Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
పిలిస్తే పలికే దైవం
యునైటెడ్ కింగ్ డం నుండి ఒక సాయిభక్తురాలి అనుభవం:
నాకు సాయిబాబా అంటే ఎంతో నమ్మకం. ఈ సంఘటన, నాకు పాప పుట్టిన మరుసటి రోజున జరిగింది. అప్పుడు నేను లండన్ లో ఆస్పత్రిలో ఉన్నాను. నాకు అమ్మాయి పుట్టింది. కానీ, పుట్టిన వెంటనే పాపకి ఊపిరితిత్తులలో సమస్య ఏర్ఫడి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడసాగింది.
వెంటనే పాపని నియో నాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ప్రాణానికి కూడా ప్రమాదం కలగవచ్చని డాక్టర్స్ చెప్పారు. పాపకి యాంటీబయాటిక్స్ వాడుతూ, ఐ.వీ. కూడా పెట్టారు. అప్పుడే పుట్టిన పాప లేలేత చేతులకి సూదులు, పక్కన యంత్రాలు, మొదటిసారిగా ఈ స్థితిలో (NICU ) లో ఉన్న పాపని చూసి నా గుండె బ్రద్దలయింది.
ప్రసూతి వార్డ్ లోకి నిర్ణీత సమయాలలో తప్ప ఎవరినీ అనుమతించరు. కొన్ని బ్లాకులు దాటి వెళ్ళాలి. అక్కడ ఒక బ్లాకు (NICU) లో పాప ఉంది. మానసికంగాను, శారీరకంగాను బలహీనంగా, నిస్పృహతో ఉండటం వల్ల నేను పాపని చూడటానికి వెళ్ళలేని పరిస్థితి. ఒంటరిగా, చాలా నిరాశతో ఏడుపు తప్ప ఏమీ చేయలేకుండా ఉన్నాను.
రెండు రోజుల తరువాత ఏదయినా శుభవార్త వినవచ్చనే ఆశతో నా పాప ఉన్న బ్లాక్ వద్దకు వెళ్ళాను. పాపకి లంగ్స్ పరిస్థితి బాగానే ఉందనీ, కానీ పరిస్థితిలో మాత్రం మార్పు లేదని చెప్పారు. యాంటీబయాటిక్స్ యింకా వారం రోజులు వాడాలని, అందుచేత మరొక వారం రోజులు ఐ.సీ.యూ.లోనే ఉంచాలని చెప్పారు. నావార్డుకి తిరిగివచ్చి మంచం మీద పడుకుని ఏడవసాగాను.
నాలో నేనే బాబాతో మాట్లాడటం మొదలుపెట్టాను. “నేను ఇక్కడినుండి నా పాపను చూడటానికి నడిచివెళ్ళే శక్తి లేదు. నా పాపని అటువంటి స్థితిలో చూసి తట్టుకునే ధైర్యం కూడా లేదు నాకు. నువ్వే నా పాపకు సహాయం చేయాలి”. ఈ విధంగా నా మనసులోనే బాబాతో నా బాధని చెప్పుకుంటున్నాను.
వెంటనే నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో బాబాతో, “నాపాప అలా అవడానికి కారణం నువ్వే. నువ్వే దీనిని పరిష్కరించాలి. ఏవిధంగా అన్నది నాకు తెలీదు. కాని ఇప్పుడే, ఈక్షణంలోనే పాపకి బాధ తగ్గిపోవాలి. కావాలంటే ఆ బాధను నేను భరిస్తాను. కాని అభం శుభం తెలీని ఆపసిపిల్ల మటుకు క్షేమంగా ఉండాలి” అన్నాను. ఏమీ పాలుపోని పరిస్థితిలో నిరాశ నన్నావహించింది. కళ్ళవెంట కన్నీరు ధారగా కారిపోతోంది.
అదేక్షణంలో ఒక నర్సు నా గది లోకి ప్రవేశించింది. ఆమె వంక సూటిగా చూడలేక గబగబా కన్నీరు తుడుచుకున్నాను. ఆ నర్సు నా వద్దకు వచ్చి, ‘అంతా బాగానే ఉందా?’ అని అడిగింది. కాని ఆమె ఎప్పుడూ నా గదిలోకి వచ్చే నర్సు కాదు. “నేను మామూలుగా రౌండ్స్ కి వస్తూ ఇలా వచ్చాను” అని చెప్పింది. నేను ఆమెను ‘హలో’ అని చిన్న నవ్వుతో పలకరించి, బాగానే ఉన్నానని చెప్పాను. నర్సు “పాప ఎక్కడ ఉంది?” అని అడిగింది. పాప ఎన్.ఐ.సీ.యూ లో ఉందని చెప్పాను.
విచిత్రం! ఆమె అలా నాతో మాట్లాడుతూనే ఉంది. ఆమె నన్ను “అసలు మీరు ఎక్కడివారు?” అనడిగింది. మాది భారతదేశం అని చెప్పాను. అది వినగానే మొట్టమొదటగా ఆమె నన్ను “నీకు షిరిడీసాయిబాబా తెలుసా?” అని ప్రశ్నించింది. ఆప్రశ్న వినగానే ఒక్కసారిగా నేను అప్రతిభురాలినయ్యాను.
క్షణం క్రితం అప్పుడే నేను నా మనసులో సాయితో మాట్లాడుతున్నాను. “సాయిబాబా అంటే నీకు నమ్మకం ఉందా?” అని అడిగింది. వెంటనే నేను, బాబా అంటే నాకు నమ్మకం ఉందని చెప్పాను. అధ్బుతమేమీ జరగకపోయినా, ఆమెతో మాట్లాడుతుంటే నాకెంతో సంతోషం అనిపించింది.
ఆ వెంటనే ఆమె, “నేను సాయివ్రతాన్ని పూర్తి చేశాను. నీకు సాయిప్రసాదం, పుస్తకం ఇస్తాను. తీసుకోవడానికి ఏమన్నా అభ్యంతరముందా?” అని అడిగింది నన్ను. నేనింకా ఆశ్చర్యంలోనుండి తేరుకోకుండానే అభ్యంతరం లేదని చెప్పాను. “నేను వీటిని నీ బ్యాగ్ లో పెడతాను. ఇంటికి వెళ్ళి, స్నానం చేసి ప్రసాదం పంచమ”ని చెప్పింది. నేను అలాగే అని ఆమెకి కృతజ్ఞతలు చెప్పాను.
నేను ఇక్కడ ఆస్పత్రిలో ఉన్న రెండురోజుల క్రితం కూడా ఆ నర్సుని చూడలేదు. ఎటువంటి పరిస్థితులలోనయినా నన్ను ధైర్యంగా ఉండమని భగవంతుడే నాకీవిధంగా తన ఆశీర్వాదాలను పంపించాడనిపించింది నాకు. ఇదంతా మంచికోసమే జరిగిందని భావించాను. ఈసంఘటన ఉదయం 10 గంటలకు జరిగింది. నేను నాపాపని ఉదయం 8 గంటలకు చూశాను.
మధ్యాహ్నం రెండు గంటలకు డాక్టర్ వచ్చి పాపకి రక్త పరీక్షలో నెగెటివ్ వచ్చిందనీ మరుసటిరోజు ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పారు. ఆనందం పట్టలేకపోయాను. ఆ సంతోషంలో నాకు కంట నీరొచ్చింది. నేను నాబాబాకి ఏవిధంగా నా కృతజ్ఞతలు చెప్పుకోగలను? ఏవిధంగా ఆయన్ని పొగడగలను? ఎంతపొగిడినా, కీర్తించినా తక్కువే.
సాయంత్రం 5 గంటలకి విజిటింగ్ అవర్స్ లో డాక్టర్ గారు మళ్ళీ వచ్చి “పాప ఇప్పుడు చాలా బాగుంది. అన్ని పరీక్షలు చేసేశాము. రేపు కాకుండా ఈరోజు సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోవచ్చు” అన్నారు. ఆరోగ్యవంతమైన పాపను తీసుకొని ఆరోజు రాత్రి 8 గంటలకి ఇంటికి వచ్చేశాము.
బాబాకి ధన్యవాదాలు చెప్పడానికి నాకు మాటలు చాలవు. నేనెప్పటికీ ఆయనకు ఋణపడి ఉన్నాను. బాబాను ప్రార్ధించే ప్రతిసారి ఆయనకు నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. నామీద బాబా చూపించే ప్రేమకి కొలమానం లేదు. అది వెలకట్టలేనిది. ఆయన నాతండ్రి, నా దైవం. నన్నెప్పుడూ కనిపెట్టుకుని నా యోగక్షేమాలు చూస్తూ ఉంటారు.
సాయిరాం.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- పిలచిన పలికే దైవం
- పిలిస్తే పలికే దైవమని, భక్తురాలికి అనుభవపూర్వకంగా తెలియచేసిన బాబా వారు.
- పిలిస్తే పలుకుతాను. నీవు ఎక్కడ ఉన్నా తలచిన వెంటనే నీ చెంత ఉంటాను–Audio
- ‘‘గురువుని మించిన దైవం లేడు.”
- సచ్చరిత్ర చదవడంతో గురువు అంటే ఎవరో, దైవం అంటే ఎవరో తెలిసింది
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments