🌹శ్రీ సాయి సచ్చరిత్రము🌹🌹ఉపోద్ఘాతము🌹….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice By: R C M Raju and team


🌹సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా … సాయిబాబా🌹

శ్రీ సాయినాధాయ నమః

శ్రీ సాయి సచ్చరిత్రము

మొదటి రోజు పారాయణము

గురువారము

ఉపోద్ఘాతము, శ్రీ సాయిబాబా ఎవరు, శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి

ఉపోద్ఘాతము

మహారాష్ట్ర దేశములోని వారందరికి శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతట దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్యపారాయణము చేసెదరు. దీనిని రచించినవారు సరస్వతీ గంగాధరుడు.

ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్కయు, శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలును విచిత్ర చర్యలును వర్ణింపబడియున్నవి. వీరిద్దరు దత్తాత్రేయుని ముఖ్యావతారములు.

ప్రముఖ మరాటీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్‌.ఆర్‌.(లక్ష్మణ్ రామచంద్ర) పాంగార్‌కర్‌ అభిప్రాయము ప్రకారం మీ రెండవతారములు 14, 15 శతాబ్దములలో వెలసెను.

దత్తాత్రేయుని తదుపరి యవతారములు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూరు జిల్లాలో శ్రీ అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌గారు, తుట్టతుదకు అహమదునగరు జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయును.

బాబా 1918వ సంవత్సరములో మహాసమాధి చెందిరి.

శ్రీ అక్కల్‌కోటకర్‌ మహరాజ్‌ అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకము.

అయిదవ యధ్యాయములో వేపచెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, ఇరువదియారవ యధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్రపితళే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరచుచున్నవి.

పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమను గ్రంథమందు 53 అధ్యాయములలో సరస్వతీ గంగాధరుడెట్లు వర్ణించెనో, యటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్‌ అన్నాసాహెబు దాభోళ్కరు (‘హేమాడ్‌పంతు’) అనువారు శ్రీసాయిలీలలను 53 అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథమున వర్ణించి యున్నారు.

కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము యీనాటి ‘గురుచరిత్ర’యని చెప్పవచ్చును !

పై చరిత్రల గూర్చి ఈ దిగువ అంశములు గమనార్హములు :

1. శ్రీ గురు చరిత్రను వ్రాసినవారు కన్నడము వారు కాబట్టి, వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను.

అయినప్పటికి వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు  వ్రాయగలిగిరి.

శ్రీ సాయి సచ్ఛరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు. వారు మహారాష్ట్ర దేశములోని యనేక యోగుల      చరిత్రలను చదివియున్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము.

శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో, ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి              సచ్చరిత్రములో పొందుపరచబడియుండుట చూడగలరు.

2. శ్రీ గురుచరిత్రము ముఖ్యముగా కర్మకాండపై నాధారపడి యుండుటచే దానిని బోధపరచుకొనుట బహుకష్టము.

దాని నాచరణలో బెట్టుట మఱింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు గూడ దాని నాచరణలో            పెట్టలేకున్నారు.

శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు, మిక్కిలి            సామాన్యమైనవి.   ఇందులో చెప్పినవానిని అందరు సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు.

3. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు వ్రాయబడెను. కాని శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను.

శ్రీ సాయిబాబా యొక్క యనుమతి పొంది, వారి యాశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి యాజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాసియుంచుకొనెను.

1918వ సంవత్సరములో సాయిబాబా సమాధి చెందిన తరువాత, శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి    చరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించెను.

శ్రీ సాయి సచ్చరిత్ర మీవిధముగ 1923 నుండి 1929 వరకు శ్రీ సాయిలీలలో ధారావాహికముగ ప్రచురింపబడి, 1930లో పూర్తి గ్రంథ రూపముగ ముద్రింపబడినది.

కనుక శ్రీ సాయి సచ్చరిత్రమను ప్రస్తుత గ్రంథము అధికారికమైనది.

షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగ యుండగా దర్శించుకొను భాగ్యము లభించని సాయిభక్తులకు యీ    గ్రంథము   నిజముగా యొక వరము.

శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నాసాహెబు దాభోళ్కరు కూర్చెను. కాని, ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే ‘హేమాడ్‌పంత్‌’చే వ్రాయబడి నట్లున్నది.

కావున ఈ హేమాడ్‌పంతు ఎవరని పాఠకులడుగవచ్చును. అన్నాసాహెబు దాభోళ్కరు మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు, వారీ బిరుదును దాభోళ్కరుకు కరుణించిరి.

ఎప్పుడు ఏ సందర్భములో నీ బిరుదు నతనికి నొసంగిరో యను విషయము రెండవ అధ్యాయములో రచయిత చెప్పియున్నారు. అన్నాసాహెబు జీవిత చరిత్ర యీ దిగువ క్లుప్తముగా చెప్పబడినది.

గ్రంథరచయిత యగు దాభోళ్కరు 1859 (05-12-1859)వ సంవత్సరములో ఠాణా జిల్లాలోని కేళ్వేమాహిమునందు యొక పేద ఆద్యగౌడ బ్రాహ్మణ కుటుంబములో జన్మించిరి.

వారి తాతతండ్రులు దైవభక్తి గలవారు. దాభోళ్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తిచేసి, పూనాలో 5వ స్టాండర్డు వరకు ఆంగ్ల విద్య నభ్యసించిరి.

కుటుంబ ఆర్థిక పరిస్థితులంత బాగుగా నుండకుండుటచే వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పట్లో నున్న సర్కారు నవుకరి పరీక్షలో నుత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగములో ప్రవేశించిరి.

ఆ సమయమందు కులాబా జిల్లాలో మామల్తదారుగా నున్న సాబాజీ చింతామణి చిట్ ణీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధికుశలతను, సేవానిరతిని చూచి మెచ్చుకొని తలాఠీయను గ్రామోద్యోగిగా నియమించిరి.

తరువాత ఇంగ్లీషు గుమస్తాగా వేసిరి. పిమ్మట మామల్తదారు కచేరిలో హెడ్‌ గుమస్తాగా నియమించిరి.

కొంతకాలము జరిగిన పిమ్మట అటవీశాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్ళకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేకోద్యోగిగా గుజరాత్‌లోని బ్రోచ్‌లో నియమితులైరి.

ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగ నెరవేర్చుట వలన 1901వ సం.లో ఠాణా జిల్లాలోని శాహాపూరులో మామల్తదారుగా నియమింపబడిరి.

1903వ సం.లో ఫస్టుక్లాసు రెసిడెంటు మెజిస్ట్రేటుగా బాంద్రాలో నియమింపబడిరి. వారచ్చట 1907 వరకు ఉద్యోగము చేసిరి.

తరువాత ఆయన ముర్భాడు, ఆనంద్‌, బోర్సదులలో పనిచేసి, 1910వ సం.లో తిరిగి బాంద్రాలో రెసిడెంటు మెజిస్ట్రేటుగా నియమితులైరి. ఈ సంవత్సరమందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగెను.

1916వ సం.లో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి.

అదియును విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందువరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయిరి.

బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును, 1929((15-07-1929)వ సం.లో తాను మరణించువరకును, ఎంతో చాకచక్యముగ నడిపిరి.

వారికి భార్య, ఒక కుమారుడు, అయిదుగురు కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరు క్షేమముగా నున్నారు.

శ్రీ సాయిబాబా యెవరు ?

      సాయిబాబా యెవరు ? … అను ప్రశ్నకు మూడు విధములుగా సమాధానము చెప్పవచ్చును :

1. దీర్ఘాలోచన చేయకయే, విషయముల గూర్చి గాని, మనుష్యులను గూర్చి గాని యభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా నొక పిచ్చి ఫకీరనియు,

వారు షిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో ననేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు, తమను దర్శింప వచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు !

ఆర్‌. ఏ. తర్ఖడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము, బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవునపుడు కంటతడి పెట్టుకొనెను.

అతనితో బాబా యిట్లనెను, ”పిచ్చివానివలె ప్రవర్తించుచున్నావేమి ? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా ?”

దానికి తర్ఖడ్ గారి మిత్రుడిట్లు జవాబిచ్చెను: ‘నాకా విషయము తెలియదు. ఎందుకనగా, మీరు బొంబాయిలో నాతో నున్నట్లు నా కనుభవము లేదుగదా!”

అందులకు బాబా యిట్లనియెను : ”ఎవరయితే బాబా షిరిడీలో మాత్రమే యున్నాడని యనుకొందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో!”.

2. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడనిరి. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో నొకనిగా భావించిరి.

హిందువులు బాబాను తమ మహాత్ములలో నొకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడామణిగా పేర్కొనెదరు.

ఈ యభిప్రాయము కూడ సరియైనది కాదు !

3. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను, వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవదవతారముగా నిప్పటికిని భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతముల నిచ్చెదము.

శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి :

1. బి.వి. నరసింహస్వామి గారు రచించిన ”బాబా సూత్రములు – పలుకులు” అను గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జిగారగు యమ్‌. బి. రేగే గారు ఇట్లు వ్రాసియున్నారు :

‘బాబా సశరీరులుగా యున్నప్పుడు, వారొక రూపుదాల్చిన భగత్స్వరూపముగ తమ భక్తులకు భాసిల్లుతూ, తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయు చుండెడివారు.

వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది గాని, దానిలో అప్పుడుండిన ‘బాబా’ మాత్రము ఇప్పటికిని అనంతశక్తివలె నిలిచి, వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారి నాశ్రయించు యసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు”.

2. శ్రీ బి.వి. నరసింహస్వామి గారు రచించిన ‘భక్తుల యనుభవములు’ అను పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశములో నున్న ఒక హైకోర్టు జడ్జి (యమ్‌. బి. రేగే) గారిట్లు వ్రాసియున్నారు :

‘నేను సాయిబాబాను సృష్టి, స్థితి లయకారకుడుగా భావించెదను. 1918వ సం.లో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికి నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు.

నా దృష్టిలో, వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య యున్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించు చుండెను.

ఒక్కొక్కప్పుడది మా దృష్టిని విశేషముగ నాకర్షించెడిది. కాని, ఎక్కువ భాగము మా ఎరుకలో నిలచినది మాత్రము వారి అనంతతత్త్వమే. శాశ్వతము – అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక మానసిక ప్రతిబింబమువలే వారు మాకు భాసించేవారు.

అశాశ్వతమైన తమ మానవదేహము నొక్కొక్కప్పుడు మా ముందర తళుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై, ‘సాయిబాబా’ యను శాశ్వతమైన అనంతశక్తి మాత్రము నిలిచియున్నది”.

3. బి.వి. నరసింహస్వామి గారిచే రచింపబడిన ‘భక్తుల యనుభవములు’ అను గ్రంథములో 19-20 పుటలలో ఆచార్య జి.జి. నార్కే, (యం.ఏ., యం.యస్‌.సి., పూనా ఇంజనీరింగు కాలేజీ) వారు యిట్లు చెప్పియున్నారు:

”ఇంటివద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా నొకరిగా నుంచితిని. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారగు శ్రీమాన్‌ బూటీ, నా భార్య, నా తల్లి గొప్ప సాయిభక్తులు. వారు సాయిబాబాను భగవంతునివలె పూజించువారు.

నేను క్రొత్తగా షిరిడీకి పోయినప్పుడొకనాడు హారతి సమయములో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై యుండెను.

అకారణముగా వారు కోపించుచు, శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా యేమను సంశయము నా మనస్సులో మెదిలెను.

మామూలుగనే హారతి పూర్తియాయెను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు, ‘నేను పిచ్చివాడను కాను !’ అనెను.

ఎంత యాశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండ మనము ఏ రహస్యములను దాచజాలము.

వారు యంతర్యామి, నా యాత్మ యొక్క అంతర్యామి. వారి యంతర్యామిత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగెను.

వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయములో కూర్చుండి, మాట్లాడువానివలె మాట్లాడువారు. నా హృదయములో గల యాలోచనలను, కోరికలను గ్రహించు చుండెడివారు.

వారు నాలో నున్న భగవంతుడు. వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను.

ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు, వారి యిచ్ఛానుసారము సర్వమును నడిపించెదరను ఒకే నమ్మకము కలుగుచుండెను”.

4. రావుబహద్దూర్‌ యమ్‌.డబ్ల్యు. ప్రధాన్‌ వ్రాసిన ‘షిరిడీ సాయిబాబా’ యను గ్రంథమునకు ఉపోద్ఘాతములో గౌరవనీయులును, అమరావతిలో ప్రసిద్ధి కెక్కిన వకీలును నగు దాదాసాహెబు ఖాపర్డే యిట్లు చెప్పియున్నారు :

”శ్రీ సాయిబాబా ప్రతివారి యంతరంగమందు మెదలు ఆలోచనలన్నియు తెలిసిన వానివలె వుండి, వారి కోరికలు తీర్చుచు సుఖసంతోషములు కలుగజేయు చుండెడివారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను”

5. దాసగణు మహారాజు తమ ‘స్తవన మంజరి’యను స్తోత్రము నందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన యంతరాత్మగాను నిత్య శాంతమూర్తిగాను వర్ణించి యున్నారు.

6. హేమాడ్‌పంతు శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసరుచుండిన యొక వింతయోగిగా వర్ణించెను.

కాని రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది, బాబాను భగవంతుడనియు, సాక్షాత్పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పియున్నారు.

7. షిరిడీ భక్తులందరు, ముఖ్యముగా మాధవరావు దేశపాండే వురఫ్‌ శ్యామా యనువారు బాబాకు మిక్కిలి భక్తులు; వచ్చిన భక్తులందరితో కలిసి మెలసి తిరుగుతాడు. ఆయనెల్లప్పుడు బాబాను ‘దేవా’ యని సంబోధించువాడు.

ఈ భక్తులందరి యభిప్రాయములను అవధరించి, వారు చెప్పిన దానిలోని యదార్థమును గ్రహించి శ్రీ సాయి యవతారపురుషుడని భావించెదము గాక !

ఉపనిషద్‌ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి  యను సత్యమును దర్శించిరి.

బృహదారణ్యక, ఛాందోగ్య, కఠ, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహ సర్వవస్తు సముదాయమైన ప్రకృతి యంతయు భగవంతుని రచనమనియు, అది యంతయు నంతర్యామిచే, అనగా సర్వమును సృష్టించి పాలించెడి భగవంతునిచే, వ్యాపింపబడియున్నదనియు వక్కాణించు చున్నది.

ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన యుదాహరణము శ్రీ సాయియే !

ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును, సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివినవారు తప్పక యీ సత్యమును గ్రహించి, యదార్థమయిన శ్రీ సాయిని దర్శించగలరు !

ఉపోద్ఘాతము సంపూర్ణము

సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు

శుభం భవతు

The above Telugu Sai Satcharitra text has been typed by : Mr. Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles