భక్తుల మనస్సులలో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు-ఒకటవ భాగము.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

   సాయి బాబా      …      సాయి బాబా      …      సాయి బాబా      …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు.

సాఠే 1917వ సంవత్సరములో శిరిడీ కి వచ్చెను.సాఠే గొప్ప మనోబలము గలవాడగుటచే వెంటనే గురుచరిత్రము పారాయణ మొదలుపెట్టెను.

7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా యానాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను.అది యిట్లుండెను.

బాబా గురుచరిత్రము చేతిలో బట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠె కు బోధించుచున్నట్లు,అతను దానిని శ్రద్ధగా వినుచున్నట్లు జూపెను.

సాఠే నిద్ర నుండి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను.మిగుల సంతసించెను.అజ్ఞానమనే నిద్రలో గుఱ్ఱుపెట్టి నిద్రపోవుచున్న తనవంటి వారిని లేపి,గురుచారితామ్రుతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ద్రహృదయమె గదా యనుకొనెను.

ఆ మరుసటిదినమా దృశ్యమునుకాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయియుండునో సాయిబాబా ని అడిగి తెలిసికొనుమనెను.ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనో కనుగొనమనెను.

కాకాసాహెబు సమయము చూచి బాబాను ఇట్లడిగెను,”ఓ దేవా! యీ దృశ్యము వలన సాఠే కు ఏమని చెప్ప నిశ్చయించితివి?అతడూరకొనవలెనా లేక యింకొక సప్తాహము పారాయణము చేయవలెనా?అతడు అమాయిక భక్తుడు;అతని కోరిక నేరవేరవలెను.అతనికి ద్రుస్టాంతార్ధమును బోధించవలెను.వాని నాశీర్వదింపు”డన బాబా, “అతడు గురుచరిత్ర మింకొక సప్తాహము పారాయణ చేయవలెను.ఆ గ్రంధమునే జాగ్రత్తగా పఠించినచో నాతడు పావనుడగును;మేలు పొందగలడు.భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచబంధముల నుండి తప్పించును!”అనెను.

ఆ సమయమున  హేమాడ్ పంతు  అచ్చట నుండి,బాబా కాళ్ల నొత్తుచుండెను.

బాబా పలుకులు విని యతడు తన మనస్సులో నిట్లనుకొనెను:” సాఠే యొక్క వారమే పారాయణ చేసి ఫలితము పొందేనా!నేను నలుబది సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను గాని నాకు ఫలితము లేదు గదా!అతడిక్కడ 7 దినములు మాత్రమె నివసించెను. నేనో 7 సంవత్సరములనుంచి యున్నాను.నా ప్రయత్నములు నిష్ఫలమా యేమి?చాతకపక్షి మేఘమునుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని యున్నట్లు నేను కూడ బాబా తన దయామృతమును నాపై వర్షించెదరని,వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని యున్నాను.”ఈ యాలోచన అతని మనస్సులో మొదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను.

భక్తుల మనస్సులలో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు.

అంతియేగాక,చెడ్డ యాలోచనలను అణుచుచు,మంచి యాలోచనలను ప్రోత్సహించువారు.

హేమాడ్పంతు మనస్సును గనిపెట్టి బాబా అతనిని వెంటనే లేపి,శ్యామావద్దకు పోయి అతనిని 15 రూపాయలు దక్షిణ తీసికొని,అతనిని కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను.

బాబా మనస్సున కారుణ్యోదయ మయ్యెను.కాన వారిట్లా ఆజ్ఞాపించిరి.బాబా యాజ్ఞను జవదాటగల వారెవరు?

హేమాడ్ పంతు వెంటనే మసీదు విడచి శ్యామా గృహమునకు పోయెను.అప్పుడే యతడు స్నానము చేసి ధోవతి కట్టుకొనుచుండెను.

అతడు బయటకు వచ్చి హేమాడ్పంతు నిట్లడిగెను:మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏల యున్నారు? మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లున్నదే!మీరేల చీకాకుతో చంచలముగా నున్నారు?మీరొంటరిగా వచ్చినారేల?కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు.నా పూజను ముగించి వచ్చెదను.ఈలోగా తాంబూలము వేసికొనుడు.పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని  మాట్లాడుకొనెదము!”ఇట్లనుచు అతడు లోపలికి పోయెను.

హమాడ్పంతు ముందర వసారాలో కూర్చొనెను.

కిటికీలో ఏకనాథభాగవత మను ప్రసిద్ధ మరాఠీ గ్రంధముండెను.ఇది భాగవతములోని యేకాదశస్కంధమునకు ఏకానాథుడు వ్రాసిన వ్యాఖ్యానము.

సాయిబాబా సిఫారసు చేయుటచే బాపూసాహెబు దీక్షితు

(శ్రీ కృష్ణునకు అర్జునకు జరిగిన సంభాషణారూపమైన) భగవద్గీత ,

దాని మరాటీ వ్యాఖ్యానమైన భావార్థదీపిక (జ్ఞానేశ్వరి),

(శ్రీ కృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాష ణారూపమైన)ఏకనాథభాగవతము,

మరియు భావార్ధ రామాయణమును నిత్యము శిరిడీలో చదువు చుండెడివాడు.

భక్తులు వచ్చి బాబాను యేదైన ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి,అటుపైన వారిని ఆ గ్రంధముల పారాయణమును వినుమని పంపుచుండెను.

ఆ గ్రంధములే భాగవత ధర్మములోని ముఖ్యగ్రంధములు.

భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి,ఆ గ్రంధములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను.

హేమడ్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథభాగము పూర్తిచేయకయే కొందరు భక్తులతో కలసి మసీదుకు పోయెను.

శ్యామా ఇంటి కిటికీలో నున్న ఏకనాథభాగవతము తీయగా తానానాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను.

తన నిత్యపారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తననచ్చటకు పంపెనని హేమాడ్పంత్ యనుకొనెను.

వెంటనే తన నిత్యపారాయణమును పూర్తి చేసెను.

పిమ్మట శ్యామా తన పూజను ముగించి బయటకు వచ్చెను.వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను.

హేమాడ్పంతు:నేను బాబావద్ద నుండి యొక కబురు తీసికొని వచ్చినాను.

బాబా నీ వద్దనుండి 15 రూపాయలు దక్షిణ తీసికొని రమ్మని నన్ను ఆజ్ఞాపించియున్నారు.అంతేకాదు,కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి.

శ్యామా: (ఆశ్చర్యముతో)నా వద్ద డబ్బు లేదు.నా 15 సాస్టాంగనమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము.

హేమాడ్పంతు: సరే నీ నమస్కారము లామోదింపబడెను.మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనెదము.మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలను,కథలను చెప్పుము.

శ్యామా:అయితే కొంతసేపు కూర్చొనుము.ఈ దేవుని(బాబా)లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియును.నేను పల్లెటూరి వాడను;నీవా చదువుకున్న పట్టణవాసివి.నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే యుందువు.వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను?సరే యీ తమలపాకులు వక్క సున్నము తీసికొని తాంబూలము వేసికొనుము.నేను లోపలికి బోయి దుస్తులు ధరించి వచ్చెదను.

కొద్ది నిమిషములలో శ్యామా బయటికి వచ్చి హమాడ్పంతుతో మాట్లాడుచు కూర్చొనెను.అతడిట్లనియెను:”ఈ దేవుని (బాబా)లీల కనుగొనశక్యము కానిది.వారి లీలల కంతులేదు.వాని నెవరు గమనించగలరు?వారీ లీలలతో వినోదించు నట్లగుపడినను వారు వాని నంటినట్లు కాన్పించరు.మా వంటి జానపదుల కేమి తెలియును?బాబాయే యీ కథల నెందుకు చెప్పరాదు?మీ వంటి పండితులను నా వంటి పామరుని వద్ద కేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి.అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను.”

ఈ యుపోద్ఘాతముతో శ్యామా యిట్లనెను:”నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది.అది నీకు చెప్పెదను.నాకది స్వయముగా తెలియును.

భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో,బాబా యంత త్వరగా వానికి సహాయపడును.

ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్షచేసిన పిమ్మట వారికి ఉపదేశము నిచ్చును.”(ఇచ్చట ఉపదేశము అనగా నిర్దేశము).

ఉపదేశమనుమాట విన్నతోడనే హమాడ్పంత్ మనస్సులో నొక స్మృతి తళుక్కుమనెను.

వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను.

తన మనస్సుకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండుననుకొనెను.అయినప్పటికి ఈ భావము నణచుకొని,శ్యామా చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను.

ఈ కథలన్నియు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును.వానిని వినగా హేమాడ్పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను.

శ్యామా ఈ దిగువ కథను చెప్పదొడంగెను.

మిగతాది తరువాయి భాగములో పొందుపరచితిమి.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

   సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles