తన ఒడి లోనికి తానే రప్పించుకున్న సర్వాంతర్యామి(లవ్ సాయి లివ్ ఇన్ సాయి)–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

ఓమ్ సాయినాధాయ నమః

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-105-తన ఒడి లోనికి తానే రప్పించుకున్న సర్వాంతర్యామి 17:15

నా పేరు చాగంటి సాయిబాబా, ప్రస్తుతం ఖుర్దారోడ్, ఒడిషాలో రైల్వే నుండి స్వచ్చంద పదవీ విరమణ చేసి లక్ష్మీ నారాయణుడూ, కృష్ణరామ శివ మారుత్యాది రూపుడూ, శేషసాయీ అయిన ఆ గోదావరి తట షిర్డీ వాసుని తలుచుకుంటూ శేష జీవితాన్ని కొనసాగిస్తున్నాను.
నేను డిసెంబరు ఇరవైఎనిమిది పందొమ్మిదివందల ఏభైనాలుగు మంగళవారం రోజున నా మాతా మహులు శ్రీ తురగా కామేశ్వరరావు లక్ష్మీదేవిల ఇంట కాకినాడలో పుట్టాను.

మా నాన్నగారు అప్పటికే రైల్వేలో వుద్యోగ రీత్యా ఒడిషాలో స్తిరపడిన కారణంగా నేను కాకినాడలోనే పెరిగాను.

అప్పట్లో కాకినాడ సంత చెరువు వద్ద భక్త హృదయ వాసుని మందిరం ఒకటి వుండేది. (ఇప్పుడు కూడా వుంది).

చాలా విశాలంగా వుండేడి. మా అమ్మమ్మ గారు సర్వహృదయ వాసుని ఆశ్రితురాలయినందువలన ఆమె నన్ను తరచుగా ఆ మందిరానికి మూడు చక్రాల సైకిల్ పై తీసికుని వెళ్లేదిట.

మందిరం చుట్టూ ఆ సైకిల్ పై నేను తిరుగుతూ వుండేవాడినట. తన తొంబైతొమ్మదవ ఏట రెండువేల పన్నెండవ సంవత్సరంలో సర్వభూతవాసునిలో లీనమైన మా అమ్మమ్మ నాతో ఈ విషయాలన్నీ చెప్పేది.

భూతభవిష్యద్భావవర్జితుడైన ఆ కాలాతీతుడే కాలాన్ని శాసించి నా విధ్యాబ్యాసాన్ని మాతామహుల ఇంటనే ప్రారంభమయ్యేలా రూపొందించాడు.
మా అమ్మమ్మ చూపిన సాయి మార్గంలోనికి నా తమ్ముడినీ, ఇద్దరు చెల్లెళ్లనీ సాయి రప్పించుకున్నా ,

నేను మాత్రము సాయి పధము లోనికి రాలేదనేచెప్పాలి.

పందొమ్మిదివందల డబ్బయైదు నాటికి నేను బి.కాం పట్ట భద్రుడునై ఉధ్యోగార్దినై ఒడిషాలో మా నాన్న గారి దగ్గరికి చేరుకున్నాను.

అయిదుసంవత్సరాల పోరాటం తర్వాత అప్పటి ఆగ్నేయ రైల్వే లోని ఖుర్దారోడ్ లో వుద్యోగంలో ప్రవేశించి సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు వివిధ పదవులు నిర్వహించి, పందొమ్మిదివందల తొంబైఎనిమిదిలో ఒక ప్రధానమైన పదవిలో మండల ప్రధాన కేంద్రంలో ప్రవేశించాను.

ఒడిషాలో ని తెలుగు సంస్థలకు కన్వీనర్ గా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సినీ నటీనటులతో ఫోటోలు, అధికారులకు పొర్లు దండాలూ ఇదే జీవితమనీ, దీనిలోనే జీవన పరమార్దముందనీ భావించుకున్న రోజులవి.

కాలదర్పదమనుని చర్యలు అగోచరాలు! మన ఊహకి కూడా అందవు.

జీవితం వడ్దించిన విస్తరిలా సాగిపోతూ వుందన్న భ్రమలో జీవిస్తున్న నన్ను రెండువేల నాలుగవ సంవత్సరం మే మాసం ఒక కుదుపు కుదిపేసింది.

భక్తానుగ్రహకతారకుడు తన పేరు పెట్టుకున్న ఈ జీవి ఇంతలా భ్రష్టుపట్టి పోతున్నాడేమిటి అని భావించుకున్నాడా అన్నట్లు మండల ప్రధాన కేంద్రంలొ వున్న ప్రధానమైన పదవినుండి నన్ను తప్పిస్తూ ఒక అప్రధానమైన పదవికి జగన్నాధ క్షేత్రమైన పూరికి రైల్వే అధికారులు బదిలీ చేసారు.

అప్రధానమైన పదవీ, కొత్త కార్యస్థలం, సుమారు ఏభై మంది నా క్రింద పనిచేసేవారు,

అటువంటిది నేను ఒకరికింద పని చేయవలసి రావడం తో విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యాను. గుండెనొప్పివచ్చింది,

శస్త్రచికిత్సా జరిగింది. అయినా నాలో వత్తిడి తొలిగిపోలేదు.

వున్నపదవిలో కూడా కొన్ని ఆరోపణల మీద విచారణ మూడున్నర సంవత్సారయినా తీరని పరిస్థితులలో జీవితం పట్ల విపరీతమైన విరక్తి కలిగింది.

ఖుర్దారోడ్ నుండి పూరికి నలుబైఅయిదు కిలోమీటర్ల దూరం ప్రతిరోజూ వెళ్లివస్తూ వుండేవాడిని. అది మే మాసం, రెండువేల ఏడవ సంవత్సరం, అప్పటికి మూడు సంవత్సరాలు పూర్తయింది నేను పూరికి బదిలీ చేయబడి.

ఆరోజు పదిహేడవ తేదీ. ఇంటినుండి బయలు దేరినప్పుడే ఇంక తిరిగి ఇంటికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను, మధ్యాహ్నం భోజన విరామ సమయమయింది,

నా సహాధ్యాయితో నా ట్రావెల్ బ్యాగ్ ని మా ఇంటికి పంపమనీ, నేనొక పనిమీద బయటికి వెడుతున్నాననీ చెప్పి ట్రావెల్ బ్యాగ్ లో నా మనీ పర్సు వుంచి అందులోంచి పదిహేను రూపాయలు తీసికుని ఏదైనా మందు కొనుక్కుని తింటే జీవితం నుండి ముక్తిలభిస్తుందని బయలు దేరాను.

దుర్దర్షాక్షోభుని చర్యలు విచిత్రం గా వుంటాయి, మనం ఊహించను కూడా వూహించలేము.

తీవ్రమైన నిరాశ నిస్పృహలతో వెడుతున్న నేను నాకు ఎదురుగా ఎవరు వస్తున్నది గమనించుకునే స్థితిలో లేను.

తెల్లటి దుస్తులను ధరించి ఆజానుభాహుడైన ఒక వృద్దుడు నా ఎదురుగానుండే వెళ్లడం ఆయన నన్ను నాపేరుతో ’సాయీ’ అని పిలిచేంతవరకూ నేను గమనించనే లేదు.

’ఒక ఇరవై రూపాయలు ఇవ్వండి’ – ఆ వృద్ధుడు నన్ను అదోరకమైన యాసతో కూడిన హిందీ లో నన్ను అడిగారు.

నేనాశ్చర్యపోయాను, కానీ ఆ దివ్య నేత్రాల వైపు చూస్తూ కాదు అనలేక అలాగే చూస్తూవుండిపోయి, ’నా దగ్గర ఇప్పుడులేవు’ అని తల అడ్డంగా ఊపాను.

’నీ ఆఫీసులో నీ పర్సులో వున్నాయిగా, ఇక్కడికి ఒక అయిదునిముషాల దారి మాత్రమేగా, పద’ అని నా చేయి పట్టుకుని నన్ను నా ఆఫీసు వైపుకి దారి మళ్లించారాయన.

మరింత ఆశ్చర్యానికి గురయ్యాను, మొదటిది వారికి నాపేరు ఎలా తెలిసింది? రెండు నా ఆఫీసు ఎక్కడో ఆయనకెలా తెలుసు?

మూడు నా పర్సులో సరిపోయే పైకం వుందని ఆయనకెలా తెలిసింది? ఆఫీసుకి చేరుకుని పర్సులోనుండి అయిదురూపాయలు తీసి మొత్తం ఇరవై రూపాయలను ఆ వృద్దుని చేతిలో పెట్టాను, వెంటనే ఆయన చేతిలో వున్న ఒక ఎర్రటి అట్టవున్న పుస్తకంలో ఆ ఇరవై రూపాయలు పెట్టుకుని బయలుదేరేందుకు సిద్ధపడ్డారు.

అప్పుడు నేను ’స్వామీ, నేను మీకు ఇరవై రూపాయలిచ్చాననే అహంతో కాక ఆసక్తితో ప్రశ్నిస్తున్నాను,

నా పేరు మీకెలా తెలిసింది?’ అని అడిగాను.
దానికి వారిచ్చిన జవాబు నాకు నవ్వు తెప్పించింది, ’నేను షిరిడీ నుండి వస్తున్నాను,

మాకు అందరూ సాయిలే’. ఓహ్, ఎవరో నాగురించి ఈ ముసలాయనికి వూదారన్న మాట, ఎలాగోలాగ నా దగ్గర నుండి డబ్బులు దండుకు పోదామని వచ్చాడు అన్న భావన నా మనసంతా నిండిపోయింది.

’ఓహో’ అని వ్యంగ్యంగా అంటున్న నాతో ’సాయీ! మీరు చాలా కష్టకాలం గడుపుతున్నారుకదూ, ఎక్కడికో వెళ్లిపోదామనుకున్నారుగా! మీరు ఎక్కడికీ పోరు! మీ కష్టాలు తీరనున్నాయి, మీకు మంచికాలం రాబోతోంది,

మీ చేతులు చాచండి’ అన్నారు. అప్పుడు నేను పూర్తిగా నిర్ధారణకొచ్చేసాను, ఏవేవో పూజలంటాడు, షిరిడీలో దానాలంటాడు, నా దగ్గర నుండి ఒక వెయ్యి రూపాయలు లాగించేలాగ వున్నాడు అన్న భ్రమలో వున్నాను.

అయినా చేయి చాచాను, అంతకు మునుపు నేనిచ్చిన ఇరవై రూపయలుంచిన పుస్తకంలోనుండి డబ్బుతీయడం నేను గమనించాను.

చాచిన నా చేతిలోనికి ఇరవైరూపాయలతో పాటు ఒక రుద్రాక్ష ఇచ్చారు. రుద్రాక్ష ఎప్పుడు వచ్చిందో నేను గమనించనేలేదు.

అయితే ఇచ్చిన ఇరవైరూపాయలనూ తీసికోనన్న నాతో ఆయన ’ఈ ఇరవై రూపాయలు తీసికోండి, దీనితో సరకులు కొనండి, కొన్న సరుకులతో పరవాన్నం మీరు మాత్రమే తయారు చేయండి, తయారు చేసిన పరవాన్నాన్ని వచ్చే మాసం మొదటి గురువారం నుండి మూడు వారాల పాటు తెల్లవారుఝామున ఒక నల్లటి ఆవుకి తినిపించండి,

మీ కష్టాలు తొలిగిపోతాయి, అప్పుడు నేను మీ యింటికి వచ్చి ఈ ఇరవై రూపాయలు తిరిగి తీసికుంటాను,’ అన్నారు. అదే వ్యంగ్యం, అదే అజ్ఞానం, ’మా ఇల్లు మీకెలా తెలుసు’ అని ప్రశ్నించాను.

తొలి పరిచయంలోనే అంతటి ఆగ్రహాన్ని ఎవరి దగ్గరి నుండీ వూహించలేము, కళ్లలో ఎరుపుతో ’ఎన్ని సార్లు చెప్పాలి మీకు, నేను షిరిడీ నుండి వచ్చానని, మీరు ఎవరో, ఎక్కడినుండి వస్తున్నారో, ఏమి చేద్దామనుకున్నారో, ఏమి చేయబోయారో అన్నీ నాకు తెలుసు.

మీ ఇల్లు నాకు తెలీదా’ అని మండిపడ్డారు. వెంటనే చకచకా వెళ్లిపోయారు, రెండునిముషాల తర్వాత బయటికి వెళ్లి చూద్దును కదా ఎక్కడా ఆయన జాడే లేదు.
అయినా నాలో అజ్హానం తొలగిపోలేదు, అక్కడేవున్న నా సహాధ్యాయితో ’ఇప్పటిదాకా మాట్లాడిన ఆ సాధువుని చూసావు కదా, ఆయనో వీర ముష్టివాడు, మళ్లీ వస్తాడు, మా యిల్లు ఎక్కడ అని అడుగుతాడు,

మీకు తెలీదని చెప్పండి’ అంటుంటే అయోమయంగా ఆయనంటాడు ’మీలో మీరు మాట్లాడుకుంటూ, మీ ట్రావెల్ బ్యాగ్ లోనుండి నగదు తీసి మళ్ళీ అందులో పెట్టేస్తున్న మిమ్ములను చూసి మీకు మతి చలించిందేమొ అనుకుంటున్నాము మేమందరమూ’ ఇప్పుడిలా అంటారేమిటి? అంటూంటే ఆశ్చర్యపోవడమ్ నావంతయింది.

నా మనసులోనుండి ఆత్మహత్య భావన తొలిగిపోయింది, నా సహాద్యాయి ఆ విధంగా అనేటప్పటికి నాకు పూర్తిగా నిర్ధారణ కలిగింది, వీళ్లంతా కలిసి నాటకాలాడుతున్నారన్న నిర్దారణకొచ్చాను.

సరే, నేను ఆ ప్రదేశం నుండిబయట పడాలి, వెంటనే వున్న ట్రెయిన్లో ఖుర్దారోడ్ కి బయలుదేరాను.

సత్యసాయి ఆశ్రితుడైన స్టేట్ బ్యాంకు ఉద్యోగి మా తమ్ముడు ఖుర్దారోడ్ లోనే పని చేస్తున్నాడు, అతనికి ఫోనులో సంగతంతా వివరించాను.

ఆశ్చర్యకరంగా రైలు ఖుర్దారోడ్ చేరుకునే సరికి మా తమ్ముడు అక్కడ ఎదురు చూస్తున్నాడు, మరింత ఆశ్చర్యకరంగా నా పాదాలను తాకి ’అన్నయ్యా నువ్వు ఇరవై రూపాయలిచ్చిన స్వామి పాదాలకు మొక్కావా’ అని అడిగాడు.

’ఒక ముష్టివాడికి ఎందుకు మొక్కాలి’ అని వ్యంగ్యంగా అడిగాను.

నన్ను అదోలా చూసి అక్కడినుండి వెళ్లిపోయి ఆ సాయంకాలం నాకు శ్రీ సాయి సచ్చరిత్ర తెలుగు గ్రంధం ఇచ్చి ’అన్నయ్యా! ఈ పుస్తకం చదువు,

నీకున్న అనుమానాలన్నీ తొలగిపోతాయి, దక్షిణ ఇవ్వడం, తిరిగి బాబా ఆ దక్షిణని భక్తునికి ఇచ్చివేయడం ఇలాటి లీలలను ఇందులో చదివితే, బాబాతత్వం తెలుస్తుంది,

షిరిడీ నుండి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన యోగక్షేమవహుని సత్స్వరూపము నీకర్దమవుతుంది’ అన్నాడు.
సరే, ఆ గ్రంధాన్ని ఒక వారం చదివాను, నాలో ఏదో చేతన! నా మానసిక స్థితి మామూలు స్థాయికి వస్తున్న భావన, రెండవవారం పూర్తయింది,

నాలో ఆత్మ విశ్వాసం, చివరిగా మూడోవారం ముగిసేసరికి నాలో ఆత్మ విశ్వాసం వెల్లివిరిసింది. ఈ లోగా ఆ వృద్దుడు నల్ల ఆవుకి పరవాన్నం తినిపించమన్న విషయం నా కుటుంబ సభ్యులందరికీ తెలిపాను,

నా పెద్ద కుమార్తె అప్పటికే సాయి ఆశ్రితురాలు, చిన్నమ్మాయి అప్పుడప్పుడే ప్రవేసిస్తోంది, మాచెల్లెలందికదా ’ఆవు సాధారణంగా తన క్షీరంతో చేసింది తినదు, కానీ బాబా చెప్పారు కదా తప్పకుండా తింటుంది’ అంది,

అది వాళ్ల నమ్మకం, నాకింకా సంపూర్ణమైన విశ్వాసం కుదరలేదు.

జూన్ మాసం తొలి గురువారం, తెల్లవారు ఝామునే లేచి పరవాన్నం నా భార్యనడిగి నేనే తయారు చేసాను,

పూర్తయిన తర్వాత ఒక అరటి ఆకులో పెట్టుకుని సుమారు ఇరవై కిలో మీటర్ల దూరం బైక్ మీద నల్ల ఆవుకోసం ఏడు గంటల వరకూ వెతికాను, ఎక్కడా కనిపించలేదు,

నిరాశ కన్నా, నా ఉహే నిజమైనందన్న ఆనందమూ, గర్వమూ నాలో ఎక్కువయ్యాయి.

చదువుకుని కూడా ఇలాటివి నమ్మడం మన అజ్ఞానమని నా సోదరునికి ఫోను చేద్దామనుకునేంతలో నా కూతురు నన్ను పిలిచింది,

’నాన్నా రండి! ఎవరొచ్చారో చూడండి! ఆ పరవాన్నం పట్టుకుని రండి’ అని దాదాపు ఉద్విగ్నతతో పిలిచింది. వెళ్లి చూద్దును కదా, గుమ్మం ముందు నల్ల ఆవు.

ఇంకా నాలో తొలగని అహంభావం, అజ్ఞానం వెరసి ’తినాలి కదా, తిన్న తర్వాత మాట్లాడుకుందాం’ అనిపించింది. నేను ఇచ్చే పరవాన్నం స్వీకరించాలన్న ఆతృతగా వున్నట్లు సకల ప్రాణి స్వరూపుదు నల్ల ఆవు రూపంలో గబాలున ఆ పొట్లాన్ని తీసికుని ఆకులు కూడా మిగల్చకుండా స్వీకరించారు.

కంట నీరు, అహం కరిగి కన్నీటిగా ప్రవహిస్తూ వుంటే నల్ల ఆవు రూపంలో వున్న అంతర్యామికి నమస్కారం చేసాను. మరోరెండు గురువారాలు అదే సమయానికి నా గృహానికి నల్ల ఆవు రూపంలో విచ్చేసిన పరమసుఖదాయకుడు నన్నింక వెనక్కి తిరిగి చూడనీయలేదు, ఇప్పుడు సచ్చిదాత్ముడు నా జీవితం, పరమాత్ముడు నా సర్వస్వం మరియూ పరమేశ్వరుడు నా వెలుగు.

రెండువేల తొమ్మిదవ సంవత్సరంలో నేను స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన తర్వాత నాకు రావల్సిన నిధులు రావడం తీవ్రమైన జాప్యం జరిగినా అన్ని విధాలా నన్ను ఆదుకున్నది అన్నవస్త్ర దాయకుడు,

ధన మాంగళ్య దాయకుడు. సమరస సన్మార్గ స్థాపకునికి అందరూ అన్నివిధాలా తమ తమ పరిధులలో సేవలనందించుకుంటూడడం గమనించిన నేను ఏమి చేయగలను.

ఆ పరమ సుఖదాయకుని వర్ణించడానికి రచయితను కాను, ఆ లీలలను గానం చేయడానికి గాయకుడిని కాను, అర్చించేంత సహనమా లేనివాడిని,

ఆరతుల సంప్రదాయం పట్ల అవగాహనే లేనివాడిని, సచ్చరిత్ర పారాయణ అంటే ఆమడ దూరం పారిపోయే వాడిని,

మరి ఎలా? ఎలా?

ఆ సంసార సర్వ దుఃఖ క్షయకరుని ఋణము తీర్చుకోగలను? ఏభై మూడు సంవత్సరాల పాటు వ్యర్దం గా జీవితాన్ని గడిపి ఆయనే రప్పించుకునే వరకూ ఆయన పంధాలోని రాలేకపోయిన నాకు ఆ ప్రపన్నార్తి హరుని సేవించడానికి మిగిలిని జీవితమెంత?

ఒక ప్రార్దనతో, చిన్న నామ స్మరణతో, ఒకసారి లీలను స్మరించుకున్న మాత్రాన తీరగలిగిన ఋణమా అది.
ఓ సర్వమంగళకరా! నీ సేవలోనికి నీవే రప్పించుకునే వరకూ రాలేకపోయిన నాకు, నీ సేవలో గడిపే సమయం తక్కువే అని తెలుసు. మోక్షం, ముక్తి వంటి పెద్ద వరాలు నాకు వద్దయ్యా ప్రేమప్రదా!

నీ సేవలోనే ఎన్ని జన్మలైనా ఏ విధంగానానైనా జన్మించినా సరే పునీతమయ్యే సద్భాగ్యాన్ని అనుగ్రహించు ప్రీతివర్దనా!
ఇలా మధన పడుతున్న నాకు సిద్ధేశ్వరుడు ప్రేరేపించిన మార్గం, నవీన సాధనమైన సెల్ ఫోన్ ద్వారా సాయి సంక్షిప్త సందేశాలను ఆయన ఆశ్రితులకి పంపించడం. రెండువేల ఎనిమిదిలో సుమారు ఇరవైమందితో ప్రారంభమైన ఈ

’లవ్ సాయి; లివ్ ఇన్ సాయి’ సాయి సంక్షిప్త సందేశాలు ప్రతిరోజూ షిరిడీలో కాకడ హారతికి ముందు సుమారు 1850 సాయి ఆశ్రితులకి నిబంధనలకు అనుగుణంగా చేరి ఈ అల్పుడిని

’ఎస్ ఎమ్మెస్ సాయిబాబా’ గా పిలవబడేలా చేయడం ఆ వాసుదేవుని కృపకాక మరేమిటి? మరింత నవీనమైన వాట్సప్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ల ద్వారా మరింతగా సేవ చేసికునే భాగ్యాన్ని కల్పించారు ఆ భక్తవత్సలుడు!

చాగంటి సాయిబాబా
సాయి దయాల్ విహార్
లవ్ సాయి లివ్ ఇన్ సాయి
6-3-72, బాలి చెక్ సాహి, ఖుర్దారోడ్
జటనీ – 752050
9437366086, 8270077374
Whatsapp 7077339935

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles