వినదగు నెవ్వరు చెప్పిన …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 12



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“భగవంతుడు ఎలా ఉంచితే అలా ఉండాలి” అంటారు సాయిబాబా. మొదట్లో అది కష్టమే.

నికోలస్ హెర్మన్ ఎప్పుడు జన్మించాడో తెలియదు. కానీ బ్రదర్ లారెన్స్ గా ఫిబ్రవరి 12, 1691న తనువు చాలించాడు.

పేదవాడిగానే పుట్టాడు, పేదవానిగానే మరణించాడు. ఐతే అయన జీవించినది భగవంతునితో.

అయన మరణానంతరం “భగవత్ సాన్నిధ్యాన్ని అనుభవించటం – practises of the presence of God” అనే చిన్న గ్రంథాన్ని అయన సన్నిహితులు వెలువరించారు.

అందులో అయన సంభాషణలు, ఉత్తరాలు ఉన్నాయి. ఆ చిన్న గ్రంథము నేటికి కూడా ఆధ్యాత్మిక సాహిత్యంలో అందరి మన్ననలను అందుకుంటోంది.

ఆయన 18 ఏండ్ల వయసులో ఒక వృక్షాన్ని చూసాడు. వృక్షాన్ని చూడని వారెవరుంటారు? కానీ ఆయన ఆ చెట్టు ద్వారా ఆ చెట్టును సృష్టించిన దైవం యొక్క తత్వాన్ని దర్శించాడు.

శిశిర ఋతువులో ఆకులన్నీ రాల్చి మోడుగా ఉన్న వృక్షాన్ని చూచాడు. కొలది కాలంలో అది మరల చిగురించి, ఆకులు, పూవులు, పిందెలు, కాయలు, పండ్లతో నిండి ఉండటం చూచాడు.

భగవంతుని సృజనాత్మకత, దయా గుణం, శక్తి విశిష్టత గోచరించింది. ఒక దివ్యానుభూతి, అలోకిక ఆనందం కలిగాయి.

అనుక్షణం భగవంతుని సాహచర్యం అనుభవిస్తూ, ఆయనతో విరామం లేకుండా సంభాషిస్తూ, ఐహిక, ఆధ్యాత్మిక విషయాలన్నింటిలోనూ ఆయనకు దాసోహమంటూ జీవించాలనుకున్నాడు.

సుఖ, దుఃఖాలను సమదృష్టితో స్వీకరించాలంటాడాయన. భగవంతుడు ఇచ్చే రక్షణ, సహాయానికి ఏ మాత్రం లోటుండడంటాడు.

ఆయన జీవితాన్నే పరిశీలిస్తే, పూట గడవక సైన్యంలో చేరాడు. పొంగి పోలేదు. యుద్ధంలో గాయపడి సైన్యం నుండి వచ్చేశాడు. చింతించలేదు.

ఊరి వారందరకీ జబ్బు చేసినప్పుడు, ఆ జబ్బు నుండి బయటపడ్డ వారిలో ఆయనొకడు. పొంగిపోలేదు.

పొట్టకూటికై మరల ప్రయత్నాలు. కుంచించుకు పోలేదు. కుంటితనంతోనే క్రిస్టియన్ మఠంలో బ్రదర్ లారెన్స్ గా మారాడు. వంటవాడయ్యాడు.

వంట చేయటం ఆయనకిష్టంలేదు. భగవంతుని ఆజ్ఞగా స్వీకరించి దైవకార్యంగా వంట, వడ్డన చేసేవాడు. ఆ పనులలో నిరంతరం భగవత్ సాన్నిధ్యం పొందాడు.

చర్చిలో చేసే దైవ ప్రార్ధనను, తాను చేసే వంట, వార్పుకు భేదమే లేదాయనకు. భోజనాలు చేసేటప్పుడు వినబడే శబ్దాలు, భగవంతుని సాన్నిధ్యం నుండి ఆయనను మరల్చలేక పోయాయి.

శరీరం కృశించగా చెప్పులు బాగుచేసే పని కూడా దైవ సంకల్పమని, ఆ పనిని ప్రేమతో చేయసాగాడు.

అంతటి చిన్న స్థాయిలో ఉండి కూడా భగవత్సాన్నిధ్యాన్ని ఎలా పొందుతున్నాడో అని పండితులు, పామరులు ఆయనను సంప్రదించే వారు.

చేసే ప్రతి పని భగవంతుని ప్రీతి కొరకే. అసలు జీవితమే భగవానుని కోసం.

బ్రదర్ లారెన్స్ ఫిబ్రవరి 12, 1691న మరణించినా, ఆయన జీవితం చిరు పుష్ప సువాసనలు వెదజల్లుతున్నవి.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles