బాబా భోదామృతం (శ్రీసంత కథామృతం 57వ అధ్యాయం) పదమూడవ భాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి భాగం….

నానా సద్గురు సాయి ప్రవచనాన్ని విని, “ప్రభుత్వం నిరవయవం కదా! దానికి ఇంద్రియాలేక్కడుంటాయి?” అని వారిని ప్రశ్నించారు. అప్పుడు బాబా “నానా భలే మంచి ప్రశ్నే వేశావు. ప్రభుత్వమంతా ఒక్కటే అభిన్నం. నిజమే కాని దానిలో విభాగాలుండవూ. అట్లే అనంతమైన చైతన్యం కూడ. అయితే చైతన్య శక్తికి విభాగాలుండవు. అయినా గ్రహకులు వారి వారి శక్త్యానుసారం గ్రహిస్తారు.

కుండలో, కూజాలో, వాగులో, పెద్ద పాత్రలో ఈ అన్నింటిలో నిండి కూడా ఆకాశం ఎప్పటి వలెనే ఉంటుంది. నదిలో ఎంతగా వ్యాపించి ఉందొ అంత కంటే తక్కువ కుండలో, దాని కంటెను తక్కువ కూజాలోనూ ఉంటుంది. దీనివల్ల ఆకాశం అన్ని రకాలుగా విభాగాలైనట్లా? ఆత్మ స్వరూపం కూడా అట్లేనని బాగా తెలుసుకో.

ఈ దృశ్య జగత్తంతా మాయా లీల. ఈ బ్రహ్మాండాన్ని మాయ, బ్రహ్మ కలిపి సృష్టించారు” అని బాబా చెప్పగా, నానా “సాయి సమర్దా ఈ మాయ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? ఎలా నిర్మాణమైంది? జగత్తుకు ఆది కారణం చైతన్యమైనా జగత్తు చైతన్యం కంటే భిన్నం కాదు అని మీరు చెప్పారు కదా, మరి ఈ మాయ ఎలా వచ్చింది?” అని ప్రశ్నించారు.

బాబా “మాయ ఎట్లా ఉద్భవించిందో చెప్పుతాను, ఏకాగ్ర చిత్తంతో విను. చైతన్యం యొక్క శక్తియే మాయ. ఇది చైతన్యాన్ని ప్రతి చోట నాట్యం చేయిస్తుంది. బెల్లాన్ని, దానిలోని మాధుర్యాన్ని ఎలా వేరు చేయలేమో అట్లే చైతన్యాన్ని మాయను వేరు చేయలేము. సూర్యుడు సూర్యని ప్రభ, రెండూ ఒకే సూర్యుడైనా సూర్యుడు, ప్రభ అని రెండు శబ్దాలు వాడుతాము. సూర్యుడు తన అస్తిత్వాన్ని, ప్రభా కిరణాల ద్వారా తెలియ చేస్తాడు.

అట్లే బ్రహ్మ చైతన్యం మరియు మాయ. చైతన్యం అంతు లేనిది. అనంతం. కాని మాయకు అంతం ఉంది. ఈ రెండు అనాది నుండి ఉన్నాయి. అందువల్ల వీరికి ఆది లేదు. మాయ ప్రకృతి, చైతన్యం పురుషుడు. ఈ ప్రకృతి పురుషుల నుండే జగత్తు యొక్క ఉత్పత్తి. ప్రకృతి పురుషుల వివరణను అమృతానుభవంలోను మరియు మోహిని రాజప్రసాద్ లో జ్ఞాన రాజు విశదీకరించాడు. అందువల్ల నేను మరల ఆ విషయాన్ని చెప్పాను.

కేవలం, ఆత్మ జ్ఞాన గుహ యొక్క మర్మాన్ని తెలియచేస్తాను. ఆ గుహలోనికి వెళ్ళిన వారెవ్వరూ తిరిగి రారు. కారణం ఆ గుహలో తాము కూడా గుహగా మారిపోయి ఆనందంలో తల్లీనులైపోతారు. పురుషుడు అన్నింటికీ కారణం. మాయ పురుషుని కార్యం. ఈ మాయ యొక్క మహిమ అగాధం. నేను సోమయ్య, రామయ్య, భీమయ్య అని తలపోయటం మాయ కారణంగానే. మాయచే కప్పబడి ఉండటం వల్ల సత్యం కన్పించదు.

మాయకు రెండు గుణాలున్నాయి. ఉన్న సత్యాన్ని కప్పి పెట్టటం, లేని దాన్ని ఉన్నట్లుగా భాసింప చేయటం. ఈ మాయ కారణంగానే జీవులు భ్రమసిపోతుంటారు. ఒక కూలి వానికి తాను రాజు అయినట్లుగా స్వప్నం కల్గింది. ఇక్కడ మాయ కూలివాణ్ణి మరుగు పరచి, వాస్తవంగా లేని రాజ పదవిని వానిపై భాసింపచేసింది.

ఇదే విధంగా మాయ వాస్తవమైన బ్రహ్మను మరుగు పరచి నిజంగా లేని జగత్తును భాసింపచేస్తుంది. వాస్తవంగా ఈ జగత్తు అసలు లేదు. నిత్యమైన ఒక్క చైతన్యమే సద్ వస్తువే ఉంది, కాని మాయ కారణంగా జగత్తు ఉన్నట్లుగా భాసిస్తుంది. జగత్తు జగత్తులోని వన్నీ సత్యంగా అసత్యమే, ఐనా వాస్తవంగా అగుపిస్తూ ఆశుభాలను కలుగుచేస్తాయి.

అందుచేత, జ్ఞానంతో మాయ యొక్క ఆవరణను తొలగించుకుంటే అంతటా సర్వత్ర నేను నేనే అన్న శుద్ధ చైతన్యం గోచరిస్తుంది. నీటిలోని నాచు తొలగిపోతే, స్వచ్చమైన నీరు ఎలా కన్పిస్తుందో అట్లే మాయయనే మాలిన్యాన్ని తొలగిస్తే చైతన్యం గోచరిస్తుంది. అందువల్ల నానా మీరందరూ ఆసద్ వస్తువును ఉపాసించండని చెప్పుతున్నాను.

సద్వస్తువైన ఆత్మయే ఆధ్యాత్మ జ్ఞానానికి కారణం. అందుచేత ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది మీరు ఈ జన్మలోనే ముక్తులవండి” అని బాబా భోదించారు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని విని భక్తులు ఆనందంతో సాయి చరణాల యందు సాష్టాంగ వందనం చేసారు. వైద్యుడు, సాఠె, నానా చందోర్కర్, నానా నిమోన్కర్, మారుతి లక్ష్మణ, నూల్కరు మొదలగు వారిని తిలకించి సాయి మహారాజు “బిడ్డలారా! ఈ జ్ఞానాన్ని మనసులో బాగా గుర్తుంచుకోండి” అని చెప్పారు.

భక్తులు సరేయని మరల మరల వారికీ వందనం చేసారు. జ్ఞాన భాస్కరుడు ఉన్న చోట అంధకారానికి తావెక్కడిది? ఓ కృపారాశి! సాయి మహారాజా! మీ బిడ్డనైన దాసగణుని మీ ఒడిలోనికి తీసుకోని, మీ కృపాచాయలో కూర్చుండ బెట్టుకోండి. స్వస్తిశ్రీ సంత కథామృతంలో సాయి మహారాజుయనే మేఘం నుండి వర్షించిన జ్ఞానామృతాన్ని సేవించి తరించండని దాసగణు మనవి చేస్తున్నారు.

సమాప్తం…

source: దాసగణు గారి రచన  శ్రీసంత కథామృతం 57వ అధ్యాయం

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles