Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నేను (ఒక భక్తురాలు) హైదరాబాద్, వనస్థలిపురం లో నివాసం ఉంటున్నాను. మా వారు ఉద్యోగ రిత్యా చాలా ఊర్లు తిరిగి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాము.
మా దంపతులకి ఒక్కగానొక్క కొడుకు. వాడు DHMS చేసి ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తూ వేరే ప్రాక్టీస్ కూడా చేస్తుంటాడు.
నేను మా ఇంటి దగ్గర ఉన్న గుడులు అన్నిటికి ఇంచుమించు, రోజు వెళ్తూ ఉంటాను. ఇంట్లో కూడా రోజు పూజలు బాగానే చేస్తుంటాను.
పదిహేను సంవత్సరాల క్రితం వరకు కూడా బాబా నాకు తెలియదు, అన్ని గుడులకు వెళ్ళినట్లే బాబా గుడికి కూడా వెళ్ళేదాన్ని.
మా అబ్బాయికి మేము అంటే చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయి. వాడంటే కూడా మాకు అంతే ప్రేమ అభిమానం, అపురూపం కూడాను.
ఎందుకంటే లేక లేక కల్గిన సంతానం. ఒక ఆడపిల్ల పుట్టి పోయింది. ఉన్నవాడు వంశోద్ధారకుడు కూడా కాబట్టి చాలా ప్రేమ వాడి మీద.
వాడికి పెళ్లి చేయాలని కోడల్ని తెచ్చుకోవాలని సంబంధాలు చూస్తున్నాము. ఆ సమయంలో మా బావగారు (అక్క భర్త) స్నేహితుడు ఒకాయన మాకు తారస పడ్డారు.
ఆయనకి ముగ్గురు అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి పెళ్లి అయిపోయింది. రెండవ అమ్మాయి పెళ్ళికి రెడీగా ఉంది, మీకు ఇష్టం అయితే సంభందం కలుపుకుందాం అన్నారు.
సరే పూర్వాపరాలు అన్ని అలోచించి మా బావ గారు మాకు పిల్ల మంచిది మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. మీకు ఆడపిల్ల లేని లోటు కోడల్తో తీర్చుకుందురు గాని అని చెప్పారు.
వాళ్ళకి అబ్బాయి చాలా మంచివాడు, ఒక్కడే కొడుకు, కూతుళ్లు లేరు కాబట్టి మీ అమ్మాయిని వాళ్ళ అమ్మాయి లాగా భావించి నెత్తిన పెట్టుకుంటారు అని చెప్పి సంభంధం ఖాయం చేసారు.
పిల్ల పెద్ద అందగత్తె కాకపోయినా తెలిసిన సంభంధం అని ఒప్పుకున్నాము.
పిల్లకి బంగారం అదీ వాళ్ళు బాగానే పెట్టారు. మేము ఆ అమ్మాయికి బాగానే పెట్టాము. పెళ్ళి గ్రాండ్ గా చేసారు.
పెళ్ళి తర్వాత ముచ్చట్లన్ని అయ్యాయి. పిల్లని కాపురానికి తీసుకురమ్మంటే మాత్రం తీసుకురాలేదు.
మధ్యవర్తుల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళకి చాలా ప్రేమట. వాళ్ళకి అబ్బాయిలు లేరు కాబట్టి మా అబ్బాయిని వాళ్ళ అబ్బాయిగా చూసుకుంటారుట, అందుకని మా అబ్బాయిని ఇల్లరికం పంపమని కూర్చున్నారు.
మేము ఒప్పుకోలేదు. మా అబ్బాయి అస్సలు ఒప్పుకోలేదు. అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి.
ఒకనాడు మా వియ్యంకుడు వచ్చి తలుపు కొట్టాడు. పిల్లని తీసుకువచ్చాడని ఆత్రంగా చూసాము.
ఆయన చేతిలో ఒక పెద్ద మూట ఉంది. ఆ మూట మా ముందు పెట్టి మూట విప్పాడు. అందులో డబ్బు నగలు ఇంకా వెండి వస్తువులు ఉన్నాయి.
నేను ఆశ్చర్యంగా ఏమిటండీ! అన్నయ్య గారూ ఇవన్నీను అన్నాను. ఏం లేదు చెల్లెమ్మా! ఇవ్వన్నీ తీసుకుని మా అల్లుడ్ని మా ఇంటికి పంపించండి అన్నాడు.
నాకు చాలా కోపం వచ్చింది. మేము మీ కంటికి డబ్బు మనుష్యులు లాగా కనపడుతున్నామా? మేము ఏం చేసుకోము ఈ డబ్బు. మీరే పట్టుకుపోయి మా కోడల్ని మా ఇంటికి పంపించండి అని అన్నాను.
ఆయన డబ్బంతా మూట గట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం అనుకున్నాడో ఏమో కానీ వాళ్ళ అమ్మాయిని కాపురానికి తీసుకువచ్చి దింపాడు.
మా కోడలు మా ఇంటి పిల్లలాగా కలిసిపోయింది. మమ్మల్ని ఎవర్నీ ఏపనీ ముట్టుకోనీయకుండా అన్నీ తనే అయి పనులన్నీ చకచకా చేసుకుపోయేది.
మా ఇంటికి కొత్త కోడలిని చూడడానికి చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు వచ్చేవారు, వాళ్ళ అందరితోనూ మా కోడలు కలుపుగోలుగా, ఉంటూ మర్యాదలు బాగా చేసేది.
వాళ్లంతా ”నువ్వెంత అదృష్ట వంతురాలివి, నీకు మంచి కోడలు దొరికింది అనేవారు.
ఆ మాటలకి మా భార్యా భర్తలం మురిసిపోయేవాళ్ళం. అలా కొన్ని రోజులు బాగానే గడిచాయి.
మళ్లీ మా వియ్యంకుడు వచ్చి వాళ్ళ అత్తగారికి (కోడలు వాళ్ళ అమ్మమ్మ) బాగాలేదు ప్రాణాపాయ స్థితిలో ఉంది, మనవరాలను చూడాలి అంటోంది అంటూ మా కోడల్ని తీసుకువెళ్లాడు.
కొన్ని రోజులు అయ్యాక, మా కోడలు వాళ్ళ ఊరినుంచి వచ్చిన ఒక మనిషి ద్వారా మాకు తెలిసింది ఏంటంటే మా కోడలి అమ్మమ్మకి అసలేమి కాలేదని, మా వియ్యంకుడే నాటకం ఆడి వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్లాడు అని మాకు అర్ధమైంది.
ఇది తెలిసి మేము మా వియ్యంకుడికి కబురు చేసి, మీ అమ్మాయిని అంతగా మీ దగ్గరే ఉంచుకోవాలి అని అనుకుంటే అసలు పెళ్ళి చెయ్యకుండా వుంటే బాగుండేది.
మీరు కనక మీ అమ్మాయిని కాపురానికి పంపించకపోతే మేమే మా అబ్బాయికి వేరే పెళ్ళి చేయాల్సి వస్తుంది అంటూ, మేము కొంచెం ఘాటుగానే కబురు పంపించాము.
ఈలోగ మాకు అరవై సంవత్సరాలు నిండినా, షష్టి పూర్తి చేసుకోలేదు, మా అత్త గారింట్లో వారు కూడా ఎవ్వరు చేసుకున్నట్లుగా నాకు తెలియదు.
నాకేమో వేడుకగా చేసుకోవాలి అనిపించి, మా వారిని, మా పిల్లవాడిని అడిగితే వాళ్ళు సరే అని అన్నారు.
ఈ సంబరానికి ముందునుంచే మా కోడలు కూడా ఉంటే బావుంటుంది అని మా వియ్యంకుడికి తిరిగి కబురు చేసాము.
షష్టి పూర్తి విషయం తెలుసుకొని మా కోడలిని మా వియ్యంకుడు తీసుకువచ్చి ఇంటిలో దింపాడు.
మేము షష్టి పూర్తికి సంబంధించిన పనులన్నీ ప్రారంభించాము. అందరం సంతోషంతో ఎవరెవర్ని పిలవాలో లిస్టు తయారు చేసుకున్నాము.
ఇంటికి రంగులు వేయించాము. అందరికీ బట్టలు కొన్నాం. శుభలేఖలు వేయించాము. దూరాన ఉన్న చుట్టాలకి ముందుగానే అందాలని పోస్ట్ చేసాము.
ఊర్లో వాళ్ళకి కొంచెం నిదానంగా పంపవచ్చు అనుకున్నాము. బట్టలు కొని, కుట్టించాల్సిన బట్టలు టైలర్స్ కి ఇచ్చేసాము.
ఇంట్లోకి కొన్ని వస్తువులు కావాలంటే మా కోడలు ముచ్చటపడి తెప్పించుకుంది.
బంధువులందరికీ పెట్టాల్సిన బట్టలు కవర్లో పెట్టి వారి వారి పేర్లు రాసి పెట్టేసింది. దగ్గర వాళ్ళకి కూడా శుభలేఖలు పోస్ట్ కూడా అయిపోయాయి.
తెల్లారితే మండపానికి వెళ్ళాలి. ముందు రోజు ఉదయం కొన్ని బట్టలు ఇస్త్రీ చేయాల్సి వుంటే అవన్నీ పక్కకి పెట్టింది. నేను గుడికి వెళ్ళే ముందు ఎప్పటిలాగే దేవుడికి పూజ చేసి దీపం పెట్టి వెళ్ళాను.
మా వాడు క్లినిక్ కి వెళ్ళిపోయాడు. మా వారు వంట వాళ్ళు వస్తే వాళ్ళతో కింద మాట్లాడుతున్నారు.
మా కోడలు పైన మేడ మీద దేవుడి గదిలో కొత్త బట్టలన్ని అందరికీ పెట్టటానికి కరెక్టుగా ఉన్నాయో లేదో అని పరిశీలిస్తోంది.
ఇంట్లో దేవుడి దగ్గర దీపాలు వెలుగుతున్నాయి. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ దేవుడి గదిలోనుంచి అరుపులు కేకలు వినిపించాయట.
మా వారు గబుక్కున బయటకి వచ్చి పైన కిటికీ వైపు చూశారట, కిటికీ లోనుంచి పొగలు వస్తున్నాయట.
గబ గబా మెట్లు ఎక్కి మా కోడల్ని పిలుస్తూ, పూజ గదిలోకి తొంగి చూసేసరికి కోడలు లేదు మంట మాత్రమే ఉంది.
ఆయనకీ ఏం చేయాలో తోచక అక్కడే పూజకు అని తెచ్చుకున్న బిందెడు నీళ్లు ఆ అమ్మాయి మీద పోసారుట.
ఆ మంట ఆరిందో లేదో తెలియలేదు కానీ, ఆ మంట తాలూకూ సెగ ఆయన మొహం మీదకి వచ్చి మొహం కమిలిపోయింది.
వెంటనే చుట్టుపక్కల వాళ్లేవరో మా అబ్బాయికి కబురు చేసారు. మా వాడు అయోమయంగా, గుడి దగ్గరికి వచ్చి, నన్ను తీసుకుని ఇంటికి వచ్చాడు.
నేను హడావిడిగా మేడ మీదకి వెళ్ళేటప్పటికి, ఒక బూడిద కుప్ప, దాని ఎదురుగా మొహం కమిలిపోయి మా వారు కూర్చొని ఉన్నారు.
విషయం అడిగితే మా వారు చెప్పారు. అసలు ఏమయిందో నాకూ తెలియదు.
నేను కింద వంట వాళ్ళ తోటి మాట్లాడుతున్నాను. ఇంతలో ఉన్నట్లుండి అరుపులు, కేకలు వినిపించాయి
నేను అరుపులు కోడలివి అని తెలుసుకుని ఏమయిందో అని పరుగున మెట్లన్నీ ఎక్కి వచ్చేటప్పటికి మంటల మధ్యలో కోడల్ని చూసేసరికి నాకు మతి పోయి ఏమి చేయాలో తోచక ఇక్కడ బిందెలో ఉన్న నీళ్లు ఆ అమ్మాయి మీద కుమ్మరించాను.
కోడలిలా పడిపోయింది. మండిపోతోంది. ఆ వేడి సెగకి నా మొహం మండుతోంది అన్నారు. నాకు ఏం చెయ్యాలో తోచటం లేదు. మతిపోయినదానిలాగా పిచ్చిచూపులు చూస్తున్నాను.
ఈ లోపు చుట్టూ జనం ఇంట్లోకి వచ్చేశారు. వాళ్లంతా ఎవరి నోటికి ఏది తోస్తే అది మాట్లాడుకుంటూ ఉన్నారు.
డాక్టర్ని పిలిచారు ఎవరో,, ఆయన వచ్చి మా కోడలిని పరీక్ష చేసి చనిపోయింది అని నిర్ధారణ చేసారు.
నేను అవాక్కయిపోయాను. నా కాళ్ళ క్రింద భూమి కంపించి పోతున్నట్లుగా అనిపించింది. మెదడు మొద్దుబారిపోయింది. తల్లో నరాలు తెగిపోతున్నాయి.
ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నాకేమీ అర్ధం కావటం లేదు. ఈ లోపు మా చుట్టు పక్కల వాళ్ళు ఇక్కడ హత్య జరిగిందంటూ ఎవరో పోలీసులకి ఫోన్ చేసారు.
పోలీసులు వచ్చి అంతా పరిశీలించారు. కొత్త బట్టలన్నీ కాలి పోయాయి. మా కోడలు అని చెప్ప బడే బూడిద కుప్ప చుట్టూ ఏవో గీతలు గీశారు. ఫోటోలు తీశారు.
చుట్టాలతోనూ, పట్టు చీరల గలగలతోను ఉండవలసిన ఇల్లు క్షణాలలో ఇలా పోలీసులతోనూ, చుట్టు పక్కల వాళ్ళతోనూ నిండి, వారి మధ్య మేము దోషులుగా నిలబడటం, మాకేం అర్ధం కావటంలేదు.
ఈ లోపు మా వియ్యంకుడికి ఎవరో కబురుచేసారు. ఏమని అంటే మీ అమ్మాయిని అత్తగారింట్లో అందరూ కలిసి చంపేశారు అని చెప్పారు.
మమ్మల్ని నన్ను, మా అబ్బాయిని, మా వారిని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు.
ఈ లోపు మా వియంకుడికి ఎవరో కబురు చేసారు కాబోలు. వియ్యంకుడు, వియ్యపురాలు అందరూ వచ్చేసారు.
మా వియ్యంకుడు మా పిల్లని నిలువునా కాల్చి చంపేశారు అంటూ ఏడుస్తూ తిట్టిపోస్తున్నాడు. శాపనార్ధాలు పెట్టాడు. మాకేమి అర్ధం కావటంలేదు తెల్లవారితే షష్టిపూర్తి పండగ ఏంటి?
ఈ రోజు ఇలా దానికి జరగటం మేమిటి? దానికి మమ్మల్ని దోషులను చెయ్యటం ఏంటి? ఇలా పోలీసు స్టేషన్ కి రావటం, మనసును పిండేస్తున్నాయి.
అలా మమ్మల్ని జైల్లో పదిహేను రోజులు ఉంచారు. స్టేషన్ లో మమ్మల్ని విడివిడిగాను, కలిపి ప్రశ్నల వర్షం కురిపించారు.
మా దగ్గర నుండి వాళ్ళు కావాలనుకున్న నిజాన్ని రాబట్టడానికి నానా రకాల దుర్బాషలాడారు.
పదిహేను రోజుల అనంతరం మాకు అతి కష్టం మీద బెయిల్ దొరికింది. ముగ్గురం బయటికి వచ్చాము, నాకు ప్రపంచం అంతా శూన్యంగా కనిపిస్తోంది.
ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాము. దారిలో బాబా గుడి (వైదేహీనగర్) కనపడింది.
నాకా గుడిలోకి వెళ్ళాలనిపించి, మా అబ్బాయిని, మా వారిని నడుస్తూ ఉండమని చెప్పి, నేను బాబా గుడిలోకి ప్రవేశించాను.
ఆ బాబాని చూస్తూనే నాలో దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఏడుస్తూ ఆయన పాదాలమీద వాలిపోయాను అంతే నేను ఎక్కడ ఉన్నానో, చుట్టూ ఎవరున్నారో, నేను ఇంక గమనించే పరిస్థితిలో లేను.
పరిస్థితిని అంతా బాబాకి వివరించాను. ఇంకా ఆ క్షణంలో బాబా తప్ప మమ్మల్ని కాపాడేవాడు ఇంకెవ్వరూ లేదనిపించింది.
ఇంక మాకు బాబా పాదాలే శరణు అనిపించింది. వెక్కి వెక్కి ఏడుస్తూ నేను బాబాతో
”బాబా! మేము నిండు ప్రాణాలు తీసేటంత కిరాతకులమా? అయినా ఆ అమ్మాయిని చంపవలసిన అవసరం ఏముంది? పైగా ఆ అమ్మాయి ఎవరు? మా ప్రాణానికి ప్రాణమైన మా అబ్బాయికి భార్య.
అటువంటప్పుడు మరి ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం మాకేంటి? అందరూ మమ్మల్ని హంతకులని చేసారు?
మేమేం చేయాలి? ఎలా ఈ గండం నుంచి తప్పించుకోవాలి? ఆ హత్య మేము చేయలేదని, అసలు హత్యే కాదని, ప్రమాదవశాత్తు జరిగిన ఒక దురదృష్టకర సంఘటన.
ఆ అమ్మాయి నిప్పంటుకుని చనిపోయింది అని మేము అసలు ఆ సమయంలో అక్కడ లేమని ఎవరు చెబుతారు? ఎవరు చూసారు? చెప్పటానికి ఒక భగవంతుడికి తప్ప ఎవరికీ తెలుసు?
మాకు ఎవరు సాయం చేస్తారు? మేము దోషులం కామని మాకే పాపం తెలియదని ఎంతగా మొర పెట్టుకున్నా మా గోడు ఎవరు వింటారు? మేము హత్య చెయ్యలేదు అనటానికి ఋజువులు, సాక్ష్యాలు లేవు.
ఎవరు చెబుతారు? మేము నిర్దోషులమని ఒక్క నువ్వు తప్ప అవునా కాదా బాబా! ‘ అలా ఏడ్చి ఏడ్చి ఇంక ఇంటికి వెళదామని, బయటికి వచ్చాను.
మా వారు, మా అబ్బాయి అక్కడే ఉన్నారు. ”ఏమిటి ఇక్కడే ఉన్నారు, నేను వెనకాల వస్తాను మీరు పదండి అన్నాను కదా! వెళ్లి పోకపోయారా?, ఇక్కడే ఉంటే లోపలి రాలేక పోయారా?” అని అన్నాను.
అప్పుడు వాళ్ళు, ”మేము ఇంటిదాకా వెళ్ళాము ఇంట్లోకి వెళ్ళ లేక భయం వేసి మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చాము” అన్నారు.
మళ్ళీ ముగ్గురమూ బిక్కు బిక్కుమంటూ ఇంటి దాక వెళ్ళాము. దారి పొడుగునా మమ్మల్ని ఎక్సిబిషన్ లోను, తోలు బొమ్మలాటలోని బొమ్మలను చూసినట్లు చూస్తూనే ఉన్నారు.
ఇంక మా వీధిలోకి వచ్చాక చుట్టూ పక్కల వాళ్ళు చాలా భయంకరంగా మాట్లాడారు. చాల అసహ్యకరంగా మొహాలు పెట్టారు. మాకు చాల బాధ వేసింది భయ పడుతూ, బాధ పడుతూ ఇంట్లోకి అడుగు పెట్టాము.
శుభ కార్యంతో కళకళలాడవలసిన ఇల్లు స్మశానం లాగా మారింది. పదిహేను రోజుల క్రితం కుక్కర్లో వండిన అన్నం అలాగే ఉంది.
పదిహేను రోజులు పోలీసు స్టేషన్లో ఉన్నా ఒక్క చుట్టం కూడా మమ్మల్ని చూడడానికి రాలేదు.
మా వారు వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు. నాకు ఏడుగురు అక్కాచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళు కానీ, వీళ్ళు కానీ, ఏ ఒక్కరూ కూడా స్టేషన్ గడప తొక్కలేదు.
షష్టిపూర్తి కని వచ్చిన వారు విషయం తెలుసుకొని ”ఆమ్మో! కోడలిని చంపేశారు! బాబోయ్! ” అని గుండెలు బాదుకుని వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోయారు.
ఈ విషయం పేపర్ లో కూడా వేశారు. ”కోడలిని చంపిన కుటుంబం, డబ్బు కోసం అమాయకురాలిని బలిగొన్నారు,” అంటూ వీధులలో పోస్టర్స్ కూడా అంటించారు.
మాకు డబ్బే కావాలనుకుంటే, ఆ రోజు మా వియ్యంకుడు తెచ్చిన డబ్బు మూట ఉంచేసుకుని, కావాలంటే మరో మూట తెమ్మనమనేవాళ్ళం.
కానీ, మాకు డబ్బు అక్కర్లేదు. మాకు కోడలు కావాలి. మాకు కొడుకు కావాలి. వాళ్లిద్దరూ సుఖంగా ఉండటం కావాలి.
ఇంక మేము సొంతిల్లే ఐనా ఆ ఇంట్లో ఉండలేకపోయాము. చుట్టు పక్కల వాళ్ళు సూటి పోటీ మాటలతో కాకుల్లా పొడుస్తున్నారు.
మేము మా ఇంట్లో ఉండలేకపోయాం. పలకరించేవాళ్ళు లేక అయ్యో! అని సానుభూతి చూపే వారు లేక అల్లాడి పోయాము.
అదే సమయంలో మా వారి స్నేహితులు రంగారావు గారు వచ్చి ఇక్కడ ఉండలేరు, నాతో రండి మా ఇంటికి వెడదాం అంటూ ఆహ్వానించారు.
నేను బాబాకి నా బాధనంతా చెప్పుకోవటం వల్ల (బాబాకి తెలియంది కాదు) మా వారి స్నేహితుడి మనసులో బాబా ప్రవేశించి, మాకు ఆశ్రయం కల్పించాడు.
బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు సూటి పోటీ మాటలనే రాళ్ళతో కొడుతుంటే అంతా అంధకారంగా మారి పోస్టర్ల రూపంలో గోడలమీద వార్తల రూపంలో పేపర్ల కెక్కి అవమానాల పాలై భయకంపితులమయిన మాకు మా వారి స్నేహితుడి ద్వారా రక్షణ కల్పించాడు బాబా.
చీకట్లో జడుసుకున్న పిల్లవాడు ఒక్కసారిగా తల్లిని చూసేసరికి ఎలా చటుక్కున అతుక్కుపోతాడో, రమ్మనదే తడవుగా వాళ్ళింటికి వెళ్ళాము.
వాళ్ళు మమ్మల్ని సొంత వాళ్ళలాగా, అయిన వాళ్ళ కంటే ఎంతో ప్రేమగా ఆదరించారు. రంగారావు గారి భార్య సరోజ, ఆవిడా కూడా నన్ను సొంత ఆడపడచులాగా ఆదరించింది.
కొన్నాళ్ళకి కేసు కోర్ట్ లోకి వచ్చింది. మేము లాయర్ని పెట్టుకుకోవాలంటే ప్రస్తుతానికి 30, 000 రూపాయలు కావాలి. అభిమానం చంపుకుని మా అక్క చెల్లెళ్ళకి కబురు చేసి, డబ్బులు సర్ధమని మరల ఇచ్చేస్తామని చెప్పాను.
వాళ్ళు నిష్ఠూరంగా మాట్లాడారు. డబ్బులు లేవని కర్కశంగా చెప్పారు. మాకు ఆశ్రయాన్ని కల్పించిన రంగారావుగారే ఆ 30 000 రూపాయలు ఏర్పాటు చేసారు.
ఆరు నెలలపాటు మేము వారింటనే ఉన్నాము. కేసు వాయిదాలు పడుతూ వస్తోంది.
ఆరు నెలల తర్వాత ఇంకా మేము మా ఇంటికి వెళ్లి పోతామని రంగారావు అన్నయ్య కి చెప్పి, ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళింట్లో ఉంటామని బయలు దేరి మా ఇంటికి వచ్చి, మా కోడలు చనిపోయిన దేవుడి గదిలోకి వెళ్లి తలుచుకుని తలచుకుని గుండెలు బాదుకుంటూ ఏడ్చాను.
మా అబ్బాయి కూడా ఉద్యోగానికి వెళ్ళటం లేదు, ఎందుకంటే పొలీసు కేసు ఉంది కాబట్టి, వాళ్ళు రానియ్యలేదు.
అయినా పుట్టెడు దుఃఖంతో, అవమానంతోనూ ఏం ఉద్యోగం చేస్తాడు. గడ్డం పెంచుకొని పిచ్చివాడిలాగా తయారయ్యాడు. ఇంకా మా వారి సంగతి అంతే.
ఇంట్లో ఒకళ్లతో ఒకళ్ళు మాట్లాడుకోడానికి కూడా భయం, భాధ. నేను అప్పట్లోనే ఎం. ఏ పాసయ్యాను.
మా వారు వయస్సులో పెద్దవారు అవటం వల్లన, మా అబ్బాయికి ఉద్యోగం లేకపోవటం మూలాన, మా దగ్గర ఉన్నదంతా మా అబ్బాయి పెళ్ళికి, జరగని షష్టిపూర్తి కి అయి పోయాయి.
బ్రతకటం కష్టం అవటం మూలాన చుట్టుపక్కల పిల్లల్ని ప్రయివేట్ కి పంపమని అడగటానికి (గతంలో చెప్పేదాన్ని) గుమ్మంలోకి వెళ్ళానో లేదో ఒకావిడ నన్ను ఆపి ఏంటి ఇలా వచ్చావు అని అడిగింది,
అంతకు ముందు ఎంతో గౌరవంగా మీరు అని మాట్లాడి నావిడ ఏహ్యంగా నువ్వు అంటూ మాట్లాడింది.
పిల్లలకి ట్యూషన్ నేను చెప్పదలచుకున్న మాట ఇంకా నా గొంతులోనే ఉంది. ఆ తల్లి ఉరుములా నా మీద పడిపోయింది.
”ఇంకా పిల్లలకి నీ చేత ట్యూషన్ చెప్పించుకోవాలా? ఎందుకమ్మా తల్లీ! మా పిల్లలు కూడా మీలాగా హంతకులు కావాలా? ఇంట్లో వాళ్ళని చంపెయ్యాలా? అంటూ ఉరిమింది.
అయినా నేను ఆశ చావక చుట్టుపక్కల వాళ్లకి విషయం ఇదీ అని జరిగిన సంఘటనతో మాకెలాంటి సంభందం లేదు అని వివరించే ప్రయత్నం చెయ్యబోయాను. మా పరిస్థితి వివరించబోయాను అయినా అదంతా అరణ్య రోదనే అయ్యింది.
బాబాని తలచుకుంటూ బాబా ఏమిటీ అవస్థ? అని బాధ పడ్డాను.
రోజులు చాలా అద్వానంగా గడుస్తున్నాయి, బయటికి వస్తే అందరూ శతృవుల్లాగా, క్రూర జంతువును చూసినట్లు చూస్తున్నారు.
అందరి మాటలు, చూపుల ఈటెలు పడక తప్పటం లేదు. అయినా బయటికి రాక తప్పటం లేదు.
అలాగే బాబా గుడికి వెళ్లి రోజూ నలభై ప్రదక్షిణలు చేసి వస్తున్నాను. మాకు వచ్చిన కష్టం ఒక్క భగవంతుడైన బాబా తప్ప ఎవరూ తీర్చలేరు అనిపించింది.
రాను రాను జనాల మాటలకి మేము అలవాటు పడిపోయాము. మనసు బండ బారిపోయింది. కోర్ట్ వాళ్ళు పిలవడం, మేము వెళ్ళటం, కేసు వాయిదా పడటం జరుగుతోంది.
కేసు కోసం ఇంట్లో ఉన్న నగలు, ఉన్న కాస్త కూస్త డబ్బు హరించుకుపోయింది. కేసు పూర్తి అయ్యే సరికి మాకు మూడు లక్షలు అయ్యింది.
నేను రోజూ బాబా గుడికి వెళుతున్నాను కదా! నాతో పాటు మనశాంతి కోసం మా అబ్బాయి కూడా రావటం మొదలు పెట్టాడు.
అలా వచ్చినప్పుడు గుడిదగ్గర మా అబ్బాయికి, ఒక ముసలి అతను కనపడి ఒక పుస్తకం ఇచ్చి ”ఈ పుస్తకం పారాయణం చెయ్యి, నీ కష్టాలన్నీ తీరుతాయి” అని చెప్పాడట.
ఈ విషయం నేను బయటకు రాగానే నాకు చెప్పి పుస్తకం చూపించాడు. అది గురు చరిత్ర పుస్తకం. ”సరే నాయనా! పారాయణ చెయ్యి బాబాయే నీకు కనపడి ఈ పుస్తకం ఇచ్చాడు. తప్పక చదువు” అని చెప్పాను.
ఆ మరునాడే గురువారం. మావాడు ఉదయాన్నే లేచి స్నానం అదీ చేసి, పారాయణ చెయ్యటానికి కూర్చుని ఇలా పుస్తకం తెరిచాడో లేదో అందులో మొదటి పేజీలో బాగా పాతదయిన బాబా ఫోటో ఒకటి కనపడిందిట.
నిజానికి అందులో ఏ ఫోటో లేదు. వీడికి అలా కనిపించి అనుగ్రహించాడు.
బాబా పారాయణం చెయ్యమని పుస్తకం ఇచ్చి, నీ కష్టాలు తీరుతాయంటూ, ఆశీర్వాదం ఇచ్చి, దగ్గరుండి పుస్తకం చదివించటానికి, తానే ఫోటో రూపంలో మా వెంట ఉన్నానని కనిపించాడు కాబోలు.
మా వాడు ఒక్క ఉదుటన అక్కడనుండి లేచి వచ్చి అమ్మా! నాకు బాబా ఫోటో ఆ పుస్తకం తెరవగానే కనపడింది అన్నాడు చిన్నపిల్లాడిలా సంతోషంగా.
నేను బాబా మన కష్టాలు తీర్చడానికి, మనతోనే ఉండటానికే వచ్చాడురా! ఇంక పారాయణ చెయ్యి అన్నాను సంబరంగా.
మా వాడు గురుచరిత్ర పారాయణం వారం రోజులలో పూర్తి చేసాడు. పూర్తి అయినరోజు రాత్రి బాబు ఇంట్లోంచి బయటికి రాగానే గుమ్మంలోకి ఒక ముసలాయన వచ్చి ”ఏమీ దిగులు పడకు నేను ఉన్నానుగా మీకేమి కాదు, నేను చూసుకుంటాను నిశ్చింతగా ఉండండి” అని వీపు మీద ధైర్యంగా ఉండమన్నట్లుగా చరచి వెళ్ళిపోయాడు.
మేము గుండెల నిండుగా గాలి పీల్చుకొన్నాము. కొంచెం ధైర్యం వచ్చింది.
తర్వాత మేము కోర్టుకి వెళ్ళినప్పుడు అప్పటిదాకా జడ్జి గారు ఎంతో అవమానంగా మాట్లాడి హీనంగా చూసే ఆయన మారిపోయి, ఆయన స్థానంలో మరో కొత్త జడ్జి గారు వచ్చారు.
ఆయన మా కేసు పూర్వపరాలు అన్నిపరిశీలించి, ”మీ లాంటి వాళ్లకి రా దగ్గ కష్టం కాదమ్మా! అని అన్నాడు.
ఆయన మమ్మల్ని చాలా మర్యాదగా చూసి కూర్చోబెట్టి మాట్లాడేవాడు. ఆ సంఘటన జరిగిన రెండు సంవత్సరాలకి మా తప్పు ఏమీ లేదు అని కోర్టులో రుజువైంది.
నిర్దోషులమని కోర్టు మమ్మల్ని విడుదల చేసింది. బాబా మాతో ఉండబట్టి, మమ్మల్ని కాపాడ బట్టి మేము నిర్దోషులుగా బయటికి వచ్చాము.
అదే బాబా మాతో లేకపోతే మేము కనీసం పదునాలుగు ఏళ్ళు జైల్లో మగ్గవలసి వచ్చేది.
బయటికి వచ్చాక మాకేముంటుంది నిరాశ, నిస్పృహ తప్ప. కానీ బాబా మమ్మల్ని పదిహేను రోజులు మాత్రమే జైల్లో ఉంచి బయటికి తీసుకువచ్చేసాడు.
మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఏం ఇచ్చి బాబా ఋణం తీర్చుకోగలం? ఆయనే లేకపోతే మా గతి ఏం కాను?
పై సంఘటన జరిగిన తర్వాత కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చినా మా బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు వెలివేసినట్లు చేసారు.
అవసరానికి పనికి రాని చుట్టం వున్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే. మాకింత కష్టం వస్తే కనీసం కళ్ళ నీళ్ళు తుడవడానికి కూడా నా గుమ్మం తొక్కలేదెవ్వరు.
మా వీధిలో వాళ్ళు మాతో మాట్లాడటం మానేశారు. మాట్లాడితే వాళ్ళు మైలబడి పోతారట.
ఏం ఫరవాలేదు మాకు బాబా ఉన్నాడు. బాబా చెయ్యి మేము పట్టుకోవడం కాదు, మా చెయ్యి బాబా పట్టుకున్నాడు.
బాబా కొండంత అండగా మా చెంత నుండగా మా కింకేల చింత. కోడలు చనిపోయి, కోర్టుల చుట్టూ తిరిగిన బాధ అయితే మాకు చాలా ఉంటుంది. జనాలు చాలా రోజులు చెవులు కోరుకున్నారు.
ఎన్నాళ్ళు కోరుకుంటారో కొరుక్కోనీ అని ఊరుకున్నాము. మా మంచితనం నిరూపించబడింది.
మమ్మల్ని భగవంతుడైన ఆ సాయినాధుడు తన అక్కున చేర్చుకున్నాడు. మళ్ళీ మాకు నెమ్మదిగా మంచి రోజులు రావటం మొదలు పెట్టాయి.
మా అబ్బాయిని మళ్ళీ పిలిచి ఉద్యోగం ఇచ్చారు. ఎక్కువ జీతం కూడా ఇస్తామన్నారు.
కొద్దిరోజుల తర్వాత మా వాడిని వప్పించి, ఒక పేదింటి అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్ళి చేసాము.
ఇప్పటి కోడలికి, బాబా అంటే గిట్టేది కాదు. ఇంట్లో కూడా బాబా పూజలని వ్యతిరేకించేది.
తనకి ఒక కొడుకు పుట్టాక (నాకు ఇద్దరు మనుములు, పెద్ద మనవడు పుట్టినప్పుడు) వాడికి మూడు ఏళ్ళు వచ్చాక ఫిట్స్ లాగా వచ్చాయి.
వాడిని ఆసుపత్రికి తీసుకువెడుతున్నాము. మా మనవడికి కూడా బాబా అంటే ఇష్టం అందు మూలాన వాడు బాబా ఫోటోను చేతిలో పట్టుకుని ఉన్నాడు.
డాక్టర్ ఇంజక్షన్ చేయగానే వచ్చి రాని మాటలతో, ”ఏడి! బాబా ఏడి” అంటూ లేచి కూర్చుని, వాడి చెయ్యి చూసుకుంటున్నాడు.
చేతిలోనే ఉన్న బాబా ఫోటో చూసి మురిసి పోయాడు. అప్పటి నుంచి మా కోడలికి బాబా అంటే నమ్మకం కలిగింది.
అప్పటినుంచి తనూ బాబాని పూజించడం బాబా గుడికి వెళ్ళటం చేస్తోంది.
ఆ బాబా దయ వలన మేము ఎంతో హాయిగా ఉన్నాం. మాకిప్పుడు ఇద్దరు మనుములం.
క్రమంగా మేమంతా పాత సంఘటనని మర్చిపోయి, కొత్తకోడలితో, మనుములతో మా జీవితాలు సంతోషంగా బాబా దయతో, బాబా అనుగ్రహంతో నడుస్తున్నాయి. ఆనందంగా ఉన్నాయి.
సర్వం శ్రీ సాయినాధ చరణావిందార్పణ మస్తు
శుభం భవతు
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- మా మీద దయతో మా కుటుంబ సభ్యునిగా మారిన బాబా వారు ……!
- బాబా వారి ఊధీ ధారణతో మానసిక వ్యధ తొలగిపోవుట.
- ఒక నాస్తికుని చేత శివదీక్ష చేయించి మోక్షాన్ని ప్రసాదించిన బాబా వారు!
- మాకు షిర్డీ వెళ్లి బాబా ని దర్శించుకోవటమే పెద్ద పండుగ.
- రైలు ప్రమాదం లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన బాబా గారు.(బాబా పైన ఉన్న భక్తి ఎదుటి వ్యక్తిని కాపాడే శక్తి గా మారిన కథ).
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments