మన ప్రశ్న – చీటీ ద్వారా బాబా జవాబు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

మన ప్రశ్న – చీటీ ద్వారా బాబా జవాబు

ఈ రోజు  అమెరికా నుంచి ఒక భక్తురాలు పంపిన బాబా అనుభూతి ఆమె మాటలలోనే…

నేను డిగ్రీ చదువుతున్న రోజులలో నాకు బాబా వారి గురించి తెలిసింది. స్నానం చేసిన తరువాత ప్రతీరోజు సాయిబాబా సచ్చరిత్రలో ఒక పేజీ చదవడం ప్రారంభించాను. నిర్ణయాలను తీసుకోలేని పరిస్థితులలో నేను బాబాముందు చీటీలను వేసి సమాధానం కోసం ప్రయత్నిస్తూ ఉండేదానిని.

(ఆ పరిస్థితులలో సమస్య తీరడానికి తగిన కారణాలను అన్నిటినీ చీటీలమీద రాసేదానిని). బాబా నామాన్ని ఉచ్ఛరిస్తూ చీటీలను తీసేదానిని. చీటీ తీసినప్పుడు ఏది వస్తే దానిని బాబా సమాధానంగా అనుసరించేదానిని.

ప్రముఖ కాలేజీలో అప్పుడు కొన్ని యింటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆ కాలేజీ మా యింటి వద్దనించి రెండుగంటల ప్రయాణం దూరంలో ఉంది. నా స్నేహితులందరూ ఆ కాలేజీకి దగ్గరలోనే ఉన్నారు. మా యిల్లు ఒక్కటే చాలా దూరంలో ఉంది. ఇక యింటర్వ్యూకి ఒకరోజు ఉందనగా ప్రభుత్వం వారు బంద్ ప్రకటించారు.

ఆరోజున బస్సులు ఏవీ తిరగడంలేదు. ఆరోజున బస్సులు లేని కారణంగా మా నాన్నగారు యింటర్వ్యూకి వెళ్ళవద్దని చెప్పారు. నా స్నేహితులందరూ వెడుతున్న కారణంగా నేను కూడా వెళ్ళి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నాను.

నేను మా నాన్నగారితో బాగా వాదించాను. కాని మా నాన్నగారు ఒప్పుకోలేదు. ఆఖరికి చీటీల మీద యింటర్వ్యూకి హాజరవడానికి తగిన కారణాలన్నిటినీ రాసి, ఏది వస్తే దానినే అనుసరిస్తానని చెప్పాను. మా నాన్నగారు దానికి ఒప్పుకున్నారు.

చీటీలలో నేను రాసినవి ఇవి:

1) యింటర్వ్యూకి వెళ్ళు, నువ్వు సెలెక్ట్ అవుతావు

2) నువ్వు యింటర్వ్యూకి వెళ్ళినా లాభం లేదు

3) వెళ్ళు, అనుభవం వస్తుంది

4 ) వెళ్ళవద్దు

ఇవే నేను చీటీలలో రాసినవి.

సాయిబాబా నామ స్మరణ చేస్తూ ఒక చీటీ తీసాను. అందులో నువ్వు యింటర్వ్యూకి వెళ్ళినా లాభం లేదు అని వచ్చింది. అందుచేత నేను యింటర్వ్యూకి వెళ్ళడం మానుకొన్నాను.

రెండురోజుల తరువాత యింటర్వ్యూ ఫలితాలు వచ్చాయి. నా స్నేహితులందరూ సెలెక్ట్ అయ్యారు. నేను యింటర్వ్యూకి వెళ్ళనందుకు చాలా బాధ పడ్డాను. కొన్ని రోజుల తరువాత అది ఒక మోసపూరిత కంపెనీ అని తెలిసింది. చేసిన సెలెక్షన్ ప్రోసెస్ అంతా కూడా కాన్సిల్ చేసారని తెలిసింది.

నాకొక చెల్లెలు ఉంది. ఆమె నాకన్నా రెండేళ్ళు చిన్నది. ఈ సంఘటన తరువాత తను కూడా ఏదైనా సమస్య వచ్చినపుడు చీటీలను వేసి నన్ను సాయిబాబా పేరు ఉచ్ఛరిస్తూ తీయమని అడిగేది. ఇప్పటివరకు బాబా పేరు ఉచ్ఛరిస్తూ నేనే చీటీ తీసినా అదే నా చెల్లెలి భవిష్యత్తుగా ఉండేది. (తన ఎంసెట్ రాంక్, కాలేజీ లో డిగ్రీ చదువు అన్నీ కూడా బాబా చీటీలలో వచ్చిన ప్రకారమే జరిగింది.)

అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే ముందు నేను మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను. నా అండర్ గ్రాడ్యుయేషన్ తరువాత మాస్టర్స్ డిగ్రీ కోసం నేను అమెరికా వచ్చాను. ఇక్కడ మాస్టర్స్ డిగ్రీలో నేను కొంతమంది ప్రముఖులని కలుసుకున్నాను.

ఇక్కడ ప్రతీక్షణం ఒక అద్భుతమైన క్షణం. ప్రతీరోజు కూడా మంచిరోజు. నేనిక్కడ ప్రతీక్షణం ఎంతో ఆనందాన్ననుభవించాను. కాని అది ఒక సంవత్సరం మాత్రమే. నా మాస్టర్స్ డిగ్రీలో 3 మరియు 4 సెమిస్టర్ లు చాలా కష్టంగా గడిచాయి.

ఆ సమయంలో నేను సాయిబాబా సచ్చరిత్ర ఒక వారం పారాయణ చేశాను. 3 వ సెమిస్టర్ తరువాత నేను ఇండియాకి వెళ్ళాను. రెండవసారి షిరిడీ వెళ్ళాను. నేను షిరిడీకి  వెళ్ళిన రోజు బాబా రోజు, గురువారము. నాకు సాయంత్రం ఆరతి చూడాలని కోరికగా ఉంది. బాబాని నా కోరిక నెరవేర్చమని ప్రార్థించాను.

సెక్యూరిటీ గార్డ్ మా కుటుంబాన్నంతటినీ ముందుకు వెళ్ళమని చెప్పాడు. మేము ముందుకు జరిగితే కనుక సెక్యూరిటీ గార్డ్ మా వెనకనున్నవారిని ఆరతి చూడటానికి ఆపేస్తాడు. నేను ముందుకు జరగకుండా ఆగిపోదామనుకున్నాను. కాని సెక్యూరిటీ గార్డ్ ముందుకు నడవమని అరిచాడు.

నేను కొంతసేపు బాబా నామస్మరణ చేసి, సెక్యూరిటీగార్డ్ తో నాకు సాయంత్రం ఆరతి చూడాలని ఉందని చెప్పాను. అప్పుడతను నవ్వి మమ్మల్ని వెనుకకు రమ్మన్నాడు. మాకు సాయిబాబా దర్శనం బాగా జరిగింది.

ఆరోజు గురువారము కనుక పల్లకీ ఉత్సవం కూడా ఉంది. కొంతమంది పూజారులు సమాధిమందిరంలోకి పల్లకీని తీసుకుని వచ్చారు. భక్తులందరూ కూడా ఆ పల్లకీని ముట్టుకుందామనే ప్రయత్నంలో ఉన్నారు. నేను కూడా పల్లకీని ముట్టుకుందామనుకున్నాను కాని నాకు పల్లకీకి మధ్యన చాలామంది జనం ఉన్నారు.

హఠాత్తుగా పల్లకీని మోస్తున్న పూజారి ఆగి నావైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నేను కూడా ఆయనవైపు చూసి నవ్వి పల్లకీని ముట్టుకున్నాను. దర్శనం తరువాత నేను వేపచెట్టు దగ్గరికి వెళ్ళాను.

అక్కడ ఉన్న భక్తులందరూ క్రిందకు చూస్తున్నారు. వారందరూ క్రిందికి ఎందుకు చూస్తున్నారో నాకర్ధం కాలేదు. వారంతా వేపాకులకోసం చూస్తున్నారని కొంతసేపటికి నాకర్ధమయింది. నాకు కూడా కొన్ని వేపాకులనిమ్మని బాబాని ప్రార్ధించాను.

నేనప్పుడు వేపచెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తున్నాను. ప్రదక్షిణ చేస్తుండగా నేను 6, 7 ఆకులదాకా సేకరించాను. నా షిరిడీ యాత్ర యింత అద్భుతంగా జరిగినందుకు నేను బాబాకి ఎంతో కృతజ్ఞురాలిని.

ఇండియా నుంచి తిరిగి వచ్చిన తరువాత బాబా దయ వల్ల నా మాస్టర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేశాను. ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఒక కన్సల్టెన్సీ లో చేరాను. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి మా చెల్లెలు వచ్చింది.

మా చెల్లెలిని కూడా నేనే చూసుకోవాలి కనుక నాకు ఉద్యోగం చాలా అవసరం. మా చెల్లెలు నా ఉద్యోగం కోసం, యింకా తనకి కాలేజీ ప్రాగణంలో జరిగే ఆన్ కాంపస్ లో ఉద్యోగం రావడానికి సాయి సచ్చరిత్రను చదవడం ప్రారంభించింది. నేను 9 గురువారముల వ్రతం మొదలుపెట్టాను. 9 గురువారముల వ్రతము చదివిన మొట్టమొదటి గురువారమునాడు మా ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి.

నాకు ఉద్యోగము వచ్చిన తరువాత రెండవసారి సాయి సచ్చరిత్ర పారాయణ చేశాను. పారాయణ చేసినప్పుడల్లా ప్రతీరోజూ నా కళ్ళనుండి కన్నీరు వస్తూ ఉండేది. అక్టోబరు 17 వ తారీఖున నేను చదువుతున్న అధ్యాయములో, అక్టోబరు 15 వ తారీకున బాబావారు సమాధి అయ్యారనీ, భక్తులందరూ ఆయన శరీరాన్ని అక్టోబరు 17వ తారీఖున బూటీవాడాకు తీసుకుని వెళ్ళారనీ ఉంది.

నేను ఆ అధ్యాయము చదువుతున్నరోజు, బాబా వారి శరీరాన్ని బూటీవాడాకు తీసుకుని వెళ్ళిన రోజు రెండూ కూడా సరిపోలాయి. కాకతాళీయంగా జరిగిన ఈ సంఘటనకి నాకు చాలా ఆనందం వేసింది.

నా జీవితాశయం ఒకటి ఉంది. దానిని గురించి బాబా వారిని మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. ఈ విషయం గురించి నేను చీటీలు కూడా వేసాను. జవాబు నాకు అనుకూలంగా వచ్చింది. అది అసాధారణమైన విషయం, బాబా అనుగ్రహంతో తప్ప అది సాధ్యంకాదు. బాబా నాయందే ఉన్నారు కనుక అది జరుగుతుంది. అది జరిగిన వెంటనే నాకు కలిగిన అనుభవాన్ని మీకు తెలియచేస్తాను.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles