అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

బాబా ఫలానా కులానికి చెందిన వాడని, బాబా ఫలానా మతానికి చెందిన వాడని వారూ వీరూ చెప్పడమే కాని, తనంత తానుగా ‘నేను ఫలానా’ అని బాబా ఎన్నడూ చెప్పలేదు. ఎవరేది అనుకుంటే అదే తాననే వారు.

పదహారేళ్ళ వయసులో షిరిడీలో ప్రత్యక్షమయ్యారు బాబా. తనూ, తన గురువూ వేపచెట్టు కింది భూగృహంలో ‘గురుస్థానం’లో పన్నెండేళ్ళ పాటు తపస్సు చేశామని చెప్పారేగాని, తన గురువు ఎవరో, తనని గురువు దగ్గరకు చేర్చిందెవరో కూడా చెప్పలేదు బాబా. అసలు ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు.

మహల్సాపతి ‘ఆవో సాయీ’ అనడంతో బాబాకి ‘సాయి’ అని నామకరణం జరిగింది.

ఊరు లేదు. పేరు లేదు. కులం లేదు. మతం లేదు. ఏమీ లేని బాబాని తమ వాడంటే తమ వాడంటూ పంచుకోజూశారు హిందూ-ముస్లింలు.

చినికి చినికి గాలివాన అయిందది. ఇరు వర్గాల వ్యక్తులూ కత్తులూ, కటార్లూ పట్టుకున్నారు. కొట్టుకోబోయారు. అప్పుడక్కడ శ్యామా ఉండడంతో, అతడు ఇరు వర్గాలకీ సర్దిచెప్పడంతో సరిపోయిందిగాని, లేకపోతే పెద్ద మత కలహం చెలరేగేది.

అసలింతకీ బాబా ఎవరు? ఎక్కడి వాడు? ఏ కులానికి చెందిన వాడు? ఆయన మతం ఏమిటి?-తెలుసుకోవాలనుకున్నాడు శ్యామా. తెలుసుకుని ప్రచారం చేయగలిగితే అప్పుడు ఈ గొడవలు ఉండవనుకున్నాడతను.

ఆ వివరాలన్నీ చెప్పగలిగేది ఎవరు? బాబానే చెప్పాలి. ఆయన్నే అన్నీ అడిగి సమస్యను పరిష్కరిద్దామనుకున్నాడు శ్యామా. ద్వారకామాయికి చేరుకున్నాడు.

‘‘గొడవంతా తెలుసుకదా?’’ అడిగాడు శ్యామా. తెలుసునన్నట్టుగా తలూపారు బాబా.‘‘మరి, ఇప్పడయినా చెప్పు నీదే కులం? ఏ మతం?’’సమాధానంగా ముందు నవ్వారు బాబా. తర్వాత ఇలా అన్నారు.

‘‘జీవనాధారమయిన సూర్యుడిది ఏ కులమో నాదీ అదే కులం. ఆరోగ్య స్థితిగతులకు కారకుడయిన చంద్రుడిది ఏ మతమో నాదీ అదే మతం.”

అలాగే పంచభూతాలూ ఏ కులానికి చెందుతాయో అదే నా కులం. అవి ఏ మతానికి చెందుతాయో అదే నా మతం. సబ్‌ కా మాలిక్‌ ఏక్‌, అల్లాది ఏ కులమో నాదీ అదే కులం. అల్లాది ఏ మతమో నాదీ అదే మతం.’’ చెప్పారు బాబా.