Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా నిష్టాగరిష్టులైన యోగులను ఎట్లు గౌరవించవలెనో వాసుదేవానంద సరస్వతుల వలన తెలియచేసారు.
పిఠాపురమే శ్రీపాదవల్లభుల జన్మ స్థలమని తెలిపినవారే వాసుదేవానందులు.
బోధించటంకన్నా ఆచరించటానికి ఆయన ప్రాధాన్యత నిచ్చేవారు.
“ప్రపంచ పాపముల తొలగించునట్టి గంగా, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మదా మున్నగు పవిత్ర నదులుకూడా యోగులు వచ్చి స్నానము చేసి వాటిని పవిత్రము గావించవలెనని వాంఛించును” అంటారు సాయి సచ్చరిత్రలో శ్రీ ప్రత్తి నారాయణరావుగారు.
పరమ పవిత్రుడు, నిష్టాగరిష్టుడైన వాసుదేవానందులవారు బ్రహ్మావర్తములో గంగా తీరమున నుండగా, నర్మదామాత “నా తీరమునకు వచ్చి కొన్నాళ్ళు నివసింపుము” అని ఆదేశించింది.
కానీ, ఆయన అంతగా పట్టించుకోలేదు. ఒకసారి వాసుదేవానందుల ఒడలంతయూ బొబ్బలెక్కినవి. గంగా స్నాన మాచరించారు ఆయన.
స్వప్నములో గంగామాత ఆయనకు కనిపించి “నీవు వరసగా మూడు దినములు నర్మదా నదిలో స్నానము చేసినచో నీకు తిరిగి ఆరోగ్యము కలుగును” అంది.
వాసుదేవానందులు కాలినడకన నర్మదా తీరాన్ని చేరారు.
నర్మదామాతకు నమస్కరించి “అమ్మా! నీవు మాహాత్మ్యము వెల్లడించుటకు నేనుతప్ప మరెవరు గోచరించలేదా తల్లీ” అని విన్నవించుకుని నర్మదానదిలో స్నానము చేసినారు.
ఆయన శరీర బాధ ఎవరో చేతితో తీసివేసినట్లు మటుమాయమైంది. ఆయన “నర్మదా లహరి” అను స్తోత్రముచేసి మరల నమస్కరించారు.
బోధించుటకన్నా ఆచరించి చూపుట మిన్న అని ఆయనకు తెలియును. నర్మదా తీరమున బ్రాహ్మణి ఘట్టమున నుండి ఆయన భిక్షకు పోదామనుకున్నారు.
కాలు బెణికింది. కాలుతీసి కాలు పెట్టలేకున్నారు. అచటనే పడుకున్నారు. భిక్షా సమయమైంది.
ఒక బాలిక ఆయనవద్దకు వచ్చి “మీకు భిక్షా సమయమైంది! లెండు. మీ బాధను నేను తొలగించెదను” అని చేతిలోనికి కొంచెము భస్మము తీసుకుని, మంత్రములు చదివి, కాలికి, నడుముకు ఊదిరాసి “కాలు ఝాడించు” అంది. ఆయన అట్లే చేశాడు. బాధ తొలగింది.
ఆ బాలిక నర్మదయె గాని వేరు కాదని ఆయన నర్మదా మాతను స్తుతించారు. ఆ బాలిక అదృశ్యమైంది.
నర్మదామాత పఠించిన బాధోపశమన మంత్రము మహారాజ్ కు తెలియదా? తెలుసు. ఐతే మంత్రమునేల పఠించలేదు.
తన ప్రారబ్ద కర్మను తాననుభవింపదలచి, ఆ శ్లోకములను పఠింపలేదు. సుఖములకు పొంగని, బాధలకు కృంగని మహనీయుడాయన.
ఆయన గురుచరిత్ర, గురు సంహిత, దత్త మాహాత్మ్యము మొదలైన గ్రంధరాజములను రచించారు.
వాసుదేవానందులు 24 జూన్, 1914న మహాసమాధి చెందారు.
నేడు వారి వర్థంతి – జూన్ 24, ఆయనను స్మరించి, ఆయన రచించిన శ్రీ దత్త స్తవస్తోత్రము నుండి మొదటి శ్లోకమును స్మరించెదము గాక!
“నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో
సర్వ బాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే…”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- తల్లివి నీవే! …. మహనీయులు – 2020… జూన్ 9
- పదవి – సాధన . …. మహనీయులు – 2020… నవంబర్ 13
- సోదరా! నన్ను మరచిపోకు!! …..సాయి@366 ఆగస్టు 13….Audio
- పాద స్పర్శ …. మహనీయులు – 2020… జూన్ 25
- ఒక్కడు చాలు! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 27
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments