అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘వద్దు! నా కోసం ఎవరూ ఏడవద్దు. ఇక్కడుంటే ఇంతే! అందుకే బూటీవాడాకు పోతాను. అక్కడుంటాను.’’ అన్నారు బాబా.

ఆ మాటకి బూటీ పట్టరాని ఆనందం చెందాడు.బూటీవాడా నిర్మాణం పూర్తయింది. అక్కడ ప్రతిష్ఠించేందుకు శ్రీకృష్ణుని విగ్రహం కూడా సిద్ధంగా ఉంది. అయితే బాబా అనారోగ్యం కారణంగా వాడా ప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠాపన వాయిదా పడుతూ వస్తున్నాయి.

బాబా బూటీవాడాలోకి ప్రవేశించరేమో! ప్రవేశించి ఆ నేలని పవిత్రం చేయరేమో అని భయపడుతున్న బూటీకి తనంత తానుగా బాబా వాడాకి వస్తాననడం గొప్ప సంతోషాన్ని కలిగించింది. చేతులు జోడించి, బాబాకి నమస్కరించాడతను.

దుఃఖిస్తూ తననే చూస్తున్న భక్తులతో బాబా ఇలా అన్నారు.‘‘మిమ్మల్ని కాదనుకుని నేను బూటీవాడాకి పోవట్లేదు.

మీరు కూడా నాతో పాటే అక్కడకి రండి. మీరూ నేనూ అందరం అక్కడే ఉందాం. మీ సేవలన్నీ నేను స్వీకరిస్తాను. మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.

భౌతికంగా రేపు నేను లేకపోయినా, నా సమాధి నుంచి సర్వకార్యాలూ నిర్వర్తిస్తాను, కంగారు పడకండి.’’బాబా మాటలకి శ్యామా దిగ్భ్రమ చెందాడు.

బూటీవాడాలో బాబా సమాధి అవుతారా? తానుండగా మళ్ళీ శ్రీకృష్ణుడు ఎందుకు? అన్నారు ఒకప్పుడు బాబా. దాన్ని నిజం చేస్తారా? కృష్ణుణ్ణి ప్రతిష్ఠించే చోట బాబా సమాధి అవుతారా?-అనేకానేక సందేహాలతో శ్యామా తల తిరిగిపోయింది.

15 అక్టోబర్‌ 1918, మంగళవారం.విజయదశమి రోజు. తండోపతండాలుగా భక్తులు ద్వారకామాయికి చేరుకుంటున్నారు. వారిని బాబా ఆశీర్వదిస్తున్నారు.

భక్తులను నిరాశపరచడం భావ్యం కాదని, చేతిని ఎత్తి దీవిస్తున్నారే కాని, అలా చేతిని ఎత్తడానికి కూడా బాబాకి శక్తి లేకుండా పోతోంది.

జ్వరం. ఎడతెరిపిలేని దగ్గు. ఊపిరి తీసుకునేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బాబా.

శ్యామా, నానా, బూటీ, జోగ్‌, మహల్సా, భాగోజీ, భయాజీ, బాలాషింపి, నిమోన్కర్‌, కాకాసాహెబ్‌, లక్ష్మీబాయి షిండే అంతా బాబాని కనిపెట్టుకుని ఉన్నారక్కడే! అందరి ముఖాల్లోనూ ఆందోళన కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది.