల్లలు కొట్టేవారని ఆ సన్నివేశం ఆమె చూసిందని కూడా ఆయన చెప్పాడు.
మాలో లక్ష్మి గారు వాళ్ళు, భక్తుల అనుభవాలు రాస్తున్నారు కదా అందుకని వాళ్ళింటికి వెడితే ఏమైనా అనుభవాలు ఉంటాయేమో అని మీ అక్కయ్య గారింటికి కూడా వెడతాము అని చెప్పాము.
ఆయన వాళ్ళ మేనల్లుడి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఇంక బయలుదేరుతున్నాము ఉండండి ఉండండి కొంచెం టీ తీసుకు వెళ్ళండి అంటూ మళ్ళీ టీ లు ఇచ్చారు.
రాలేక రాలేక బయలుదేరాము. వాళ్ళ ఇంటి నుండి బయలు దేరేటప్పుడు ఆయన మా పచ్చడి రుచి చుడండి అంటూ ఒక డబ్బాలో పచ్చడి పెట్టి మరీ ఇచ్చాడు.
మేము వాళ్ళకి మా పిల్లలని పంపి కొన్ని పళ్ళు తెప్పించి ఇచ్చాము. మేమంతా ఆ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకొని మరీ బయలు దేరాము.
వాళ్ళతో కొన్ని ఫొటోస్ కూడా తీయించుకున్నాము. మేమంతా చాలా అనుభూతికి లోనయ్యాము.
దాదాపు వారింట 3 గంటల సేపు ఉన్నాము. ఎప్పుడైనా ఎవరైనా ఇలా వస్తుంటారా అని అడిగితే అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి పోతుంటారు అని వారన్నారు.
అంత సేపు వెతికాక ఎవరైనా నిరుత్సాహ పడి వెనక్కి వెళ్ళిపోతారు కానీ మా సహనాన్ని బాబా పరీక్షించి నట్లున్నారు. ఎంత వరకు వీళ్ళు నిలబడతారా అని చూసినట్టున్నాడు.
బయలుదేరాము, ఇంక భోజనాలు చేయడానికి ప్లేస్ కోసం చూసుకుంటూ దాదాపు 80 km వెళ్ళిపోయాము.
మాకసలు ఆకలి వెయ్యడం లేదు. కానీ తినాలి కాబట్టి ప్రయత్నాలు అక్కడ జరిగిన సంఘటనలకి మా మనసంతా నిండి పోయింది.
ఒక చోట డాబా ఖాళీగా కనిపించింది. వెళ్లి మా వాళ్ళు భోజనాలు ఇక్కడ పెట్టుకు తింటాం అన్నాం. వాళ్ళు అందుకోసం మేం ఎదురుచూస్తున్నాం అన్నట్లు గా వెంటనే సరే అన్నారు.
వెంటనే బల్లలన్నీ సవరించి మాకు అనుకూలంగా వేసుకొని భోజనాలు పెట్టుకొని తిన్నాము.
అన్నం చాలా బావుంది. ఆ అన్నం చూసాక ” ఆ ఇన్స్ పెక్టర్ గారి భార్య కూడా ఎంత బాగా వండారు అన్నం అన్నారు ” .
వాళ్ళు వండితే అన్నం ఎలా ఉండేదో ఏమో మేమంతా కడుపు నిండా తిన్నాక ఇంకా అన్నం ఉండిపోయింది.
ఆ డాబా లో 2 డబ్బాలు అన్నం ఇచ్చేసాము. ఇంకా ఖాళీ అయిన నాలుగు డబ్బాలు ఉంటే అందరమూ ఆ సంఘటనకి గుర్తుగా తలా డబ్బా తీసుకుందాం అనుకున్నాము. అలాగే చేసాము.
ఆ మరునాడు మా వాళ్ళు నరసింహారావు గారు, లక్ష్మి గారు, ఉమా మహేశ్వర రావు గారు హేమ గారు ఆ ఇన్స్ పెక్టర్ గారి అక్క గారింటికి వెళ్లారు.
వీళ్ళని వీళ్ళు పరిచయం చేసుకొని నిన్ననే మీ బావ గారిని కలిసి వస్తున్నాము అని చెప్పారుట. వాళ్ళు చాలా సంతోషించారట.
వాళ్ళకి టీ లు ఇచ్చి మర్యాదలు చేశారట. వాళ్ళు అక్కడ ఉండగానే ఆ ఇన్స్ పెక్టర్ గారు వాళ్ళకి ఫోన్ చేశారట.
ఇలా షిరిడీ నుండి జామ్నెరు వచ్చారు కొంతమంది. వారు అక్కడకి వస్తామన్నారు. వాళ్ళు వస్తే బందోబస్తుగా టీ లు అవి ఇవ్వమని ఫోన్ చేశారట.
ఆయన ఫోన్ చేసాడని చెప్పి 5 నిముషాలలో మా వాళ్ళకి కొబ్బరి తో తాయారు చేసిన స్వీట్ (వాళ్ళ పండగకి చేసుకొనే ప్రత్యేకమైన స్వీట్) చేసి తీసుకు వచ్చి పెట్టారట.
వాళ్ళ ఇంటికి బాబా వచ్చేవాడట (పాత ఇంటికి). వాళ్ళ అత్త గారు బాబా కి బాగా సన్నిహితంగా ఉండేదట. ఎదురుగ్గా ఒక మసీద్ ఉంది. అక్కడకి బాబా వచ్చేవారట.
అక్కడకి వెళ్లి చూసారు. వారికి కృతజ్ఞతలు చెప్పుకొని బయటికి వచ్చారు. ఇదంతా మా వాళ్ళు నాకు చెప్పారు .
చాలా ఆశ్చర్యపోయాం ఇక్కడకి రాకుండా ఉంటే మేము బాబా తిరిగిన ప్రదేశాలను చూడటం అయ్యేది కాదు.
ఇది నిజం గా జామ్నెరు లీలే. ఇది మాకు కూడా జరిగిన జామ్నెరు లీల.
The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni
Latest Miracles:
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన అద్భుత లీల(ఇందిరా గారి అనుభవాలు)–Audio
- బాబా నా ఆరోగ్యాన్ని సరి చేసిన లీల అద్భుతం అనిర్వచనీయం.–12
- శ్రీ భరద్వాజ గారి ద్వారా బాబా లీల – మాట్లాడలెని అమ్మాయికి మాటలాడే శక్తి
- బాబా సచ్చరిత్ర పారాయణం లీల
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments