శ్రీ సాయి అమృత ధార – నమ్ము నమ్మకపో….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఈ రోజు శ్రీ సాయి అమృతధారలో అద్భుతమైన చమత్కారాన్ని తెలుసుకుందాము. ఈ లీల శ్రీసాయిలీల మాసపత్రిక ఏప్రిల్ 1987 వ సంవత్సరంలో ప్రచురింపబడింది.

నిజానికి విజ్ఞానశాస్త్రాన్ని నమ్మిన వారెవరూ ఏ కొద్ది మందో తప్ప దేవుడి ఉనికిని నమ్మరని నా ఉద్దేశ్యం. వైద్యులు కూడా తామిచ్చే మందుల మీదే ఆధారపడతారు గాని, ప్రత్యేకంగా భగవంతుని నమ్ముతారో లేదో నాకు తెలియదు గాని, ఊదీ రోగాలను నయం చేస్తుందనే విషయాన్ని నమ్మకపోవచ్చు. ఇప్పుడు ఈ లీల చదవండి.

శ్రీ సాయి అమృత ధార – నమ్ము నమ్మకపో….

మీకు నేనిప్పుడు చెప్పేది ఒక కథలా అనిపించవచ్చు. కాని యదార్థంగా జరిగిన సంఘటననే మీ ముందుంచుతున్నాను. చదివిన తరువాత పాఠకులే నిర్ణయించాలి.

నాకు ఇద్దరు సోదరులు. ఇద్దరూ వైద్యులే. ఒకతను గుండె వైద్య నిపుణుడయితే, మరొకతను పిల్లల వైద్య నిపుణుడు. ఇద్దరూ కూడా వారి వారి వృత్తులలో మంచి పేరు సంపాదించారు. ఒక్కొక్కసారి క్లిష్టమయిన కేసులలో వారి సహచరులు కూడా వీరిద్దరి సలహాలు తీసుకుంటూ ఉండేవారు.

మూడు సంవత్సరాల క్రితం పిల్లల వైద్యుడయిన మా సోదరుని వివాహం జరిగింది.  1984వ సంవత్సరం జూన్ నెలలో అతనికి కొడుకు పుట్టాడు. బాబు చాలా అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు.  మేమంతా చాలా ఆనందించాము.

బాబు ముద్దుగా ఉన్నాడు.  మా బంధువులలో చాలామంది అబ్బాయిని ఎలా పెంచుతాడా అని కాస్త ఆశ్చర్యంతో ఉండేవారు. రెండు నెలలపాటు అంతా బాగానే ఉంది. 

ఆ తరువాత మొదలయింది. బాబు రాత్రి వేళల్లో ఏడవటం మొదలు పెట్టాడు. నా సోదరుడికి ఇంటి వైద్యంలో ఎటువంటి నమ్మకం లేదు. తనే తన బాబుకు చాలా శ్రధ్ధగా వైద్యం మొదలు పెట్టాడు. అయినా పిల్లవాడు ఏడుపు మానలేదు. ఇస్తున్న మందులేవీ పని చేయలేదు.

అతను తన అన్నగారిని (హృద్రోగ నిపుణుడు) కూడా సంప్రదించాడు. అతను చేసిన వైద్యం కూడా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. వారాలకి వారాలు గడిచిపోతున్నా బాబు పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాత్రివేళల్లో ఏడుస్తూనే ఉన్నాడు.

నా సోదరుడు, అతని భార్యకి అన్నీ నిద్రలేని రాత్రులయిపోయాయి. నిద్రలేమితో చాలా బలహీనపడ్డారు. మనశ్శాంతి కూడా కరువయింది. నా సోదరుడు తన పిల్లవాడిని వేరే వైద్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. వారు చేసిన వైద్యం కూడా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆఖరికి ఇంటి వైద్యం మొదలు పెట్టారు.  ఊహు…అది కూడా ఏమీ పని చేయలేదు.

ఇలా ఉండగా నేను ఎల్.టీ.సీ లో యాత్రలకు వెడదామనుకున్నాను.  ఎల్.టీ.సీ లో వెళ్ళడం నాకు అదే మొదటిసారి. నా భార్య ఎప్పుడూ ఇంత వరకు షిరిడీ వెళ్ళలేదనీ, షిరిడీ వెడదామని అడిగింది. నేను కూడా ఆమె చెప్పినదానికి వెంటనే సరే అన్నాను.

షిరిడీకి వెళ్ళేముందు రోజు నా సోదరుడి నుంచి (పిల్లల వైద్యుడు) ఉత్తరం వచ్చింది. షిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పుడు ఊదీ తీసుకురమ్మని రాశాడు. నాకు ఆశ్చర్యమనిపించింది.  ఊదీ దేనికి తీసుకురమ్మన్నాడో నాకు అర్థం కాలేదు.

శ్రీ సాయిబాబా వారి దయవల్ల మేము క్షేమంగా షిరిడీ వెళ్ళి ఆయనను దర్శించుకుని వచ్చాము. వచ్చేటప్పుడు ఊదీ కూడా తీసుకుని వచ్చాము. వెంటనే నేను ఊదీని మా సోదరునికి పంపించాను. ఆ తరువాత మేము కలుసుకున్నపుడు ఊదీ దేనికి తెప్పించావని నా సోదరుడిని అడిగాను.

“బాబు రాత్రి వేళల్లో ఏడుస్తూ ఉన్నాడు.  ఎన్ని మందులు వాడినా రవ్వంత కూడా పని చేయలేదు. బాబు ఎందుకని ఏడుస్తున్నాడో ఏమీ కారణం తెలియకుండా ఉండేది.

ఆఖరికి నువ్వు పంపించిన ఊదీని తాయెత్తులో ఉంచి బాబు నడుముకి కట్టాను. నువ్వు నమ్ము నమ్మకపో. ఆ రోజు రాత్రి నుంచి బాబు మళ్ళీ రాత్రివేళల్లో ఏడవలేదు.  అంత అద్భుతం జరిగింది.  బాబు చక్కగా చలాకీగా ఆడుకుంటున్నాడు” అని చెప్పాడు .

ఈ విశ్వానికంతటికీ సర్వాధికారయిన శ్రీసాయిబాబాకి కోటి కోటి ప్రణామాలు.

     ఎస్. సాయినాధ్

     భద్రావతి – 577302

ఈ లీల చదివిన తరువాత నాకొక(త్యాగరాజు గారు) సంఘటన గుర్తుకు వచ్చింది. 30 సంవత్సరాల క్రితం నేను కుటుంబంతో సహా మా తోడల్లుడి గారి ఇంటికి వెళ్ళాను. ఎక్కడో శ్రీకాకుళం దగ్గర ఉన్న మారుమూల గ్రామం. అప్పుడు మా మూడవ కుమార్తెకి రెండు సంవత్సరాల వయసనుకుంటాను. మేమందరం ఆ ఊరికి దగ్గరలో ఉన్న శివాలయానికి నదిని దాటి వెళ్ళాము. నదిలోనే నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడికి వెళ్ళాలంటే నావలు లేవు.  వచ్చేటప్పుడు చీకటి పడింది. మా మూడవ అమ్మాయిని నా భార్య ఎత్తుకుని నడుస్తూ ఉంది. హఠాత్తుగా మా అమ్మాయి ఏడవటం మొదలు పెట్టింది.  ఎందుకని ఏడుస్తోందో అర్థం కాలేదు. ఇంటికి వచ్చినా ఏడుస్తూనే ఉంది. ఇంటికి వచ్చాక మా తోడల్లుడు గారి నాన్నగారు ఆమెని ఎత్తుకుని మంత్రం వేశారు.  వెంటనే ఏడుపు ఆపేసింది.  దీనికి కారణం ఒక్కొక్కసారి చిన్న పిల్లలని గాలి, ధూళి ఆవహిస్తాయి.   

చిన్న పిల్లలని చూడటానికి వెళ్ళినపుడు బయటినుంచి వస్తాము కనుక కాళ్ళు కడుగుకుని ఇంటిలోకి రావాలని పెద్దలు చెప్పిన కారణం ఇందువల్లనే అని మనకందరకూ తెలుసు కదా.

దీనిని బట్టి నేనర్థం చేసుకున్నది పైన చెప్పిన లీలలో బహుశ బాబుకి అటువంటిది ఏమన్నా జరిగి ఉండవచ్చు. బాబా ఊదీ తాయెత్తులో పెట్టి నడుముకు కట్టగానే ఏడుపు ఆపేశాడంటే బాబా ఊదీ మహత్యం కాక మరేమిటి

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles