బాబాయే ఆటో పంపించారా? – నాలోని భయాన్ని పారద్రోలిన బాబా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఈ  రోజు చెన్నైనుండి సాయి భక్తురాలు శ్రీమతి కృష్ణవేణి గారుపంపించిన రెండు అనుభవాలను ప్రచురిస్తున్నాను.

బాబాయే ఆటో పంపించారా?

2015 సెప్టెంబరులో మొదటిసారి మేము షిరిడీ వెళ్ళాము.  మేము బయలుదేరేటప్పటికి చెన్నైలో వర్షాలు ప్రారంభం కాలేదు.  సరిగా దీపావళికి కొంచెం ముందుగా బాబా గారి దర్శనం బాగా జరిగింది. బాబా గారి అనుమతితో తిరుగు ప్రయాణం అయ్యాము.  అప్పుడే చెన్నైలో వర్షాలు మొదలయ్యాయి.  నేను, మా పాపలిద్దరూ, మా అమ్మగారు, తమ్ముడు.  మా ఆయన అందరం బయలుదేరాము.  నేను మా అమ్మగారి ఇంటి నుండి అంటే ఒంగోలు నుండి చెన్నైకి బయలుదేరాలి.  అప్పటికే చెన్నైలో వరదలు ప్రారంభమయి అయిదు రోజులయింది.  మా వారు  కొత్తగా వేరే కంపెనీలో చేరారు. సెలవులు అయిపోవడంతో వెంటనే ఆఫీసుకు వెళ్ళాల్సిన పరిస్థితి.  సమయానికి ఆఫీసుకు చేరుకో లేకపోతే మాట పడాల్సి వస్తుంది.  ముందుగానే రిజర్వేషన్ చేయించాము. కాని వైటింగ్ లిస్టు చాలా ఉంది.  కన్ఫర్మ్ అవడం కూడా కష్టమే.  బాబా మీదే భారం వేసి బయలుదేరాము.  ఆఖరికి చెక్ చేస్తే టికెౘ సీట్ నంబర్లతో సహాకన్ఫర్మ్ అయ్యాయివెయిట్ లిస్టు చాలా ఉన్నా కన్ఫర్మ్ అవడంచాలా ఆశ్చర్యం కలిగించింది.  అప్పటికే వర్షాల వల్ల చెన్నైకి వెళ్ళే రైళ్ళన్నీ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి.  చెన్నై దాకా చేరకుండా సూళ్ళూరుపేటలోనే నిలిపేస్తున్నారు.  వరదల వల్ల దాదాపు 20రైళ్ళు బాగా ఆలస్యంగా నడవడమో లేక సగంలో నిలిపివేయబడడమో జరుగుతూ ఉంది.  మేము ఎక్కిన పినాకినీ ఎక్స్ ప్రెస్ చాలా నెమ్మదిగా నడుస్తున్నట్లుగా ఉంది. మేము బయలుదేరిన రెండు రోజుల ముందు పినాకిని ఎక్స్ ప్రెస్ ని సూళ్ళూరుపేట వరకే నడిపారట.  మేము పిల్లలతో ఉండటం వల్లకాస్త భయపడ్డాను.  కాని ఆశ్చర్యం పినాకినీ ఎక్స్ ప్రెస్ సరిగా సమయానికి చెన్నై సెంట్రల్ స్టేషన్ కి చేరుకొంది. అంతా  బాబా దయ అని మనసులోనే ఆయనకి  నమస్కరించుకొన్నాను.

రైలు దిగి స్టేషన్ బయటకు రాగానే చిన్న చిన్న చినుకులుపడుతూ ఉన్నాయి.  చేతిలో సామాన్లు, చిన్నపాప, పెద్దపాప నడవటం కొంచెం కష్టం గానే ఉంది. ఎలాగో బయటకు వచ్చాము. అప్పటికే చిన్న చిన్న చినుకులు పడుతూ  వేగంగా గాలులు వీస్తున్నాయి. ఆటో కోసం బయటకు వచ్చాము. ఈ పరిస్థితిలో బయటకు వచ్చామో లేదో  ఉన్నట్లుండి   పెద్ద వర్షం ప్రారంభమయింది. ఏమి చేయాలో తోచలేదు.   పిల్లలు తడిసిపోతారనే భయంతో ప్రక్కనే చెట్టు ఉంటే దాని క్రిందకు మేము నలుగురం  చేరుకొన్నాము. ఇంతలో ఎవరో మా కోసమే పంపించినట్లుగా, అక్కడున్న ప్రయాణీకులెందరో ఆటో కోసం ఎదురుచూస్తూ ఉన్నా, వారినందరినీ దాటుకొని ఒక ఆటో మా వద్దకేవచ్చింది.  ఆటోని మాముందు ఆపి ఎక్కండి అన్నాడు ఆటోఅతను.  సంతోషంతో ఎక్కి కూర్చున్నాము.  ఆటో మా ఇంటిముందు వరకు వచ్చింది.  మామూలు రోజులలో ఆటోలు మా ఇంటి వరకు వచ్చినా ఈ వర్షాలలో ఆటో దొరకడమే కష్టమనుకుంటే ఇంటిముందు వరకు ఆటో రావడం చాలా ఆశ్చర్యం కలిగించింది.  ఆటోరాగానే ఎక్కేసాము గాని ఇంటి ముందు వరకు వచ్చినందుకు ఎంతడుగుతాడో అని లోపల చాలా భయంగానే ఉంది.  ముందర బేరం కూడా ఆడుకోలేదు. ఆటో దొరకడమే అదృష్టం అనుకున్నాము.  ఇంటిలోనికి వెళ్ళాక ఎంతిమ్మంటావని ఆటో అతనిని అడిగాము.  రూ.150/-  ఇవ్వండి అన్నాడు.  చాలాఆశ్చర్యం వేసింది.  మావారు రూ.200/-  ఇచ్చారు.  మా మామయ్య గారు ఆటో అతను రూ.150/- అడిగాడంటే చాలాఆశ్చర్యపోయారు.  ముందు రోజుల్లో వర్షాలు, వరదలకి ఆటోవాళ్ళురూ.700/- నుండి రూ.800/-  దాకా అడిగారట.  కాని ఇంటిదాకా రాలేదని చెప్పారు మా మామయ్యగారు.  అంతా సాయిబాబా దయవల్లే వర్షంలో తడవకుండా ఇంటికి చేరుకున్నాము.

ఆయన కొత్తగా వేరే కంపెనీలో చేరారు.  సెలవులు అయిపోయాయి. ఆఫీసులో మాట రాకుండా బాబా వారు అంత  వర్షాలు వరదలలోను రైలును సమయానికి చెన్నై కి చేరుకునేలా చేశారు. ఆటోని కూడా పంపించారు.  అంతా బాబా అనుగ్రహం. 

(ఆవిడ పంపించిన ఈ లీల చదివిన తరువాత శ్రీ సాయిసత్చరిత్రలోని రెండు విషయాలు నాకు గుర్తుకు వచ్చాయి.)

33వ. అధ్యాయంలో రామ్ గిరి బువా బాబా ఆజ్ఞ  ప్రకారం ఆరతి పాటను, ఊదీని నానా సాహెబ్ చందోర్కర్ కు అందచేయడానికి జలగామ్ చేరుకొన్నాడు. అప్పుడు రాత్రి రెండు గంటల సమయం. జామ్నేర్ చేరుకోవడానికి ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. అప్పుడు ఒక బంట్రోతు, నానా సాహెబ్ పంపించారని చెప్పి  బువాను టాంగా వద్దకు తీసుకుని వచ్చాడు.  జామ్నేర్ చేరుకొన్నాక ఆ టాంగా, గాని, బంట్రోతు గాని, టాంగాను తోలువాడు గాని ఎవ్వరు కనపడలేదు. వచ్చినది బాబాయే కదా!.  మరి పైన చదివిన అనుభవంలో అక్కడ ఎంతో మంది ప్రయాణీకులున్నా, ఆటో సరిగా వీరివద్దకే రావడం,పైగా రూ.150/-  అడగడం బాబా చేసిన చిత్రం కాక మరేమిటి.

ఇక అతను అడిగిన దానికన్నా రూ.50/- ఎక్కువ ఇచ్చారు.  ఇది నాకు శ్రీసాయి సత్ చరిత్రలోని 18,19 అధ్యాయాలలో బాబా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.  బాబా నిచ్చెన తెచ్చిన వానికి రెండు రూపాయలు కూలీ ఇచ్చారు.  అది చూసిన అక్కడున్నవారిలోఒకతను బాబాని ఎందుకతనికి అంత ఎక్కువ కూలీ ఇచ్చారని ప్రశ్నించినపుడు  బాబా ఇలా అన్నారు “ ఒకరి కష్టమును ఇంకొకరు ఉంచుకొనరాదు.  కష్టపడు వానికి కూలి సరిగను. దాతృత్వముతోను ధారాళముగా ఇవ్వవలెను.” మరి అంత వర్షంలోఅందరినీ కాదని, ఆటోలో ఇంటి దాకా దింపి రూ.కేవలం రూ.150/-మాత్రమే అడిగినపుడు ఇంకొక రూ.50/- రూపాయలను ఎక్కువ ఇవ్వడం బాబా చెప్పిన మాటను ఆచరణలో పెట్టినట్టే కదా….

నాలోని భయాన్ని పారద్రోలిన బాబా(శ్రీమతి కృష్ణవేణిగారి ఇంటిలోని బాబా పటం)

చిన్నప్పటి నుండి నాది చాలా భయపడే మనస్తత్వం.  బాబా నాలోని భయాన్ని ఏవిధంగా తొలగించారో వివరిస్తాను.  ప్రతీ విషయాన్నిఅది ఏదయినా సరే దాని గురించే తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేదానిని. ఒక రోజు మా ఇంటి దగ్గిర ఒకరు చనిపోయారు.  మా ఇంటిలోని వాళ్ళు పలకరించడానికి వెళ్ళారు.  నా మనస్తత్వం అందరికీ తెలుసు కాబట్టి, మా చిన్న పాపతో నన్ను ఇంటిలోనే ఉండి పొమ్మని మా అత్తగారు అన్నారు.  ఇంటిలో ఉన్నాగాని ఆ విషయం గురించే ఆలోచిస్తూ భయంగా ఉన్నాను.  మా ఇంటిలో రోజూ ప్రొద్దున్న, సాయంత్రం దేవుని ముందు దీపం వెలిగిస్తాము.  నా మనసులో ఏదోతెలియని భయం వెంటాడుతూనే ఉంది.  రోజూలాగానే ఆరోజు సాయంత్రం దీపం వెలిగిస్తున్నాను.  ఆ సమయంలో నా వెనుక ఏదోఉన్నట్టుగా నల్లని రూపంతో  ఒక భారీ శరీరం నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది.  నా వెనుక జరిగేదంతా నాకు తెలుస్తూనే ఉంది.  మా పూజా గదిలో బాబా పటంఉంది.

ఇంతలో ఆఫోటోలోని బాబా గారి ఎడమచేతి చూపుడు వేలు కదిలినట్లుగా కనిపించింది. (దిండుపై ఉన్న చేయి)  ఆయన చూపుడు వేలు నుండి సెకనులో వెయ్యోవంతు ఒక విధమైన వెలుగు ప్రసరించి సూటిగా నా వెనకనున్న భయంకరమయిన రూపం మీదపడింది.  ఆ వెంటనే ఆ రూపం గుమ్మం బయటపడి ముక్కలయింది.  నా శరీరమంతా చెమటలు పట్టింది.  నాలో చాలాధైర్యం పెరిగింది.  ఆ విధంగా బాబా నాలో ధైర్యాన్ని కలిగించారు. బాబావారికి నేనేమిచ్చినా నాఋణం  తీరదు.  కేవలం భక్తితో కూడిననమస్కారం తప్ప నేనేమివ్వగలను?

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబాయే ఆటో పంపించారా? – నాలోని భయాన్ని పారద్రోలిన బాబా

Sreenivas

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles