Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
నా సంరక్షకుడు.. సాయిబాబా – 2
శ్రీలంకలోని ఒక సాయి భక్తురాలి మరో అనుభవం…
నేను నా జీవితంలో నాభర్తకు దూరమయ్యాను. ఆయన గురించే నేను బాబాని ప్రార్ధిస్తున్నాను. నా భర్త వారి తల్లిడండ్రుల దగ్గరకి వెళ్ళిపోయి మరలా తిరిగి రాలేదు. మా అత్తగారికి నేనంటే యిష్టం లేదు. మావారికి మళ్ళీ వివాహం చేయాలని అనుకొంటోంది. నాకు ఉద్యోగం పోయింది. నా మానసిక వత్తిడి వల్ల నాకడుపులో ఉండగానే నాబిడ్డ కూడా చనిపోయింది. నాభర్త నన్ను పలకరించడం కూడా మానేశాడు. నేను సాయి గురువారం వ్రతం మొదలుపెట్టాను. అంతర్జాలంలో ఎప్పుడూ నేను సాయిని ప్రశ్నలడుగుతూ, వాటికి సమాధానాలను తెల్సుకుంటూ ఉంటాను. బాబా ఇచ్చే సమాధానాల వల్లే నేను ఆత్మహత్య చేసుకొనే ఉద్దేశ్యాన్ని కూడా విరమించుకొన్నాను. కాని నాకు ఆయన ఎప్పుడూ యిచ్చే సమాధానం ఒకటే. సంవత్సరాలుగా నేనడుగుతున్న ప్రశ్నకి సమాధానం రామనవమినాడు అనగా ఈరోజు నాకోరిక నెరవేరుతుందని. జీవితంలో కోల్పోయిన సుఖసంతోషాలను నాకు తిరిగి ప్రసాదించమని బాబా ముందు ప్రతిరోజూ విలపిస్తూ ప్రార్ధించేదానిని. ఈరోజున అంటే రామనవమి నాడు నాభర్తను నాకు తిరిగి వచ్చేలా చేస్తానన్నదే బాబా చెప్పిన సమాధానం. ఆశుభసమయం కోసమే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. కాని నేను కోరుకొన్నట్లుగా ఏమీ జరగలేదు. బాబా దగ్గరకెళ్ళి తనివితీరా ఏడిచాను. కాస్త మనసు తేలిక పడిన తరువాత మరలా సాయిబాబా సమాధానాలకోసం అతర్జాలంలో చూశాను. అందులో “అన్నదానం చేయి. నీకు శుభం కలుగుతుంది” అని వచ్చింది. ఇక్కడ నేను ఉన్న ప్రాంతం లో చుట్టూ ధనవంతులు ఉన్నారు. పెద్ద పెద్ద భవనాలు. ఇక్కడికి భిక్షగాళ్ళు ఎవరూ రారు. అన్నం పెడదామన్నా యింతవరకూ నేను ఏభిక్షగాడిని చూడలేదు.
బీదవారు ఎవరయినా కనపడతారేమో చూద్దామని మెయిన్ రోడ్డు వైపు నడుస్తున్నాను. ఇక మెయిన్ రోడ్డుకు చేరుకుంటాననగా “అసల్లాము ఆలేకుం” అని ఎవరో నన్ను పిలవడం వినిపించింది. ఎవరు పిలుస్తున్నారా అని వెనక్కి తిరిగి చూశాను. ఒక యింటి గోడ ప్రక్కగా ఒక నిరుపేద ముస్లిం స్త్రీ ఒక చిన్న పిల్లవాడితో నిలబడి ఉంది. కళ్ళలోంచి ఆనంద భాష్పాలు జాలువారుతుండగా, నా చేతిలో ఉన్న ఆహారం పొట్లం ఆపిల్లవాడికిచ్చి, వెళ్ళిపోయాను. నావెనుక ఆస్త్రీ నన్ను ఆశీర్వదించడం నాకు వినపడింది. నేను రోడ్డుకు చేరుకొన్న తరువాత ఆమెని, పిల్లవాడిని చూద్దామని వెనుకకు తిరిగాను. వాళ్ళిద్దరూ నాకు కనపడలేదు. నేనక్కడి నుండి బయలుదేరగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారో, లేక నానుంచీ ఆహారాన్ని స్వీకరించి నన్ను సంతోషపెట్టడానికి బాబాయే ఆరూపంలో వచ్చారో నాకు తెలీదు. బాబాయే స్వయంగా వచ్చి నన్ననుగ్రహించారని పొంగిపోయాను. బాబాని చూడాలనే ప్రగాఢమయిన కోరిక కలిగింది. ఇక్కడ శ్రీలంకలో సాయి మందిరాలు లేవు. అంతర్జాలంలో సాయి మందిరాలు ఏమయినా ఉన్నాఏమో చూసి చిరునామాలు, ఫోన్ నంబర్లు వెబ్ సైట్లలో వెతికి పట్టుకున్నాను. అవి నిజంగా సాయి మందిరాలు అవునో కాదో తెలుసుకోవడానికి ఆ నెంబర్లకు ఫోన్ చేశాను. కాని ఆరెండు నెంబర్లు కూడా పనిచేయడం లేదు. ఎలాగయినా సాయి మందిరానికి వెళ్ళాలని నిశ్చయించుకొని బ్యాంక్ లో నా ఖాతాలో ఆఖరుగా మిగిలిన కొద్ది మొత్తం తీసేసుకొని ఆటోలో బయలుదేరాను. అక్కడ ఎవరిని అడిగినా తమకు సాయి మందిరాల గురించి తెలియదని చెప్పారు. ఎలాగయినా నీ మందిరానికి చేర్చి, నీ దర్శన భాగ్యం కలిగించు బాబా అని ప్రార్ధించాను.
నా దగ్గిర ఎక్కువ డబ్బు కూడా లేదు. దూరదూరాలు వెళ్ళి మధ్యలో చిక్కుకు పోతే చేతిలో డబ్బు లేకుండా తిరిగి వెళ్ళలేని పరిస్థితి. తొందరగా నీదర్శన భాగ్యం కలుగచేయి అని వేడుకొన్నాను. చిరునామా ప్రకారం నేను చేరుకున్న రోడ్డులో ఎక్కడా సాయి మందిరం కనిపించలేదు. అక్కడ ఎవరిని అడిగినా మాకు తెలీదనే చెప్పారు. నాకు చాలా బాధ కలిగింది. మళ్ళీ ఆటోలో కూర్చున్నాను. నేనింక ఆశ వదిలేసుకున్నాను, ఆటో డ్రైవరు మాత్రం ఆటోని మెల్లిగా నడుపుతూ తను కూడా బాబా మందిరం ఎక్కడ కనపడుతుందాని వెతుకుతున్నాడు. ఆవీధిలో ఉన్న అన్ని సందుల్నీ చూస్తూ ఒక సన్నటి సందు ముందర ఆగి, యిక్కడ 10/2 ఉంది కాబట్టి 10/4 కూడా యిక్కడే ఉండచ్చు. ఒకసారి వెళ్ళి చూడమని చెప్పాడు. అక్కడ మందిరాలు ఏమీ లేవు.
కాని ఆరోడ్డులో ఒక మూడంతస్తుల భవనం ఉంది. గోడమీద షిరిడీ సాయిబాబా పోస్టరు ఉంది. వెంటనే గోడ మీద అతికించి ఉన్న బాబా ఫొటో వద్దకు వెళ్ళి చూశాను. కాని గేటుకి తాళం వేసి ఉంది. అక్కడ అతికించిన పోస్టర్ మీద ‘ఇది సాయి మందిరం. ఈమందిరం ఉదయం 2గంటలసేపు, సాయంత్రం 2 గంటల సేపు మాత్రమే తెరువబడును అని రాసి ఉంది. ఏమిచేయాలో నాకర్ధం కాలేదు. ఇపుడు మధ్యాహ్న్నం ఒంటిగంట అయింది. తిండితిప్పలు లేకుండా, చేతిలో డబ్బు లేకుండా సాయంత్రం 5 గంటల వరకూ వేచి ఉండాలి. అక్కడే 5 నిమిషాలు నిలబడ్డాను. ప్రక్కయింటి గేటు దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడిని దగ్గరకు పిలిచి, యిప్పుడు లోపలికి వెళ్ళి బాబాని చూడచ్చా అని అడిగాను. యింటి ముందున్న కాలింగ్ బెల్ కొట్టమని అప్పుడు లోపలికి వెళ్ళవచ్చని చెప్పాడు. అలా చెప్పి తనే కాలింగ్ బెల్ కొట్టాడు. ఓం సాయిరాం అని నామస్మరణ చేస్తూ నుంచుని ఉన్నాను. ఒక స్త్రీ తలుపు తెరిచింది. లోపలికి వచ్చి బాబా దర్శనం చేసుకోవచ్చా అని ఆమెనడిగాను. ఆమె లోపలికి రమ్మని ఆహ్వానించింది. అది ఒక బాబా ప్రార్ధనా స్థలం అనుకున్నాను. కాళ్ళు కడుగుకొని మేడమీదకు వెళ్ళమని చెప్పింది. పైకి వెళ్ళగానే తలుపు ప్రక్కనే బాబా ఫొటో ఉంది. బాబా ఫొటో ముందు నుంచొని ఆయనకు నమస్కరించి గదిలోపలకు చూశాను. గదిలో తెల్లటి బాబా విగ్రహం, పైన పెద్ద చత్రం తో కనిపించింది. బాబా విగ్రహం చిరునవ్వు చిందిస్తూ కరుణామయ దృక్కులతో చూస్తూ ఉన్నారు.
వెంటనే ఆయన పాదాల ముందు వాలిపోయి ఏడవసాగాను. బాబా, ఆఖరికి నన్ను నీదరికి చేర్చావు. ఇదేనా రామనవమినాడు నీవు చూపిస్తానన్న అద్భుతం! బాబా మందిరాన్ని దర్శించాలని ఉందని ఎప్పుడూ అనుకునే నాకోరికను యిప్పుడు తీర్చావా! మనస్ఫూర్తిగా ఆయనను ప్రార్ధించుకొని, కాసేపటి తరువాత అక్కడి నుండి బయలుదేరాను. మరలా నాజీవితంలో సుఖసంతోషాలు కలిగి నాపూర్వపు జీవితం నాకు తిరిగి వస్తే షిరిడి వచ్చి బాబాను దర్శించుకుంటానని మొక్కుకొన్నాను. నేను ముస్లిం అయినప్పటికీ నాసద్గురువు సాయిబాబాపై నమ్మకం ఉంది. ఆయనను నేనెప్పుడూ వదలి ఉండలేను. బాబా నామొఱ ఆలకించి, నాభర్తను తిరిగి నావద్దకు తిరిగి వచ్చేలా చేస్తారనీ, జీవీతంలో నేను కోల్పోయినవాటిని నేను మరలా తిరిగి పొందగలననె నమ్మకం నాకుంది. పోయిన నాఉద్యోగం, సంతానం, ప్రతీదీ కూడా నాసాయి నాకు తిరిగి యిప్పిస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నాను.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments