Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice By: R C M Raju and team
🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹
శ్రీ సాయినాధాయ నమః
శ్రీ సాయి సచ్చరిత్రము
ఏడవ అధ్యాయము
అద్భుతావతారము; సాయిబాబా వైఖరి; బాబా యోగాభ్యాసములు – ధౌతి,
ఖండయోగము; బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము; కుష్ఠురోగ భక్తుని
సేవ; ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి; బాబా పండరి ప్రయాణము
అద్భుతావతారము :
సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడనుకొన్నచో హిందూమతాచార సంపన్నుడుగ గాన్పించుచుండెను.
ఆయన హిందువా లేక మహమ్మదీయుడా యన్న విషయము ఇదమిద్ధముగ యెవ్వరికీ తెలియదు.
బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి యుత్సవము జరుపుచుండెను. అదేకాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను.
ఈ యుత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చెడివారు.
గోకులాష్టమినాడు గోపాల్‌కాలోత్సవము జరిపించుచుండిరి. ఈదుల్ ఫితర్ పండుగనాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు.
మొహఱ్ఱం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిల్పి, కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామములో నూరేగించెదమనిరి.
నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి యయిదవనాడు నిస్సంకోచముగ దానిని తామే తీసివేసిరి.
వారు మహమ్మదీయులన్నచో హిందువులకువలె వారి చెవులు కుట్టబడియుండెను.
వారు హిందువులన్నచో, సున్‌తీని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదునందేల యుండును ?
మహమ్మదీయుడైనచో ధునియను అగ్నిహోత్రమునేల వెలిగించి యుండువారు ?
అదియేగాక, తిరుగలితో విసరుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను.
వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము లెట్లు చేయు చుండెడివారు ?
వారే తెగవారని యడుగబోయిన వారెల్లరు వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి.
అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరును సరిగా నిర్ణయించ లేకుండిరి. ఇదియొక వింతకాదు.
ఎవరయితే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి యొనరించెదరో వారు దేవునితో నైక్యమై పోయెదరు.
వారికి దేనితో సంబంధముగాని, భేదభావముగాని యుండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు.
వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్పించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కారు.
శ్రీ సాయి యవతారము విశిష్టమైనది; యద్భుతమైనది. నా పూర్వ జన్మ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చొను భాగ్యము లభించినది.
వారి సాంగత్యము లభించుట నా యదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన యానందోల్లాసములు చెప్పనలవి కానివి.
సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను.
ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును.
సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులనేకమంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు.
బాబా వారితో కలసి నవ్వుచూ, సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ, వారి నాలుకపై ‘అల్లామాలిక్’ యను మాట యెప్పుడూ నాట్యమాడుచుండెడిది.
వారికి వాద వివాదములు గాని, చర్చలు గాని యిష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ, వారెల్లప్పుడు శాంతముగాను, సంయమముతోను యుండెడివారు.
ఎల్లప్పుడు పరిపూర్ణ వేదాంత తత్త్వమును బోధించుచుండువారు. ఆఖరు వరకు బాబా యెవరో ఎవరికి తెలియనేలేదు.
వారు ప్రభువులను భిక్షుకులను నొకే రీతిగా ఆదరించిరి. అందరి యంత రంగములందు గల రహస్యములన్ని బాబా యెరింగెడివారు.
బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగనే యందరు ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులయినప్పటికి ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి.
సన్మానములన్నచో వారికే మాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది.
మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ, వారి చర్యలను బట్టి జూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను.
వారిని జూచిన వారందరు వారు షిరిడీలో వెలసిన భగవంతుడనియే యనుకొనుచుండిరి.
వట్టి మూర్ఖుడనైనా నేను బాబా మహిమల నెట్లు వర్ణించగలను ?
సాయిబాబా వైఖరి :
షిరిడీ గ్రామములో నున్న శని, గణపతి, పార్వతీ-శంకర, గ్రామదేవత, మారుతీ మొదలగు దేవాలయములన్నిటిని తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మతు చేయించెను.
వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలయిన పైకమునంతయు నొక్కొక్కరికి రోజుకొక్కంటికి రూ. 50/-, 20/-, 15/-ల చొప్పున ఇచ్ఛవచ్చినట్లు పంచిపెట్టెడివారు.
బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠువారు కూడ రోగవిముక్తులగుచుండిరి.
అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పనిలేకుండగనే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను.
అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలల వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగ రాసాగిరి.
బాబా ఎల్లప్పుడు ధునికెదురుగా ధ్యాన మగ్నులయి కూర్చొనెడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు.
ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు; మరొక్కప్పుడు స్నానము లేకుండనే యుండేవారు.
తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు.
మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షించి ఔషధము లిచ్చెడివారు.
వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగ పని చేయుచుండెడివి. వారికి గొప్ప ‘హకీం’ (వైద్యుడు) యని పేరు వచ్చెను.
ఈ సందర్భమున నొక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి యేఱ్ఱబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు.
ఇతర భక్తులాతనిని బాబా వద్దకు గొనిపోయిరి. సామాన్యముగ అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన యౌషధములు వైద్యులుపయోగించెదరు.
కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడిగింజలను నూరి రెండు మాత్రలుగ జేసి, యొక్కొక్క కంటిలో నొక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి.
మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్ళను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను.
నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టిననూ సున్నితమైన కండ్లు మండనేలేదు. అటువంటి చిత్రములనేకములు గలవు కాని, యందు యిదొకటి మాత్రమే చెప్పబడినది.
బాబా యోగాభ్యాసములు :
సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధయోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో రెండు మాత్రమే యిక్కడ వర్ణింపబడినవి.
ధౌతి :
మసీదుకు చాలా దూరమున ఒక మఱ్ఱిచెట్టు కలదు. అక్కడొక బావి కలదు.
ప్రతి మూడురోజుల కొకసారి బాబా యచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను.
ఆ సమయములో బాబా తన ప్రేవులను బయటికి వెడలగ్రక్కి, వాటిని నీటితో శుభ్రపరచి, ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లర చూచి చెప్పిరి.
మామూలుగా ధౌతియనగా 3 అంగుళముల వెడల్పు 22 1/2 అడుగుల పొడవుగల గుడ్డను మ్రింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు, కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమునైనది.
ఖండయోగము :
బాబా తన శరీరావయవములన్నియు వేరుచేసి మసీదు నందు వేర్వేరు స్థలములలో విడిచి పెట్టువారు.
ఒకనాడొక పెద్దమనిషి మసీదుకు పోయి బాబా యవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూని చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను.
కాని మొట్టమొదట ఫిర్యాదు చేసినవానికి ఆ విషయము గూర్చి కొంచెమైన తెలిసి యుండునని తననే అనుమానించెదరని భయపడి యూరకొనెను.
మరుసటి దినమతడు మసీదుకు పోగా, బాబా యెప్పటివలె హాయిగా కూర్చొనియుండుట జూచి యాశ్చర్యపడెను. ముందుదినము తాను చూచిన దంతయు భ్రాంతి యనుకొనెను.
చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి యెవ్వరికిని అంతుబట్టనిది.
రోగులవద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగా చికిత్స చేయుచుండిరి.
ఎందరో పేదలు వ్యధార్ధులు వారి యనుగ్రహము వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగ వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను.
బాబా తన సొంతము కొరకు ఏమియు చేయక, యితరుల మేలుకొరకే యెల్లప్పుడు పాటుపడేవారు.
ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసికొని ఆ బాధను తామనుభవించేవారు.
అటువంటి సంఘటన నొకదానిని యీ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమగును.
బాబా సర్వాంతర్యామిత్వము – కారుణ్యము :
1910వ సంవత్సరము (ఘన త్రయోదశినాడు, యనగా) దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు, ధునిలో కట్టెలు వేయుచుండెను.
ధుని బాగుగా మండుచుండెను. కొంత సేపయిన తరువాత హఠాత్తుగ కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగ యుండిపోయిరి.
మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును, మాధవరావు దేశపాండేయు దీనిని జూచి, వెంటనే బాబా వైపుకు పరుగిడిరి.
మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగ వెనుకకు లాగెను.
”దేవా ! ఇట్లేల చేసితిర”ని బాబా నడిగిరి. (మరేదో లోకములో యుండినట్లుండిన) బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని, ”ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను యొడిలో నుంచుకొని, కొలిమి నూదుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తన యొడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను.
బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలినది. అది నా కంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనను విషయము నా కానందము గలుగచేయుచున్న”దని జవాబిచ్చెను.
కుష్ఠురోగభక్తుని సేవ :
బాబా చెయ్యి కాలెనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలిసికొనిన నానా సాహెబు చాందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టరు పరమానంద్ యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్య సామగ్రితో సహ హుటాహుటిన షిరిడీ చేరెను.
చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను.
బాబా యందుల కొప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీశిందే యను కుష్ఠురోగి యేదో ఆకువేసి కట్టు కట్టెడివాడు. నానా యెంత వేడినను బాబా డాక్టరు గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు.
డాక్టరుగారు కూడా అనేకసారులు వేడుకొనిరి. ‘అల్లాయే తన వైద్యుడనీ‘, ‘తమకే మాత్రము బాధలేదనీ’ చెప్పుచూ, యెటులో డాక్టరుచే చికిత్స చేయించుకొనుటను దాటవేయుచుండెను.
అందుచే డాక్టరు మందుల పెట్టె మూతయైన తెరువకుండగనే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను.
కాని అతనికి యీ మిషతో బాబా దర్శన భాగ్యము లభించెను.
ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టు కట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము మానిపోయెను.
అందరు సంతోషించిరి. అప్పటికిని యింకా ఏమైన నొప్పి మిగిలియుండినదాయను సంగతి యెవరికి తెలియదు. కాని, ప్రతిరోజు ఉదయము భాగోజీ పట్టీలను విప్పి, బాబా చేతిని నేతితో తోమి, తిరిగి కట్లను కట్టుచుండెడివాడు.
బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునే యుండెను. మహాసిద్ధపురుషుడయిన బాబాకిదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ, తన భక్తుడైన భాగోజీ యందుగల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనెను.
బాబా లెండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు.
ప్రతిరోజు ఉదయము బాబా ధుని యొద్ద కూర్చొనగనే, భాగోజీ తన సేవాకార్యము మొదలిడువాడు.
భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగ యీ జన్మమున కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు, దుర్వాసన కొట్టుచుండెను.
బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతునివలె గాన్పించునప్పటికి, అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు; బాబా సహవాసమును పూర్తిగా ననుభవించినవాడు.
ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి :
బాబా విచిత్ర లీలలలో నింకొక దానిని వర్ణించెదను. అమరావతి నివాసి యగు దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకు(బల్వంత్)తో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను.
ఒకనాడు ఖాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను.
తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడచి అమరావతి పోవలెననుకొని సాయంకాలము బాబా బూటీవాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయెను.
గద్గద కంఠముతో తన చిన్నకొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను.
బాబా యామెతో దయతో మృదువుగ నిట్లనెను : ”ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి యున్నది. కొద్ది సేపటిలో మబ్బులన్నియు చెదిరిపోయి, ఆకాశము నిర్మలమగును”.
అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి, చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణము గల నాలుగు ప్లేగు పొక్కులను చూపుచూ, ”నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో చూడుము ! వారి కష్టములన్నియు నావే !”
ఈ మహాద్భుత లీలను జూచిన జనులకు, మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరింతురో యను విషయము స్పష్టమయ్యెను.
మహాత్ముల మనస్సు మైనము కన్న మెత్తనిది, వెన్నవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియు ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగ భావించెదరు.
బాబా పండరి ప్రయాణము !
సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరముల నెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను.
నానాసాహెబు చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందూరుబారులో మామల్తదారుగా నుండెను.
అతనికి పండరీ పురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి యను ఫలమానాటికి పండెను.
పండరీ పురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నాతడు గొప్ప ధన్యుడు.
నానాసాహెబు వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి యుండెను. షిరిడీలో యెవ్వరికీ ఉత్తరము వ్రాయక, హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యెను.
ముందుగా షిరిడీ కి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి, ఆ తరువాత పండరికి పోవలెననుకొనెను. నానాసాహెబు షిరిడీకి వచ్చు సంగతి యెవరికి తెలియదు. కాని బాబా సర్వజ్ఞుగుటచే గ్రహించెను.
నానాసాహెబు నీమ్‌గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను.
బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పాశిందే, కాశీరాములతో మాట్లాడు చుండెను.
హఠాత్తుగా బాబా వారితో నిట్లనియెను : ”మన నలుగురము కలిసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరచినారు. కనుక ఆనందముగా పాడెదము లెండు !”
అందరు కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమన, ”నేను పండరీ పోవలెను. నేనక్కడనే నివసించవలెను. ఎందుకనగా, అదియే నా ప్రభువు యొక్క ధామము”.
అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరు బాబాను అనుకరించిరి.
కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగ వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి, తనకు పండరీపురము బదిలీయైనదనీ, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి యక్కడుండవలసినదనీ వేడుకొనెను.
అటుల బ్రతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా యప్పటికే పండరి పోవలెను, అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి.
ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను.
బాబా యొక్క ఊదీ ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది, నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు !
ఏడవ అధ్యాయము సంపూర్ణము
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
శుభం భవతు
మొదటి రోజు పారాయణము సమాప్తము
The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy
Latest Miracles:
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఏబది యొకటవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹మొదటి అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ముప్పదియేడవ అధ్యాయము🌹….Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పన్నెండవ అధ్యాయము🌹…Audio
- 🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹పదనొకండవ అధ్యాయము🌹….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
3 comments on “🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఏడవ అధ్యాయము🌹….Audio”
Murthy Yeluri
June 13, 2021 at 8:14 amSir I need the full audio files.of baba charithra. Can I get it
Murthy Yeluri
June 13, 2021 at 8:16 amCan i get full audio files of baba charithra for hearing
Sreenivas Murthy
June 14, 2021 at 5:27 amhttp://saileelas.com/?p=16166
Sir, You can click above link, you can get complete SAI SATCHARITRA sung by RCM Raju Sir and his team