🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఆరవ అధ్యాయము🌹…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice By: R C M Raju and team


🌹సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా…సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

ఆరవ అధ్యాయము

సాయిబాబా యొక్క అనుమతి – వాగ్ధానము; ఉరుసు ఉత్సవము;

చందనోత్సవము; ఉరుసు శ్రీరామ నవమి ఉత్సవముగా మారిన వైనము;

మసీదుకు మరమ్మత్తులు

సాయిబాబా యొక్క యనుమతి – వాగ్దానము :

సంసారమను సాగరములో జీవుడనెడి యోడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగను, సురక్షితముగను గమ్యమును చేరును.

సద్గురువనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నాకండ్ల యెదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఊదీ పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయివేసి యాశీర్వదించుచున్నట్లు పొడముచున్నది.

నా మనస్సు సంతోషముతో నిండిపోయి, కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది.

ప్రళయాగ్నిచే కూడ కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కర స్పర్శ తగులగనే భస్మమై పోవును; అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును.

ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడువారి వాక్కు కూడ నెమ్మది పొందును.

శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును;

కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును; హృదయము భావోద్రేకముతో యుక్కిరి బిక్కిరి యగును.

‘నేనే తాన’ను (పరబ్రహ్మ స్వరూపమును) స్ఫురణ మేల్కొని, ఆత్మసాక్షాత్కారా నందమును కలిగించును. ‘నేను నీవు’ అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేయును.

నేను వేదపురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే యడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును;

నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి, తన లీలలను తామే వినిపింప జేయునట్లు తోచును.

నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీ సాయి యాపాద మస్తకము కృష్ణునివలె గాన్పించును. భాగవతమో, ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగ అనిపించును.

ఎవరితోనైన సంభాషించునప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను యేదైన వ్రాయ తలపెట్టినచో, యొక మాటగాని వాక్యము గాని వ్రాయుటకు రాదు.

వారి యాశీర్వాదము లభించిన వెంటనే రచనా ధార యంతులేనట్లు సాగును.

భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని యణచి వేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టిజేసి యాశీర్వదించును.

సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్యశరణాగతి చేసినవానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములగును.

భగవత్‌ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనెడి నాలుగు త్రోవలు గలవు. అన్నింటిలో భక్తిమార్గము కష్టమైనది.

అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును.

ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించెడివారు.

స్వయంసత్తాకమైన బ్రహ్మము, జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి (మాయ), సృష్టి…యను యీ మూడింటి గూర్చిన తత్త్వ విచారము చేసి, వాస్తవమునకీ మూడును నొకటియేయని  సిద్ధాంతీకరించి, బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రదాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు :

”నా భక్తుని యింటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తి, శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే యారాధించువారి యోగక్షేమముల నేను జూచెదను.

కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు ! నీకేమైన కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములోని కీర్తి,  ప్రతిష్ఠలకై ప్రాకులాడుట మాని, దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించుము.

ప్రపంచ గౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సు నందు ఇష్టదైవము యొక్క యాకారమును నిలుపుము.

సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని యారాధనకొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుము.

మనసును ధనసంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణము మొదలైన విషయముల పట్ల సంచరించకుండ గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి, శాంతముగను చింతారహితముగను యుండును.

మనస్సు సరియైన సాంగత్యములో నున్నదనుటకు నిదియే గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు”.

బాబా మాటలుదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమును వర్ణించుటకు పూనుకొనెను.

షిరిడీలో జరుగు నుత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది.

సాయిలీల (1925 – పుట 197) పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవము గురించి విపులముగ వర్ణింపబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది.

ఉరుసు ఉత్సవము :

కోపర్‌గాంవ్‌లో గోపాల్‌రావు గుండ్‌ అనునతడు పోలీసు సర్కిలు ఇన్‌స్పెక్టరుగా నుండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు.

అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికి సంతానము కలుగలేదు. శ్రీ సాయి యాశీర్వచనముచే అతనికొక కొడుకు బుట్టెను.

ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ‘ఉరుసు’ * ఉత్సవము నిర్వహించవలెనను ఆలోచన కలిగినది.


* ఉరుసు = సమాధి చెందిన మహమ్మదీయుల మహాత్ముల దర్గాల (సమాధుల) వద్ద యేటేటా భక్తులు జరుపుకొను ఆరాధనోత్సవము.


తన ఆలోచనను తాత్యాకోతేపాటీలు, దాదాకోతే పాటీలు, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయిభక్తుల ముందుంచెను.

వారంతా దీనిని ఆమోదించిరి. బాబా యాశీర్వాదమును, అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను.

ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి.

గ్రామ కులకర్ణి (కరణము) దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కాని బాబా యాశీర్వదించి యుండుటచే, మరల ప్రయత్నించగా వెంటనే యనుమతి వచ్చెను.

బాబా సలహా ననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమినాడు చేయుటకు నిశ్చయించిరి.

ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమినాడు జరుపుకొనమనుటలో హిందూ – మహమ్మదీయుల సమైక్యతా భావము బాబా ఉద్దేశ్యము కాబోలు. భవిష్యత్సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును.

ఉత్సవము జరుపుటకు అనుమతయితే వచ్చెనుగాని, యితర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను. గ్రామమంతటికి రెండు నూతులుండెడివి.

ఒకటి యెండకాలములో నెండిపోవుచుండెను. రెండవ దానిలోని నీళ్ళు ఉప్పనివి.

ఈ సమస్యను బాబాకు నివేదించగా, బాబా ఆ ఉప్పునీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగ ఆ ఉప్పునీరు మంచినీళ్ళుగా మారిపోయినవి.

ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరము నుండి మోటల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగ అంగళ్ళు వెలసినవి. కుస్తీ పోటీల  కొరకేర్పాట్లు చేయబడినవి.

గోపాలరావు గుండున కొక మిత్రుడు గలడు. వాని పేరు దాము అణ్ణాకాసార్‌. అతనిది అహమద్‌నగరు. అతనికిని ఇద్దరు భార్యలున్నప్పటికి సంతానము లేకుండెను. అతనికి కూడ బాబా యాశీర్వాదముచే పుత్ర సంతానము గలిగెను.

ఉత్సవము కొరకు ఒక జండా తయారు చేయించవలెనని గోపాలరావు అతనికి పురమాయిచెను. అటులనే నానాసాహెబు నిమోన్‌కరును ఒక నగిషీ జండా తెమ్మని కోరెను.

ఈ రెండు జండాలను ఉత్సవముతో తీసికొనిపోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి నిప్పటికిని అవలంబించుచున్నారు.

బాబా తాము నివసించిన యా మసీదును ‘ద్వారకామాయి’ యని పిలిచెడివారు.

చందనోత్సవము :

సుమారు అయిదేళ్ళ తరువాత ఈ యుత్సవముతో బాటు నింకొక ఉత్సవము కూడ ప్రారంభమయ్యెను.

కొరాలా గ్రామమునకు చెందిన అమీరు శక్కర్‌ దలాల్‌ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను.

ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు.

వెడల్పు పళ్ళెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో భాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు.

ఉత్సవ మూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి (నింబారు) లోను, గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు.

మొదటి మూడు సంవత్సరములు ఈ యుత్సవమును అమీరుశక్కరు నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను.

ఒకే దినమందు పగలు హిందువులచే జండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము యే అఱమరికలు లేక జరుగుచున్నవి.

ఏర్పాట్లు :

షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది.

భక్తులందరు వచ్చి ఈ యుత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నియు తాత్యాకోతే పాటీలు చూచుకొనెడివాడు. ఇంటిలోపల చేయవలసినవన్నియు రాధాకృష్ణమాయి యను భక్తురాలు చూచుచుండెను.

ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయెడిది. ఆమె వారికి కావలసిన యేర్పాట్లు చూచుకొనుటయే గాక, ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు. స్వయముగా ఆమె మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము వేయుచుండెను.

మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసిపట్టి యుండెడివి. మండుచున్న ధునితో సహా, మసీదులోని వస్తువులనన్నింటినీ తీసి బయట పెట్టి, మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లవేయించుచుండెను.

ఆమె ఇదంతయు (దినము మార్చి దినము) బాబా చావడిలో పరుండునప్పుడు చేసెడిది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తిచేయుచుండెను.

పేదలకు అన్నదానమనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ యుత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి.

భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగ వండబడెడివి. అనేకమంది సంపన్నులైన సాయిభక్తులు స్వచ్ఛందముగ పూనుకొని యీ సేవలో పాల్గొనుచుండెడివారు.

ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము :

ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను.

రానురాను అది వృద్ధియగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో యీ ఉత్సవమునకు సంబంధించినొక మార్పు జరిగెను.

శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్తయైన కృష్ణారావు జాగేశ్వర భీష్మ యనువాడు దాదాసాహెబు ఖాపర్డే (అమరావతి)తో కలిసి నుత్సవమునకు వచ్చెను.

వారు దీక్షిత్‌వాడాలో బసచేసిరి. ఉత్సవము ముందురోజు కృష్ణారావు దీక్షిత్‌వాడా వసారాలో పండుకొనియుండెను. ఆ సమయములో లక్ష్మణరావు ఉరఫ్‌ కాకామహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను.

అతనిని చూడగనే భీష్మకు యొక క్రొత్త యాలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో

”ఉరుసు యుత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనుటలో భగవదుద్దేశమేదియో యుండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక యీ దినమందు రామ జన్మోత్సవము యేల జరుపకూడ”దని యడిగెను.

కాకా మహాజనికి ఆ యాలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా యనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యిరి.

కానీ, భగవస్సంకీర్తన చేయుటకు, అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము.

ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లన, అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే, అతడే దానిని సంకీర్తన చేయుటకు, కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి.

చక్కెరతో కలిపిన శొంఠి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను.

బాబా యనుమతి బొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా, వాడాలో నేమి జరుగుచున్నద’ని మహాజనిని ప్రశ్నించెను.

బాబా యడిగిన ప్రశ్నలోని అంతరార్ధమును మహాజని గ్రహించలేక, యేమీ జవాబివ్వక మౌనముగ నుండెను.

బాబా యదే ప్రశ్న భీష్మ నడిగెను. అతడు శ్రీరామనవమి యుత్సవము చేయవలయునను తమ యాలోచనను బాబాకు వివరించి, అందులకు బాబా యనుమతి నివ్వవలెనని కోరెను.

బాబా వెంటనే యాశీర్వదించెను. అందరు సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి.

ఆ మరుసటి దినము మసీదు నలంకరించిరి. రాధాకృష్ణమాయి యొక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరి.

శ్రీరామజన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను.

అప్పుడే లెండీ నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించెను.

రామజన్మోత్సవము జరుపుటకు బాబా యొప్పుకొనునో లేదో, యేమగునో యని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను.

అదియంతయు యేమని, అక్కడ ఊయల యెందుకు  కట్టిరని బాబా యతనిని యడిగెను.

శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల  కట్టిరనియు అతడు చెప్పెను.

బాబా మసీదులో నుండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు ‘నింబారు’ (గూడు) నుండి రెండు పూలమాలలు తీసి, యొకటి మహాజని మెడలో వేసి, యింకొకటి భీష్మకు పంపెను.

హరికథ ప్రారంభమయ్యెను. రామకథాసంకీర్తనము ముగియగానే, బాజా భజంత్రీ ధ్వనుల మధ్య ‘శ్రీరామచంద్రమూర్తికీ జై’ యను జయ జయ ధ్వానములు చేయుచూ, పరమోత్సాహముతో అందరూ యొకరిపై నొకరు ‘గులాల్‌’ (ఎఱ్ఱ రంగుపొడి) జల్లుకొనిరి.

అంతలో నొక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్‌ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలమంది భయముతో పారిపోయిరి.

కాని బాబా యొక్క సన్నిహితభక్తులు మాత్రము అవన్నియు తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన యాశీర్వాదములని గ్రహించి కదలక నక్కడనే యుండిరి.

శ్రీరామ జయంతి నాడు రావణుడనే యహంకారాది అరిష్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపములో నున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా యని భావించిరి.

షిరిడీలో ఏదైన క్రొత్తది ప్రారంభించునపుడెల్ల బాబా కోపించుట యొక రివాజు. దీనిని తెలిసినవారు గమ్మున నూరకుండిరి.

తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని బిలిచి ఊయలను దీసికొని రమ్మనెను.

మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంత సేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను.

సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నింకనూ దాని యవసరమున్నదనీ, కనుక దానిని విప్పవద్దనీ బాబా యతనిని వారించెను.

రామనవమి మరుసటి దినమున జరుపు గోపాలకాలోత్సవముతో గాని యుత్సవము పూర్తికాదను విషయము అప్పుడు భక్తులకు స్పురించెను.

మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు ‘కాలాహండి’ యను ఉత్సవము జరిపిరి. కాలాహండి యనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పుకారము కలిపి వ్రేలాడగట్టెదరు.

హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగుల గొట్టెదరు. రాలిపడిన యటుకులను భక్తులకు ప్రసాదముగ పంచి పెట్టెదరు.

శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగనే తన స్నేహితులగు గొల్ల పిల్లవాండ్రకు పంచి పెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నియు పూర్తియైన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను.

శ్రీరామనవమి వేడుకలీ విధముగ జరిగిపోవుచుండగా, పగటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవము కూడా యథావిధిగ జరిగినవి. ఈవిధముగ ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగ మారెను.

1913 నుండి శ్రీరామనవమి యుత్సవములోని యంశములు క్రమముగ హెచ్చినవి. చైత్ర పాడ్యమి నుంచి రాధాకృష్ణమాయి ‘నామసప్తాహము’ ప్రారంభించుచుండెను.

భక్తులందరు వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడ వేకువఝాముననే భజనలో చేరుచుండెను.

శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతట జరుగుటచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను.

శ్రీరామనవమికి 5, 6 రోజులు ముందు ‘ఆధునిక తుకారామ్‌’ యని పిలువబడు బాలాబువ మాలీ యను సంకీర్తనకారుని కాకామహాజని యాధృచ్ఛికముగ కలియుట తటస్తించినది.

శ్రీరామనవమినాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని వచ్చెను.

ఆ మరుసటి సంవత్సరము కూడా, అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్‌ సిద్ధకవటె గ్రామములో ప్లేగు వ్యాపించి యుండుటచేత బాలబువ సతార్కర్‌ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా నుండెను.

కాకాసాహెబ్‌ దీక్షిత్‌ ద్వారా బాబా యనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి, హరికథా సంకీర్తనము చేసెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను.

1914 సం.లో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగణు మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా యేటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగ పరిష్కరింపబడెను.

1912 నుండి ఈ యుత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను.

చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనెత్రుట్టెయవలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీపోటీలలో ననేకమంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి.

పేదలకు అన్న సంతర్పణ విరివిగ జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ యొక సంస్థానముగ రూపొందెను.

వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు మొ.నవి బహుకరింపబడెను.

ఉత్సవమునకు ఏనుగులు కూడ వచ్చెను. ఇవన్నియు యెంత హెచ్చినప్పటికి సాయిబాబా వీనినేమాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై యుండెడివారు.

ఈ యుత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయమేమన హిందువులు, మహమ్మదీయులు యెట్టి అరమరికలు లేక కలిసి మెలసి ఉత్సవములలో పాలుబంచుకొనెడివారు.

ఈనాటి వరకు యెటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5000 నుండి 7000 వరకు యాత్రికులు వచ్చేవారు.

క్రమముగ యా సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికి ఎన్నడూ అంటువ్యాధులు కాని, అల్లరులు గాని సంభవించలేదు !

మసీదుకు మరమ్మతులు :

గోపాలరావు గుండునకు ఇంకొక మంచి యాలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగనే, మసీదును తగినట్లుగా తీర్చి దిద్దవలెనని నిశ్చయించుకొనెను.

మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను. కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు.

నానాసాహెబు చాందోర్కరుకు ఆ సేవ లభించినది. రాళ్ళ తాపన కార్యము కాకాసాహెబు దీక్షిత్‌కు నియోగింపబడెను.

మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబా కిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహల్సాపతి కల్పించుకొని, యెటులనో బాబా యనుమతిని సాధించెను.

బాబా చావడిలో పండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపుమీద కూర్చుండువారు.

గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరములో సభామండపము పూర్తిచేసిరి.

మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది. సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్‌ దానిని విశాలపరచి పై కప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను.

రాత్రియంతయు శ్రమపడి స్తంభములు నాటెడివారు. మరుసటి దినము ప్రాతఃకాలముననే బాబా చావడి నుండి వచ్చి యదియంతయు జూచి కోపముతో వానిని పీకి పారవైచెడివారు.

ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై, నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో బెకలించుచు, రెండవ చేతితో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను.

తాత్యా తలపాగాను బలవంతముగా దీసి, యగ్గిపుల్లతో నిప్పంటించి, యొక గోతిలో పారవైచెను. బాబా నేత్రములు నిప్పుకణములవలె వెలుగుచుండెను. ఎవరికిని బాబావైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను.

అందరు భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి యటువైపు విసరెను. అది శుభసమయమందు చేయు యాహుతివలె కనబడెను. తాత్యా కూడా చాలా భయపడెను.

తాత్యాకేమి జరుగనున్నదో ఎవరికీ ఏమియు తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టునుండి తాత్యాను విడిపించుట కెవ్వరికిని ధైర్యము చాలలేదు.

ఇంతలో కుష్ఠిరోగియు బాబా భక్తుడు నగు భాగోజి శిందే కొంచెము ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసివేసెను.

మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలచిరో అందరికి యొకే గతి పట్టెను.

కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి, వాని వద్ద నుంచి యొక నగిషీ జరీపాగాను కొని, తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకాయన్నట్లు, దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టెను.

బాబా యొక్క యీ వింతచర్యను జూచిన వారెల్లరు నాశ్చర్యమగ్నులైరి.

అంత త్వరలో బాబా కెట్లు కోపము వచ్చెను? ఎందుచేత నీ విధముగ తాత్యాను శిక్షించెను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను? అని యందరు ఆలోచించుచుండిరి.

బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలె గూర్చుండి యత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణముగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు.

కాని యేది చెప్పవలెనను విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్ల ఒక్కొక్కటి చెప్పెదను.

ఆరవ అధ్యాయము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles