అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

అతని(రామచంద్రపాటిల్‌) స్థితిని గమనించాడు తాత్యా. తట్టుకోలేకపోయాడు. బాబాని సమీపించాడు.‘‘మామా’’ బాబాని పిలిచాడు.‘‘చెప్పు’’‘దాదా పరిస్థితి ఏమీ బాగా లేదు. చూస్తోంటే భయం వేస్తోంది. మీరు కల్పించుకోవాలి. మీరు కల్పించుకోకపోతే దాదా మనకి దక్కడు.’’ అన్నాడు తాత్యా.

జవాబుగా కళ్ళు మూసుకున్నారు బాబా.‘కనికరించు మామా! దాదాని కాపాడు.’’ బాబా పాదాల్ని ఆశ్రయించాడు తాత్యా. కళ్ళు చెమర్చుకున్నాడు. కళ్ళిప్పి చూశారు బాబా.

దుఃఖిస్తున్న తాత్యా తల మీద ప్రేమగా చేతిని ఉంచి, నిమిరారు.‘‘గోళీలాట కాదిది, చావు బతుకుల సమస్య.’’ అన్నారు బాబా.‘‘అందుకే మిమ్మల్ని బతిమలాడుతోంది.’’ అన్నాడు తాత్యా. కొద్దిగా కోపగించుకున్నాడతను.

‘‘అది కాదు తాత్యా…’’ అని ఏదో బాబా చెప్పబోతుంటే ఆయన మాటల్ని అడ్డుకున్నాడు తాత్యా.‘‘నువ్వు నాకింకేమీ చెప్పవద్దు. దాదా నీ భక్తుడు. సేవకుడు. అతన్ని కాపాడే బాధ్యత నీదే.’’

‘‘నీ గురించి ఆలోచించుకోకుండా, దాదా గురించిన ఆలోచనలు ఎందుకు నీకు?’’ అడిగారు బాబా.సమాధానంగా గంభీరంగా చూసి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు తాత్యా. బాబా పిలుస్తున్నా పట్టించుకోలేదు. నవ్వుకున్నారు బాబా.

ఆ రాత్రి రామచంద్ర కలలో దర్శనం ఇచ్చారు బాబా. నమస్కరించాడు రామచంద్ర.‘‘పడలేను బాబా, ఈ బాధలు నేను పడలేను. నాకు జీవించాలని లేదు. చెప్పు, ఎప్పుడు నేను చనిపోతానో చెప్పు. హాయిగా కళ్ళు మూస్తాను.’’ ప్రార్థించాడు రామచంద్ర.‘‘

బాధపడకు. ఈ బాధలు ఇక ఎన్నాళ్ళో ఉండవు. త్వరలోనే నువ్వు కోలుకుంటావు. నీ దరిదాపుల్లో మరణం లేదు. అడ్డుకున్నాను దానిని.’’ చెప్పారు బాబా.

ఆనందించాడు రామచంద్ర. పదే పదే బాబాకి నమస్కరించాడు.‘‘నీ గురించి కన్నీరు పెట్టుకుంటున్న తాత్యా మాత్రం 1918 విజయదశమి రోజున మరణిస్తాడు. వాణ్ణి ఎలా బతికించాలో అంతుచిక్కడం లేదు. నా బాధంతా వాడి గురించే!’’ అన్నారు బాబా.

నోట మాట లేదు రామచంద్రకి.‘‘తాత్యా మరణం గురించి వాడికి చెప్పకు. వాడికే కాదు, ఎవరికీ చెప్పకు. ఇది రహస్యం.’’ అన్నారు బాబా. అదృశ్యమయిపోయారు.బాబా చెప్పినట్టుగానే రామచంద్ర కోలుకున్నాడు. ద్వారకామాయికి వచ్చి బాబాని కూడా దర్శించుకోసాగాడు.

అయితే ఏదో భయం…ఆందోళన అతని కళ్ళల్లో కనిపించేవి. తాత్యాని చూసి కన్నీరు పెట్టుకునేవాడు.‘ఏం దాదా’’ అని తాత్యా పలకరిస్తే గబగబా కన్నీరు తుడుచుకుని, నవ్వుతూ పలికేవాడు. ఇదంతా గమనించసాగాడు షింపే.