అంకిత సేవకు, బాబా చూపిన అపార ప్రేమ ….!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు గూడూరి ప్రకాష్ నాకు అమ్మ, నాన్న చిన్నతనం లోనే పోయారు, నేను వరంగల్ లో ఉంటాను.

1990వ సంవత్సరంలో అప్పుడు నాకు 10 ఏళ్ల వయసుంటుంది. అప్పుడు మా మేన మామ గారింట్లో ఒక రోజు దత్త భజనకు వెళ్ళాను, నాకా వయసులో భజనలేంటో, పూజలేంటో తెలియవు.

నేను  అటూ ఇటు తిరుగుతున్నాను, అది చూసి మా బావ (మా మేన మామ గారబ్బాయి) నన్ను పిలిచి, ఎందుకురా, అలా తిరుగుతావు, రా ఇలా కూర్చో అంటూ ఆ భజనలో కూర్చోబెట్టాడు.

ఆ పూజలో దత్త ఫోటోతో పాటు, ఒక పెద్దాయన బాబా ఫోటో కూడా పెట్టారు. అప్పుడే నేను బాబాని చూడడం. అప్పటిదాకా బాబా ఎవరో నాకు తెలియదు.

అలా వాళ్ళు ప్రతి ఆదివారం నాడు పూజ చేసేవారు, నన్నూ పిలిచేవారు, నేను ఎందుకో వెళ్ళేవాడిని.

అలా రెండు మూడు వారాలు అయ్యాక నన్ను పాడమన్నారు, నాకు పాటలు రావు, అసలు భక్తి అంటే ఏంటో తెలియదు.

అంతక ముందు రెండు, మూడు వారాల నుంచి వాళ్ళు భజన చేయడం చూస్తూన్నానుగా, ముక్కున పట్టి ఏదో రెండు ముక్కలు పాడాను, నన్ను అందరూ మెచ్చుకున్నారు.

ఆ చిన్న వయసులో అది నాకు చాలా గొప్పగా అనిపించింది. అప్పటినుండి ప్రతి భజనకి నన్ను రమ్మనటం, పాడమనటం, నేను పాడటం జరుగుతుండేది.

అలా నేను భజన పాటలు పాడటం మొదలయ్యింది. ఆ తర్వాత నారాయణ స్వామి గారు నన్ను దత్తుడి గుడికి తీసుకు వెళ్లారు.

1995లో నేను శిరిడీ మొదటిసారి వెళ్ళాను. నాకు 15 ఏళ్ళు ఉంటాయి, బాబాని దర్శించుకోంగానే బంగారు బాబా లాగా నాకు కనపడ్డాడు.

అప్పట్లో ఈ బంగారం అలంకారం బాబాకి లేదు. ద్వారకామాయిలో దర్శనానికి వెళ్లి ఆ మెట్లు ఎక్కుతుంటే నా కళ్ళ వెంట నీళ్ళు కారిపోయాయి.

ఏదో తెలియని అనుభూతి, ఆనాడే అనుకునున్నాను ”బాబా నేను ఇదే మొదటిసారి శిరిడీ రావటం, నేను బ్రతికి ఉండగా మరోసారి శిరిడీకి తీసుకురా, నీ ఆజ్ఞ లేకపోతే ఎవరూ ఇంత దూరం రాలేరు” అని అనుకున్నాను.

అప్పటికి నేను శ్రీ సాయి సచ్చరిత్ర ఒకటి, రెండు సార్లు మాత్రమే చదివాను. నేను చాలా చోట్ల భజనలు చేస్తూనే ఉన్నాను. అప్పటినుండి ఇప్పటి వరకు నేను శిరిడీ డెబ్భై  సార్లైనా వెళ్ళి ఉంటాను.

నేను ఇక్కడా అక్కడా భజనలు చేస్తూ ఎందుకు, ఏకంగా నా మకాము శిరిడీకి మార్చేసుకుంటే బావుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది.

నేను పెళ్లి కూడా చేసుకోలేదు, నా ఈ తనువు బాబాకే అంకితం అనుకున్నాను.

1996 లో వరంగల్ ఖిల్లా రోడ్లో సాయిబాబా గుడి కట్టారు. అప్పటి నుండి ఆ గుడిలో భజనలు చేస్తూ ఉంటాము.

అక్కడ కొంత మందిమి కలిసి ఒక గ్రూప్ లాగా ఏర్పడి గుడిలో ఏ కార్యక్రమం అయినా మేమంతా అన్నా అంటే అన్నా అనుకుంటూ సొంత వాళ్ళ కంటే ఎంతో ఆప్యాయంగా, అభిమానంగా ఉంటూ ఒకరికొకరు తోడ్పడుకుంటూ గుడిలో సేవ కూడా చేస్తుంటాము.

నేను నా మకాం శిరిడీకి మారిపోతానంటే వీళ్ళే నన్ను పోనీయరు. ఒక్కడివే ఎందుకు అంటారు.

నాకు షిరిడి ఒకసారి నడిచి వెళ్ళాలనే కోరిక పుట్టింది. నేను బాబాకి చెప్పుకున్నాను, ఆయన దగ్గర నుండి రమ్మనమని ఆజ్ఞ వచ్చింది.

ఒక్కడివే ఎలా వెళ్తావు అని ఊళ్ళోవాళ్ళు అందరూ నన్ను ఆపేసారు. నేను ఏం ఫర్వాలేదు, నాకు ఎలాగో తల్లి, తండ్రి లేరు,

పెళ్లి చేసుకోలేదు కదా నాకేమైనా అయితే ఏడవటానికి, బాధ పడటానికి భార్య పిల్లలు కూడా లేరు, ఏం కాదులే, పర్వాలేదు అన్నా కూడా వాళ్ళు నేను ఒక్కడినే వెళ్ళటానికి ఒప్పుకోలేదు.

రెండు సంవత్సరాల అనంతరం నేనింక గట్టిగా ఏమైనా సరే బయలుదేరుతాను అంటే, నాతో కూడా ఒకతను బయలుదేరాడు.

రోజుకి 40, 50 కిలోమీటర్లు పగలంతా నడవటం, రాత్రి పూట ఎక్కడో అక్కడ ఆగడము అవుతోంది.

ఒక చోట మరో గంటలో నడక ఆపుతాము అనగా, ఒక పొట్టిగా ఉన్నాయన మమ్మల్నే చూస్తున్నారు. మేము నడుస్తూనే వెనక్కి వెనక్కి తిరిగి అతన్ని చూస్తున్నాము. ఆయన సుతలీదారము నడుముకి కట్టుకున్నాడు.

మేము రాత్రి ఆ ఊళ్ళో ఉండిపోయి ఏ అరుగు మీదనో ఏ గుడిలోనో మకాం. మేము ఎక్కువగా బట్టలు కూడా తీసుకెళ్ళలేదు. ఒక చిన్న బ్యాగు మాత్రమే ఉంది.

మర్నాడు ఉదయము బయల్దేరి పదికిలోమీటర్లు వెళ్ళాక ఒక కారు మమ్మల్ని దాటుకుని వచ్చి మా ముందు ఆగింది, ఒక కల్వర్డు దగ్గర మేము ఆగాము,

ఆ కారులో నుండి నిన్న మేము చూసిన పొట్టి అతను చేతిలో ఒక బుట్ట లాంటి దాంతో దిగాడు, ఆ బుట్టని కల్వర్డుపై మా ముందుంచాడు.  

అందులో రెండు పెద్దవైన మామిడి పళ్ళు, ఒక స్వీట్ డబ్బా, ఒక ప్లాస్క్ లో కాఫీ ఉన్నాయి. అతను రెండు గ్లాసులు కారులో నుంచి తెచ్చి ప్లాస్క్ లో నుంచి కాఫీ గ్లాసుల్లో పోసి మాకిచ్చాడు.

తనని తాగమన్నాము. నాకు వద్దు అన్నాడు, పెద్ద పెద్ద గ్లాసుల నిండా మంచి కాఫీ పోసిచ్చాడు, తాగాము. ఆ గ్లాసులు తనే దూరంగా తీసుకెళ్లి కడిగాడు.

మళ్ళీ కారు ఎక్కుతూ ”మీకు ఇవ్వాళ్ళ ఇంక భోజనం అక్కర్లేదు, మీ కడుపులు నిండిపోయాయి” అన్నాడు.

మేము బయలుదేరేటప్పుడు ఓం అని ఉన్న జండా పట్టుకుని బయలుదేరాము. ఆ కారు వెనక కూడా ఓం అని రాసి ఉంది.

ఆ మనిషి కారు ఎక్కి డ్రైవింగు సీట్లో కూర్చుంటే రోడ్ అతనికి అసలు కనబడదు. క్షణాలలో కార్ స్టార్ట్ చేసాడు. కారు దుమ్ములో మాయం అయిపోయింది. అంతే ! నిజంగానే ఆ రోజంతా భోజనం మాటే మర్చిపోయాము.

అలా మేము వెళ్ళిన ప్రతి చోట బాబా మాకు ఎదో ఒక రూపంలో సాదరంగా ఆహ్వానం పలుకుతూనే ఉన్నాడు,

ఎవరో ఒకరి రూపంలో, ఇక్కడ గుడి ఉంది అనేవారు, మేము గుడిలోకి వెళ్లి ఏ మండపంలోనో పడుకుందామనుకునే సరికి ఎవరో ఒకరు వేడి వేడిగా అన్నం తీసుకువచ్చి పెట్టేవారు. అలా భోజనం, వసతి లభించేవి.

ఒక చోట నడుస్తుంటే మా వెనుక బస్సు డ్రైవర్ హారన్ కొడుతున్నాడు. మమ్మల్ని ఎక్కమంటున్నాడనో, లేక తప్పుకోమనో అంటున్నాడు అనుకున్నాము.

ఈ రెండు కాదు, దక్షిణ అంటూ సైగ చేసాడు, బస్సు ఆపాడు, ఆ డ్రైవర్ సీట్ లోనుంచి ప్రయాణికులు ఎక్కే గేట్ అంటే మేము ఆ గేట్ బయటే నిలబడ్డాము,

అంత వరకూ తన చేతిని చాచాడు. దాదాపు 6, 7 అడుగులు చేతిని చాచి మాకు దక్షిణ ఇచ్చాడు, బాబా హుండీలో వేయమన్నాడు. 

14 రోజుల పాదయాత్రలో మమ్మల్ని ఆనందంగా ఆహ్వానించేవారు ఆయా ఊరు వాళ్ళు. మా అవసరాలు తీర్చేవారు. ఆ తరువాత కనపడకుండా పోయేవారు.

మేము వెళ్ళింది జూన్ మాసంలో, వర్షాలు పడేవి, కానీ మేము రేపు ఆ ఊరు వెడతామనగా ముందు రోజు ఆ ఊర్లో వర్షం పడేది, వర్షం మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు.

వెళ్ళిన చోట చెప్పేవారు, నిన్న వర్షం కురిసింది, ఈ రోజు లేదు అని. పక్క ఊళ్ళో పడుతోందని తెలిసేది.

దాదాపు 14 రోజుల తర్వాత ఒక బుధవారం షిరిడి చేరుకున్నాము, మరునాడు గురువారం, నేను వరంగల్ గుడికి రోజూ వెడుతుండేవాడిని.

గుడిలో ప్రతి గురువారం పల్లకికి నా సొంత డబ్బులతో బాబాకి ఒక దండ తీసుకువెడతాను.

నేను బయలుదేరి రెండు వారాలు అయింది కాబట్టి మధ్యలో ఒక గురువారం మిస్ అయిందని అనుకున్నానో ఏమో అందుకని అనుకోకుండా బాబా కోసం రెండు దండాలు కొన్నాను.

రెండు చేతుల మీదుగా మధ్యలో వేసుకుని ద్వారకామాయి మెట్ల మీద నిలబడి ”బాబా ఇవిగో దండలు తీసుకో” అన్నాను.

అంతే అక్కడి పూజారి గబగబా వచ్చి రెండు దండలు తీసుకున్నాడు. శిరిడీలో వాళ్ళు ఒకేసారే ఒక సమయంలో మాత్రమే దండలు మారుస్తారు,

అన్ని చోట్లా మళ్ళీ మళ్ళీ దండలు వేరే సమయాలలో మార్చరు కాక మార్చరు . (శిరిడిలో ద్వారకామాయిలో లోపలా బయటా, చావడిలోనూ బాబాకి దండలు ఒక నిర్ణీత సమయానికి మాత్రమే) మారుస్తారు మరి బాబా అతనికి ఏం ఆదేశమిచ్చాడో ద్వారకామాయి లోపల ఫోటో కి అద్దాల తలుపు తీసి మరీ ఒక దండ అక్కడ వేసాడు.

మరో దండ బండ మీద బాబా ఫోటోకి కూడా అద్దాల తలుపులు తీసి మరీ వేశారు.

నేను తెచ్చిన దండలకి బాబా అంత విలువ ఇవ్వడము నాకు చెప్పలేని ఆనందం.

ఇదో గొప్ప అనుభవం, నేను నడిచి అంత దూరం వచ్చినందుకు బాబా నా మీద చూపిన ప్రేమ అది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles